Previous Page Next Page 
దివిసీమ ఉప్పెన పేజి 3

   
    భోగాది వెంకట రత్నారావు            గణపేశ్వరం గ్రామము
    
    వయస్సు 50 సం.లు

       
    
    
    పట్టుదల లేనివాడు మట్టిబొమ్మకన్నా హీనం మంచితనం లేనివాడు మరణించినా బ్రతికినా ఒక్కటే. ఇదే నా వుద్దేశం. అందువల్లనే నేను నా స్వగ్రామమైన తలగడదీవిని వదలి గణపేశ్వరం కాపురం రావలసివచ్చింది. వచ్చిన వేళావిశేషము ఏలాటిదో నాకు అన్నివిధములా కలిసి వచ్చినది. ఏవో కొద్దిపాటి యిబ్బందులు తప్ప నా వ్యాపారం పైలాపచ్చీసులాగుంది. దీనితోపాటు కాస్తోకూస్తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నాను. గణపేశ్వరములోనే కాపురముంటున్నాను.
    
    నాకు ఏడుగురు ఆడపిల్లలు. ఒక మగపిల్లవాడు. వీరిలో ఇద్దరాడపిల్లలు మాత్రమే యింటివద్ద వున్నారు. మిగిలిన వాళ్ళంతా చదువుకొనుచూ బందరులో వున్నారు. మేమిక్కడ. వాళ్ళక్కడ. ఈ తుఫాన్ బీభత్సానికేమయ్యారో? వాళ్ళంతా నాకు తలపుకు వచ్చారు. వాళ్ళను తలచుకొని గుండె నిబ్బరం చేసుకున్నాను. నా భార్య పిల్లలు ఆ రోజు శనివారం చేసి భజన చేస్తున్నారు. మా పని మనిషి పులుగుర్తు సుబ్బారావు వచ్చాడు. అప్పటికి ఉదయం 9 గంటలు కావచ్చింది. గేదెల్నిపాలుదీసి బయటకు తోలి వేశాము. ఎక్కడ చూచినా వడ్ల రాసులు, పుగాకు పెండెంలు, మిరపకాయ భోరాలు, యెక్కడవక్కడున్నవి. పనిమనిషి వాటిని సర్దుతూ మా యింట్లోవేయుచున్నాడు.
    
    మధ్యాహ్నం 12గంటలు అయినది. తుఫాను గాలులు ఉధృత ముగా వీస్తున్నాయి. తలుపులు ఆగటం లేదు, కిటికీల సందులోనుంచి మాత్రము బయటకు చూడగలుగుతున్నాము. అప్పటికే మా వూళ్ళో పూరిళ్ళన్నీ పడిపోయాయి. మా యింటిగోడలు కూడా వూగుచున్నాయి. పై కప్పు కొంచెము కొంచముగా లేచి పోవటం మొదలు పెట్టింది. భయమేసి పిల్లలు ఏడుస్తున్నారు. నేను నా భార్య కృష్ణనామ స్మరించుచున్నాము. మా పని మనిషి సుబ్బారావును పిలిచాను. నాకు ఎందుకనో అతన్ని యింటికి పంపి వేయాలనిపించింది. ఎవరి ఇంటివద్ద వాళ్ళు వుండటం మంచిది, నీవు నీ పిల్లల దగ్గరకు వెళ్ళిపొమ్మని చెప్పాను అతను మమ్మల్ని వదలి వెళ్ళలేనన్నాడు. నేను నాభార్యా బ్రతిమలాడి బలవంతాన బయటకు పంపించివేశాము. అతనాగాలిలో పడుతూలేస్తూ యింటికి వెళ్ళాడు.
    
    హోరుగాలి వీస్తున్నది గాలివాన ఎక్కువైనది. మేము ప్రాణాలపై ఆశవదులుకున్నాము. అయినా చివరి వరకూ ప్రయత్నము చేయాలి కదా! అందుకే మరెక్కడికైనా వెళ్ళుదామనిపించినది నా భార్య 28వేల రూపాయలు, 45 శేర్ల బంగారాన్ని ఒక సంచిలో వేసి నడుముకు కట్టుకుంది. మా పిల్లల్ని యిద్దర్ని తీసుకొని బయలుదేరింది. నేను మాత్రం ఏమియూ తీసుకోలేదు. వంటిపైనున్న బట్టలు, ఒక కళ్ళజోడుతప్ప మేము మా యింటి తూర్పువైపు గుమ్మము వద్దకు వెళ్ళాము తలుపుసందుల నుండి నీళ్ళు వస్తున్నాయి. అప్పటికి షుమారు సాయంత్రము 4 గంటలు కావచ్చు. చూస్తుండగానే యింట్లో నీరు పెరిగినది, ఇది వాన నీరను కొన్నాము. పిల్లలిద్దరూ నా భార్య వద్దనే యున్నారు. సముద్రము పొంగి వాగ లొస్తున్నాయి. చూస్తుండగానే మొలలోతు వచ్చింది. పిల్లలకు అందటంలేదు. వడి చాలా విపరీతంగా ఉన్నది. నా భార్య వాళ్ళను పట్టుకోలేక వదిలిపెట్టింది. కళ్ళెత్తి చూడలేక పోయాము. పొగలు కమ్ముకొస్తూ పడగిప్పిన పాములా బుసలు కొట్టుకుంటూ తాడి ఎత్తు సముద్రపు కెరటాలు వస్తున్నాయి. పిల్లలు నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. నాన్నా, నాన్నా మేము కొట్టుకు పోతున్నాము. మమ్మల్ని పట్టుకోండి. మమ్మల్ని పట్టుకోండి. అని కేకలు వేస్తున్నారు. యేమండినేను కొట్టుకుపోతున్నా పిల్లల్ని కాపాడండి. అని నాభార్య మరోప్రక్క గోల చేస్తోంది. ఏం చేసేది నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేనయినా బ్రతుకుతాననే నమ్మకమెక్కడిది. పిల్లల ఆర్తనాదాలతో నా గుండె బ్రద్దలవుతోంది. విపరీతమైన సముద్రపు వాగవచ్చింది. ఆ వాగకు మేము మునిగిపోయాము.
    
    ఉప్పెన ఉరవడి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మానవ కృషి అంత మైంది. భారమంతా దైవము పైవేశాను. లోలోన కృష్ణనామం చేస్తున్నా. ఒక్కసారి నీళ్ళపైకి లేచా! మా యిల్లు తేలి కొట్టుకు పోతోంది. మరల వాగ వచ్చి నన్ను ముంచేసింది. రెండు గుటకలు నీళ్ళు త్రాగాను మూడవ గుటకకు నానోరు అప్రయత్నముగా మూసుకుపోయింది మరలా వాగా వచ్చినది నన్ను యెత్తి మా యింటి ముందర ఉన్న ముళ్ళచెట్లపైన పారేసింది. ఆ చెట్టుగూడా చాలా ఎత్తైనదే. దాని చిట్టచివరి కొమ్మ నాచేతికి దొరికినది దాన్ని పట్టుకొని నీళ్ళల్లో వ్రేలాడుచున్నాను, కట్టుపంచె కాళ్ళకు పట్టేసుకుంది. ఒక చేత్తో చెట్టుకొమ్మ పట్టుకొని మరొక చేత్తో పంచె విప్పి పారవేశా. బనీను తీసి గోచి పెట్టుకొన్నా. యింతలో చేతిలో కొమ్మ విరిగిపోయింది. నేను నీళ్ళలో కొట్టుకుపోతున్నా. కళ్ళుచూడ నివ్వటం లేదు. కళ్ళు మూసుకొని కృష్ణా! కృష్ణా! అంటున్నా. నేను మునిగిపోతా ఏదో రబ్బరు ట్యూబు మీద కూర్చుని పోతున్నట్లుంది. నేనే డ్రయివర్నై చిన్నకారు నడుపుకొని పోతున్నానా అనిపించింది షుమారు 100 గజాలు నీటిలో కొట్టుకు పోయాను కొంచెం కళ్ళు తెరచి చూశాను. నా ప్రక్కనుంచే ఒక దూలం కొట్టుకు పోతోంది. దాన్ని వాటేసుకున్నా సముద్రకెరటాలలో తెప్పమీద పోయే వాళ్ళలా క్రిందపడుతూ పైకి లేస్తూపోతున్నా.
    
    అక్కడికి దగ్గరలో దుర్గ అమ్మవారి గుడివున్నది. దాని చుట్టూ మంచి ప్రాకారము దట్టమైన చెట్లు వున్నాయి. నేను పోయి ఆ ప్రాకారానికి పట్టాను. దూలం ఏమయిందో తెలియదు. నేను ఒక చెట్టు మధ్య యిరుక్కుపోయాను. అది ఒక ముళ్ళ చెట్టు దాని కొమ్మల మధ్య నా కాలు యిరుక్కుపోయింది వాగలు నాపైనుంచి పోతున్నాయి. వాగలు లేనప్పుడు కొంచెం కొంచెం గాలి పీల్చుకొంటున్నా. నీటి ఉరవడి బాగా వున్నది. బలవంతాన కాలు లాక్కున్నా. ముళ్ళు పట్టి తొడ కండలు చీల్చుకుపోయాయి. నాకేమి నొప్పి అనిపించలా శరీరమంతా బండబారి పోయింది. నా ప్రక్క నున్న ప్రహరీగోడ పడిపోయింది. నేనున్నా చెట్టు వంగిపోయింది అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నా. నాకొకలావాటి కర్ర దొరికింది దాన్ని రెండు చేతులతో బిగించి పట్టుకున్నా. ఇంతలో మరో పెద్ద కెరటం వచ్చింది. నన్నెత్తి అమ్మవారి తరంబ్రాల మంటపముపై పడవేసింది. కళ్ళెత్తి చూశా. చేతిలో దాన్ని వదిలిపెట్టి మంటప శిఖరాన్ని గట్టిగా పట్టుకున్నా. నేను యింతకు ముందు పట్టుకున్న దేమిటా అని కొంచెము అనుమాన మొచ్చింది. అది కర్రకాదు, దాని కొక తల దాని మీద రెండు కళ్ళు కనిపిస్తున్నాయి. అది పాము. అంత పెద్దపామును నేనెప్పుడూ చూడలేదు. కాడి కర్రలావుంది. రెండు మూడు బార్ల పొడవు వున్నది. అది అటూ ఇటూ కదలటం లేదు. సొమ్మసిలిపడి పోయినట్లు ఉప్పెన నన్ను వదలినా ఈ పాము నన్ను వదలదనుకున్నా ఏది ఏమైనా మరణానికి సిద్దముగా వున్న నాకు ప్రాణమంటె భయమెందుకు? అన్నిటికి భగవంతునిదే భారం. నేను మాత్రం కళ్ళు మూసుకుని కృష్ణ నామము చేస్తున్నా. మరల పెద్ద కెరటం వచ్చింది. పాము కొట్టుకుపోయింది. నేను మంటపము పైనుండి క్రిందకి పడిపోయా మంటపము ప్రక్కనే పెద్ద చెరువు దానిలోకి విసిరివేయబడ్డాను. మరల ఎట్లా వచ్చానో నాకే తెలియదు. తలంబ్రాల మంటపములోనికి వచ్చాను. ఆ మంటప స్తంభాన్ని కావిటేసుకొని దానిలోనే వున్నా.

    నీళ్ళు మండపంలో అందటం లేదు. కొంచెం పైకి ఎగిరి మంటపస్థంభాన్ని కావిటేసుకొంటున్నా. వాగలు నెట్టేస్తున్నవి. అక్కడ నుండి పోయి మరో స్థంభాన్ని పట్టుకున్నా. ఇట్లా నాలుగు స్థంభాల ఆట అయింది నా బ్రతుకు. నేను మాత్రం కృష్ణనామం విడువలేదు. కృష్ణా! కృష్ణా! అని కేకలు వేస్తున్నా. నాశక్తి వుడిగింది. ఆయాసం వస్తుంది. నాదం శుష్కించి పోయింది. మరలా ఆ పాము వచ్చింది ఈ దఫా నన్ను మ్రింగుతుందనుకొన్నా. కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేస్తున్నా. ఎంత సేపటికి అది నన్ను మ్రింగలేదు. ఆ పాము అక్కడే వుంది దానిలో చాలా మార్పు కనిపించింది. చాలా వుషారుగా వుంది. చూస్తుండగానే లావు తగ్గింది. చేతికర్ర లావు మాత్రమేవుంది. నన్ను చూచి తోక జాడించుకొనుచూ నీళ్ళల్లోకి జారిపోయింది. కృష్ణుడే వచ్చి పరామర్శించి. చిరునవ్వు నవ్వి, వెళ్ళి పోతున్నాడా అనిపించింది. నన్ను నేనే నమ్మలేకపోయా.
    
    ప్రొద్దు గూకింది ప్రాణం శోషకు వచ్చింది. నా శక్తి సన్న గిల్లింది. నిలబడలేకపోతున్నా. కళ్ళు చీకట్లు కమ్ముచున్నాయి. నేను చేయగలిగింది ఏమియూలేదు అంతా ఈశ్వరేచ్చ. ఆ భగవాన్ యెలా చూస్తే అలా జరుగుతుందని అనుకున్నా. ఇంతలో పడమర గాలి వచ్చింది. వాగులు తగ్గుముఖము పట్టాయి. నేను సొమ్మసిల్లి మంటపములో పడిపోయా. అప్పుడేమి జరిగిందో నాకు తెలియదు. కళ్ళుతెరిచి చూసేసరికి తూర్పువైపున ఒక పెట్రోమాక్సులైటు లాంటిది కనిపిస్తోంది. నాకెంతో దైర్యము వచ్చింది. అప్పటికి రాత్రి 12 గంటలు కావచ్చు ఉప్పెన తగ్గింది. మా వాళ్ళు అక్కడ వుండవచ్చుననిపించింది. నేను మండపం పైనుంచి క్రిందకు దూకా. నీళ్ళు మొలలోతు మాత్రమే వచ్చాయి. ఆ లైటు నాకు  కనపడలా. ఒకటి రెండు నిముషాల కన్నా ఆ కాంతి ఎక్కువసేపు నిలువలేదు. ఏమిటీ చిద్విలాసం; ఎందుకీ వింతలునాకు కనిపిస్తున్నాయి. ఏమిటో అంతా ఆగమ్యగోచరం ఎటు చూచినా గాడాంధకారం ఆశ నిరాశ చేసుకుని అమ్మవారి మండపం లోపలకు జేరుకున్నాను. స్పృహతప్పి పడి పోయాను.
    
    నన్నెవరో లేపుచున్నారు. యెక్కడో వినపడుచున్నాయి ఆ మాటలు కళ్ళెత్తి చూశా. వాళ్ళు నా బంధువులే. వాళ్ళు నా స్వగ్రామమైన తలగడదీవినుంచివచ్చారు. వాళ్ళంతా తుండ్లు చుట్టుకొని గోచీలు పెట్టుకొని వున్నారు. పొద్దు చాలా ఎక్కింది నన్ను చూచి వాళ్ళంతా ఏడ్చారు. నేనూ కళ్ళనీరు పెట్టుకున్నా. పైకి లేచే ఓపికలేదు చలికి వణికి పోతున్నా. ప్రాణం శోషకు వచ్చింది. నోటి మాటరావటం లేదు. వాళ్ళు చెప్పేది కొద్ది కొద్దిగా తెలుస్తోంది నాభార్య ఏమయినదో? పిల్లలు ఏమైనారో తెలియదు. మా వాళ్ళు నా భార్యా పిల్లలు బాగానే ఉన్నారని చెప్పారు. నేను నమ్మలేదు. మా వాళ్ళు నన్ను తీసుకు వెళ్ళేందుకు వీలుపడలేదు. అమ్మవారి దేవాలయంలోకి నన్ను చేర్చి గొంగళ్ళు కప్పారు; ఆ రాత్రి అక్కడే వున్నాము.
    
    తెల్ల వారింది సోమవారం వచ్చింది. నా బంధువులు మా గ్రామానికి నన్ను మంచము మీద వేసుకొని తీసుకువెళ్ళారు. 15 రోజుల తరువాత గాని నేను మనిషిగా కోలుకోలేదు. నా భార్యా, పిల్లల్ని రాకాసి కడలి పొట్టను పెట్టుకొంది. ప్రభుత్వము వారి లెక్కల ప్రకారం రెండున్నర లక్షల ఆస్తి ఏటి పాలైనది. బందరులో చదువుకొనుచున్న పిల్లలు మాత్రమున్నారు. ఇప్పుడు నాకు మిగిలిన ఆస్తి గోచీ పెట్టుకొన్న బనీను, కండ్లజోడు మాత్రమే. అచంచలమైన విశ్వాసము, అమితమైన భక్తి తత్పరత. వీటి చేతనే నేనిప్పుడు మనిషిలాగ జీవించుచున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS