మంజుల రమేష్ ని తిడుతూ "రండి-మేష్టారూ-మనమిక్కన్నించి పోదాం...." అంది.
మోహనరావు లేచి నిలబడి "నేనిక్కన్నించి వెడుతున్నాను. జీవితంలో నేను మళ్ళీ నీ ముఖం చూడను. నీకు వశంకాని ఆడదానిమీద అభాండాలు వేసే అలవాటు చాలా ఏళ్లుగా ఉంది నీకు. అయితే అలాంటి అభాండాలకు లొంగేవాడిని కాదు నేను. నేను మంజులను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. నీ అబద్దాల కారణంగా ఈ పెళ్ళి ఆగదు....." అన్నాడు.
మోహనరావు ఈ మాటలు అనడానికి మంజుల రమేష్ ని తిట్టిన తిట్లూ, మోహనరావు ని పొగిడిన పొగడ్తలూ కారణం. ఆ ఆవేశంలో అతనీ మాటలు అన్నాక-"నే నెవరికైనా అన్యాయం జరిగితే సహిస్తాను కానీ-స్నేహితుడి కన్యాయం జరిగితే సహించను. మంజులా నీ నిజస్వరూపం బయటపెట్టు-" అన్నాడు.
జవాబుగా మంజుల రమేష్ ని మరిన్ని తిట్లు తిట్టింది. మోహనరావు ఆవేశం పరాకాష్ట నందుకోగా-అతను కలగజేసుకుని రమేష్ ని చెడామడా తిట్టాడు.
రమేష్ అన్నింటినీ నవ్వుతూ విని- "నాతోరా నిజం చెబుతాను" అంటూ పక్కగదిలోకి తీసుకువెళ్ళి ఒక డైరీలాంటి పుస్తకాన్ని మోహనరావు చేతికిచ్చి "ఇది చదవ్వోయి నిజం తెలుస్తుంది" అన్నాడు.
మోహనరావా పుస్తకాన్నందుకుని పేజీలు తిరగేసే లోగా గదితలుపులు మూసుకుంది.
"నేను వేసిన అపనిందను నిజంచేస్తాను" అన్న మాట లతనికి అవతల నుండి వినబడ్డాయి.
ఆ తర్వాత మంజుల ఆర్తనాదం....."నన్ను రక్షించరూ మేస్టారూ!" అంటూ కేకలూ, తర్వాత పెద్దపెట్టున ఏడుపు రక్షించమనీ, వదిలేయమనీ రమేష్ కు వేడుకోలు-తిట్లు, శాపనార్ధాలూ-ఆ తర్వాత కొద్దిక్షణాల మౌనం......అనంతరం సన్నని ఏడుపు......ఆ తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
మోహనరావు జీవచ్చవమయిపోయాడు. జరగబోయే ఒక అన్యాయానికీ అతనికీ ఒకే ఒక తలుపు అడ్డం పద్మ వ్యూహంనాడు పాండవులకు సైంధవుడిలా ఆ తలుపు అతనికి అడ్డంనిలిచి-అంతా అయిపోయేక తెరుచుకుంది.
ఆవేశం చల్లారేక-స్నేహితుడికి తన ముఖం చూపించడం ఇష్టంలేక కాబోలు-రమేష్ మరోగదిలోకి చరచరా వెళ్ళి తలుపులు వేసుకున్నాడు.
మానం కోల్పోయిన మంజుల ఏడుస్తోంది. మోహనరావులో ఇప్పుడు ఎవర్నీ ఎదిరించే శక్తిలేదు. హఠాత్తుగా అతను చచ్చుబడిపోయాడు.
"పద పోదాం. మంజులా!" అన్నాడతను.
అప్పటికింకా టైము ఏడవుతుందేమో-అంతే! ఇద్దరూ మాట్లాడకుండా బయటకు వచ్చారు.
మంజుల బట్టలు చాలాచోట్ల చిరిగిపోయాయి. చూడడానికో బిచ్చగత్తెలా ఉన్నదామె యిప్పుడు.
సుమారు మైలుదూరం నడిచేక వాళ్ళకో రిక్షా కనబడింది. బేరమాడకుండా రిక్షా ఎక్కాడు మోహనరావు మంజులతో సహా.
పక్కనే కూర్చున్న మంజుల అతనికే విధమైన అనుభూతినీ యివ్వలేదు. మంజుల అతని మధురమంజుల కాడు. ఒక పతిత-
రిక్షా ప్రతాప్ ఇల్లు చేరింది. అదృష్టవశాత్తూ ప్రతాప్ ఇంట్లోనే ఉన్నాడు. త్వరత్వరగా మంజులనింట్లో ప్రవేశపెట్టి రిక్షా అతనికి అడిగిన డబ్బులిచ్చి-తనూ ఇంట్లో చొరబడ్డాడు మోహనరావు.
ఈ రాత్రికిక్కడే వుంటానని అతననగా అభ్యంతరం లేదని ప్రతాప్ చెప్పాడు.
ప్రతాప్ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. అతని ముఖంలో ఏమీ కుతూహలం లేదు. మోహనరావు ఎందుకు వచ్చాడు? కూడా మంజుల దయనీయ స్థితిలో వచ్చిందేం?-అన్న ప్రశ్నలు అతను వేయలేదు. అయితే తన గదిలోకిపోయి పడుకోబోయేముందు-వాళ్ళిద్దరకూ పడక సదుపాయాలు చూపించడం మాత్రం మరిచిపోలేదతను.
ఆ రాత్రి తెల్లవార్లూ మోహనరావుకు సరిగ్గా నిద్ర పట్టలేదనే చెప్పాలి. మేష్టారూ, రక్షించరూ? అన్న ఆర్తనాదం అతని చెవుల్లో గింగురుమంటోంది అక్కడ తనుండి ఏం చేయగలిగాడు?
ఇప్పుడు మంజులను తను వివాహం చేసుకోగలడా? మంజులకు జరిగిన అన్యాయాన్ని అక్కడుండి తనే ఆపలేకపోయినప్పుడు- అందులో ఆమె తప్పేముంది?
5
ఎప్పుడో తెల్లవారుఝామున మోహనరావుకు నిద్రపట్టినట్లుంది. లేచేసరికి ఎనిమిది దాటింది.
అప్పటికి ప్రతాప్ ఇంకా లేవలేదుకానీ మంజుల పక్కకాళీగా ఉంది.
ఆమె మంచంమీద ఓ చీటీ వుంది.
"మేష్టారూ-బాధ్యులెవరైనా నా జీవితం అన్యాయమైపోయింది. నా కింకా చావాలని లేదు కాబట్టి బ్రతికే ఉంటాను. ఎటొచ్చీ ఈ జన్మకు మీ భార్యనయే అదృష్టానికి మాత్రం నోచుకోలేదు. నా కోసం వెతకొద్దు.
-అభాగ్యురాలు
మంజుల."
చీటీలోని ఈ వాక్యాలు చదువుకుని "మంజులా!" అంటూ ఏడ్చాడు మోహనరావు. ఏడ్పు మొదలు కాగానే ఇంకా ఎక్కువైంది. వెక్కివెక్కి ఏడుస్తున్నాడతడు.
అప్పుడతని భుజంమీద ఓ చేయి పడింది. అది ప్రతాప్ ది. "ఏం జరిగింది మోహన్?" అనడిగాడతను.
గద్గద స్వరంతో జరిగింది టూకీగా చెప్పాడు మోహన రావు.
ప్రతాప్ అదోలా నవ్వి-"మీకు మనోబలం ఎక్కువ. మీది దుర్బల మనస్తత్వం కాదు. ఎటువంటి విషయాలూ మిమ్మల్ని కదిలించవు. అయినా ఏడుస్తున్నారు మీరు నాకు నచ్చలేదు-" అన్నాడు.
మోహనరావుకు దుఃఖంలో కూడా కోపం వచ్చింది-"వేళాకోళానికైనా సమయా సమయాలుంటాయి...." అన్నాడు.
"సమయా సమయాల్చూసి వేళాకోళమాడడానికి నా కంత మనోనిబ్బరం లేదు. అందుకే ఎన్నడూ నేను మనో నిబ్బరం గురించి పందెం కాయలేదు-" అన్నాడు ప్రతాప్.
మోహనరావు ముఖం ఎర్రబడింది. "అవును పందెం కాశాను. మీకంటే ఎక్కువ మనోనిబ్బరముందని. ఆ విషయమే ఇప్పుడు ఋజువు కాలేదుగా...." అన్నాడతను కాస్త తీవ్రంగా.
