2
జాన్ బా, రాం శాస్త్రి సతారా చేరుకున్నారు. జాన్ బా చెప్పిన కధ విన్న అనగళ్ షావుకారికి రామ్ శాస్త్రి మీద జాలి వేసింది. అతన్ని షాగిర్దా'గా ఇంట్లో కుదుర్చు కున్నాడు. (షాగిర్ద్ అంటే ఇంటి పనులు చేసే బ్రాహ్మణపిల్లవాడు) . రామ్ కి చదువు రాదు కాబట్టి ఇంతకన్నా మంచి పని దొరకలేదు.
ఒక వారం గడిచింది. రాదాభాయి జరిగినదంతా తెలుసుకుని కొడుకుని చూడటాని కని సతారా వచ్చింది. పసిపిల్లవాడు చేస్తున్న బండ చాకిరీ చూసేప్పటికి ఆమెకి కన్నీరు ఆగలేదు.
"బాబూ నీకిదే కర్మ!" అని గుండెలకి హత్తుకుంది. నీ తండ్రి గొప్ప పండితుడు. నువ్వేమో ఇలా వెట్టి చాకిరీ చేసి బతకాలా" అని బోరుమంది.
తల్లి మాటలు విన్న రామ్ కి కూడా ఏడుపు ఆగలేదు. వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించాడు. తన మాటలు అతని పసి మనసుని గాయపర్చాయని గ్రహించిన రాదాభాయి అతన్ని సముదాయించి తను చేసి తీసుకు వచ్చిన మిఠాయి ఆప్యాయంగా తినిపించింది.
"అమ్మా నాకు షావుకారు గారు సంవత్సరానికి మూడు రూపాయల జీతం ఇస్తానన్నారు తెలుసా?' అన్నాడు రామ్ గర్వంగా కొంతసేపటి తర్వాత. 'ఈ ఏడాది పూర్తీ కానీ, నీకు ఆ జీతాన్నంతా ఇచ్చేస్తాను."
కొడుకు అమాయకపు మాటలకి రాదాభాయి దుఃఖం మళ్ళీ పెల్లుబిక్కింది. అతని చిన్న హృదయంలో దాగి వున్న ప్రేమ ఆమెని కదల్చి వేసింది. ఎలాగో కన్నీటిని దాచుకుని అతని దగ్గిర సెలవు తీసుకుంది. రామ్ కి కూడా దుఃఖం ఆగలేదు. తన అశ్రువులతో ఆమె పాదాలని తడిపి వేశాడు.
రాదాభాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె మాటలు అతని చెవిలో ఇంకా మోగుతూనే ఉన్నాయి. "నీ తండ్రేమో గొప్ప పండితుడు....నువ్వేమో ఇలా వెట్టి చాకిరీ చేసి బతకాలా........."
* * * *
పది సంవత్సరాలు గడిచి పోయాయి. రామ్ ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ యువకుడు. దేహమయితే బాగా పెరిగింది కాని అతని బుద్ది మాత్రం సరైన పోషణ లేక అనగల్ షావుకారు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏ స్థితిలో ఉందొ అదే స్థితిలో ఉంది. ఈ లోటుని కొంత దాకా తీర్చేందుకా అన్నట్లు అతని మంచితనం , నిజాయితీ తన చుట్టూ వాళ్ళందరి నీ ఆకర్షించటమే కాక అతనికి మంచి పేరుని కూడా సంపాదించి పెట్టాయి. రాదా భాయి కి కొడుకు ఏటా పంపే జీతం కన్నా అతని మీద అందరికీ ఉన్న సదభిప్రాయమే ఎక్కువగా సంతోషం కలిగించేది.
ప్రతిదినం షావుకారు గారు ఇంటికి రాగానే అయన కాళ్ళ మీద నీరు పోసి వాటిని తుడవటం రామ్ పనులలో ఒకటి.
ఆరోజు రామ్ చెంబు, తువ్వాలుతో సిద్దంగా నుంచుని ఉన్నాడు. షావుకారు గారు గుడికి వెళ్లి తిరిగి రావాలి.
ఇంతలో అయన పల్లకి రానే వచ్చింది. ఇంటి ముందు పని వారంతా వినమ్రంగా లేచి నుంచున్నారు. ఇంటి లోపల సందడి తగ్గిపోయింది. సాలెలో గుర్రాలు తమ యజమాని పల్లకి లో వెళ్ళటం వల్ల తమని అవమాన పరచాడా అన్నట్లు సకిలించాయి. పంజరంలో చిలక "అయ్యగారూ దయ చెయ్యండి! అయ్యగారూ దయ చెయ్యండి!" అని స్వాగతం పలకటం మొదలు పెట్టింది.
కిటికీ లో నుంచి బయటికి తొంగి చూస్తున్న షావుకారు పడుచు పెళ్ళాము తన భర్త ధరించిన పట్టు తలపాగాలో ఆనాడు మరింత అందంగా కనిపిస్తున్నాడనుకుని మురిసిపోయింది.
రామ్ చెంబు తో, తుండు గుడ్డతో హడావుడిగా ముందుకి వెళ్ళాడు.
అదే సమయంలో షావుకారు రాక కోసం అక్కడే కాచుకుని ఉన్న ఒక నగల వర్తకుడు కూడా ఆయనని సమీపించి, నమస్కారాలు చేసి తను తెచ్చిన ఆభరణాలని ఒకసారి తిలకించమని వేడుకున్నాడు. షావుకారు ని అతను చూపించిన చెవి దిద్దు ఒకటి బాగా ఆకర్షించింది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అయన చేతిలో మెరిసిపోతున్న ఆ నగ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆకర్షించింది. 'ఏమి పనితనం -- ఎంత కాంతి -- ఎంత చక్కటి ముత్యాలు' అనే మాటలు అన్ని మూలల నుంచి వినిపించాయి. యజమాని కాళ్ళ మీద నీరు పోస్తున్న రామ్ కు సయితం ఈ అందమయిన ఆభరణాన్ని ఒకసారి చూడాలనిపించింది. కళ్ళు పైకి తిప్పటం తో కాళ్ళ మీద పడవలసిన నీరు కొంత నేల మీదకి వలికింది. షావుకారు గారికి కోపం వచ్చింది. రామ్ ని నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఊరుకోక, "ఏమి విడ్డూరం! నౌకరు పనిచేసే షాగిర్ద్ కి నగల మీద మోజా! చదువు రాని మోద్దువి నీ బతుక్కి ముత్యాల చెవి దిద్దు కూడానా? దీన్ని పెట్టుకోవలసిన వాడు మహా పండితుడయిన బ్రాహ్మణుడు కాని నీలాంటి షాగీర్ద్ కాదు తెలిసిందా?' అని ఎత్తి పొడిచాడు.
మర్నాడు ఉదయం రామ్ చిన్న మూటతో యజమాని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి అతి వినయంగా వంగి నమస్కారం చేసి తనకి ఉద్యోగం నుంచి సెలవు ఇప్పించమని కోరాడు. తన సేవకులందరి లోకి రామ్ శాస్త్రి అత్యుత్తముడని అనగల్ షావుకర్ కి తెలుసు. "ఈ చిన్న దానికే ఇంత అలిగితే ఎట్లా?' అని మందలించి పనిలోనే ఉండి పొమ్మన్నాడు.
"అయ్యా, నిన్న మీరు కోప్పడినందుకు అలిగి వెళ్ళిపోవటం లేదు. ఇన్ని సంవత్సరాలు పోషించిన మీ మేలు నేనేన్నటికీ మరువలేను. కాని నాకు ఇప్పుడు చదువుకోవాలని ఉంది! ఈ విశాల ప్రపంచంలో వెతికితే చదువు చెప్పేవారు కనిపించక పోరనే ధైర్యం నాకు ఉంది. నా జీవితం ధారపోసి అయినా సరే చదువు కుంటాను." అన్నాడు రామ్ శాస్త్రి.
ఇంతలో అక్కడ పోగాయిన వారు రామ్ ని , నీకింత సాహసం తగదని వారించ బోయారు. ఈ ముదురు వయసులో చదువేమిటన్నారు. రామ్ అందరి మాటలు విని సవినయంగా తన నిశ్చయం మార్చుకోలేనని తెలిపి షావు కారు వద్ద సెలవు పుచ్చుకున్నాడు.
పద్దెనిమిదేళ్ళప్పుడు, చదువుకొని రామ్ శాస్త్రి లో మళ్ళీ విద్య మీద అభిలాష కలిగింది. ఈ అభిలాష సామాన్యమయినది కాదు. ఉజ్వలమయిన అగ్ని వంటిది. ఆ అగ్ని కాంతి లోనే తను అన్వేషించే కొత్త మార్గాల వెంబడి ప్రయాణం చేసి తన లక్ష్యం సాధించాలనే దృడ నిశ్చయానికి వచ్చాడు అతను. ఈ మార్గంలో ఎడుర్కొపోయే కష్టాలని తలుచుకుని అతను భయపడలేదు.
షాగిర్ద్ రామ్ విద్యాన్వేషకుడుగా మారిపోయాడు. ఆకాశంలో అతి దూరంగా మెరిసిపోతూ కనిపించే సరస్వతీ డేవి ఆలయమే అతని అశావధి అయిపొయింది.
నెలరోజుల పాటు రామ్ శాస్త్రి నిర్విరామంగా కాలి నడక సాగించాడు. అతనికి తోడు లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. సరయిన ఆహారం లేదు. అతనికి ఉన్నదల్లా దృడ సంకల్పం. తల్లి తన దృడ సంకల్పాన్ని పూర్తిగా మెచ్చు కుంటుందనే విశ్వాసం. ఒకరోజు ఉదయం పవిత్ర కాశీ నగరాన్ని చేరుకున్నాడు. గంగా నదీ తీరం మీద కూర్చుని అలసట తీర్చుకుంటున్న అతను తన కళ్ళ ఎదుట కనిపించిన దృశ్యం చూసి పడిన కష్టాలన్నీ మర్చిపోయాడు. తన లక్ష్య సిద్దికి మరింత దగ్గర అయ్యాడను కున్నాడు. సంతృప్తితో. ఈ సంతృప్తి , ఎంత కాలమో నిలవలేదు. తనకన్నా చిన్న వారయినా బాలురు కొందరు నదిలో నుంచుని శ్లోకాలు వల్లించటం విన్నాడు. తనకీ చడుకీ ఇంకా ఎంత దూరం ఉంది అనిపించింది. తను పాండిత్యం సంపాదించాలంటే మాటలా? ఎన్ని సంవత్సరాల కృషి కావాలి.'
ఒక చిన్న పిల్లవాడు స్నానం ముగించి వళ్ళు తుడుచుకుంటూ ఇలా గంగానదీ స్తుతీ ప్రారంభించాడు.
"ఝుంకార కారీ, హరిపాద రజోపహారీ!!' వెంటనే నీళ్ళలో ఉన్న మరోక అబ్బాయి శ్లోకాన్ని ఇలా పూర్తి చేశాడు.
"గాంగ "దాంతో ఇతర బాలురు కూడా శోకాలు చదివారు.
"సకల కలుష గంగే స్వర్గ సోపాన సంగే
తరంతర తరంగే దేవీ గంగే ప్రసీద!!"
ఈ స్త్రోత్ర పఠనం రామ్ అంతరాళాలని కదిలించి వేసింది. "గంగామ తల్లీ!' అని గద్గదంగా అన్నాడు. చెక్కిళ్ళ వెంబడి కన్నీరు కారిపోగా. "పవిత్ర గంగా నదీ! బ్రాహ్మణ జన్మ ఎత్తి ఇంత వయస్సు వచ్చినప్పటికీ నీ స్తుతీ పలికే అర్హత నాకు లేకపోయింది కదా! తల్లీ నన్ను క్షమించు! నేను అక్షరం ముక్క రాని షాగిర్ద్ ని. కాని నా హృదయం నీకు తెలుసు. ఇదిగో నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గంగాదేవీ , నా తల్లి నన్ను కన్నది, పాలు ఇచ్చింది ఈ దేహాన్ని పోషించింది. నా బుద్దిని పోషించలేక పోయింది కాని అది ఆమె లోపం కాదు. ఆమె దారిద్ర్యమే డానికి కారణం ....నిర్జీవంగా ఉన్న నా బుద్దికి మళ్ళీ ప్రాణం పొయ్యగలిగింది ఒక్క విద్య మాత్రమె! అందుకనే ఆమె నన్ను నీ పాదాల దగ్గర పడేస్తుంది! నువ్వు మాత్రం నా తల్లివి కావా! నన్ను కరుణించు! విద్య ప్రసాదించు....నేను దానికి తగకపోయినా నీ దయకి పాత్రురాలయిన నా తల్లి కోసమయినా విద్య ప్రసాదించు!"
సాన్నాలు ముగించిన బాలురు ఇతని దీన స్వరూపాన్ని గమనించారు. అతని చుట్టూ మూగి అతని సంగతంతా అడిగి తెలుసుకున్నారు. రామ్ శాస్త్రి పరిస్థితి వారికి జాలి కలిగించింది. "నువ్వేం బాధ పడకు. మా పాఠశాలకి వచ్చి అన్నీ నేర్చు కుందువు గాని!" అన్నారు. "నువ్విక్కడ దిక్కులేని అనాధ బాలుడి వని ఎందుకనుకోవాలి> మహారాష్ట్ర దేశం మాత్రం భారత ఖండం లోది కాదా? మేమంతా మీ తమ్ముళ్ళం కదూ? రా బాబూ, ,మా పాఠశాలకి రా! మా గురువుగారు నీకు తప్పకుండా శరణు ఇస్తాడు. నీకు విద్య, భోజనం , నివాసం అన్నీ ఆయనే ఏర్పాటు చేశాడు!"
రామ్ సంభ్రామాస్చర్యాలకి అంతు లేదు. తనూ స్నానం ముగించి తక్కిన పిల్ల వాండ్రతో పాఠశాలకి వెళ్ళిపోయాడు.
