మధ్యవర్తుల రాయభారాలు ఫలించలేదు. ఇరుపక్షాల్లో ఎవరూ దిగి రాలేదు. "కందకు లేని దురద కత్తి పీటకా? వాళ్ళకీ లేకపోయాక మనకెందుకీ బాధ" అని అంతా తప్పుకున్నారు. పెళ్ళికి వచ్చిన చుట్టాలంతా జరిగిన దానికి చిలవలు,పలవలు అల్లుకుంటూ తమకు అందవలసిన కట్నాలు అందలేదన్న చింతతో ఇరుపక్షాల వారిని ఆడి పోసుకుంటూ ఇళ్ళ దారి పట్టేరు.
జరిగినదానితో తనకున్న సంబంధం ఎంతవరకో తెలియని పెళ్ళికూతురు దిగాలు పడికూర్చుంది. ఆవేశం చల్లారిన ఆడపిల్ల తల్లి సుందరమ్మ,ఆలోచనలో పడింది.
"ఏం చేస్తామండీ! పిల్ల నిచ్చుకొన్నవాళ్ళం. పంతాలకి పొతే ఏమౌతుంది? ఆ వెయ్యి అప్పో సొప్పో చేసి వాళ్ళ ముఖాన తగలేసి రండి. ఇంకా స్టేషను లోనే అఘోరిస్తూన్నారుట" అన్నది భర్తతో.
"నేనింకో పైసా అయినా ఇచ్చేది లేదు. వాళ్ళడిగినదల్లా ఇలా ఇస్తూ పోతుంటే దానికో చివరంటూ ఉండదు. ఏం చేస్తారో చెయ్యనీ, చూద్దాం." అన్నారు కన్యాదాత రమణయ్య.
రాత్రి పది గంటలకు పైగా అయింది. ఇక్కడ పెళ్ళి వారింట్లో అంతా తలో మూలా పడుకొన్నారు. అక్కడ రైల్వే స్టేషను లో అందరూ పెట్టెలకు, మూటలకు అనుకోని నిద్రకు జోగుతున్నారు.
మెల్లిగా వీధి తలుపు తీసుకొని బయటికి నడిచింది పెళ్ళి కూతురు జానకి. కాళ్ళకు రాసుకున్న పసుపు, పారాణి ఇంకా చెరగలేదు. నుదుటనుతీర్చి దిద్దిన కళ్యాణ బొట్టింకా కరగలేదు.భుజాల మీదుగా పైట కప్పుకొని, బుర్ర వంచుకొని, వీధి దీపాల వెలుతురూ లోంచి తప్పుకుంటూ స్టేషను వైపుగా నడక సాగించింది ఆమె.
పక్క చుట్టుకు అనుకోని కనుకు తీస్తున్న పెళ్ళి కొడుకు రాజారావు తనను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి కళ్ళు విప్పి చూసేడు. క్రీ నీడలో జానకిని చూసి అతను పోల్చుకోలేక పోయేడు. అసలు జానకిని అతడు చూసింది కొదొఆ అంతంత మాత్రమే. పెళ్ళి చూపుల నాడు ఓ అరగంట, అటు తరువాత లగ్న సమయంలో కాస్త సేపు.
జానకి అట్టే ప్రయత్నం అక్కరలేకుండానే అతన్ని పోల్చుకుంది. కళ్ళకు కాటుక, బుగ్గన దిష్టిచుక్క పెళ్ళి కొడుక్కు కాక మరెవరి కుంటాయి? పైగా పేరు పెట్టి పిలవగానే ఉలికిపడి చూసేడు. ఇతడే రాజారావు అనుకొంది.
"ఎవరు కావాలి?" అని ప్రశ్నించేడు లేచి, సరిగా సర్దుకొని కూర్చుంటూ రాజారావు.
"మీతోటే మాట్లాడాలి. కొంచెం అలా అటువైపు వస్తారా?' అన్నది ఆమె.
చుట్టుపక్కల అంతా నిద్రకు జోగుతున్నారు. స్టేషను గడియారం పదకొండు గంటలటైము చూపుతున్నది.ఇంతరాత్రి వేళ ఎవరీ పిల్ల! తనతో ఈమె కేం పని?అనుకొన్నాడు రాజారావు. రకరకాల ఊహలు, కధలు అతని మనసులో కదిలి కొంచెం హుషారు పుట్టించేయి. ఎవరైతే తనకేం? అర్ధరాత్రి అమ్మాయి రమ్మంటుంటే ఆలోచన దేనికి-- అనుకొన్నాడు.
ఇద్దరూ నాలుగడుగులు నడిచి ఒక గోడ వారగా నిలబడ్డారు. క్షణ కాలం సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అని తటపటాయించింది జానకి.
"ఎవరు నువ్వు?" తిరిగి అతడే ప్రశ్నించేడు.
జానకి ముఖమేత్తి అతని వైపు చూసింది. దూరంగా పోతున్న లారీ లైట్ల వెలుగు ఆమె ముఖం మీద పడింది.
"ఓహో , నువ్వా!" అతను పోల్చుకొన్నాడు.
'అవును, నేనే" అన్నది ఆమె నెమ్మదిగా.
"ఏమిలా వచ్చేవు?" మీ అయ్య పగలు పొసగని సంధిని రాత్రి నీద్వారా చేయిడ్డామనుకొన్నాడా?" అతని మాటలో హేళన ధ్వనించింది.
"నన్నెవరూ పంపలేదు. నేనీ అర్ధరాత్రి ఇలా వచ్చినట్లు ఇంట్లో ఎవరికీ తెలియదు."
'అసలింతకీ ఎందుకొచ్చినట్లు?"
"జరిగిన ఈ అల్లరితో మీ పాలెంత ఉందొ తెలుసుకొందామని వచ్చెను. మీవారి మాతలను నేనెంత లోతుగా తీసుకోవాలో కనుక్కుందామని వచ్చెను." జానకి అతని ముఖంలోకి చూస్తూ నొక్కి పలికింది.
"అంటే నీ అభిప్రాయం లో, మానాన్నా నా ప్రసక్తి లేకుండా మిమ్మల్ని అల్లరి పెట్టె ఉద్దేశంలో అలక పాన్పు మీద వెయ్యి రూపాయలు కావాలని కోరేడనా?"
'అలాగే అనుకొంటున్నాను, రాజారావు గారూ! పెద్ద వాళ్ళు చాదస్తంగా ఏవో లాంచనాలని, కట్నాలని పెళ్ళిళ్ళలో తగాదాలు పెట్టుకొని అల్లరి పాలు కావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కాని, ఈరోజుల్లో యువకులు అటువంటి వాటికి అట్టే ప్రాధాన్యం ఇవ్వరనీ, కనీసం పరిస్థితులు అనుకూలించనప్పుడు వాటి కోసం పట్టుదలలు పట్టరని నా అభిప్రాయం."
"నువ్వు అనుకొంటున్నది , కాలేజీ చదువులు చదివి వరకట్న నిషేధం అంటూ ఉపన్యాసాలిచ్చే యువకుల గురించి అయి ఉంటుంది. నేనేం చదువుకోలేదు. నా కటువంటి ఉన్నత భావాలు లేవు. మా రీతి రివాజులు , ఆచారాలు, మానుకోవలసినంత నాగరికత మా ఇంట ఇంకా రాలేదు."
"మీ రీతి రివాజులు ,ఆచారాలు ఏమి చెప్తున్నాయి, రాజారావు గారూ? తాము కన్నపిల్లని మీ చేతుల్లో పెట్టిన నేరానికి కన్యాదాతల ధన, మాన, ప్రాణాలను పీల్చి, వారిని నాశనం చేయ్యాలనా?
"మగపిల్లడితో పాటు ఆడపిల్లకి ఆస్తి హక్కులు లేని కాలంలో తమ ఇంట పుట్టిన పిల్ల, పై ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమెకి అవసరం అనుకొన్న వస్తువులు కొని, ఆమెతో పంపేవారు. వివాహ సమయంలో తమ సంతోషాన్ని వ్యక్త పరిచిందికి, తమ తాహతుకి తగినంత ధనం వరకట్నంగా ఇచ్చేవారు. ఈ ఆచారాలు సంతోషంగా నిర్వర్తించడం పోయి ఏనాడు నిర్భంధంగా మారేయో, ఆనాటి నుండే ఆడపిల్ల పెళ్ళి ఒక సమస్యగా తయారయింది. ఈ వరకట్నం అన్న ఆచారం దురాచారంగా వ్యాప్తి పొందింది.
"ఈ దురాచారాన్ని నిర్మూలించిందికి మీలాటి యువకులు ముందుకి రావడానికి మారుగా, ఇంకా దానిని పెంచుకుంటూ అలక పాన్పులని, ఆనవాయితీ లని పట్టు పంతాలు పడుతుంటే మన సంఘం ఏనాటికి బాగుపడుతుంది? గవర్నమెంటు చేస్తున్న చట్టాలు అమలులోకి రావాలంటే ఉత్సాహవంతులైన యువకుల సహకారం ఉండాలి."
"ఉపన్యాసం లా వినిందికి నువ్వు చెప్పింది చాలా బాగుందిమ జానకీ! ఇటువంటి సంస్కరణలు చేస్తూ, సంఘాన్ని మరామత్తు చేసే పనిని, నా భుజాల మీద నేను మోపుకోలేదు. నాకు కావలసింది నా వాళ్ళ ముద్దు ముచ్చట్లు. నా తల్లిదండ్రుల సంతృప్తి. మా ఇంట్లో నేనొక్కడినే మగ పిల్లాడిని. మిగిలిన ఆడపిల్ల అందరికీ మేమూ పెళ్ళిళ్ళు చెయ్యాలి. రావలసిన చోట రాబట్టుకొనిదే, ఇయ్యవలసిన చోట మేము మాత్రం ఎలా ఇయ్యగలం?"
'అందుకోసం వెయ్యి రూపాయలకి ముఖం చూసుకొని, మీరు పవిత్రంగా భావించి కట్టిన ఈ మంగల్యాన్ని త్రుణీకరించి వెళ్ళిపోతారన్న మాట! ఈ విషయంలో మీ రీతి రివాజులు మీరేం పాఠాలు చెప్పలేదా? అగ్నిసాక్షి గా కట్టిన ఈ తాళికి ఏపాటి విలునియ్యాలో బోధ చెయ్యలేదా?"
"రాజారావు గారూ, మీరు కాస్త ఆలోచించండి. పెద్దవాళ్ళ మూర్ఖత్వానికి పిల్లలు తన జీవితాల్ని బలియ్యడం లో అర్ధం లేదు. పెద్దవాళ్ళు తమ పట్టు పంతాలే చూసుకొంటారు కాని పిల్లల మంచి చెడ్డలు చూడరు.
"నాన్నగారికి ఏమాత్రం అవకాశంగా ఉన్నా అలా రెచ్చి పోకపోను. అతనికున్నదంతా ఈ పెళ్ళికి ఖర్చు పెట్టేసేరు.ఇంక ఒక్కపైసా అయినా అప్పు పుట్టే స్థితిలోలేరు. ఆ మాట చెప్పుకోలేక పంతాలకి దిగేరు."
"ఆమాత్రం ముద్దు ముచ్చట్లు తీర్చలేని వాళ్ళు పెద్ద సంబంధాలకి ఎగ పడకూడదు. గంతకి తగిన బొంత - ఏదో ఒకటి చూసుకొంటే సరిపోయేది. ఆశలావు, పీక సన్నం అని ఇలాటి దానికే అంటారు. మీవాళ్ళింత దరిద్రులని తెలుస్తే...."
రాజారావు మాటలతో జానకి లో సహనం చచ్చిపోయింది. అప్పటికి ఆమె తన ఈడుకు మించిన ఓర్మి చూపించింది. కష్ట నిష్టూరాల మధ్య పెరిగిన ఆ పిల్ల మనసు ఆమె వయసుకు మించి పెరిగింది. అ కారణంగానే, పెళ్ళి పందిట్లో అయిన అలజడి ముందు ముందు తనవైవాహిక జీవితం పై ఎటువంటి ఫలితాన్ని వెదజల్లేది ఊహించుకోన్నది. యువకుడైన రాజారావుకు నచ్చచెప్పి, ఈ అవాంచిత పరిస్థితిని ఆదిలోనే అంతం చెయ్యాలని నిశ్చయించుకొంది. పసుపు పారాణి పాదాలతో ఒంటరిగా ఇంటి నుండి అర్ధరాత్రి బయటికి నడిచేందుకు సాహసించింది.
కాని, రాజారావు మాటలు విన్న తరువాత ఈ విషయం తననుకొన్నంత సులువుగా పరిష్కారమయ్యేది కాదని తెలుసుకొంది. ధనదాహం తండ్రీ బిడ్డలకు సమంగానే ఉందని, ఆ విషయంలో తండ్రి అడుగుజాడలను కుమారుడు దాటే పరిస్థితి లేదని తెలుసు కొంది. పరిష్కారమార్గం కనిపించకపోయేసరికి, జానకి లో అంతవరకు దాగి వున్న అహంకారం బయటికి పొడుచుకు వచ్చింది. ఆవేశం లో ఆమె సమాధానం చెప్పేలోపునే వెనక నుండి ఎవరో పెళ్ళి కొడుకును "రాజులూ" అంటూ పిలుస్తూ వస్తున్నారు.
"మీకోసం ఎవరో వస్తున్నట్లున్నారు. నేను చెప్పదలుచుకొన్న రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అటుపైన మీ ఇష్టం వచ్చినట్లు చేయండి.
"రాజారావు గారూ , మాకు డబ్బు లేదని, దరిద్రుల మని అక్షేపించేరు. మా నాన్నకే తగినంత డబ్బుంటే మీ సంబంధం వైపు కన్నెత్తి చూసేవారు కాదు. చదువు, చక్కదనం , సంస్కారం గల వరుణ్ణి తన కూతురి కోసం గాలించి తెచ్చేవారు. కాని నాన్నగారికి ఆ శక్తి లేదు. మాకులేని డబ్బు మీకుంది అందుకే ఇతర లక్షణాల ప్రమేయం లేకుండా మిమ్మల్ని చేసుకొన్నాను. మిగిలిన విషయాలెలా ఉన్నా, కనీసం తమ బిడ్డ కడుపు నిండా తిండి తిని బ్రతికింది అవుతుందని మావాళ్ళు ముచ్చట పడ్డారు.
"విద్య లేకపోయినా మీలో వివేకం ఉంటుందని ఆశిస్తున్నాను. మీ నాన్నగారు జారీచేసిన హెచ్చరికను అమలు పరిచే ముందు మీ బుద్దిని కాస్త ఉపయోగించి మరీ పనిలోకి దిగండి. ఇంతకన్నా నే చేప్పవలసింది లేదు. నమస్కారం." అని వెనుదిరిగి చూడకుండా గబగబ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది జానకి.
జానకి మాటలు రాజారావు కు చెప్పుచ్చుకొని ముఖం మీద కొట్టినట్లే అయింది. "ఓరి బడుద్దాయీ! నీకు డబ్బుండగానే సరా? నాకు చదువుంది. సభ్యత వుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్భయంగా నిలిచి నిదానంగా ఆలోచించగల శక్తి ఉంది నీకేమున్నాయి?' అని సవాలు చేసినట్లనిపించింది అతనికి.
అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి అట్టే పరిచయం లేని మగాడి ముందు ఎన్ని మాటలని పోయింది. ఈ పిల్లకి ఎంత ధైర్యం! అనుకోని ఆశ్చర్యపోయాడు. మగవాడు కనిపిస్తే నే భూమికి మూడడుగులు లోతుకు కుంచించుకుపోయే తమ ఇళ్లలోని స్త్రీలతో జానకి ని పోల్చి చూసి, డబ్బు పట్టింపు వదిలి ఈమెను తీసుకు పోయినా ఇంట్లో స్థిరంగా కాపురం చెయ్యగలదా అనుకొన్నాడు. తను ఇంటువంటి పిల్లను భరించగలడా అని ప్రశ్నించుకొన్నాడు. అతను సరియైన సమాధానం తెలుసుకొక ముందే రైలు బయలుదేరింది. తిరిగి తలిదండ్రుల ఆర్భాటాలు, బంధు జనుల ఉద్భోదల ముందు జానకి మాటలు అతని మనసులో మరుగున పడిపోయేయి.
