Previous Page Next Page 
ఉష్ ష్ ష్..... పేజి 2

    ఆ తుప్పల్లోంచి పరుగుతీస్తుంటే ఏవేవో ముళ్ళచెట్లు అతని చర్మాన్ని చీలుస్తున్నాయి.

    ఏమైనాసరే వాడికి అందకూడదు. అందితే చంపేస్తాడు.

    కొన్ని గజాల దూరంలో అతనికి ఒక బంగ్లా కనిపించింది.

    పరుగువేగం పెంచి బంగాలాని చేరుకున్నాడు. బంగళా తలుపులు తెరిచి వున్నాయి.

    గభాలున బంగళాలో దూరి వీధి తలుపులు మూసేశాడు.

    అప్పుడు తట్టింది అతనికి తాను వేరేవాళ్ళ ఇంట్లో దూరినట్టు.

    హాలు మధ్యలో నిల్చుని చుట్టూ తిరుగుతూ గమనించాడు.

    ఇంట్లో ఎవరూ వున్నట్టు అనిపించలేదు.

    "ఎవరూ? ఎవరండీ లోపల?"

    వణికే కంఠంతోనైనా గట్టిగా ప్రశ్నించాడు.

    ఈ విధమైన సమాధానం రాలేదు.

    ఎవరూ లేరు.

    నిర్జనమైన ఆ ప్రదేశంలో, ఆ బంగళాలో ఎవరూ లేరు.

    అతనికి చాలా భయం వేసింది.

    భారంగా కొట్టుకుంటున గుండె ఠాప్పుమని పేలిపోతుందేమో అన్న ఫీలింగ్ ఏమో...గుండెమీద కుడిచెయ్యి చేసి గట్టిగా అదిమి పట్టుకున్నాడు.

    "ధన్.....ధన్.....ధన్...."

    బయటినుండి తలుపుమీద బాడుతున్నాడు ఆ భీకరాకారుడు.

    అయిపోయింది ఇంక తన పని అయిపోయింది.

    ప్రణయ్ వణికిపోయాడు.

    సరిగా అప్పుడే అతని దృష్టి మూల టీపాయ్ మీద వున్నా టెలిఫోన్ మీద పడింది.

    పోలీసులకు ఫోన్ చేస్తేనో!

    వేగంగా ఫోన్ దగ్గరికి పరుగుదీశాడు.

    ఆ సమయంలో....

    అతను ఊహించని భయంకరమైన సంఘటన జరిగింది.

    ఫోన్ రిసీవర్ ఎవరో ఎత్తినట్లు హఠాత్తుగా గాల్లోకి లేచింది.

    వైరు పాములా దాని చివర గాల్లో రిసీవర్ పడగలా బుసలు కొట్టింది.

    ప్రణయ్ భయంతో కొయ్యబారిపోయాడు.

    దెయ్యాల మేడ.

    ప్రణయ్ అడుగు వెనక్కి వేసేంతలోనే ఆలస్యం అయిపోయింది.

    పైకి లేచిన రిసీవర్ పడగతో కొట్టినట్టుగా బుసకొడుతూ రివ్వున అతని మెడమీద కొట్టింది. కాదు.... కాదు....కాటువేసింది.

    భయంకరంగా చావుకేక పెట్టాడు.

    దబ్బున శబ్దం!

    ప్రణయ్ పడ్డాడు. నేలమీద పడ్డాడు.

    నేలమీద దబ్బున పడ్డ ప్రణయ్ 'అబ్బా' అంటూ కళ్ళు తెరిచాడు.

    కళ్ళు తెరిచిన అతను ఉలిక్కిపడ్డాడు.

    తన మొహం మీద మరో మూడు మొహాలు!

    తన తల్లిది, తండ్రిది, చెల్లెలుది!

    మంచం మీద వుండాల్సిన తనేమో నేలమీద!

    "ఏంట్రాగన్నాయ్? మళ్ళీ కలగాన్నావా?" అడిగాడు తండ్రి మారుతీ రావు.

    "అయినా ఎప్పుడూ ఆ దరిద్రం డిటెక్టివ్ నవల్సు రీడింగ్స్ చేస్తూ వుంటే డ్రీమింగ్స్ ఎందుకు రావూ?" విసుక్కుంటూ అంది అతని తల్లి కనకమహాలక్ష్మి.

    "చదివితే చదివాడు....చదివిన తర్వాత ఆ పుస్తకాలని మరీ తల క్రింద పెట్టుకుని పడుకుంటాడే అమ్మా....మరి కలలు రాకేం చేస్తాయి...."నవ్వుతూ అంది చెల్లెలు కోమలి.

    ప్రణయ్ నేలమీద ఇబ్బందిగా కదిలాడు.

    "ఇంకా ఆ పవ్వళింపేమిటి? లే....లే....లేచి తయారవ్వు....ఆఫీసుకు టైమవుతుంది. నీ అరుపులతో కంగారు పెట్టేశావ్ కదా? చుట్టు ప్రక్కలవాళ్ళు ఎవరయినా వింటే ఈ ఇంట్లో హత్య జరిగిపోయిందేమో అని అనుకుంటారు" అంటూ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు మారుతీ రావు.

    "లే బాబూ లే...లేచి టూత్ బ్రష్షింగ్ చేస్కో.....కాఫీ పెట్టిస్తా అంది కనకమహాలక్ష్మి.

    "అబ్బ వుండవే....ఒక ఐదు నిమిషాలు పడుకుని వస్తాను.....బద్దకంగా వుంది" నేలమీంచి లేచి నిలబడి మంచంమీద కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు ప్రణయ్.

    కనకమహాలక్ష్మి, కోమలి గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు.

    ప్రణయ్ మంచంమీద వెల్లకిలా పడుకుని ఇందాక తను కన్న కాలని ఒకసారి గుర్తు చేసుకున్నాడు.

    ఎంత భయంకరమైన కల!?

    ఇప్పటికీ అతని గుండె భారంగా కొట్టుకుంటూ వుంది.
 
    డిటెక్టివ్ నవల్సు చదివినంత మాత్రాన ఇటువంటి కలలు రావాలా?

    మరి అలాగయితే సెక్స్ నవల్సు చదివితే అలాంటి కలలు వస్తాయా? చచ్చినా రావు.

    ఏనాడయినా ఓ అందమయిన అమ్మాయి కలలోకి వచ్చిందా? ఊహు?

    రోజూ ఆఫీసులో ప్రమీలని చూస్తాడు తను. పోనీ ప్రమీలయినా కలలోకి వచ్చి కనీసం ఓ ముద్దిచ్చిండా? అబ్బే....అంత అదృష్టం ఏదీ?

    ప్రమీల అంటే ఆఫీసులో అతని క్రింద పనిచేసే స్టెనో అన్న మాట!

    ప్రమీల!

    వెరీ స్వీట్ గాళ్...

    అనుకున్నాడు.

    సరిగా అంతలోనే శబ్దం....

    'సర్...సర్...సర్....'

    చీపురు శబ్దం! తనకి అతి చేరువలో....

    చాలా పరిచయం వున్న శబ్దం అది.

      రోజూ తనకి సుప్రభాతం పలికే శబ్దం అది !!

    వేల్లకితలా పడుకుని వున్న ప్రణయ్ చటుక్కున ప్రక్కకి తిరిగాడు .

    ప్రవల్లిక చీపురుతో గది తుడుస్తూంది .

    ప్రవల్లిక అంటే అతని మరదలో ,మేనకోడలోకాదు .

    ప్రవల్లిక అంటే వాళ్ళింట్లో పాచిపని చేయడానికి వచ్చే పనిమనిషి .

    ఇది వరకు పనిమనిషంట్ ఏ రంగమ్మో,రాములమ్మో అని పేర్లు వుండేవి.
 
    ఇప్పుడు కాలం మారిపోయింది.

    మనకంటే వాళ్ళే బోల్డంత లేటెస్టు పేర్లు పెట్టుకుంటున్నారు!

    దీనికి ముందు మరో మనిషి వాళ్ళింటిలో చేసేది. దాని పేరు హేమమాలిని. అది పని సరిగ్గా చేయడంలేదని దాన్ని తీసేసి దీన్ని పెట్టుకున్నారు.

    ప్రవల్లిక వంగి వంగి నేలని వూడుస్తూంది. దాని పైట ఎప్పుడో జారిపోయింది.

    లోనెక్ జాకెట్ లోంచి....ఆమె యవ్వనం సోయగాలు చూస్తూ....

    ఇందాక భయంకరమైన కల చూసినప్పటికంటే బరువుగా కొట్టుకోసాగింది అతని గుండెకాయ.

    చూస్తూండగానే క్షణాల్లో మెరుపులా గదంతా వూడ్చేసింది ప్రవల్లిక.

    ప్రణయ్ కంగారుపడ్డాడు. అప్పుడే వెళ్ళిపోతూందా?

    "ఇదిగో....నిన్నే. అంత కంగారుగా వూడిస్తే దుమ్ము పోతుందా? అదిగో...ఆ మూల కాస్త దుమ్ము వున్నట్టుంది చూడు...."అన్నాడు పని మనిషితో.

    "ఎక్కడండి బాబూ...సుబ్బరంగా తుడిశాగా.....ఎలాగయినా మీకు శాలా సుబ్రం ఎక్కువండి బాబూ...తుడిసిన సోటే తుడవమంటారు. కానీ ఈ సీపురు సూశారా బాబూ? తుడిసీ తుడిసీ అరిగిపోయి ఎంత సిన్నదయి పోయిందో.....అమ్మగారికి సెప్పి మరో కొత్త సీపురు ఇప్పించండి బాబూ నేనూ సెప్తుంటే అమ్మగారు ఇనిపించుకోవడంలేదు బాబూ. ఇంగిలీసులో తిట్టేస్తా వుండారు బాబూ" అంది ప్రవల్లిక పైట పూర్తిగా సర్దుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS