Previous Page Next Page 
నన్ను నన్నుగా ప్రేమించు పేజి 2


    "చూసేవా! నిష్కారణంగా అజాగ్రత్తగా ప్రవర్తించేవు! చెక్కపేడు తీద్దామని సేఫ్టీపిన్ గుచ్చేవు. గుచ్చిన దానివి ఇంత లోతుగా గుచ్చి ఇంతగా గాయం చేసుకొంటారుటే! పైగా, నే నేమీ మందులు రాయక్కర్లేదంటావూ?"
    "పోనిద్దూ. రేపీ పాటికి అదే మానుతుంది."
    "మానిపోతుంది! ..... సరిగా నేను చెప్పదలచిందీ ఇదేనే, లీలా! నీ అంత సుకుమారమైన శరీరం చాలా అరుదు. ఇంత పిసరు చెక్కపేడు దిగేటప్పటికే అరచేయి ఇలా కమిలిపోయిందే - ఇంకెందుకు పనికొస్తుందే ఈ గాజుబొమ్మ!......నీలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకూడదే-మ్యూజియమ్స్ లో పెట్టాలి-అంతే."
    "ఇంకా నయం. 'జూ'లో అన్నావు కాదు."
    "మన సంఘమే ఒక 'జూ'. దీని ధర్మమే జూఆలజీ. ఆడపిల్లా మొగపిల్లాడూ ఎదిగారో లేదో చూసుకోకుండానే పెళ్ళి అంటూ చేసెయ్యడం, ఈ ఎదిగీ ఎదగని పిల్లల్ని ఏకం చెయ్యడం, అదేదో కులాసా అనుకొని వాళ్ళు ఆబగా స్వీటు తినేసరికి పిల్లలు పుట్టుకు రావడం! ఇంక అందం లేదు, ఆనందం లేదు ..... పిల్లని చూసి, తల్లిని చూసి మొగవాడు చిరాకు పడిపోవడం."
    లీల భయంగా చూసింది. కొంచెం నవ్వు తెచ్చుకొని "అయితే ఇప్పు డేమి టంటావే" అంది.
    "నే నేమి టంటానమ్మా! నువ్వు నాకు ఇంతప్పట్నుంచీ తెలుసును. మనం ఎన్నో సంవత్సరాలు కలిసి ఆడేం, తిరిగాం కాని ఎప్పుడూ ఒక్కటే బెంగ నాకు-మా లీలక్కూడా పెళ్ళి అయిపోతుంది. వరసగా పిల్లలు పుట్టేస్తారు. లీల కూడా వికారంగా అయిపోతుంది. ఇంతేను. ఈ లోకంలో అందానికి స్థానం లేదు     - ఇలా అనిపించి ఒళ్ళు గగుర్పొడుస్తుందే." వీపుమీద చెయ్యి వేసి, నింపాదిగా ఆ చేత్తో వీపు నిమిరింది. రెండో చేతిని లీల భయం మీద వేసి, జబ్బమీదుగా అరచేతి మీదికి తీసుకొచ్చింది. "ఈ సున్నితమైన శరీరం, చేతులు పిల్లల్ని మొయ్యడానికి తగినవి కావు, లీలా ..... అది సరే, నాకు తెలియక అడుగుతానూ - ఎప్పుడైనా పావుగంట సేపు ఎవరి పిల్లనైనా ఎత్తుకొన్నావుటే?"
    "పోదూ, నీ వన్నీ వింత మాటలు!"
    "వింత మాటలు కావు, లీలా నే చెప్పేది అక్షరాలా నిజం! ఇప్పుడంతా బాగానే ఉంటుంది గాని, ఒక్కకానుపొచ్చిందా, నీ పని సరి! నువ్వు తట్టుకోలేవు. అది మాత్రం నిజం. ఒకవేళ తట్టుకొన్నా ఆనక నిన్ను చూడలేనంత అసహ్యంగా తయారయి పోతావుకూడానూ. అందుచేత, మీ ఆయనా నువ్వూ తప్పకుండా, అర్జెంటుగా ఈ విషయం మాట్లాడుకొని, వీలున్నన్ని సంవత్సరాలు మీకు పిల్లలు పుట్టకుండా చూసు కోవాలి. కొన్నేళ్ళుగా మా కందరికీ కన్నుల పండువుగా మీ ఇద్దరూ నవకం చెడకుండా ఇలా కనబడాలి. మీ ఇద్దర్లో ఎలాంటి చీదరైనా మేం చూడలేం. నీమీద అభిమానం ఉన్న వాళ్లెవరైనా ఇదే అనుకొంటారు. నేను డాక్టర్ని కనక అనుకోవడంతో ఆపుచెయ్యక చెప్పవలసే వచ్చింది!"    
    లీల సిగ్గుపడింది. ఇలాంటి మాటలు ఆమె ఇదివరకెప్పుడూ వినలేదు, చదవలేదు. పైగా, జయప్రద చిన్ననాటి స్నేహితురాలైనా ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నారు. కలిసి ఎన్నో రోజులు గడిపారు. ఎంతోమందితో స్నేహం చేసుకొన్నారు. కానీ ఇలాంటి సంగతి ఎప్పుడూ, ఎక్కడా చర్చకి రాలేదు. 'పెళ్ళి' అనే విషయం చర్చకి వచ్చినప్పుడే చాలా ముభావంగా, క్లుప్తంగా ఉండేది. పెళ్ళి తరవాత తానూ, ప్రభాకరం - ఇదిమాత్రం ఎన్నాళ్ళయింది? ఇంకా మూడు రోజులేగా? ప్రభాకరం చాలా మర్యాదస్థుడు. నిరంతర కృషీ ఫలమైన అతని సంస్కారం, వినయం, హుందా ఎంతో బాగున్నాయి. మూడు రోజుల అనుభవం ప్రత్యేకంగా ఉన్నా తమ కిద్దరికీ అదేపరిచయం కాదుకానీ అంతకుముందేమీ చొరవ లేనట్లూ, అన్నిటికీ మర్యాద, గౌరవం అవసరమైనట్లూ, తొందర, బలప్రయోగం పొరపాటు భావాలైనట్లూ ఎంతో చక్కగా ప్రవర్తిస్తున్నాడు. మొదటినుంచీ అతనికి తనంటే గౌరవమే; మర్యాదే. ఈ గౌరవ మర్యాదల పరిధి దాటి ఇంత కొత్తదీ, అశుభ్రమైనదీ అయిన ఈ విషయాన్ని అతనితో ఎలా చర్చించడం? చర్చించమంటూంది జయ ఎలాగ?
    జయ చెప్పేది నిజమేలా ఉంది.
    "ఆలోచించు, లీలా" అంది జయప్రద. "బాగా ఆలోచించు. ఆలోచించిన కొద్దీ నే చెప్పేదానిలో నిజం నీకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆలోచించుకొని, నిజం తెలుసుకొని, మీ ఇద్దరూ అనుకొని ఏదో ఉపాయం ఆలోచించి ఆచరణలో పెట్టండి. నీ దగ్గరి నుంచి ఉత్తరాలు తప్పకుండా వస్తాయి నాకు. దీన్ని గురించిన దుర్వార్త ఉందేమో అని భయంతో అవన్నీ విప్పుకుంటాను నేను .... నాకు వీలైనంత ఆనందాన్ని ఇవ్వడంకోసమైనా నే చెప్పినట్టు చెయ్యవే....."
    లీల నవ్వింది. "ఏదో బహుమానం ఇస్తానని ఆశ పెట్టేవు. చివరికి ఇది టే నువ్విచ్చే బహుమానం! మంచి ఫ్రెండువే! ఎవరేనా నన్ను పిలిచి మీ ఫ్రెండు మీకేమీ ప్రెజెంట్ తేలేదా అంటే, నేనేం చేసేదే?" అని హాస్య ధోరణిలో పెట్టి తప్పుకుందామని చూసింది.
    "ఊఁ హూఁ! అలాగా! సరే. ఓ ఏడాది పోయేక రమ్మని చెప్పి, బక్కి పేగులతోనూ, లటలటలాడే కాళ్ళ తోనూ, ఎనీమియాతోనూ కలకల్లాడే పాపని కని, అందరికీ చూపించవే! అప్పుడు మెచ్చుకుంటారు నిన్ను!" అన్నది జయప్రద చిరాగ్గా.
    "ఛా అది కాదే! నీ లెక్చర్ నుంచి తప్పించుకోవడాని కలా అన్నానే, బాబూ" అని చిన్నబుచ్చుకుంది లీల.
    "పద, ఇంట్లోకి పోదాం. నీ కిస్తానన్న బహుమానం నా పెట్టెలోనే ఉండిపోయింది" అని లేచింది జయప్రద. "ఆయన్ని కూడా పిలు. ఇద్దర్నీ ఎదురు బదురుగా నిలబెట్టి మరీ ఇవ్వవలసిన ప్రెజెంటు అది!" అని కొంటెగా నవ్వింది జయప్రద.
    "ఏం వద్దులే. నీ కబుర్లు మొగాళ్ళతో కూడానా ఏమిటి, చాల్చాల్లే!"
    
                            *    *    *

                     

                                    2

    "పెబాకరం బాబూ! ఓ పెబాకరంబాబూ!"
    చెట్టు నీడలో ఆపిన బండిని బలవంతంగా లాగుతూ అరిచాడు లచ్చన్న.
    బస్సు దిగేసరికి దగ్గిరగా ఎవరూ కూలివాడు కూడా లేడు. ఎండకి లీల కందిపోయేటట్లుగా ఉంది. చేతిలో సూట్ కేసు. ప్రభాకరం చాలా బెంగగా అడుగులేస్తూ ఉండగా అల్లంత దూరాన లచ్చన్న అరుపు వినిపించింది. అతనికి హుషారు వచ్చింది.
    "ఏం బాబూ, మే మెవురం రాకుండానే పెళ్ళి సేసేసుకున్నావా!" అని నోరంతా విప్పి నవ్వాడు లచ్చన్న. లీలని ఎగాదిగా చూసి, "తల్లి మా లచ్మినా గున్నాడు బాబూ అమ్మాయిగోరు. మీ మీద నాలుగు సాయ లెక్కువే" అన్నాడు.
    "నాలుగు చాయలేం, పది పదిహేను చాయ లెక్కువ ఉంటుంది. అందుకేగా చేసుకొంది!" అన్నాడు ప్రభాకరం, గర్వంగా లీలవేపు చూస్తూ.
    "ఛాయలసంగతి దేవుడెరుగును గానీ, మీ రిద్దరూ ఒకరి కంటా ఒకరు నాలుగాకు లెక్కువ చదువుకున్నాట్టుంది" అంది లీల.
    "అమ్మ బాబో యంత మాట సెలవిచ్చినారండి అమ్మగోరు. అయితే బాబూ ఈ యమ్మ తమర్నాగ పట్లంలో నడుపుకోనేదా?"
    "చదువుకోకేం? మన్లాగ నాలుగాకులు చదవక పోయినా, ఏదో ఒకటి రెండాకుల్దాకా చదివి ఆ తరవాత..." అని చిలిపిగా ప్రభాకరం లీలవంక చూసి నవ్వాడు. లీల తల వంచేసుకొంది.
    "ఆఁ....రండమ్మాయిగోరూ!" అంటూ సామానంతా తనదే నన్నంత స్వతంత్రంగా బండిలో పెట్టాడు వాడు.
    "ఆఁ ఏరా, లచ్చన్నా, బాబాయిగారి కెలా ఉంది?" బండి మెల్లిగా తోలుతున్నాడు లచ్చన్న.
    "ఈ యాల కాస్త లేచారండి. అమ్మమ్మో! ఏం జొరమో బాబూ మడిసి సగం అయిపోనారు. అమ్మగారికి ఒకటే బెంగ-అమ్మయిగార్ని రప్పించేశారు."
    "ఏమిటి లక్ష్మికూడా ఇక్కడే ఉందా?" ప్రభాకరం ముఖం విప్పారడం గమనించినా, తనకు పరిచయంలేని వారి గురించి జోక్యం చేసుకోలేదు లీల.
    "బాబూ, నిన్న సందేశాలనుంచీ అమ్మగారు ఒక్కటే లీల సందడి, బాబూ మీ రొత్తున్నారని టెలిగ్రాం ఇప్పించారుట కదా!" అయినా ఎటో ఈ బందం....ఎంతమంది సదువుకోనేదు మా బాబు దగ్గర కానీ.....మీరు అట్టా ఇంటో ఒకరినాగా మసిలారు..."
    చిన్నప్పటి సంగతులు నెమరువేస్తూ బండి నడుపుతున్నాడు వాడు. మనసులో భయం భయంగా అనిపించినా కొత్తవల్ల ఏమీ మాట్లాడలేకపోతూంది లీల.
    "లీలా..."
    ఏమిటన్నట్టు చూసింది.
    "రోడ్డు సరిగా ఉండదు.....కాస్త ఓపిక పట్టాలి. ఆ దిండు సరిగా వేసుకో...అడుగున బాగానే గడ్డి వేశానులే. గట్టిగా పట్టుకో.... అయినా ఎప్పుడైనా బండెక్కావా?" అన్నాడు ప్రభాకరం.
    "ఒకసారి జ్ఞానం తెలియనప్పుడు.....మా పిన్ని పెళ్ళయింది. అదేదో ఊరు.....సముద్రపు ఒడ్డున గంటసేపు నడిచింది తరవాత ఒళ్ళు కట్టించి తీసుకెళ్ళారు కానీ.....ఆ తరవాత ఎప్పుడూ ఎక్కలేదు."
    "కొంచెం దూరం అయితే బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ దూరం అయితే ఒళ్ళు పులుసు అయి, చచ్చినంత పని అవుతుంది మా లాంటివాళ్ళకి. అసలే సుకుమారివి. ఒకటికి పది సార్లు మీ అమ్మగారు జాగ్రత్తలు చెప్పి ఒప్పగించారు కూడా" అంటూ చిన్నగా నవ్వాడు.
    "ఆఁ....అమ్మాయిగారూ, ఆరి మాట అట్టా ఉంచండి. నన్ను ఉతికేత్తారు మా బాబు-జాగర్తగా తోలలేవా? అంటూ." నవ్వాడు లచ్చన్న.
    ఇలా దారిపొడుగునా ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా, రాత్రికి భరించలేని తలనెప్పి, చిన్నగా జ్వరం వచ్చేశాయి లీలకు. గాభరా పడిపోయాడు ప్రభాకరం.
    వేళాకోళం చేశారు ఆడంగులు.
    "మరీ ఇలాగయితే ఎలాగమ్మా, కోడలుపిల్లా! ఇంత నాజూకుతనం పనికిరాదు."
    "ముట్టుకోకుండానే కందిపోతే ఎలా?"
    "రేపు పిల్లలు పుట్టుకొచ్చారంటే ఎలాగమ్మా? కాస్త ఆరోగ్యం సరిచూసుకోవాలి. రేపు నీ కాపరంలో ఎవరు కనిపెట్టుకు చూస్తారు చెప్పు!"
    "ఆ ఆరోగ్యం మంచిదేనండీ." సణుక్కొంటున్నట్టు జవాబిచ్చింది లీల.
    మర్నాడు.... మధ్యాహ్నం భోజనాలయి కాస్త విశ్రాంతి తీసుకుందామనుకొంటూండగా, బిలబిల్లా డుతూ వచ్చారు ముత్తైదువులు. లీలను తీసుకొచ్చి చాపమీద కూర్చోబెట్టింది గురువుగారి భార్య.
    "పుట్టింటారు ఏ ఊరమ్మా?"
    వారి చూపులకి ఇబ్బంది పడుతూనే జవాబిచ్చింది లీల.
    మెల్లిగా ప్రశ్నలు కట్నకానుకలమీదికీ, ఆస్తి పాస్తులమీదికీ, అక్కడి నుంచి సౌందర్యం మీదికీ మళ్ళీ చిన్నగా గుసగుసలుగా తయారయ్యాయి.
    "ఆఁ... అమ్మాయే పసిడి బొమ్మయితే ఇంక కట్నం ఎవరిస్తారు?" ఎవరో గట్టిగా అంటున్నారు.
    ఏం చేయాలో తోచక చాపలోంచి పుల్లలు లాగ ప్రయత్నిస్తూ తల వంచుకు కూర్చుండిపోయింది లీల.
    "ఏవమ్మాయ్, శేషమ్మా... ఈ వేళ నీకు పని తప్పింది..."
    వారి భావం అర్ధంకాక "ఎందుకు?" అంది గురువుగారి భార్య.    
    "లాంతర్లు తుడవక్కర్లేదు...."
    "అదేం?"    
    "కోడలొచ్చిందిగా?"
    "అయితే కోడలిచేత చేయించాలనా?"
    "అబ్బబ్బ..... చిదిమి దీపం పెట్టచ్చు....అలాంటి కోడలొచ్చాక..." భావం అర్ధం అయి, అందరూ ఫక్కున నవ్వారు.
    ఇబ్బందిగా, మొహమాటంగా కూర్చుంది లీల.
    గంట గడిచాక ఒక్కొక్కరే తాంబూలా లందుకొని లేచారు.    
    లీల అవస్థ గమనిస్తున్న లక్ష్మి ఫక్కున నవ్వింది, "బాగుంది, వదినా, నీ పని" అంటూ.
    చిన్నగా పెదాల్ని అరవిప్పి బదులుగా నవ్వింది లీల, లక్ష్మి పది నెలలు బాబుని తన ఒళ్ళోకి తీసుకుంటూ.
    బాబు కాళ్ళూ చేతులూ ఆడిస్తూ ఏవో చెపుతున్నాడు. అర్ధంకాని మూగసంజ్ఞ లవి!
    "ఏమిటి, బాబూ.....ఏమిటి....? ఏం కావాలి?"
    "నే ననుకొంటున్నాడు" అని, "నాన్నా....అత్తరా, అత్త!" అంది లక్ష్మి.
    అర్ధం అయినట్టు బోసినోరు విప్పి నవ్వాడు వాడు.
    "అడుగుతున్నాడు.....పిల్ల నెప్పుడిస్తావని...." భాష్యం చెప్పింది శేషమ్మ.
    మనసులో ఏమిటోలోగా అనిపించినా పైకి సిగ్గు పడుతూ నవ్వింది లీల.
    "ఆఁ... కన్నవాళ్ళం పడుతున్నది చాలు....కాస్త వయసు తేడా ఎక్కువున్నా మా అబ్బాయికేం ఫర్వాలేదు కానీ.....కొన్నాళ్ళయినా సుఖంగా ఉండండొదినా." నిట్టూరుస్తూ అంటున్న ఆమెలో జయప్రద కనిపించింది లీలకు.
    "వచ్చే ఏటికి పండులాంటి బాబు నెత్తుకొని మరీ రావాలి సుమా!" వెళ్ళిపోయేముందు దీవించింది గురు పత్ని శేషమ్మ.
    'ఈయనకి తగ్గ గురుపత్నిగారే దొరికారు!' అనుకుంది లీల. ఆమెకి జయప్రద మాటలు జ్ఞాపకం వచ్చేయి. వచ్చే ఏటికి నిజంగా తనకి సంతానమే కలిగితే జయప్రద తనని తిట్టిపోస్తుంది. ఇంతకీ జయ ఇచ్చిన బహుమతీ, ఆ పుస్తకాలూ ఆ సామగ్రీ ఆయనకి చూపించనే లేదు. ఎలా చూపించడం? ఇంకా నయం.... ఇద్దర్నీ ఎదురు ఎదురుగా నిలబెట్టి ఇస్తానంది జయ....ఈ గురువుగారి ఊరు రప్పించి, ఈ పల్లెటూల్లో జయప్రద ని మాట్లాడమనాలి....అప్పుడు తెలుస్తుంది....
    బండివాడు ఈల వేస్తూ ఎద్దుల్ని అదిలిస్తున్నాడు. కుదుపుకి కొంచెం అలవాటు పడిందేమో, లీల, ఈ ఊరు వచ్చినప్పట్లా బెదరలేదు, బెంగెట్టుకోలేదు.
    ప్రభాకరం బండిలో ముందుకి జరిగి గడ్డిలో లోతుకి పాతుకున్న ఆమె చెయ్యిని పైకి లేవనెత్తాడు. ఆమె 'ఏమిటి' అన్నట్లు అతని కళ్ళలోకి చూసింది.
    "మా గురువుగారు, దొడ్డగారు-అదే మా గురువు గారి భార్య-అందరూ నిన్ను చూసి మెచ్చుకున్నారు, లీలా!"
    లీల మాట్లాడక చూసింది.
    "నిన్ను మెచ్చుకోవడం అంటే నన్ను మెచ్చుకున్నట్టే తెలుసా? నీ లాంటి అప్సరసని తెచ్చుకోగలిగానని నన్ను మెచ్చుకున్నారన్న  మాట!"
    "నే నేం అప్సరసని కాదు-ఊర్కోండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS