"అయినా కూడా."
"మిమ్మల్ని ఒకసారి చూడాలని ఆమె అంతిమ క్షణాల్లో కోరుకుంటే?"
"అప్పటికీ అంతే."
"సరే అయితే" అని అతను తలుపుదాకా వెళ్ళి అంతలో ఆగి, "మీ భార్యకు సీరియస్ గా వుంది. ఆమె ఎక్కువరోజులు బ్రతకదని డాక్టర్లు చెబుతున్నారు" అని గబ గబ వెళ్ళిపోయాడు.
అనంతమూర్తి ప్రతిమలా నిలబడిపోయాడు. ఒక్క నిమిషం అతని మెదడంతా స్తంభించిపోయినట్లయింది. కళ్ళు జీవం లేనట్లుగా అయిపోయినాయి.
"వసంతా!" అతని గుండె బరువుగా మూలిగింది.
* * *
రెండు రోజుల తర్వాత జయిలు అధికారి అతని దగ్గరకు వచ్చాడు.
"మీ కోసం ఎవరో వచ్చారు. సాధారణంగా ఎవర్నీ కలుసుకోవటానికి అనుమతి యివ్వం. బట్ ఏజ్ ఎ స్పెషల్ కేస్ ఒప్పుకున్నాం. పదండి"
మూర్తి అతనివెంట నడిచాడు.
బయట జయిలు ఆవరణలో మోహన్, నందన ఆతృతగా నిలబడి వున్నారు.
అతన్ని చూడగానే "నాన్నా!" అంటూ నందన దగ్గరకు వచ్చింది. "అమ్మకి చాలా సీరియస్ గా వుంది నాన్నా, మనం అమ్మని పోగొట్టుకుంటున్నాం. అమ్మ నిన్నే కలవరిస్తోంది నాన్నా" ఆమె ఏడుస్తోంది.
మూర్తీ ఆమె భుజం మీద చెయ్యివేసి నిమురుతున్నాడు. అతని నోటినుంచి ఏ శబ్దమూ బయటకు రావటం లేదు.
మోహన్ దగ్గరకు వచ్చాడు. మనిషి నలిగి, కళ్ళు ఎరుపెక్కి వున్నాయి.
"నాన్నా!" అతని గొంతు వణుకుతోంది. "నువ్వు నన్నెప్పుడూ ఓ కొడుకుగా పెంచలేదు. ఓ స్నేహితుడిగా హెచ్చరిస్తూ, లాలిస్తూ వచ్చావు. అయినా నీ అపారమైన వ్యక్తిత్వ మంటే నేను భయపడేవాడ్ని. నిన్ను...ఎప్పుడూ ఏ కోరికా కోరలేదు నాన్నా. అంతధైర్యం లేకపోయింది. ఇవేళ....న యొక్క కోరిక....తీర్పు నాన్నా. మా కోసం, అమ్మకోసం.....సంతకం పెట్టి రా నాన్నా."
అనంతమూర్తి కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తున్నాయి. అతనప్పటికీ ఏమీ మాట్లాడలేదు.
"సారీ!"
జయిలు అధికారి గొంతు అది.
అనంతమూర్తి అతనివైపు ముఖం త్రిప్పాడు.
"మీ రచనలన్నీ ఆసక్తిగా చదివేవారిలో నేనొకడ్ని. మీ భావాలకి ముగ్దులయిన వారిలో ఒకడ్ని. ఇలాంటివిషమ పరిస్థితిలొ నేనిక్కడ ఆఫీసర్ని కావటం దుర....నోనో...నా అదృష్టం. సారీ! మీమీది గౌరవంతో నా ఉద్యోగాన్ని రిస్క్ చేస్తున్నాను. ఏ షరతులూ లేకుండా మీరక్కడ్నుంచి వెళ్ళవచ్చు. మీమీద ఏ ఆదేశమూ లేదు. అక్కడ మీ కర్తవ్యం ముగించుకుని మీ అంతట మీరే రావచ్చు"
మోహన్ ఒక చెయ్యీ, నందన్ ఒక చెయ్యీ పట్టుకు లాగుతున్నారు.
"రా నాన్నా!"
"రా నాన్నా"
అనంతమూర్తి కదిలాడు.
* * *
మోహన్ టాక్సీ తీసుకువచ్చాడు. కారులో కూర్చున్నాక ప్రయాణంలొ ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు.
అనంతమూర్తి గంభీరమైన మౌనంలో వున్నాడు. "వసంతా! వసంతా!"
"ఎన్నేళ్ళ గొప్పసాన్నిహిత్యం!"
అంతకన్నా అతని ఆలోచనలు సాగటంలేదు. వసంతతోటి సంఘటనలకన్నా-అతనికి వసంత ఎక్కువ. ఆ సంఘటనలు యాదృచ్చికం. వసంత సహజం.
కారు కాకినాడ చేరింది.
ఎంత ధైర్యస్థుడైనా అనంతమూర్తికి గుండె దడదడ కొట్టుకుంటున్నది.
కారు యింటిముందాగింది.
హాల్లో వసంత మంచంమీద పడుకునివుంది. ప్రక్కనే కుర్చీలలో కుమారి, రాఘవ కూర్చుని వున్నారు.
అనంతమూర్తి వాళ్ళేం చేస్తున్నారో చూడలేదు. గబగబ వెళ్ళి ఆమె ప్రక్కలో కూర్చున్నాడు.
"వసంతా."
ఆమె భుజాల మీద చేతులు వేశాడు.
అతనికర్ధమయింది. ఆమె శరీరముంది. ఆమెలేదు.
* * *
తిరిగి జైలుకు వచ్చిన అనంతమూర్తి జయిల్లో ఎమర్జన్సీ కాలం నిండు పద్దెనిమిది నెలలూ గడిపాడు.
ఎలక్షను జరపక తప్పని పరిస్థితి వచ్చింది. ఇష్టంవున్నా లేకపోయినా తప్పలేదు. ఎమర్జెన్సీని తీసివేయవలసి వచ్చింది.
అనంతమూర్తి విడుదలయినాడు.
ప్రశాంతంగా, నిరాడంబరంగా యింటికి వచ్చేద్దామనుకున్నాడు. కాని, బయటకు రాగానే ఎంతోమంది హితులూ స్నేహితులూ చుట్టుముట్టేశారు. అతను వద్దని గోలపెడుతున్నా అతని యిష్టాన్ని లెక్కచెయ్యకుండా ఆడంబరంగా యింటికి తీసుకువెళ్ళారు. ఇంటినిండా మనుషులు.
"సార్! సాయంత్రం ఓ సభ ఏర్పాటుచేశాం మీ గౌరవార్ధం."
"నోనో! ఇలాంటివి నాకిష్టంలేదు?"
"ఇది సన్మానం కాదుసార్. ఇన్నాళ్ళ మీవియోగా సంతరం మీ అభిమానులు మిమ్మల్ని కలుసుకునేందుకు అవకాశం. మీరు కాదనకూడదు."
అతనో క్షణం ఆలోచించాడు. సభ అనిపేరు పెడుతున్నా వాళ్ళ ఆంతర్యం అతనికర్ధమయింది. తన నిర్ణయం చెప్పేందుకు కూడా యిదే అవకాశం.
"సరే" అన్నాడు.
"ఇది రాజకీయ సభకాకూడదు. మనసులు విప్పుకునే వేదికగానే వుండాలి."
"సరే" అన్నారు వాళ్ళు__
* * *
ఆనాటి సభ కనీవినీ ఎరుగనంత వైభవంగా జరిగింది. తనకు ఇంతమంది అభిమానులూ, తన భావాల్ని ఇష్టపడే వాళ్ళు వున్నారని అనంతమూర్తికి మొదటిసారిగా తెలిసింది. అతని కనులు చెమర్చాయి.
