సీతమాటలు ఆగిపోయాయి. ఆమె వెనక్కు వెళ్ళి పోతున్న అడుగుల చప్పుడయింది. ఆతర్వాత ఊహించుకోవడానికి అసహ్యం వేసింది.
జుట్టు పీక్కున్నాడు. తల బాదుకున్నాడు.
సరిగ్గా అప్పుడే నాకు గుర్తు కొచ్చింది. డ్రాయింగు రూం లో బల్ల! బల్ల మీద తాడు.
సీత అవక్కడ నాకోసమే ఉంచింది.
ఈరోజు తన ప్రవర్తన కారణంగా నేనేం చేస్తానో ఆమె ఊహించింది. అందుకే అన్నీ సిద్దం చేసి తన పధకం అమలు జరిపింది. సీత చాలా తెలివైనది! ఆమె తెలివి తేటల ముందు నేను చాలా అల్పుడ్ని! ఈ జీవితం నేనింక భరించలేను. నన్నంతం చేసుకోవడం ఒక్కటే మార్గం!సీత చూపిన పరిష్కారాన్ని నేనమలుజరుపుతాను.
డ్రాయింగ్ రూం లోకి వెళ్ళాను. అక్కడున్న బల్లను గది మధ్యకు లాగాను. టేబిల్ మీద తాడును జాగ్రత్తగా ఫోన్ కు కట్టాను. తాడు కొసను నా మెడకు కట్టుకుని జారు ముడి వేశాను.
ఆత్మహత్య కు సిద్దంగా వున్నాను నేను.
మనసు హెచ్చరిస్తోంది-- మరి కాసేపు ఆలోచించమని! వివేకం హెచ్చరిస్తోంది -- చచ్చి ఎవర్ని సాధిస్తావని!
నాలోని పిరికి వాడు మాత్రం ఈ జీవితం నుంచి పారిపోవడానికిదోక్కటే మార్గమని పదేపదే చెబుతున్నాడు.
నేను చస్తే ఏమవుతుంది?సీత .....వాడు సుఖంగా వుంటారు.....ఊహు.....ఉండదు. సీత విచ్చలివిడితనాన్ని వాడూ భరించలేడు. సీత ఒకరోజున వాడికోసం కూడా డ్రాయింగ్ రూం లో బల్ల వేసి -- తాడు పెడుతుంది.
బల్ల కాలితో ఒక్క తోపు తన్నానంటే చాలు .....నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
కాలెత్తి .....బల్లను తన్నబోయాను. అప్పుడు గుర్తుకొచ్చింది ....చచ్చేముందు దైవప్రార్ధన చేసుకుంటే, వచ్చే జన్మలో నైనా తీరని కోరికలు తీరతాయని.
అయినా నా తీరని కోరికలు ఏమిటి? ....ఎక్కువ ఆలోచించలేదు. ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే అగత్యం కలక్కుంటే చాలు వచ్చే జన్మలో!
నేను గుండె రాయి చేసుకున్నాను. కాలు పైకెత్తి బల్లను తన్నేశాను.
బల్ల పడిపోయింది. నేను గాలిలో వ్రేలాడుతున్నాను. తాడు మెడకు బాగా బిగుసుకుంది. ఇంతలో ఉన్నట్లుండి దబ్బున క్రింద పడిపోయాను. ఏమైందో తెలియదు కానీ కళ్ళు బైర్లు కమ్మాయి.
తాడు తెగిందని తెలుస్తూనే వుంది.
నేను క్రింద పడి వెంటనే లేవలేకపోయాను. లేచేలోగా సీత, దొంగ వెధవ -- చెట్టపట్టాలు వేసుకుని అక్కడకు వచ్చారు.
నన్ను చూసి సీత హేళనగా నవ్వింది-- "ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడం కూడా చేతకాదు మీకు" అంది.
"నువ్వక్కడ.....అలాంటి తాడు వుంచావు...." అన్నాను.
"పటిష్టమైన తాడక్కడ వుంచితే అది హత్య అవుతుంది--" అంటూ మళ్ళీ నవ్వింది సీత.
"వాడితో మనకేమిటి డియర్ -- పద పోదాం-"అన్నాడా దొంగ వెధవ.
"ఎవడ్రా నువ్వు?"
"నేను సీతను ప్రేమించాను. కులం కుదరలేదని పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. సీత వాళ్ళు గీచిన గీటు దాటలేదు. నిన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు సీతను భార్యలా కాక అట బొమ్మలా చూశావు. శారీరకంగా, మానసికంగా హింసించావు. కానీ సీత అన్నీ సహించింది. గీత దాటని మహా పతివ్రతా గా ఉండాలని నిర్ణయించుకుంది. అనుకోకుండా నేనీ ఊరు వచ్చాను. సీత జీవితం చూశాను. తనకు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించాలనుకున్నాను. నాతొ వచ్చేయమని అడిగాను.
సీత రానంది. ముందు నన్ను వంచకుడని దుర్భాషలాడింది. పెళ్ళయిన స్త్రీ పై ఆశ పెట్టుకోవడం దుర్మార్గం మంది! నేను వెళ్ళిపోయాను -- తాత్కాలికంగా మాత్రం. నీలాంటి వాడు ఆడదాని సహనానికి పరీక్ష పెట్టి నేగ్గగలడని నాకు తెలుసు. నీ కారణంగా సీత నా దారికి వచ్చింది. ఈసమాజం గీచిన గీటు దాటింది. దాటితే యేమైంది?" అని నవ్వాడు దొంగ వెధవ.
"ఆడది ఎదురు తిరగానంత సేపే ఈ సమాజం ఆంక్షలు విధిస్తుంది. నీలాంటి వెధవలు ఎదురైతే ఏ ఆడదైనా ఎదురు తిరుగుతుంది! అలాంటప్పుడు మీరేమీ చెయ్యలేరనేదానికి నీ కధే సాక్ష్యం౧ ఇప్పుడు నేను నా సీతను తీసుకుని వెళ్ళి పోతున్నాను. మళ్ళీ మేము నీకు కనిపించం. నువ్వు మాత్రం మళ్ళీ పెళ్ళి చేసుకుంటే -- మరో సీతను గీత దాటించకు--"
సీత నామీదకు చిన్న కాగితం ఉండ విసిరి ఆ దొంగ వెధవ ను వాటేసుకునే అక్కణ్ణించి కదిలింది.
నాకు లేచే ఓపిక లేదు. వళ్ళంతా నొప్పులుగా ఉంది. దగ్గర్లో నేపడ్డ ఆ కాగితం ఉండ అందుకుని విప్పి చదివాను.
"మాజీ ప్రియుడు గారికి --
ప్రియులు ఆదరణకారణంగా భర్త వైనా నిన్ను నేను నిర్లక్ష్యం చేశాను. నీకళ్ళ ముందే కొత్త భర్తను ఎన్నుకుని వెళ్ళిపోతున్నాను. బాగుంది కదూ!- అయామ్ సారీ - టు బిడ్ యూ గుడ్ బై --
నీ మాజీ భార్య!"
ఒకప్పుడు నేను రాసిన ఉత్తరానికి జవాబు అది, సీతా అని అరవాలనుకుని ఆగిపోయాను.
అప్పటికీ సీత -- ఆ దొంగ వెధవతో కలిసి -- గడప దాటింది.
-----: అయిపొయింది :-----
