భార్యకు జబ్బుచేసింది. క్షీణించిపోతోంది.
చేతిలో డబ్బులేదు. కొడుకు కొంత వరకూ పెడుతున్నాడు. సరిపోవటం లేదు. తను యింటిమీద అప్పుచేసి తెస్తున్నాడు. యిదివరకే అప్పులున్నాయి.
డాక్టర్లకు మొదట రోగం అంతుపట్టలేదు. తర్వాత కేన్సరని తేల్చారు.
భోరుమని విలపించి హైదరాబాద్ తీసుకెళ్ళాడు.
అప్పటికే చాలా ఎడ్వాన్స్ అయిందని చెప్పి తాము చేయవలసింది చేసి ఇహ తీసుకు వెళ్ళమన్నారు.
ఎవరో హోమియోపతిలో మంచి మందులున్నాయన్నారు. ఇంటికి తీసుకొచ్చి అదే వాడుతున్నాడు.
ఇంటిమీద అప్పులు పెరిగిపోతున్నాయి. తాకట్టువాకట్టుగా మారి కోర్టులోకి ఎక్కి ఇల్లు ఖాళీచెయ్యాలని ఆజ్ఞలు వచ్చాయి.
"నాకోసం శ్రమపడకండి నేనింక బ్రతకను" అంది లక్ష్మి.
అప్పటికి చిక్కి శల్యమైపోయి బొమికల మీద చర్మం కప్పినట్లుగా వుంది. నూతిలోంచి వస్తున్నట్లుగా వుంది గొంతు.
రాఘవకు బావురుమని ఏడవాలనిపించింది. ఈ వ్యక్తితో కొన్ని వందల సంవత్సరాలు గడిపినంత సుదీర్ఘంగా గడిపాడు ఆమెకోసం తన సర్వం అర్పించాడు.
"లేదు లక్ష్మి నువ్వు లేకపోతే నేనుకూడా బ్రతకలేను. నిన్నెట్లా అయినా బ్రతికించుకుంటాను. బ్రతికేటట్లు చేస్తాను."
ఎవరో తాయిత్తులు కట్టమంటే కట్టాడు. భూతశాంతి చేయించమంటే చేయించాడు. ఎవరో సాధువు జపాలుచేసి చచ్చిపోయే మనుషుల్ని కూడా బ్రతికిస్తాడని చెబితే ఆయన్ని తీసుకువచ్చి బోలెడు డబ్బు ఖర్చుపెట్టి అవన్నీ చేయించాడు.
"నాకు విమలను చూడాలని వుందండీ" అంది లక్ష్మి.
వెళ్ళి విమలను, ఆమె భర్తనూ తీసుకొచ్చాడు నిర్మలా పెనిమిటీ అంతకుముందే వచ్చారు.
విమల తల్లి శుష్కించిన దేహంమీదపడి బావురుమంది.
లక్ష్మి కళ్ళలోంచి నీళ్ళు కారటానికి కూడా లేనంతగా వంట్లో నీరంతా ఎండిపోయింది.
తర్వాత మగత లోనికి వెళ్ళిపోయింది.
ఆమె చావు బ్రతుకుల్లో వుందని తెలుసుకుని డిగ్రీ పొందినవాళ్ళు వచ్చి ప్రాణం పోవటానికి ముందే బయట పెట్టమని హెచ్చరించాడు. ఏమీ ఎదురుచెప్పటానికి వీల్లేక పోయింది. బయటకు తీసుకొచ్చారు.
వర్షం రాత్రివేళ.
లక్ష్మి ప్రాణం యింకా పోలేదు.
"నాలక్ష్మి తడిసిపోతోంది. నాలక్ష్మి తడిసిపోతోంది" అని రాఘవ గోలపెట్టాడు.
అనంతమూర్తి దగ్గరుండి షామియానా లాంటిది కట్టించాడు.
లక్ష్మి తనకు తెలియని దశలో ఎన్నో సంవత్సరాలు నివసించిన యింటి బయట గంటల తరబడి మరణ యాతన పడుతున్నంతసేపూ వర్షం కురుస్తూనే వుంది. ఆమె ప్రాణం పోయాక వర్షం వెలిసింది.
* * *
రఘురామయ్యగారికి హై బి.పి. వల్ల హార్టు బాగా ఎన్ లార్జీ అయి విపరీతంగా ఆయాసంవస్తూ, పరిస్థితి రోజు రోజుకూ విషమిస్తోంది.
అనంతమూర్తి తరచు వెళ్ళి చూసివస్తూనే వున్నాడు.
ఒకరోజు అతనికి కబురు వచ్చింది-ఎక్కువగా వున్నదని. హడావిడిగా పరిగెత్తుకు వెళ్ళాడు.
ఆయాసం బాగావచ్చి ఊపిరి అందలేదట. అంతకుముందే డాక్టరు వచ్చి యింజక్షన్ చేయటంవల్ల తాత్కాలికంగా కొంత ఉపశాంతి కనిపించింది. చుట్టూ బంధువులంతా నిలబడి వున్నారు. రఘురామయ్యగారు అనంతమూర్తిని చూశాడు. ఆయన ముఖంలో వెలుగు కనిపించింది.
తతిమ్మా వాళ్ళందర్ని బయటకు వెళ్ళమన్నట్లు సౌంజ్ఞ చేశాడు.
అంతా వెళ్ళాక అనంతమూర్తిని దగ్గరకు రమ్మన్నట్లు సౌంజ్ఞ చేశాడు.
మూర్తి ఆయన మంచం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు.
తన ప్రక్కలో కూర్చోమన్నట్లు గా సౌంజ్ఞ చేశాడు.
మూర్తి మంచంమీద ఆయన ప్రక్కనే కూర్చుని ఆయన చేతులు తనచేతుల్లోకి తీసుకున్నాడు.
ఒకప్పుడు దృఢంగా, ఆరోగ్యంగా వున్న ఆ చేతులు నేడు దీనాతి దీనంగా శుష్కించి వున్నాయి. ముఖం ఎంత గానో కృశించిపోయింది. కాని కళ్ళలో వ్యక్తిత్వం మాత్రం చెదిరిపోలేదు.
"మూ.....ర్తీ..." ఆయన కష్టంమీద మాట్లాడుతున్నాడు. "...ఎన్నో....సంవత్సరాల ....సాన్నిహిత్యం ....మనది....నేను.....వెళ్ళిపోతున్నాను....ఈపత్రికను ....స్థాపించింది.... నేనే.... అయినా......ప్రాణంపోసి.....పెంచింది ....ఇంకొకరు....దీనికి.....న్యాయం చెయ్యలేదు. దీనిమీద.....సర్వాధికారాలూ... నీకే అప్పగించి....పోతున్నాను."
అనంతమూర్తి ఏదో చెప్పబోయాడు. "నీమనస్సూ.... ఔన్నత్యమూ.... నాకు.... తెలుసు.... ప్రలోభంతో కాదు.... బాధ్యతకోసం .... నువ్వు ఒప్పుకోవాలి" అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఎప్పుడూ లేదు అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"మూర్తీ!.... నువ్వు ఏడుస్తున్నావా...?...నువ్వు"
లేదన్నట్లు అతను తల త్రిప్పబోయాడు. కాని శరీరంలో నవనాడులూ స్తంభించిపోయినట్లయి, మంత్ర ముగ్ధుడైనట్లు ఆయన ముఖంలోకి కళ్ళనీళ్ళు కారుతుండగా చూస్తూ కూర్చుండిపోయాడు.
అలా ఎంతోసేపు యిద్దరూ నిశ్శబ్దంలో వుండిపోయారు.
* * *
ఆ రాత్రే రఘురామయ్య గారు యీ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు.
అనంతమూర్తి జీవితంలో అంత బాదెప్పుడూ అనుభవించలేదు. అంత్యక్రియలయిపోయినాక రెండు మూడు రోజులు పిచ్చెత్తినట్లు తిరిగాడు.
ఓ సాయంత్రం మనసేమీ బాగుండక సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు.
అక్కడ రాఘవ వొంటరిగా యిసుకలో కూర్చుని కనిపించాడు. గడ్డం బాగా పెరిగి, ముఖం పీక్కుపోయి వుంది. భరించలేనంత దిగులుగా వున్నాడు.
