అతడే మళ్ళీ అడిగాడు.
'మీరు హైద్రాబాదేనా వస్తూంట?'
'అవునండీ!'
'అక్కడ పని చేస్తున్నారా మీరు?'
'లేదండీ!'
'ఏదైనా అలాంటి ప్రయత్నమా?'
త్యాగరాజు కాస్త ఇబ్బందిగా అటూ యిటూ కదిలాడు.
'అలాంటిదే-!' ముభావంగా అన్నాడు.
'హైదరాబాదు వున్నది చూచారూ-' అవతలాయన లేచి బాసి పెట్టు వేసుకు కూర్చొని, దిండు క్రిందగా పెట్టిన సిగరెట్టు పెట్టెను అగ్గి పెట్టెను బయిటకు లాగి, సిగరెట్టు ముట్టించి గట్టిగా దమ్ములాగాడు. 'ఇంతకీ మీరు హైద్రాబాదుకు పాతకాపులేనా?'
'లేదు!....ఇదే మొదటిసారి అక్కడకు ప్రయాణం!'
"ఇంకేం!.....అయితే నేను చెప్పేది సావకాశంగా వినాలి మీరు.....లేదంటారా...ఆ ఊళ్ళో మీరు దిగీ దిగగానే ముందు బోల్తాపడేది రిక్షా వాడి చేతిలో!'
త్యాగరాజుకి అతడి ధోరణి కొద్దిగా నవ్వు తెప్పించింది.
త్యాగరాజు అతడి మాటలకు ఆనకట్ట వేస్తున్నట్లుగా, 'మీరేం చేస్తుంటారు అక్కడ?' అని అడిగాడు.
'ఓ చిన్న ప్రైవేటు ఫరమ్ లో రెండు వందల రూపాయిల గుమాస్తా గిరి ... అసలు చూచారూ - నాకీ పాలసీ ఏఁవీ నచ్చలేదండీ! మనంచేసే ఉద్యోగాన్నిబట్టి కంటే... మన పరిస్థితులు, మన కుటుంబంలోని సభ్యుల సంఖ్యగూడా తీసుకొని జీతం ఇవ్వటం మొదలు పెడితే ఎంతో బాగుంటుందనిపిస్తోంది నాకు!'
త్యాగరాజు నవ్వాడు: 'అంత తేలిగ్గా చెప్పలేం!.....దేనికైనా దాని ఇబ్బందులు దానికున్నయి!... అని కాస్త చొరవ తీసుకుంటున్నట్లుగా, మీ పేరు చెప్పనే లేదు ... నా పేరుమాత్రం త్యాగరాజు!' అన్నారు.
త్యాగరాజు లేచి కూర్చున్నాడు - అతగాడితో కాస్త కాలక్షేపం చేద్దామనే ఉద్దేశ్యంతో!
'నా పేరు చెప్పాలి అంటే-దాని వెనుక కధగూడా చెప్పాలి - అయినా అడిగారు గనుక మిమ్మల్ని నిరాశ బుచ్చటం నా కిష్టంలేదు......చెబుతాను వినండి!- నేను పుట్టకముందు మాయింటి పరిస్థితులు ఎంతో అద్ద్వాన్నంగా వుండేవట! ... కాని.....నేను పుట్టిన మూడోరోజుకి మా నాన్నకు అర్ధరూపాయి యింక్రిమెంటు-ఆపైన మా అక్కయ్య పెండ్లి చేసేందుకుగాను మూడువందల రూపాయిల అప్పు దొరికినయిట! ... అందుకనే నా పుట్టుకతో నా యిల్లు సౌభాగ్యంతోనూ, ఆనందంతోనూ ప్రకాశిస్తుందని - నాపేరు 'ప్రకాశం' అని పెట్టారు! -అయితే నేను పుట్టిన ఆరు నెల్లకు మా నాన్న-ఆపైన పదినెల్లకు అప్పుచేసి పెళ్ళి చేసిన మా అక్కయ్య... మా యింటి ఉజ్వల ప్రకాశాన్ని చూడకుండానే గుటుక్కుమన్నారు!' అన్నాడు.
అని ఫక్కున నవ్వాడు ప్రకాశం.
త్యాగరాజు అతడి మొఖంలోకి జాలిగా చూచాడు.
'....సరే! అదంతా తీసివేయండి...ఎలాగో పెరిగాను. మా అమ్మ కష్టపడి నన్నూ మా చెల్లెల్ని పెంచింది. పెద్ద వాళ్ళను చేసింది .... లోకంలో నలుగురి ముందూ 'అవు' ననిపించుకునేలా తీర్చి దిద్దింది!' ఒక్క క్షణం అతడు మౌనంగా వుండి పోయాడు.
త్యాగరాజుకు-అతడి జీవితానికీ తన జీవితానికీ ఎక్కడో, ఏదో సామ్యం గోచరించగా-ఉత్సుకతో అతడి కధను వినటానికి ఉద్యుక్తుడయ్యాడు! అతడి కళ్ళు ప్రకాశం కళ్ళల్లో దేనికోసరమో వెతికి నయ్.......
అయినా-ఎవరడిగారని అతడు తన కధనంతా చెబుతున్నాడు?
ఏఁవో?
'చెల్లాయిని నా చేతులమీద పెంచాను.'
త్యాగరాజు అతడి మాటలు వింటూనే గుండెల్ని చేతులతో కప్పుకున్నాడు-దడ దడ లాడుతున్నది గుండె!
చెల్లెలు-రాణి!
ఇంకెక్కడి రాణి ?
'నేను జీవితంలో ప్రేమించగల వ్యక్తి-నా జీవితాన్నైనా వెచ్చించి ప్రేమించగల వ్యక్తి-ఒక్కనా చెల్లెలే!' అతడి కళ్ళు గర్వంతో మెరుస్తున్నయి...
త్యాగరాజు కళ్ళు సిగ్గుతో కుంచించుకుపోయినయి.
'ఇంతకీ నా ప్రయాణం గురించి చెప్పానే గాదు కదూ మీకు?-నా రత్నాన్ని... నా సుందరిని పువ్వుల్లో పెట్టుకు పూజించే వ్యక్తి-అక్కడెక్కడ వున్నాడంటే చూచివద్దామని వెళ్ళివస్తున్నాను!'
'కాయా.....పండా?' త్యాగరాజు ప్రకాశం కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
'ఏదీవాడు!' ప్రకాశం నవ్వాడు. 'నేను వివరాలన్నీ తెలుసుకొని తీరిగ్గా వెళ్ళేటప్పటికి అతఃడికి మరో సంబంధం నిశ్చయమైపోయింది!'
త్యాగరాజు నిట్టూర్చాడు.
'....నేను నా చెల్లెలు వివాహ విషయంలో ఎందుకు తొందరపడుతున్నా నంటారా?......అంత పెద్ద రహస్యం కాదనుకోండి!.....మా చెల్లెలి వివాహం కాందే-నా మటుకు నాకే-నేను వివాహం చేసుకోవటం అంత బాగుండదనిపించింది!....అందుకనీ....ఇంకా...' ఏదో సాగదీస్తూ చెప్పబోయినవాడల్లా ఒక్కక్షణం ఆగి ఫక్కున నవ్వేశాడు. 'అర్ధమయిందా గురూగారూ!' అన్నాడు.
అతడి మాటలు త్యాగరాజుకు నవ్వు తెప్పించినయ్.
'......అదీ సంగతి!.....' కాస్త ముందుకు వంగి, ఇంకాస్త చొరవ తీసుకుంటున్నట్లుగా, 'మన్లోమాట....ఏ వయస్సులో జరగవల్సినవి ఆ వయస్సులో జరగాలంటాను....మనకీ వయస్సులో పక్కన పెళ్ళాం అనబడే వో అమ్మాయి లేకుండా జెవెఇథమ్ గడపడం అనేది-బహు దుర్భరంగా వుంటుంది మాష్టారూ! ....మీరే మంటారు?' అన్నాడు.
త్యాగరాజు ఏఁవీ అన్లేదు....నవ్వి మాత్రం వూరుకున్నాడు!
'అదుగో మీరు సిగ్గుపడుతున్నారు...అయితే మీకూ వివాహం కాలేదన్నమాట.....వెంటనే చేసేసుకోండి మాష్టారూ ఎందుకైనా మంచిది!
'పోనీ....నష్టమేఁవిటో చెప్పండి!' అన్నాడు త్యాగరాజు కవ్వింపుగా.
'నా నోరు అసలే మంచిదిగాదు!' ఫక్కున నవ్వి ఒక్క క్షణమాగి, 'ఆ నష్టాలు ఈ నోటిమీదగా చెప్పాలంటే చాలా వెగటుగా వుంటయి- అంతదాకా ఎందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే నేను-అందరూ అనుకుండేటట్లుగానే-మంచివాడినిగాను-మంచి వాడిని గాకుండా పోవడానికి కారణం నాకు వో మంచి 'ఆడమనిషి' తోడు లేకపోవటమే-నా ఉద్దేశ్యమేస్మీ ఇది!' అన్నాడు కళ్ళు చికిలిస్తూ.
ఈసారి చాలా పెద్దగా నవ్వాడు. అలా నోరంతా తెరుచుకు నవ్వటంతో-అతడి గారపట్టిన పళ్ళు చాలా అసహ్యంగా కనబడ్డాయి త్యాగరాజుకు!
ఈ మనిషిలో చాలా దుర్గుణాలు వుండి వుండవచ్చు!' అనుకున్నాడు త్యాగరాజు. అందుకనే అతడితో మాటలు పెంచకుండా గుట్టుచప్పుడు గాకుండా పడుకోవటం మంచిదనిపించింది అతడి మనస్సుకు.
దానికి సూచనగా ఓ తెచ్చి పెట్టుకున్న ఆవులింత నొకదాన్ని ఆవులించి, చిటికవేసి, అతడివంక చూస్తూ, 'నాకు నిద్రవస్తోంది మాష్టారూ!' అన్నట్లుగా చిన్న నవ్వు నవ్వాడు.
చాలా ముభావంగా వుండే త్యాగరాజుకు ఈ రోజున ప్రకాశంతో సంభాషణ కాస్త ఎక్కువ మోతాదులోనే జరిగిందనిపించింది-కొద్దిగా పశ్చాత్తాపపడి ఇకజాగ్ర్రత్తగా వుండాలనుకున్నాడు.
'ఇంకేం! నిద్ర వస్తున్నదల్లే వున్నది ... హాయిగా గురకపెట్టి నిద్ర పోండి!.....రేపు అనే దిగులు వద్దు ..... ఎందుకంటారా?....నేనున్నాను .... నాకో అద్దెకొంప వున్నది .... నేనూ, నా అద్దె కొంపా మీకు ఉద్యోగం వచ్చేటంతవరకూ సంతోషంగా ఆతిధ్యమివ్వగలం!' అని నవ్వేసి అతనూ పడుకున్నాడు.
ఈ సారి నిజమైన ఆవులింతే త్యాగరాజును పరామర్శించింది.
'ఇంకో కారణం గూడా చెప్పమంటారా?..... మెడ వంకరగా తిప్పి త్యాగరాజు వైపుచూస్తూ అన్నాడు.
త్యాగరాజు మొహంలో కాస్త చికాకు తొంగిచూచింది.
'ఈ రైలు మిమ్మల్ని హైద్రాబాద్ కు సవ్యంగా జేరుస్తుందనే నమ్ముతున్నారా?'
ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూచాడు త్యాగరాజు.
'యాక్సిడెంట్ అయిందనుకోండి ...అప్పుడేం జేస్తారు మీరు?....ఓహో .... మీ రేఁవిటి ?.... మనమేంచేస్తాం అప్పుడు అందాం!....మరో ప్రపంచంలో.....'పక పకా నవ్వసాగాడు: 'అందుకే మాష్టారూ! మనకు జీవితంలో భయం, దిగులూ వుండగూడదు!'
ఆ నవ్వుకు ఆనకట్టలే లేనట్లు ఉరవళ్ళు పరవళ్ళతో అతడినుండి వెలువడుతోంది!
త్యాగరాజు గుండె దడదడ లాడింది.
అతడి నవ్వుకు - పెట్టెలోని వాళ్ళంతా ఒక్కసారి అతడివంకా, త్యాగరాజువంకా విచిత్రంగా చూచారు!
