మెట్లు ఎక్కేడు. తలుపు తట్టేడు. కాళ్ళ పాదాలు తడి ఎక్కేయి.
"ఎవరూ?" లోనుంచి గాజుల మధ్య శబ్దంలో ప్రశ్న.
2
రావినూతలపడు అంత పల్లెటూరుకాదు. అల్లా అనుకుంటే పట్నవాసం కాదు. కొత్తగా స్థాపించిన పంచాయతీ బోర్డు ఆఫీసు. గోడల మీద జేగురు రంగుతో ఓట్లకోసం చేసిన ప్రచార చిహ్నాలున్నూ, వ్యవసాయం జీవకర్ర అన్నట్లుగా ఎడ్లకొట్టాలు. పశువుల కళ్ళాపు మట్టిరోడ్లమీద. వర్ణాశ్రమ ధర్మాలు ఉండీ ఉండనట్లు ఛాయ ఉన్నా, త్రిగుణాత్మకం అంటూ జాతీయపతాకం మద్యలో ధ్వజస్తంభంలా ఉంది.
పుంతలో ముసలమ్మ, ప్రారంభంలో భజరంగభళి, మధ్యలో శివాలయం, చివరగా విష్ణ్వా లయం ఊరును దిగ్భంధం చేసేయి. విష్ణు వాలయంచివరగానే సుత్తి కొడవలి జండా గాలికి రెపరెపలాడుతూంది. దా నవతలగానే శ్మాశానం, ఊరి చరిత్రల్ని కడుపులో దాచుకుంటూ. ఓ మైలు దూరంలో రైల్వే స్టేషన్ ఉంది.
భగవంతులు ఒకటి రెండు మినహాయిస్తే, చెప్పుకోతగ్గ కట్టడాలు లేవు. ఒకటి ఊరికల్లా పెద్దకామందయిన చౌదరయ్యది. రెండోది అవధానులుధి. ఆయన వద్ద ఒక్కలక్ష్మి ప్రసన్నం అయితే అవధానులవద్ద లక్ష్మీ సరస్వతులిద్దరూ చెట్టాపట్టాలు వేసుకునే ఉన్నారు.
అవధానులును చూస్తే ఎవరూకూడా అంత ధనికుడని అనుకోరు. ఓ నీర్కావిపంచ, పైన అంగవస్త్రం, ఓ చిన్న గోనెసంచీలో పూజా సామగ్రి తప్ప, ఎప్పుడూ కుడితినీ వేసుకున్నట్లు ఎవరూ చూడలేదు. ముఖంలో మాత్రం బ్రహ్మ తేజస్సు వెల్లువలాగే ఉంది. ఆయన ఉదయం లేచిన వద్దనుండి ఎవరెవరో రావడం, ముహూర్త విషయం, గాలిధూళి అంటూ విభూది పెట్టించుకోవడం, వగైరాలతో కాలం దొర్లిపోతుంది.
ఈమధ్యలో అటువంటి దిట్టలేడు అన్న ప్రఖ్యాతి పొందేడు అవధానులు. పెద్ద భవంతి అయినా ఇంట్లో ఉండేవారు పార్వతమ్మ, పద్దెనిమిది ఏండ్ల క్రితం ఎడతెగని శోకం, కడుపుకోత పెట్టి, వెళ్ళిపోయిన ఒక్కగానొక్క కొడుకు చిహ్నంగా, తాళిబొందు తెంపుకున్న కోడలు శాంత తప్ప మరొకరు లేరు. నా అన్నవారు లేకకాదు అవధానులు తోడితెచ్చుకోకపోవడం. అంతస్థులు వేరులో ఉన్న బలగం కావలసినంత ఉంది. రాకపోకలు ఉన్నా, ఎవర్నీ ఉండిపొండి అండగా అన్న బలవంతం చెయ్యలేదు ఆ దంపతులిద్దరూ. శాంతను చూస్తూంటే కడుపు తరుక్కుపోయే దుఃఖంతోటే వత్సరాలు దొర్లించేరు.
మాటల సందర్భంలో శాంత పునర్వివాహం రాకపోలేదు. ఆఖరుకు చౌదరి అంత పెద్ద కూడా, సూచనప్రాయంగానే-
"ఏమిటో, ఇంకా పురాతన పట్టుదలలుకాని, అమ్మడుకు పెండ్లి చెయ్యడం మంచిదండీ" అనేవాడు. తనకు ఆ ఊహ పారలేక కాదు. కాని వంశంలో తరతరాలనుండి వచ్చిన నిబంధనలు తన్ను నిస్సత్తువ చేసేయి.
"చౌదరయ్యా!" అనేసి ఊరుకునేవాడు. దాని వెనకాల తను చెయ్యలేనివన్నీ కప్పి పుచ్చినట్లున్న సర్వం కన్పడేది అవధానిలో.
"పోనీ, గుడివాడ రామావధానులు అంత వయస్సు నిండలేదు. ఊపి చూడకూడదూ? ద్వితీయం అయితే మాత్రం ఏం? చచ్చినంత ఆస్తివుంది."
కుతకుతమంది. శాంతనెప్పుడూ తను వదుల్చుకోవాలన్న దృష్టిలో లేడు. ఏరి, కోరి, తనే పెండ్లి చేసేడు. కోడలు వస్తూంది అన్నమై మరుపులో సర్వస్వం పెండ్లిలో లగ్నం అయ్యేడు. నూనూగు మీసాలవాడు కళ్ళతో సిగ్గుపడి నచ్చిందన్నప్పుడు తను తృప్తిపడ్డాడు, ఇక ఆలోచించే విషయాలు ఏమీ లేవన్నట్లే. పైగా పార్వతమ్మ కోడలును చూచుకుని మురిసి పోయింది. తన తర్వాత అన్నధ్యాసే లేకుండా ఆ క్షణం నుండీ నువ్వే అన్న వతులో పడింది.
కాని విధి చాలా బలవత్తరంగానే ఎదురు తిరిగి, తను కట్టుకున్న సౌధాల్ని నట్టేటకల్పివేసింది. ఆఖరుకు మనసా, వచసా ఊహ కందినంతవరకూ నిర్మించుకున్న ఆశలు, ఆ శోభ నానికి పూర్వమే కుప్పకూలిపోయేయి. తను, పార్వతి ఎదిగిన వయస్సుల్లో కుమిలి, కుళ్ళి దేవరన్యాయానికి విస్తుమ్రింగి, ఏళ్ళు లెక్క పెట్టుకోవడానికే బ్రతికి ఉన్నారు. ఈ గడిచిన వత్సరాల్లో శాంత కొడుకూ, కోడలే అయ్యింది. పేరుకు తగ్గట్లుగానే తమలో ఇమిడిపోయింది. ఐక్యమయ్యింది. అదిలేకపోతే తామే లేనట్లు అయ్యేరు. ఇది స్వార్ధమే అయినా, ఒక్క లోక సంప్రదాయంలో, ముక్కుపచ్చలారని పిల్లలా అది, ఓ శుభం తెలియకుండా ఇంట్లో కూర్చొని మ్రగ్గిపోతూంది. అదే రాచకురుపు.
చౌదరయ్య అన్న సలహాలో ఇదే ద్యోతకం అయినా, తను చెయ్యి కడుక్కుందామనుకున్నంత అధోగతికి పోలేదు.
"నాకూవుంది. ఏంచేసుకోనూ?" చిరాగ్గా అన్నాడు.
"అంత కోపం ఎందుకు, అవధానీ? ఓ బీద వాడిని తెచ్చుకుని ఇంట్లో ఇల్లరికం వుంచుకో."
ఇవి ప్రస్తుతపు ధర్మపన్నాలే అయినా, తను ఒప్పుకోలేడు. వాడు కొడుకు స్థానానికి ప్రతి చిత్రంగా చలామణి అవుతూ ఉంటే, ప్రత్యేకంగా తను భరించుకోలేడు. పార్వతమ్మ మ్రింగగలగవచ్చు, అయినా శాంతను ఎప్పుడూ ఈ విషయంలో తను ప్రస్తావించలేదు.
"అమ్మాయి ఉదేశ్యం ఎల్లా వుందో?"
నవ్వేడు చౌదరయ్య.
ఇదే విషయం రెండు మూడు పర్యాయములు వచ్చినా, ప్రస్తావన సాగించలేదు. దాన్ని అడగాలన్న ఉద్దేశ్యం ఎరువు వేసినట్లుగా ఎదుగుతూనే ఉంది. ఆఖరుకు దాని ఎదుటబడి కదలవేద్దామనుకున్నా భయం ఆవరించేది-ఏదో అవ్యక్తంలో వాడు ఆ లోకాల్లో నుండే ఆదేశించి, తన్ను ఆవరించినట్లు.
ఆరోజు అమ్మ పూజకు కూర్చున్నప్పుడే ఈ భావన రేకెత్తింది. ఇన్నాళ్ళూ మౌనంగా, ఆమెలో ఇమిడిపోయిన స్థితికి, ఈనాటి వికటానికి తబ్బిబ్బు అయినాడు. ఆవిడ ప్రసన్న ఇచ్చాఫలితం.
తీర్ధం ఇస్తూనే చౌదరయ్య సూచించిన సూచన చెప్పేడు, పార్వతమ్మతో తలుపు అవతల శాంత ఉంది. అది తెలుసు.
తెల్లబోయింది పార్వతమ్మ. వంటా ఇంటా కూడా లేని విషయం అది. కళ్ళప్పగించింది. అంతకన్న తనేమీ చెప్పలేదు.
శాంత కుప్పకూలినట్లే గోడకు జార్లాబడి బావురుమంది. వినిపించకూడదు అన్న దృష్టిలో నోట్లో కుక్కుకున్న శబ్దం. ఊహించినది ఒకటి. పరిణామం చెందినది ఇంకొకటి. అవధానులే లేచి -
"అమ్మాయి, శాంతా! తీర్ధం పుచ్చుకుందుగానిరా!" అని పిల్చేడు.
శబ్దం ఎక్కువైంది. మనిషి రానేరాలేదు. క్షణికం చూచేడు. తను బయటకు వెళ్ళేడు. పార్వతమ్మ లేవాలి, అన్న స్పృహ లేకనే ఉంది.
బయటపడ్డ రెండు కాళ్ళమీదా శాంత వాలిపోతూనే, "మావయ్యా! ఒక్కటే కోరుకుంటున్నా. ఈ జీవితం ఇల్లాగే వెళ్ళిపోనీ అది ఆయనకు ఎప్పుడో అర్పణ చేసేను. దాన్ని మళ్ళీ కలుషితం చెయ్యనియ్యకు" అంది. పాదాలు తడుస్తున్నాయి. ఒక్కొక్క కంటి చుక్కే తన్ను బడబాగ్నిలాగే కాలుస్తూంది.
ఒక్క ఉదుటలో పార్వతమ్మ లేచి, కోడల్ని హత్తుకుంది. కన్నీళ్లు చిలికితే మూర్ధాభి ఘ్రాణం చేసింది. "మా తల్లే" అన్న చూపులు పుచ్చపువ్వులయ్యేయి.
"వయస్సులో ఉన్నా పసుపూ కుంకుమకు దూరం అయ్యేను. అది నా కర్మ. అయినా ఆయనలో జీలకర్ర బెల్లంతో కలిసిన బ్రహ్మ రంధ్రం ముడిమాత్రం దూరంకాలేదు. ఏదో వెర్రి ఆశ. ఆయన జీవించే ఉన్నారు. ఓనాడు వస్తారు. నన్ను పిలుచుకు వెళ్తారన్న ధైర్యం."
ఇద్దరూ కళ్ళు తేలేసేరు. ఏమిటిది? మతిభ్రమణం కలగలేదు కదా?
"ఇది నా పిచ్చి. నమ్మ శక్యంకాదు. అయినా, మావయ్యా, నన్ను ఇల్లాగే ఆయనలో కాలి పోనీ. ఆఖరుకు గొడ్లకొట్టాం దగ్గర ఉండమన్నా ఉంటా. మీ పంచలో దాసీగానైనా ఉండనియ్యి. అల్లా ఉంచుతావు కాదూ?"
అష్టదిగ్భంధం అయ్యింది అవధానులుకు.
"అత్తయ్యా, నువ్వేనా చెప్పు." ఇక మాట్లాడలేకపోయింది.
ఏ పీఠంలోని మహత్తరశక్తి, జగజ్జనని చిహ్నాన్ని తను ఆదేశించి, దిగ్భంధం చేసి, పూజలు, షోడశోపచారాలు చేసి, పాదతీర్ధం ప్రసాదించేడో, ఆ అమ్మ తీర్పు కోడలితోనే చెప్పించినట్టయ్యింది. ఇక తను శిరసావహించడంకన్న మరో మార్గం లేదు.
"ఈ ప్రాణం ఉన్నంతవరకూ, నీకు ఇష్టంలేని పని చెయ్యనమ్మా" అంటూనే అడుగు బయటికి వేసేడు. ఏదో మనస్సు చంచలంగా ఉంది. శాంత భావన, సరళి కూడా తను అర్ధం చేసుకోలేకపోతున్నాడు. ఈ సృష్టి రహస్యం ఏమిటో? జన్మజన్మల క్రమాను బంధం ఏమిటి? భౌతిక ఆధ్యాత్మికాల కలయిక సంభవమా? కర్మ రహస్యం? తలోమూలను నించుని తన్ను ప్రశ్నలు కురిపిస్తున్నాయి. చదివిన విద్య, మననం చేసిన వేదాలు, తర్కించిన శాస్త్రాలు, ఇవన్నీకూడా అడుగున పడిపోయి, చాప క్రింద వతు అవుతున్నాయి.
తనెవ్వరు? తనే చెప్పుకోలేడు. ఈ ఆస్తులు, డబ్బు, ఇళ్ళు, వాకిలి కూడా తనతో రావు. తను ఇన్ని వత్సరాల్లోనూ చేసిన కించిత్ తఫః ఫలితం తనకు రాబోయే జన్మలో రథసారధి అవుతుందన్న నమ్మకం తప్ప ఇంకొకటి లేదు. అదేనా తన భావన? కర్మసంచయం.
"ఆయన వోనాడు వస్తారు. నన్ను పిల్చుకువెళ్ళుతారు." ఇదే చెవుల్లో గింగురెత్తింది. శాంతకు ఏమి తెలుసు? దీని అర్ధం? తను చేతులారా మట్టివేసి, కర్మచేసిన, తన కొడుకు రామం బ్రతికే ఉన్నాడా? వాడు తిరిగి రావడం ఏమిటి? శాంతను తీసుకు వెళ్ళడానికి వస్తాననడం ఏమిటి? ఎంత వింతగా ఉంది! తను అవలోకించినంతవరకూ సాదృశ్యం కన్పడటంలేదు. అది అసంభవం. 'దాని కుండలి చూడు.' మనస్సు టొకాయించింది. గబగబా జాతకాలకట్ట విప్పేడు. తను ఎన్నో పర్యాయాలు వాట్లను పరిశీలించేడు. పునఃరాశిలో పంచమభావాన్ని నవమంతో మిళాయించి చూచేడు. గుర్తు పట్టలేదు. ఉప, మంత్ర, తపోపధాల చక్రాలు వెయ్యాలనే ఉపక్రమించేడు. చూచేడు. గ్రంథాల్లో శ్లోకాలు జ్ఞప్తికి వచ్చేయి. మంత్రపదం ఏ రాశిలో పడుతుందో, ఇదే రాశి నవమాంశలో ఏ భావంలో రూపొందిందో చూసినా తన కేమీ అంతు చిక్కలేదు.
ఈసారి పేరయ్యశాస్తి వచ్చినపుడు చూపించాలనుకున్నాడు. ఏదో ఎక్కడో ఉంది. అది తనకు స్ఫురించటం లేదు. పైగా కుండలి ఈ విధంగాకూడా అర్ధంచేసి, జన్మల అనుక్రమణిక కూడా తెలుసుకోవచ్చు అన్న భావన క్రొత్త అయినా, తను నిర్ణీతం చెయ్యలేని రహస్యం ఉన్నట్లుంది.
"భోజనానికి రారా?" పార్వతమ్మ పిలుపు. ఆ విషయమే మరిచిపోయేడు.
"మావయ్యకు కోపం వచ్చిందేమో అని శాంత బాధపడుతోంది."
"పిచ్చిపిల్ల!"
"మరిచిపోయేను. పేరయ్యశాస్త్రి కొడుకు పెళ్ళికి వెళతానన్నారు."
"అవును రేపు రాత్రే. నువ్వుకూడా రావాలేమో? వెళ్ళకపోతే బ్రాహ్మడు చాలా నొచ్చుకుంటాడు."
"మరి లేవండి."
చింతకాయపచ్చడి మహ పాకాన్ని పడ్డదనుకుని, అభినందిస్తున్నప్పుడే త్రింశాంశ జ్ఞాపకం వచ్చింది. రవి, చంద్రులు త్రింశాంశలో ఎక్కడ ఉన్నారో తెలుస్తే కాస్త ద్రుగ్గోచరం అవుతుందేమో అనుకున్నాడు.
ఉరకే వేసేడు; దానితోడుగా లగ్నాధిపతి స్థానమున్నూ అనుకుంటూనే.
* * *
