Previous Page Next Page 
ఇందుమతి పేజి 2


                                    2
    అది కృష్ణా మండలం లోని అనంతవరం. అనేఒక పల్లెటూరు. రోడ్డుకు తూర్పుగా తరులతా శోభిత మైన విశాలా వరణం లో చూడ ముచ్చట గా ఉన్న ఒక చక్కని డాబా ఇల్లు. రోడ్డుకు ఆవలి పక్క పద్మరాశి రంజితమైన తామర కొలను. సంధ్యా సమయం. రోజంతా కడుపు నిండా పచ్చికలు మేసి, పొదుగులు నింపుకుని . లేగదూడలకు పాలు చేరటానికి అలస్యమవుతున్నదన్న తొందరలో రహదారి వెంట ఉవ్వెత్తుగా దుమ్ము రేపుతూ పరుగు లేత్తుతున్న గోగణాలు , దినచర్య ముగించుకొని గృహోన్ముఖుడైన సూర్యదేవుని వాలు కారణాల తామ్ర కాంతులతో స్నిగ్ధ రమణీయ ములై నందున ఆహ్లాదకరంగా ఉన్నదా ప్రదేశం.
    ఆ ఇల్లు వేదశాస్త్ర సారంగాతుడు, నిత్యగ్ని హోత్రి సర్వజన సన్మానితుడు అయిన అనంత కృష్ణ శర్మ గారిది. శర్మ గారి రెండవ కుమార్తె ఇందుమతిని వివాహ పెక్షతో చూసుకోవటానికి వచ్చారు పెళ్లి వారు.
    విశాలమైన ఆ ఇంటి చావడి లో ఒక పక్కగా పరిచిన తివాసీ మీద జరీ అంచు నీలి పావడా కుచ్చెళ్ల లో వాలుగా పాదాలు ముడుచుకుని ఆకుపచ్చని పట్టు రైక లో మొగ్గ తోడుగుతూన్న నవ యౌవనాన్ని బిగువుగా బంధించి, నునుపు తెరుతున్న భుజాల పై లేమబ్బు వన్నె జరీ పైట నిండుగా కప్పుకుని, వినయ భూషణ అయి, త్రపావనత శిరస్క అయి కూర్చున్నది వధువు ఇందుమతి. కుడి వైపున అక్కగారైన భానుమతీ దేవి, ఎడమ పక్క చెల్లెలు రేవతి లక్షీ దేవికి ఇరు పార్మ్వాలా ఉపనిష్టులైన ఉమా సరస్వతుల లాగ తివాసీ అలంకరించారు. మరొక పక్క చిరి చాప మీద వధువు తండ్రి గారయిన అనంత కృష్ణ శర్మ గారు, బ్రహ్మదేవుడి అపరాన తారం లాగ ఆసీనులయ్యారు. అయన కిరు వైపులా కనిష్ట కుమారులైన త్రివిక్రముడు, వామనుడు కూర్చున్నారు.
    వేరొక పక్క రత్నకంబలాలు పరిచిన పరుపుల మీద దిండ్ల నానుకుని సుఖాసీను లయ్యారు వరుడు రాజశేఖర మూర్తి , అతని తండ్రి వెంకట చలపతి గారూ. మందరుడూ, ప్రసన్న వదనుడూ, మందస్థితాధరుడూ అయిన రాజశేఖర మూర్తి దృష్టి సర్వాంగ సుందరి అయిన ఇందుమతి మీదనే కేంద్రీకరించబడి ఉన్నది. పచ్చని మేని కాంతి తో స్వర్ణ ప్రభా భాసమాన అయిన భానుమతే దేవికి, స్వచ్చమైన పాలవంటి తెల్లని శరీరచ్చాయ గల రేవతీ కుమరికీ మధ్య చామన చాయలో ఒక విలక్షణ సౌందర్యంతో భాసిల్లుతున్న ఇందుమతి ఒక చేత సుదర్శనము, ఒక చేత పాంచజన్యము ధరించిన వైష్ణవ తేజస్సు లాగ ఉన్నదను కున్నాడు రాజశేఖర మూర్తి.
    నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ వెంకట చలపతి గారు వధువు ను, "నీ పేరేమమ్మా?' అని అడిగారు.
    "ఇందుమతి."
    "ఎంత తియ్యని కంఠం!" అనుకున్నాడు. రాజశేఖర మూర్తి. ఆ నాలుగు అక్షరాలూ నాలుగు మధుర గీతికల లాగ ధ్వనించాయి రాజశేఖర మూర్తి వీనులలో.
    "రాజూ, నువ్వేమైనా అడుగుతావా?" అన్నారు వెంకటాచలపతి గారు కుమారుణ్ణి ఉద్దేశించి.
    అక్కరలేదన్నాడు రాజశేఖర మూర్తి.
    "పోనీ, పాట పాడించమంటావా, నాయనా?" అన్నారు అనంత కృష్ణ శర్మ గారు.
    "అక్కర్లేదండీ" అన్నాడు రాజశేఖర మూర్తి. అసలే లజ్జా భారంతో కుంచించుకు పోయిన ఇందుమతి అతని ఉదారతకు మనస్సులోనే నమోవాకాలు అర్పించుకున్నది.
    "సంస్కృతాంధ్రాలు చక్కగా చదువుతుంది. నేనే స్వయంగా భారత, భాగవత, రామాయణాది మహా కావ్యాలు క్షుణ్ణంగా బోధించాను. పైన స్కూలు చదువు ఉండనే ఉన్నది." అన్నారు శర్మగారు.
    "ఏం చదువుతుండండి?" అని అడిగారు వెంకటా చలపతి గారు.
    "నాలుగో ఫారం" అన్నారు శర్మగారు.
    ఇంతలో త్రివక్రముడ్నీ, వామనుడ్నీ లోనికి తీసుకొని పోయి పెళ్లి వారికి ఫలహారాలు పట్టించుకు వచ్చారు వధువు తల్లి గారైనా అన్నపూర్ణమ్మ గారు. కారపు బూంది, పకోడీలు, అరిటి పళ్ళు, పెళ్లి వారికి , శర్మ గారికి వెండి పళ్ళాలలో పెట్టించారు. ఆ తరవాత వెండి గ్లాసులలో కాఫీలు అతిధులకు , తండ్రి గారికి ఇచ్చిన తరవాత త్రివిక్రముడు, వామనుడు తాము కూడా ఫలహారాలు , కాఫీలు తెచ్చుకున్నారు. అందరూ ఫలహారాలు ఉపక్రమించారు.
    "ఇంటర్ మీడియట్ అయినట్టే కదా? ఇక పైనా ఏం చదువుతావు నాయనా?" అని వరుడి తో సంభాషణ కు దారి తీశారు శర్మగారు.
    "ఇంకా ఏమీ అనుకోలేదండి. ఈ పరీక్షా ఫలితాలు రానివ్వండి. ముందు" అని తప్పుకోటానికి ప్రయత్నించాడు రాజశేఖర మూర్తి.
    "ఏ మద్రాసు, విశాఖ పట్నం పంపి పెద్ద చదువులు చదివించటానికి స్తోమత లేదు, బావగారూ. ఏదో ఉన్న ఊరు కనక గుంటూరు లోనే బి.ఏ. చదివిద్దా మనుకుంటున్నాను." అన్నారు వెంకట చలపతి గారు.
    "ఏదైతే ఏమి లెండి. అది మాత్రం తక్కువ చదువా? తెలివితేటలూ ఉన్నవాళ్ళు ఏ చదువు చదివినా బాగుపడతారు. దైవ కృప బాగా ఉంటె చాలు. మా రెండో వాడు బి.ఏ. యే కదండీ! విజయవాడ లో ఒక ట్యూటోరియల్ ఇన్ స్టిట్యూట్ పెట్టి నిక్షేపం లా సంపాదించు కుంటున్నాడు. వాడి సంపాదన బి.ఎల్. పాసైన మా పెద్ద వాడికి లేదు."
    "పెద్దబ్బాయి ఎక్కడన్నారు ప్రాక్టీసు?"
    "బందరు లో నండి."
    "పెద్దల్లుడు గారేం చేస్తున్నారండీ?"
    "ఎమ్.బి.బి.యస్ . పాసయి ఏలూరు గవర్నమెంటు హాస్పిటల్ లో ఈ మధ్యనే చేరాడు. డాక్టరీ అంటే మాటలా , బావగారూ! అయిదారేళ్ళ చదువు. అదీ తప్పకుండా పాసయ్యే వాళ్ళు అరుదు. ఆ తరవాత కొన్నాళ్ళు హౌస్ సర్జన్ గా పనిచెయ్యాలంటారు. మొత్తానికి విశాఖ పట్నం లో ఏడెనిమిది సంవత్సరాలు రెండు చేతులా ఖర్చు పెట్టి ఈ మధ్యనే సంపాదనకు ఉపక్రమించాడు పెద్దల్లుడు."
    "అయితే ఏం లెండి. డాక్టరు కదా, మున్ముందు సంపాదన బాగా ఉండవచ్చు."
    "గవర్నమెంటు డాక్టరు గా సంపాదన ఎక్కువేముంటుంది లెండి! ప్రైవేటు ప్రాక్టీసు పెడితే అదృష్టం కలిసి వస్తే సంపాదన వృద్ది పొందవచ్చు. కాని ఆ ప్రాక్టీసు పెట్టటానికి తగిన స్తోమతు కావాలి. వెంటనే ప్రాక్టీసు రాదేమోనని కొంత భయం. డాక్టరు కొత్త వాడంటే వెంటనే రారు కదా జనం? కొంతకాలం కాళ్ళూ, చేతులూ కూడ దీసుకుని తరవాత ప్రైవేటు ప్రాక్టీసు సంగతి చూసుకోవచ్చు లెమ్మని ప్రస్తుతం ఈ ఉద్యోగం లో చేరాడు."
    ఈ సంభాషణ ఇలా జరుగుతుంటే ఇదే సమయమని, "అక్కా, బావని చూడవేమే?" అంటూ మోచేతితో అక్కని పొడిచింది రేవతి. చిరుకోపంతో , "పోవే!" అని తోసేసింది ఇందుమతి. శర్మ గారి సంభాషణ లో పాల్గొంటూనే అవతల జరుగుతున్న గుసగుసలు గమనిస్తున్నాడు రాజశేఖర మూర్తి.
    "వరుడు నచ్చాడో లేదో చూసుకోవే, వాళ్ళు వెళ్ళిపోయిన తరవాత నేను చూడనే లేదంటే లాభం ఉండదు." అని సన్నగా హెచ్చరించింది భానుమతీ దేవి.
    భీత హరిణి లాగ ఒక్క మాటు ఓరగా రాజశేఖర మూర్తి వేపు చూసి, అదే సమయానికి అతనూ తన వేపు చూడటంతో ఒళ్ళు ఝల్లు మని, గిరుక్కున దృష్టి మళ్ళించు కుని, సిగ్గుతో మరింత కుంచించుకు పోయింది ఇందుమతి.
    స్త్రీ లకు పురుషులతో అందచందాలు గమనించటానికి అరక్షణం చాలు. మనస్సు కొంత కుదుట పడ్డ తరవాత నిదానంగా అనుకున్నది. అందగాడే. చక్కని వన్నె. చక్కని కను ముక్కు తీరు. ఎంత విశాలమైనదా నుదురు! తెలివి తేటలయన ముఖం లోనే కనిపిస్తున్నాయి. నేనింతకీ ఆయనికి నచ్చుతానో, నచ్చనో? నచ్చకపోతే నావేపెందు కలా ఆప్యాయంగా చూస్తారు? రాజశేఖర మూర్తి! ఎంత చక్కని పేరు! తరంగాల లాంటి నల్లటి పొడుగాటి జుట్టు, ఈనాటి భావకవుల కు మల్లె ఉన్నది. ఆ సన్నటి ముక్కు, ఆ చిరు మీసం, ఆ పలచటి పెదవులు -- నవ మన్మధుడులా ఉన్నారు.'
    "ఇంక లోపలికి వెళ్ళండమ్మా" అని శర్మగారు హెచ్చరించటం తో ఆమె ఆలోచనల కంతరాయం కలిగింది. అక్క చెల్లెళ్ళు ముగ్గురూ లేచారు. వెళ్ళిపోయే ముందు మరొక్క మారు రాజశేఖర మూర్తి ని తృప్తిగా దర్శించు కుందామని ఓరగా ప్రయత్నించింది ఇందుమతి. కాని, నిర్విమేషంగా తన శరీర సౌందర్యాన్ని తాగేస్తున్న ఆ విశాల నేత్రాల ధాటికి తట్టుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె ఏ సమ్మోహనాస్త్రం ప్రయోగించిందో కాని, ఆ క్షణం నించి రాజశేఖర మూర్తి మనస్సు ఇందుమతీ ముగ్ధ మనోహర సౌందర్య మూర్తితో నిండిపోయింది.
    "ఏం, నాయనా, అమ్మాయి నచ్చిందా?' అని అడిగారు మెల్లిగా అనంత కృష్ణ శర్మ గారు.
    చిరునవ్వే జవాబుగా తృప్తి గా లేచి నిలుచున్నాడు రాజశేఖర మూర్తి. అతని ప్రసన్న వదనమే అతని మనస్సు లోని భావాలు తెలియచేస్తున్నది.
    "తరవాత తెలియ చేస్తాం లెండి" అంటూ లేచారు కుమారుని మనస్సు ఎలా ఉన్నది తెలియని వెంకటా చలపతి గారు.
    "అలాగే లెండి." అంటూ తృప్తిగా లేచారు కాబోయే అల్లుడి మనస్సు యిట్టె పసిగట్టిన అనంత కృష్ణ శర్మగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS