Previous Page
మనిషి - మిథ్య పేజి 27


    "కుసుమ నా ప్రాణం మావయ్యా" అన్నాడు రాజరావు.
    జానకిరామయ్యగారు నిట్టూర్చాడు. సుశీల వైపు చూశారు. వెంటనే చూపు మార్చాడు. పెద్ద కొడుకునీ, కోడల్నీ చూచీ తృప్తిగా నవ్వేరు.
    "ఈరోజు ..... నాకు వెర్రి ఆనందంగా ఉందర్రా" అన్నారాయన.
    డాక్టర్ని వెంటబెట్టుకుని శంకరం వచ్చాడు. డాక్టరు జానకిరామయ్యగార్ని పరీక్షించి ఏదో ఇంజక్షనిచ్చి, మళ్ళా ఉదయం వొస్తావని చెప్పి వెళ్ళారు. కాసేపు నిశ్శబ్దంగా గడిచింది.
    "మీ నిద్రలు పాడుచేసుకుని ఇక్కడ కూర్చోడం ఎందుకు? నాకే భయం లేదుగాని మీరిక వెళ్ళండి. నిద్రపోండి" అన్నారు.
    అందరూ, ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
    "ఫర్వాలేదర్రా .... నేనీ రాత్రి క్షేమంగానే ఉంటాను. వెళ్ళండి." అన్నారు.                
    అందరూ లేచారు. గది దాటారు.
    జానకిరామయ్యగారు ఆలోచనలో పడ్డారు. తప్పుచేసిన రాజారావు తప్పును తెలుసుకుని ఆ తప్పుకి గురైన వ్యక్తిద్వారా క్షమాభిక్ష పొందగలిగేడు. అతని మనసు హాయిగా, నిశ్చింతగా ఉంటుంది. తప్పు కప్పిపెట్టుకుని మరణశయ్య మీద కూడా-
    జానకిరామయ్యగార్కి తల పగిలిపోతున్నంత బాధ కలిగింది. ఈ బాధ తీరే మార్గం? ఆ బరువు తగ్గే దారి?
    రాత్రి పన్నెండు గంటలకి కుసుమ మందు తీసుకొచ్చింది. మందు తాగారు. కుసుమని కూర్చోమని చెప్పేరు. ఆమె తన పక్కనున్న కుర్చీలో కూర్చుంది.
    "నువ్వు అదృష్టవంతురాలివమ్మా" అన్నారాయన.
    ఆఒక్క ముక్కతో మవునం వహించారు. ఎంత సేపటికీ మరోమాట అనలేదు ఆయన. కుసుమా ఆయన్ని మాటాడించలేదు. అలా పది నిముషాలు గడిచిన తర్వాత.
    "శంకరాన్ని పంపు తల్లీ ...... నువ్వు నిద్రపో" అన్నారు.
    కుసుమ వెళ్ళిపోయింది. శంకరం వొచ్చేడు. అతను దగ్గిరగా వచ్చిన తర్వాత, గది తలుపు మూసి రమ్మని ఆయన చెప్పేరు. శంకరం తలుపు వేసి వచ్చి కూర్చున్నాడు.
    "నీకు దూరాలోచన ఉంది. మనిషిని అర్ధం చేసుకునే స్తోమతా ఉంది. అందుకే నీతో చాలా విషయాలు చెప్దామని నిశ్చయించుకున్నాను" అన్నారాయన.
    "చెప్పండి."
    "ఈ దీపం ఇంకా వెలగదు. కన్నీరు పెట్టకు. నువ్వు అధైర్య పడవని తెలిసే నిజం చెప్పాను. కాబట్టి నా నమ్మకాన్ని పాడుచెయ్యకు. నేను బ్రతకను. పోయేముందు-నీతో కొన్ని మాటలు......సుశీలకు తగిన వరుడ్నివెదుకు. అన్నయ్య నీకు అన్నివిధాలా సాయపడతాడు. సుశీల భారం మీ యిద్దరి మీద వేస్తున్నాను."
    "మీరివన్నీ ఆలోచిస్తూ మీ మనసు పాడుచేసుకోడం తగదు."
    "హు ..... నా మన సెప్పుడో చెదిరిపోయింది శంకరం. కుసుమ యీ ఇంట్లో కాలుపెట్టిన మరుక్షణమే నేను చచ్చిపోయాను."
    అదిరిపడ్డాడు శంకరం.
    "మనిషి చెయ్యరాని తప్పుని చేసి చాలా కాలమైనా, అదిప్పుడు కెలుకుతుంది. గొంతుపట్టి మలుముతుంది. నా తప్పు చెప్పుకుంటే క్షమిస్తావా నాయనా!"
    "నాన్నా."
    "కథలు రాస్తావ్. విలువలు నీకు బాగా తెలుసు. నా విషయం నీకు చెప్పేసే తృప్తి. యవ్వన దశలో కళ్ళు మూసుకుపోయి, ఇంట్లో వాళ్ళందర్నీ ఎదిరించి పెళ్ళి చేసున్నాను. అప్పుడున్న ధైర్యం రానురాను క్షీణించసాగింది. ఆ స్థితిలోనే కూతురు పుట్టింది. వత్తిడి ప్రారంభమైంది. గడ్డిపరక నయ్యాను. గాలివాటుకి తలాడించేను. పార్వతి కళ్ళు మూసి పారిపోయి వచ్చాను. మీ అమ్మని పెళ్ళాడేను. ఇది పెళ్ళి అందరి సమక్షంలో, అందరి ఆమోదంతో జరిగిన పెళ్ళి యిది. మీ అమ్మ నన్ను నమ్మింది. కానీ ..... నన్ను నేను నమ్మలేదు. ఆ తల్లీ కూతుళ్ళకి చేసిన అన్యాయం దాచగలిగి మీ అమ్మనీ, మీ అమ్మలాటి చాలామంది అమాయకురాలినీ నావైపు తిప్పుకున్నాను. తొలిరోజుల్లో, నే చేసిన నేరం నన్ను అనుక్షణం కృంగదీసేది, ప్రశ్నించేది. కాని, రానురాను పాతబడిపోయింది. పూర్తిగా మరిచిపోయాను. కాలం గడిచింది. కాటికి కాళ్ళు చాపిన నామీద ఆ తప్పు దండయాత్ర చేసింది. దెబ్బతీసింది. విధి నన్ను గేళిచేసింది. కన్న కూతురు బ్రతుకులో వాళ్ళమ్మలా మోసపోయి, నా వ్యక్తిత్వముపైన చాలెంజి చెయ్యటానికా అన్నట్టు, మల్లా నా యింటికే చేరింది. ఒకనాడు నేను తిట్టి పోసిన రాజారావు ఆపిల్లకి భర్త నాయనా! ...." అన్నారాయన కళ్ళనిండా నీళ్ళు నింపుకుని గాద్గదికంగా.
    "నాన్నా......" గట్టిగా అరిచేడు శంకరం.
    జానకిరామయ్యగార్కి స్పృహ తప్పింది!
    
                                   *    *    *

    తెల్లవారింది.
    ఆయనకి స్పృహ రాలేదు. డాక్టరు అయన మంచం దగ్గరే కూర్చుని మందులిస్తున్నాడు, చేతనయిన దంతా చేస్తున్నాడు. సరిగ్గా అలాటి స్థితిలోనే వాసు అరెస్టయిన సంగతి శంకరానికి తెలిసింది. అతని మనసు వికలమైంది. దాదాపు పిచ్చివాడైపోయాడు.
    వీధి అరుగుమీద కూర్చుని వొచ్చేపోయే జనం వైపు వెర్రిగా చూడటం మొదలుపెట్టాడు.
    డాక్టరు బయటకు వచ్చాడు.
    "ఈరోజు గడుస్తే అదృష్టమే మరి బంధువులకి ఉత్తరాలు రాయాలనిపిస్తే రాయండి." అని చెప్పి వెళ్ళిపోయాడు.
    శంకరం గుండె దిట్టపరుచుకున్నాడు. మిత్రులందరికీ ఉత్తరాలు వ్రాసాడు. తన గదిలోకి వెళ్ళి మంచంమీద వాలిపోయాడు. గట్టిగా కళ్ళు మూసుకుని నాన్న గురించిన ఆలోచనల్లో మునిగి పోయాడు.
    ఆరోజు-
    ఇంటికెళ్ళిన డాక్టరుతో మరి పనిలేకపోయింది!

                                      *    *    *

    జానకిరామయ్యగారిల్లు కళావిహీనంగా ఉంది. అన్నాదమ్ము లిద్దరూ వీధి అరుగుమీద మోకాళ్ళ పై తలలు పెట్టుకుని కూర్చున్నారు. రాజారావు, వొచ్చిన పెద్ధమనుషుల్తో జానకిరామయ్యగారి అంతిమ ఘడియలు ఎలా ముగిసాయో వివరించి చెప్తున్నాడు.
    దొడ్లో నూతి దగ్గర సుశీల సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె పక్కనే రేణుకా, కుసుమ లిద్దరూ కూర్చుని ఉన్నారు.
    ఏడు గంటల ప్రాంతాల బెజవాడ నుంచి పతివాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడం చూచిన శంకరం లేచి నిలబడ్డాడు. తన మొహంలో కనిపిస్తూన్న దైన్యాన్ని కప్పిపెట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నాడు.
    పతి అతని దగ్గరకు వచ్చి, భుజం తట్టి,
    "దార్లోనే తెలిసింది. ఈ సమయంలోనే ధైర్యముగా ఉండాలి." అన్నాడు.
    శంకరం ఏమీ మాటాడలేదు.
    శారదా, మృణాళినీ ఇద్దరూ కాళ్ళు కడుక్కుని దొడ్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేరు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి దొడ్లో సన్నగా ఏడుపులు వినిపించాయి.
    వీధివైపున కోటయ్య పంతులు ఉపన్యాసం ప్రారంభించేడు.
    "నాకు రావలసిన చావువాడి కొచ్చింది. చావ్వలసిన వాడిని బ్రతికి గుండ్రాయిలా తిరుగుతున్నాను. బ్రతికి బాగుంటా డనుకున్నవాడు కాస్తా కన్ను మూశాడు. విధి నిర్ణయాల ముందు మానవులం మన మెంత?"
    శంకరానికి, కోటయ్య పంతులి ఉపన్యాసం, పది మంది మధ్య కూర్చుని వినడం యిబ్బందిగా తోచింది. అరుగుమీద నుండి లేచి తన గదిలోకి వొచ్చేశాడు.
    గదిలో గోడవారగా చేరగిలబడి కూర్చుని కిటికీలోంచి కనుపిస్తోన్న బాదంచెట్టు వైపు చూస్తున్నాడు.
    కోటయ్య పంతులి ఉపన్యాసం నిరాటంకంగా సాగుతూనే ఉంది-
    "ఈ మరణం అనబడే శక్తిని మానవుడు జయించలేకపోతూనే ఉన్నాడు. ఎన్ని మందులు కనిపెట్టనివ్వండి, ఎన్ని జాగ్రత్తలు పడనివ్వండీ........ఊహు......జయించడం అతని శక్యం కానేకాదు. రాజాధిరాజైనా, మహా భక్తుడైనా, సామాన్య మానవుడైనా, నీచాతినీచుడై నా-మరణానికి అందరూ సమానమే ఎవడైనానూ-కాస్త ముందూ వెనకలతో పోవాల్సిందే. ఇక్కడికి వంటరిగా ఎలాగైతే వచ్చాడో అలాగే వంటరిగా పోవాల్సిందే. ఈ భూమ్మీద ఉన్నన్నాళ్ళూ నలుగురితోనూ ఏదో సత్రంలో గడిపినట్టు గడిపి, పిలుపు వొచ్చిన తర్వాత తలొంచుకు వెళ్ళిపోవాల్సిందే. తప్పదు. అందుకనే అన్నారు.
    'పోకన్మానదు దేహ మేవిధమునన్ పోషించి
            రక్షించినన్
    రాకన్మావదు హాని వృద్ధులు మహారణ్యంబులో
               డాగినన్
    గాకన్మానదు పూర్వ జన్మకృత్వమున్ గా గల్గు
            వర్ధంబులున్
    లేకన్నానునే యెంత జాలిపడినన్ లేముల్
            సిరుల్ రాఘవా?
    అందుచేత మనం దైవలీల ముందు నిమిత్త మాత్రులం నాయనా!"
    "గొప్పగా చెప్పారు మాస్టారు!" అన్నాడు శ్రద్దగా వింటూన్న ప్రసాదం.
    అతని అబిప్రాయం విన్న తర్వాత మరింత ఉత్సాహంతో తనకు తెలిసినదంతా బోధించడానికి సిద్ధపడ్డారు కోటయ్య పంతులు.
    శంకరం పేలవంగా నవ్వేడు.
    ఇలాటి సమయాల్లో మనిషికి వేదాంతం చాలా అవసరం. ఉన్నప్పుడు విసుగు పుట్టించే వేదాంత పారం యీ సమయంలో అమృత ప్రాయంగా ఉంటుంది.
    శంకరం కళ్ళు తుడుచుకున్నాడు.
    బాదంచెట్టు పచ్చటి ఆకులమధ్య నాన్న నిలబడినట్టూ, ఆయన చేసిన నేరానికి క్షమాభిక్ష దొరకలేడేమో నని దిగులుచెందుతున్నట్టూ భ్రాంతి కలిగింది.
    అతను గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
    తనని కంటికి రెప్పగా పెంచిన నాన్న, ప్రయోజకుడిగా చేసిన నాన్న, నిత్యమూ తన బాగు కోసం పాటుపడిన శ్రేయోభిలాషి నాన్న-పవిత్ర రూపం నిర్మలంగా, నిండుగా, ప్రశాంతిగా కనుపించింది.
    శంకరం అప్రయత్నంగా ఆ వ్యక్తిత్వానికి చేతులు జోడించాడు. ప్రేమతో 'నాన్నా' అని గొణిగేడు.

                                                         *    *    *

    గుమ్మం దగ్గర శబ్దమైంది. శారద నిలబడి ఉంది.
    "ఆ శారదా!" అని పిలిచేడు. శంకరం.
    ఆమె వచ్చి తన దగ్గర కూర్చుంది.
    "నాకు ఓ దార్చడం చాతకాదు." అన్నది.
    "తెలుసు శారదా! మనకి ఇలాంటి చావులు తెలీవు. ఏడుపులూ తెలీవు. ఏడ్చేవాళ్ళ నెలా ఓదార్చాలో గూడా తెలీదు. అటు చూడు. కోటయ్య పంతులు వేదాంతం చెప్తూన్నారు. ఆయన జీవితన్ని వడపోసి చూచిన అనుభవజ్ఞులు. వెలుగూ నీడా తెలిసిన పెద్దలు. ఇలాంటి దుస్సంఘటనలు ఆయన చాలా చూచి ఉంటారు. కాబట్టే ఆయన జీవితం గురించీ, దుఃఖం గురించీ నిబ్బరంగా నిలబడి పాఠం చెప్పగలరు. కదూ" అన్నాడు శంకరం.
    శారద నేలపైన పిచ్చి గీతాలు గీస్తోంది!
    "నాన్న గురించి నే నెప్పుడూ ఆలోచించలేదు. ఆయన బ్రతుకులో చివరి రాత్రి నన్ను ఆశ్చర్యపరచింది. ప్రాణి పోతున్నందుకు నాన్న కన్నీరు పెట్టలేదు. కానీ..... వొద్దు శారదా ..... వొద్దు......ఆయన గురించి చెడు నీతో చెప్పుకోలేను." అన్నాడు వలవలా ఏడుస్తూ -

    శారద అతని చేతిని తీసుకుంది. లాలనగా నిమిరింది అతను ఏడుపుని దిగమింగుకున్నాడు. ఆమె చేతుల్లో తన మొహాన్ని దాచుకున్నాడు.
    కోటయ్య పంతులుగారి వేదాంత చర్చ ముగింపు కొచ్చింది-
    "...... బ్రతికినన్నాళ్ళూ బ్రతుకు మన దనుకోడం, ఆ బ్రతుక్కి తెర పడగానే ఈ జీవన్నాటక రంగం నుంచి తప్పుకోడం-ఇది మామూలే. కాబట్టి ఇలాటివన్నీ పట్టించుకుని మనసు చెడగొట్టుకొడం తెలివి తక్కువ, నువ్వూ, నేనూ, పెళ్ళాం బిడ్డలూ, ఇల్లూ వాకిలీ అన్నీ, అంతా మిథ్య......మిథ్య" అన్నారు కోటయ్య పంతులు.
    ఆ మాటవిన్న శంకరం తలెత్తి శారద కళ్ళలోకి చూస్తో -
    "మనిషి తెలివిగలవాడు శారదా! తనమీద తనకి నమ్మకమున్నన్నాళ్ళూ అతనిలోని 'అహం' చవక తన ప్రయోజకత్త్వానికి మురిసిపోతాడు. ఆ నమ్మకం కాస్తా పోతే 'మనం నిమిత్త మాత్రులం, అంతా మిథ్య, అనేసి తప్పుకుంటాడు. మనిషి దేవాంతకుడు కదూ?" అన్నాడు శంకరం.
    అతని అభిప్రాయంలో తనకి సంబంధంలేనట్టు నవ్వి ఊరుకుంది శారద!
                    


                                :-ఐపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS