నేనేమీ తక్కువదాన్ని కాదు. నాకేమీ లోటు రాదు. ఉన్నత కుటుంబంలో పుట్టాను. విద్యా బుద్దులు నేర్చుకున్నాను. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదాన్నయ్యాను. అలాగే ఓ ఇంటికి ఇల్లాలిని కాగలను. పదిమందిలో గర్వంగా నిలబడగలను. నాకుటుంబం నవ్వులపాలు కానవసరం లేదు, నన్నెవరూ వేలెత్తి చూసే అవకాశం రాదు. ఇక భవిష్యత్తు గురించి ఆలోచనేలేదు.
కాని...కాని మాధవ్! ఇన్నాళ్లుగా మనసులో నిలుపుకున్న మాధవ్ ని చెరుపుకోగలనా? ప్రతీక్షణం - ప్రతీఘడియా నీడలా వెన్నంటే మాధవ్ వూహల్ని మార్చుకోగలనా? మాధవ్ లేని బ్రతుకు ఎడారికాదా? మాధవే లేడనుకుంటే నేను వుంటానా? ప్రభూ! నేనేదీ నిర్ణయించుకోలేను. నాకేదీ సాధ్యం కావటం లేదు. మాధవ్ ని చేరాలన్న కోరికైతే వుందిగాని ఆధైర్యం లేదు. మా ఇద్దరి మధ్యా అంతులేని అగాధం వుంది. వాస్తవంలో దానిని దాటి మాధవ్ సన్నిధికి చేరలేని దౌర్భాగ్యురాలిని.
పరిపరి విధాల ఆలోచిస్తూ వెక్కివెక్కి ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేను. ఒక క్షణంలో అన్నీ నిర్లక్ష్యం చేసి మాధవ్ దగ్గిరికి చేరిపోవాలని పిస్తుంది. మరుక్షణంలోనే ఏవో హెచ్చరికలు గుండెల్లో కదిలి నిలువునా కృంగదీస్తాయి. రాత్రింబగళ్ళూ కుమిలి పోవటం తప్ప ఏమీ చెయ్యలేని దౌర్భాగ్య స్థితి.
మాధవ్ దగ్గిర్నుంచి వుత్తరం వచ్చింది-"నువ్వు పరీక్షల హడావిడిలో వుంటావు. నిన్ను డిస్టర్బ్ చెయ్యకూడదని వుత్తరాలు ఆపు చేశాను. పరీక్షలై పోయి నాలుగు రోజులైంది. వెంటనే వుత్తరం రాస్తానన్నావు. ఎందుకో అశ్రద్ధ చేశావు. నీ వుత్తరం అందటం నేను బయలు దేరటం ఒక్కక్షణంలోనే జరుగుతాయి. నీవుత్తరం కోసం తహ తహతో ఎదురు చూస్తున్నాను.
నాకు పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. నాలుగు రోజుల క్రిందటే మాధవ్ ని రమ్మని రాసిన వుత్తరం మాధవ్ కి చేరకపోవటంతో నాకోరిక భగవంతుడికి కూడా సమంజసంగా తోచలేదని పించింది. నా దౌర్భాగయం కాకపోతే అన్నీ ఇలా ఎదురుతిరగాలా?
ఇప్పుడు మాధవ్ కేం చెప్పను? ఎలా చెప్పను? అయ్యో! నీకెన్ని ఆశలు గల్పించి మోసం చేస్తున్నాను మాధవ్! ఈ కబురువింటే ఏమైపోతావు? ఎలా సహిస్తావు? .....ఎంత బాధపడతావో! నన్నెంత శపిస్తావో! క్షమించలేని తప్పు చేశాను. క్షమించమనికూడా అడగలేను. ఇంకా నీకుత్తరాలు రాసే ధైర్యం నాకెక్కడిది? నన్ను క్షమించాకు కాని మర్చిపో. నన్ను మర్చిపో. అంతే నేను కోరేది.'
నేనేదో లోలోపల బాధ పడుతున్నట్టుగా వుందట. వదిన చాలా అడిగింది - ఏమిటలా వుదాసీనంగా వుంటున్నావు కృష్ణవేణీ?" అని. వదినతో ఎంత చనువున్నా ఏమీ చెప్పలేక పోయాను ఒంట్లో బావుండటంలేదని అన్నాను. క్రిందికి వెళ్ళటమే తగ్గించాను. ఎప్పుడూ పడుకుని ఆలోచించటం - ఉవ్వెత్తుగా బాధ పొంగినప్పుడల్లా ఏడవటం - మాధవ్ వుత్తరాలు చదువుకోవాలనీ మనసు తహతహ లాడేది. కొంతవరకూ నిగ్రహించుకో గలిగేదాన్ని. విషమస్థితిలో చిక్కుకొనే దాన్నేకాదు- రోజూ సాయంత్రం రేణు వచ్చి కూర్చుని వెళ్ళేది.
"నేనెంత చెప్తున్నా వినకుండా ఇంతచేశావు. మాధవే నిన్ను పాలుపోనివ్వకుండా చేశాడనిపిస్తుంది." అంది రేణు. "మాధవ్ ని మాత్రం ఏమీ అనకు రేణూ! నేను సహించలేను. ఇప్పటికే మాధవ్ కి తీరని ద్రోహం చేశాను. ఇంకా లేనిపోనివి కల్పించుకోనా? మాధవ్ వెనుకంజ వేస్తున్నకొద్దీ నేనే కవ్వించాను. ప్రోత్సహించాను ...... చివరికి దగా చేశాను." బావురుమన్నాను. రేణు ఓదార్చుతూన్న కొద్దీ ఓర్చుకోలేకుండా ఏడిచాను. రేణు నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకొంది.
"శాంత మాటలకేంగానీ పోనీ వెళ్ళిపోకూడదా కృష్ణవేణీ?" అంది బాధగా. "వద్దు రేణూ! వద్దు. నాకు తిరిగి ఆశలు రేకెత్తించకు. కష్టమైనా, సుఖమైనా అమ్మకీ, నాన్నకీ అప్రతిష్ట తేకూడదని నిశ్చయించుకున్నాను. పాపమో, పుణ్యమో మాధవ్ ని దూరం చేసుకుంటాను." "నేనే మీ యిద్దర్నీ దూరం చేశాను కృష్ణా! నన్ను క్షమించు. నీజీవితం చక్కబరచాలనే తాపత్రయం తప్పా నువ్వింత బాధపడతావని అనుకోలేకపోయాను." రేణు కళ్ళలో నీరు నింపుకుంది. అలా రేణుతో మాట్లాడుతూంటే నామనసేదో కొంత తేలికైనట్టు వుండేది.
* * *
ఆనాటి సాయంత్రం మనశ్శాంతి కోసం-ఆలోచాల మార్పుకోసం "కళ్యాణ్" లో భగవద్విషయాలు చదువుతూ కూర్చున్నాను. వదిన వచ్చి చెప్పింది అన్నయ్య రమ్మంటున్నాడని, పుస్తకం మూసి క్రింది హాల్లోకి వెళ్ళాను. అన్నయ్యా-మరొక వ్యక్తి ఎదురురెదురుగా కూర్చుని ఏదో మాట్లాడుకొంటున్నారు. నేను వెళ్ళి సోఫాలో అన్నయ్య పక్కన కూర్చున్నాను. అన్నయ్య నవ్వుతూ నన్ను అతనికి పరిచయం చేశాడు-"ఈవిడే నాచెల్లెలు కుమారి కృష్ణవేణి బి.యస్సీ-నీకు గుర్తులేదేమో గానీ చాలాసార్లు చెప్పాను వేణూ! ఈయన నాబెస్ట్ ఫ్రెండ్ శ్రీ శ్యామసుందర్ ఎం.ఎ."
"నమస్తే!" అన్నాను చేతులు కలిపి, శ్యామసుందర్ నవ్వి-"నమస్తే!" అని వూరుకున్నాడు.
తర్వాత మాటల సందర్భంలో- "ఇంకా చదువుతారా కృష్ణవేణీ?" అనడిగాడు శ్యామసుందర్.
"ఇంకా ఏం నిర్ణయించుకోలేదండీ. రిజల్ట్సు....రావాలి కదా?" అన్నాను.
"ఏం? అంతమాత్రం నమ్మకం లేదంటారా?" అన్నాడు నవ్వి.
"ఉన్నా వుందని చెప్పలేనండీ!" అన్నాను నేనూ నవ్వుతూ. అన్నయ్య టీ తెమ్మన్నాడు. ఇంటికివచ్చే ముఖ్యమైన అతిధులకి నేనుగానీ, వదినగానీ స్వయంగా టీ ఇస్తూంటాం. రెడీగా వదిన అందిస్తే ఇద్దరికీ టీ ఇచ్చాను. తర్వాత అన్నయ్యా, అతనూ కార్ లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేముందు "గుడ్ బై" చెప్పి మరీ వెళ్ళాడు.
"గుడ్ బై కృష్ణవేణీ!"
"గుడ్ బై."
* * *
రాత్రి భోజనాల దగ్గిర శ్యామసుందర్ గురించి చెప్పాడు అన్నయ్య. అతను ఆస్థిపరుడట. గుణవంతుడట.
"సరే! రూపవంతుడన్న సంగతి మీ చెల్లాయే స్వయంగా చూసింది." అంది వదిన నవ్వుతూ,
"టెంపరరీగా క్లర్క్ చేస్తున్నాడు. త్వరలో మంచి జాబ్ వస్తుంది" అన్నాడు అన్నయ్య.
"ఏం కృష్ణవేణీ? ఏమిటి నీ అభిప్రాయం?"
"నా అభిప్రాయమేమిటి?"
"నీకిష్టమేన అని?"
"నాకిష్టమేమిటి వదినా?"
"అబ్బ! ఏం నంగనాచివమ్మా! ఎన్ని వివరాలు చెప్తున్నా ఏమీ అర్ధంకానట్టు మాట్లాడుతున్నావ్. మా నోటితోనే చెప్పించుకోవాలనా? అయితే చెప్తాను .... ఆ శ్యామసుందరుడు కృష్ణవేణిని ప్రేమించాడటా..ఇక ఈ కృష్ణవేణి ఇష్టపడితే .... వారం తిరగొచ్చేనాటికి పెళ్ళికూతురివై.......అబ్బో! అప్పుడే సిగ్గా?" "వదిన ఏమిటే అంటోంది. నేను తల దించేసుకున్నాను. అంతా అర్ధమైంది నిర్ఘాంతపోయాను. మవునంగా అన్నం కెలుకుతూ కూర్చున్నాను. "వదిన చెప్పింది నిజమే వేణూ! శ్యామసుందర్ ని నాన్నగారికి కూడా చూపించాను. మా అందరికీ ఈ సంబంధం ఇష్టపడింది. శ్యాం కూడా నిన్ను అంగీకరించాడు. స్థిమితంగా ఆలోచించుకొని చెప్పు. ఇందులో బలవంతం ఏమీ లేదు సుమా! నీకిష్టమైతేనే ....."
కన్నీళ్లు జారి అన్నంలో పడ్డాయి. క్రీనీడలో ఎవ్వరూ చూడలేదు. ఆపైన అన్నయ్య మాటలు వినిపించుకో లేదు. చెయ్యి కడుక్కుని పైకి వెళ్ళిపోయాను. కడుపులోంచి దుఃఖం వుబికి వస్తూంటే పక్కమీదబడి బావురుమన్నాను.
ఎంత చిత్రమైన పరిస్థితులు కల్పిస్తున్నావు ప్రభూ! నేను పెళ్ళికూతుర్ని అవుతానా? మాధవ్ ని కాదని, మరో వ్యక్తిని నా బ్రతుకులోకి తెచ్చుకుంటానా? జీవితమంతా మరోవ్యక్తితో గడుపుకుంటావా? నా మాధవ్ పరాయివాడిగా చేసుకుంటానా? ఇది నాకు సాధ్యమా? అగ్నిపరీక్ష కాదా ప్రభూ?
