"నో.......నాకు బొత్తిగా అందలేదు. కాబట్టి తగ్గిపోడం మంచిది" అంటూ గడగడా కాఫీ తాగేశాడు రంగారావ్. కాళీ కప్పుల్ని తీసుకు వెళ్ళింది సుజాత. వచ్చే నవ్వుని ఆపుకుంటో.
మిత్రులిద్దరూ సిగరెట్లు ముట్టించారు.
"రేపో ఎల్లుండో నీ సంగతి మా ఆఫీసుకి గుర్తు చేస్తాను" అన్నాడు రంగారావ్.
"వాయిదా వేస్తున్నా వేమిటీ?"
"అది పద్ధతి. వారం రోజుల క్రితం నీ సంగతి చెప్పాను. పిలిపించమన్నాడు. రేపొస్తున్నాడని నిన్న చెప్పాను. ఆల్ రైట్ రమ్మను- తప్పకుండా సాయం చేస్తా నన్నాడు. ఇప్పుడేమో వచ్చాడని చెప్తాను. ఏమైనా నీకు ఉద్యోగం వేయించే బాధ్యత నాది. సరేనా?"
"ఆ ఆశతోనే ఇంత దూరం వచ్చాను."
రంగారావ్ అతని భుజాన్ని తట్టాడు.
"నువ్వేమీ వర్రీ అవ్వద్దు. అంతా నాకు వదిలి పెట్టు. చక్రం తిప్పే వంతు నాది"
"చాలా థాంక్స్"
"ఊ.......మరి. నేను ఆఫీసు కెళ్ళాలి. మధ్యాహ్నం భోజనానికి వస్తానో రానో చెప్పలేను. సాయింత్రం మనమంతా కలిసి సినిమాకెడధం. బై ది బై - నిన్ను చూడాలని మా వాళ్ళు చాలా మంది తొందరపడుతున్నారు. వాళ్ళందర్నీ థియేటర్ కి తిన్నగా వచ్చేయమని చెప్తాను"
"వద్దు నీ పుణ్యమా ఇది. హఠాత్తుగా నన్ను ఇరకాటంలో తోసేయకు. వాళ్ళందరితో ఎలా మాట్లాడాలో నాకు సరిగ్గా తెలీదు. కాబట్టి మరో నా డెప్పుడైనా పరిచయం చేద్దువుగని"
"ఎందు కింత సిగ్గు?"
"నాలుగు రోజులు గడవనివ్వు"
"వెధవ మోడస్టీ నువ్వూను. సరే..... ఇక రెస్ట్ తీసుకో సుజీ" సుజాతను పిలిచాడు రంగారావ్. ఆమె వచ్చిన తర్వాత అన్నాడు.
"మా వాడు ఒళ్ళు మరిచి నిద్ర పోవడంలో అఖండుడు. మధ్యాహ్నం భోజనానికి మాత్రం లేవు."
"మీరు రారా ఏమిటి?"
"చెప్పలేను. వీడి కడుపు మాత్రం మాడ్చకు. మరి వస్తా. వస్తారా శంకరం" అంటూ అతను సైకిలు కిందికి దించుకుని వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన తర్వాత సుజాత అన్నది.
"బండెడు చాకిరీ ఈయనగా రొక్కరే చూచుకోవాలిట. వాళ్ళాఫీసరు కి యీయనంటే మంచిగురీ నమ్మకమూను. ఏది జరిగినా, యీయన చేతి మీదుగానే జరగాలిట."
"అదృష్టవంతుడు."
"ఏమదృష్టమో లెండి. వేళకి ఇంటిపట్టున ఉండరుగదా. సరే....మీరింక నిద్రపొండి."
సుజాత శంకరానికి గది చూపించింది. అతను గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత వీధి తలుపు వేసి వచ్చింది. వంట ప్రయత్నంలో మునిగిపోయింది.
దాదాపు వంటి గంటకి సుజాత శంకరాన్ని లేపటానికి అతని గదిలోకి వెళ్ళింది. అతను ఆద మరిచి నిద్ర పోతున్నాడు. హోల్టాలు మీద నుండి నేలమీదికి జరిగి, కేవలం వట్టి నేలమీదే పడుకున్నాడు. సుజాత నవ్వుకుంది. నిద్ర కెంత మొహం వాచి ఉన్నాడో ఏమో!
"శంకరంగారూ!"
శంకరానికి ఆవిడ పిలుపు వినిపించలేదు. మరోసారి పిలిచింది. అప్పటికీ అతనికి మెలుకువ రాలేదు. సుజాత తలుపుని రెండు మూడు మాట్లు తట్టి గట్టిగా పిలిహ్సింది.
శంకరం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తనుహోల్డాలు వదిలి కింద పడుకోడం చూచి సిగ్గుపడ్డాడు. గబగబా లేచి నిలబడి టవల్తో మొహం తుడుచుకున్నాడు.
"దొడ్లో నీళ్ళున్నాయి. మొహం కడుక్కుంది. భోజనం వడ్డిస్తాను" అన్నది సుజాత.
"రంగారావ్ రాలేదాండీ?"
"ఇంక రానట్టే."
శంకరం దొడ్లోకి వెళ్ళేడు. కాళ్ళూ, చేతులూ కడుక్కున్నాడు. సుజాత వడ్డించింది. మొహమాటం లేకుండా భోజనం చెయ్యమని చెప్పింది.
తన పట్ల ఆమె చూపుతున్న ఆత్మీయతకు కరిగిపోయాడు శంకరం. రంగారావ్ కి తనమీద అభిమాన ముందంటే దానికి ఎనిమిదేళ్ళ తమ స్నేహం కారణం. సుజాత నీదే మొదటిసారిగా చూశాడు కానీ - ఈ ఆదరణని గమనిస్తూంటే సుజాత కొత్త మనిషిలా లేదు.
'రంగారావ్ అదృష్టవంతుడు' అని మళ్ళీ అనుకున్నాడు శంకరం.
భోజనం ముగిసిన తర్వాత వక్కపొడి డబ్బీ చేతి కిస్తూ అన్నది.
"వంటలు సరిగ్గా కుదిరాయో లేహో"
"చాలా బాగా చేశారు"
"మీరు మొహ మాటస్తులు"
"నిజం. మీరు చాలా చక్కగా వంట చెయ్యగలరు. చదువుకున్న ఆడవాళ్ళకి వంట పని చాతకాదనే వదంతి మిమ్మల్ని చూస్తుంటే నిజం కాదని పిస్తుంది."
"థాంక్స్ అభ్యంతరం లేకపోతే, ఒక్క అయిదు నిమిషాలుపాటు హాల్లో కూర్చోండి. ఈలోగా నేనూ భోంచేసి వస్తాను. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకోవచ్చు. ఏవంటారు."
"అలాగే"
శంకరం హాల్లో ఉన్న ఫేము కుర్చీలో కూర్చుని రంగారావ్ దంపతుల గురించి ఆలోచిస్తున్నాడు. పోయిన జన్మలో కొంత పుణ్యం చేసుకుంటేనే తప్ప, రంగారావ్ లాటి స్నేహితుడు తనకీ, సుజాతలాటి అర్దాంగి రంగారావ్ కీ లభించదు.
శంకరానికి అన్నా, చెల్లెలూ గుర్తు కొచ్చేరు. తను క్షేమంగా చేరాడో లేదోనని వాళ్ళు ఆందోళన పడుతూంటారు. శంకరం తన గదిలోకివచ్చి సూటుకేసులోంచి కార్డు తీశాడు. తను క్షేమంగా చేరినట్లు తండ్రికి ఉత్తరం రాశాడు.
సుజాత వచ్చింది.
"ఎవరికీ ఉత్తరం రాశారు?" అన్నది తన ముందున్న కుర్చీలో కూర్చుంటూ.
"నాన్నకి."
"ఏమని"
"క్షేమంగా చేరాను-అమూల్యమైన ఆథిత్యం లభించిందీ అని"
రెండు క్షణాలు గడిచిన తర్వాత సుజాత అడిగింది.
"ఈ మధ్య కొత్త రచన లేవైనా చేశారా?"
"లేదండీ. ఉద్యోగాన్వేషణల్తో తప్పనిసరిగా కధలు రాయడం మానుకోవలసి వచ్చింది."
"కధలు రాయడం ఒక గిఫ్ట్ అంటారు మావారు. కదూ- కృషి చేస్తే మనమూ రాయకలుగుతా మంటాను నేను."
"నిజమండీ! ఆసక్తీ, సంకల్పమూ రెండూ ఉండి కాస్త వూహించి కధలల్లగల నేర్పుంటే చాలు. మంచి కధలు రాయడం పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు."
"అంటే మీ ఉద్దేశ్యం - రాసే కథలన్నీ వూహించి-"
"అవికాదు. వాస్తవాలని యథాతధంగా కథలో ఇరికించామనుకోండి. దాన్లో పట్టు ఉండక పోవచ్చును. అలాంటప్పుడు రంగులు దిద్దవలసిన అవసరం తప్పనిసరై నెత్తిమీద కూర్చుంటుంది."
"మీ కథలు గురించి మీ అభిప్రాయం ఏమిటి?
"బలే ప్రశ్న పరీక్ష కెళ్ళిన విద్యార్ధికి, వాడి పేపరు వాడి కిచ్చి మార్కు లేసుకోమంటే- వాడెలాగూ తక్కువ మార్కులు వేసుకోడుగదూ. అయినా ఇప్పుడీ విషయా లెందుకు లెండి. కాకినాడ కబుర్లేవైనా చెబుదురూ!"
"కాకినాడ అను పట్టణము కడు అందమైనది. సముద్రమునకు అతి సమీపమున కలదు. ఆరో గ్యమునకూ, ఆనందమునకూ ఇక్కడ కొదువలేదు. అటు వ్యాపార వ్యవహారములనేమీ ఇటు సదుపాయ సౌకర్యములకేమీ పేరొందిన పట్టణము కాకినాడ. చాలాండి" అని కిలకిలా నవ్వేసింది సుజాత.
శంకరమూ నవ్వేడు.
"మా వాడిలా హాస్య ప్రియులే మీరు."
"ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం గదండీ మరి. ఇంక కబుర్లు చాలు. మళ్ళీ మూడు గంటలకి మిమ్మల్ని టీ కోసం పిలుస్తాను" అని ఆమె వెళ్ళిపోయింది.
షర్టు వేసుకుని అలా రోడ్డుమీదకి వెళ్ళేడు శామకరం. దగ్గర్లో వున్న పోస్టు బాక్స్ లో ఉత్తరం వేసి, బడ్డీ కొట్లో సిగరెట్లు కొనుక్కుని ఇంటికి వచ్చేడు.
మూడున్నర ప్రాంతాల్లో సుజాత కాఫీ తయారు చేసి తీసుకొచ్చింది. కాఫీ తాగుతూ ఆమె తన గురించి చెప్పుకుంది.
"కొవ్వూర్లో అమ్మా నాన్న ఉన్నారు. ఆ వూర్లో నే సొంత భూమీ సొంత ఇల్లూ ఉన్నాయి. ఇద్దరన్నయ్యలు. ఒకడు డాక్టరు. రెండోవాడు ప్లీడరు. ఇద్దరూ కొవ్వూర్లోనే ఉన్నారు. వదినలు గూడా చాలా మంచివారు. వాళ్ళ వల్ల మా ఇంట్లో కలత లంటూ రానేరావు. మాలో బాగా కలిసిపోయారు. వదిన లిద్ధర్నీ అమ్మా నాన్న ప్రాణ ప్రదంగా చూచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇల్లు స్వర్గం" అన్నది సుజాత నవ్వుతూ.
"మీరు చెప్తున్నది వింటూంటే నాకూ అలాగే అనిపిస్తుంది" అన్నాడు శంకరం.
"నా విషయం ఆలోచిస్తే-చిన్నప్పట్నుంచీ అల్లారుముద్దుగా పెరిగాను. మా ఇంట్లో ఆడపిల్ల నంటూ నే నొక్కర్తెనే అవడం మూలంగా వాళ్ళు అలా పెంచారు. ఇంత వయస్సు వచ్చినా నేను వాళ్ళందరి ముందూ ఇంకా పసిపిల్లనే! నా మాట నెవరూ కాదనరు. నేను వాళ్ళ మాట కెదురు చెప్పినా ఇదేమిటని మందలించరు. ఏ మాటంటే నే నెక్కడ బాధ పడిపోతానో అని వల్ల భయం" కాసేపు మవునంగా ఉండి మళ్ళీ అన్నది "నా అదృష్టంకొద్దీ- పెళ్ళయినా సుఖాన్నే అనుభవిస్తున్నాను. వారు చాలా మంచివారు" టీపాయ్ మీద నున్న గుడ్డని సవరిస్తో అన్నది.
చివరికి శంకరం అన్నాడు.
"మీలాటి వారు చాలా కొద్దిమంది ఉంటారు."
సుజాత అతని మాట విని చిన్నగా నవ్వింది. తర్వాత తన కాలేజీ చదువు గురించీ, క్లాసు విద్యార్దుల గురించీ, వాళ్ళ అల్లరుల గురించీ చెప్పింది తనతోపాటు చదువుకుని, ఇప్పుడు పైకొచ్చిన కొందరి వ్యక్తుల అదృష్టం గురించీ చెప్పింది.
దాదాపు అయిదు గంటలకి రంగారావ్ వచ్చాడు శంకరం పక్కన కూర్చుంటూ-
"సారీరా బ్రదర్-మధ్యాహ్నం ఇంటికొచ్చి నీతో పాటు భోంచేయడానికి నోచుకోలేక పోయాను"
"సుజాతగారి ఆతిధ్యం నువ్వు దగ్గర లేవనే వెలితిని పూర్తి చేసింది."
రంగారావ్ సుజాత వైపు నవ్వుతూ చూశాడు.
"నాకు తెలుసు. సుజీతో మాటాడుతూ కూర్చుంటే గంటలు నిమిషాల్లా దొర్లుకుపోతాయ్. నువ్వేమీ కధకుడివి, సుజీకి కధలంటే ఇష్టం ఇద్దరూ 'ఒకే' విషయంపైన మాట్లాడుకోడానికి టేస్టు లొక టైయ్యాయి కాబట్టి విసుగని పించదు. పైగా-ఒక రహస్యమోయ్ శంకరం" రహస్యం చెప్పబోతున్నట్టే అన్నాడు.
"సుజీ ఈ మధ్య......."
"చాల్లే వూరుకోండి" అన్నది సుజాత.
"ఫర్వాలేదు లేస్తు నవ్వక మహా రచయిత్రి వానిమా వాడికి చెప్పడం లేదులే. అసలు సంగతేవిటంటే....."
"మీరు నమ్మకండి శంకరంగారూ......ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు" అనేసి రంగారావ్ కి కాఫీ తెచ్చేందుకు లోపలి కెళ్ళింది.
రంగారావ్ నవ్వేస్తూ అన్నాడు.
"మా సుజీ ఒక చిన్న కథ రాసి, ఒక పెద్ద పత్రికకి పంపిందిరా. పంపిన తర్వాత పోస్ట్ కోసం రోజూ ఎదురు చూచేది. వారం వారం పత్రికొచ్చే వేళకి వీధి గుమ్మం దగ్గర నిలబడి పత్రిక లమ్మే కుర్రాడికొం వెయ్యి కళ్ళు పెట్టుకు ఎదురు చూచేది. నాలుగు వారాలు గడిచాయి. ఈవిడగారు ఏ స్థితి కొచ్చారంటే రాత్రి పూట కథ కోపం కలవరింతలు గూడా ప్రారంభించారు పాపం. సరేనయ్యా-ఆ రోజేదో రానే వచ్చింది. వన్ ఫైన్ మార్నింగ్, ఆ కథ కాస్తా తిరిగొచ్చేసింది. ఆ దెబ్బతో సుజీ అభిమానం, ఉత్సాహం చప్పున దిగజారిపోయాయి. రెండు రోజులు భోజనం మానుకుంది. నేను ఓదార్చగా మళ్ళా భోంచేసింది. 'జన్మలో కథ రాయను' అని ఇప్పుడు భీష్మించుకు కూర్చుంది. ఆ పత్రిక వాళ్ళెవరోగాని సుజీని చాలా నిరుత్సాహ పరిచారోయ్! ఏ మాట కామాటే సుజీ రాసిన కథ బాగానే ఉంది మరి. ఆవిడంటుంది 'ఇప్పుడు వేసే చాలా కథల కంటే నేను మంచి కథలే రాయగలను. కానీ- వాళ్ళు చదవకుండా తిప్పి పంపేస్తే ఆ తప్పు నాదా?" అని. అన్నట్టు నాకు తెలీ కడుగుతా, పత్రికల వాళ్ళు కొత్త వాళ్ళెవరైనా కథ రాసి పంపితే దాన్ని చదవకుండానే తిప్పి పంపేస్తారా శంకరం?" అని అడిగాడు రంగారావ్.
"అలాంటి దేమీ జరగదు. కధలు ప్రచురించడంలో పాతా కొత్తా అనే భేదం ఉండదనే నా ఉద్దేశం. ఆ మాట కొస్తే ఇప్పుడు, పాత వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళ కధలు ఒకప్పుడు కొత్తవాళ్ళ కథలేగా మరి. నలుగుర్ని చంపితేనేగాని డాక్టరు కానట్టు, నాలుగు కథలు తిరిగొస్తేనే కాని కథకుడిగా రాణించడు" అన్నాడు శంకరం నవ్వుతో.
"వచ్చిన వాడి వెలాగో వచ్చావు. సుజీని ఎంకరేజు చేసి ఆ నాలుగు కథలూ రాసేట్టు చూడు" అన్నాడు రంగారావ్.
సుజాతరాగానే, ఆవిడ చేతిలోని కాఫీని తీసుకుంటూ-
"నీ విషయమంతా మా వాడితో చెప్పాడు. వాడు పేరొందిన డాక్టరుకీ ప్రఖ్యాత కథకుడికీ పోలిక చేసి, కాబట్టి కథలు తిరిగొచ్చినంత మాత్రాన నే నిహ కథలు రాయనని భీష్మిస్తే సాధించేదేమీ లేకపోగా, కొంతవరకు నిన్ను నువ్వే చంపుకున్నట్టవుతుందని వాడి ఉద్దేశ్యం. నిరుత్సాహ పడకుండా ఇంకా మంచి కథలు రాయాలి సుజీ"
కథల మీద చర్చ ముగియగానే రంగారావ్ అన్నాడు.
"మరో మూడు రోజులపాటు నీ ఉద్యోగ వ్యవహారం వాయిదా పడిందోయ్ స్వామీ!"
శంకరం అర్ధం కానట్టు చూసేడు.
"రేపు ఆఫీసరు కేంప్ కి వెడుతున్నారు. ఆయన్తోపాటు నేనూ వెళ్ళాలి. టూర్ మూడు రోజులు. ఈ టూర్లోనే నీ విషయం ఆయనకి మనవిచేసి వప్పిస్తాను. టూర్ నుంచి రాగానే పోస్టింగ్ ఆర్డర్సు వేయిస్తాను.
ఈ మూడు రోజులూ నిరభ్యంతరంగా మా ఇంట్లోనే ఉండు."
శంకరం ఏమీ మాట్లాడలేదు.
ఆ తర్వాత ముగ్గురూ కలిసి సినిమాకి వెళ్ళారు. ఇద్దరి మిత్రుల మధ్యా సుజాత కూర్చుంది. శంకరానికి ఇలా కూర్చోడం నచ్చలేదు. సినిమా నడుస్తున్నంత సేపూ ఆ దంపతులు నవ్వుకుంటూ ఎన్నో విషయాలు మాటాడేస్తున్నారు. ఇది మరీ నచ్చలేదు శంకరానికి.
మరో పావు గంటకి సినిమా అయిపోతుందనగా సుజాత చెయ్యి శంకరానికి తగిలింది. తన చెయ్యి లాక్కుని ఒరగంటితో ఆమెవైపు చూశాడు సుజాత తన పక్కకి ఒరిగినట్టు గమనించాడు.
ఆ పావుగంటా అతనికి ముళ్ళమీద కూర్చున్నట్టుంది.
* * *
