"అదేం లేదు, ఇందిర మాట్లాడటం మొదలు పెడితే నేను కూడా నోరు మూసుకోవలసిందే" మంజుల కల్పించుకుంది.
"నిజం!" ఆశ్చర్యాన్ని నటించాడతను. వాసన్ ఫక్కు మన్నాడు.
"అయినా మంజులా, మీ కజిన్ ని గురించి ఏమీ చెప్పక పోవడం అన్యాయం." అన్నాడు మాధవరావు.
"ఏం చెప్పను మహానుభావా?' చిలిపిగా చూసింది మంజుల. "సరే, ,మొన్ననే , అంటే ఏప్రిల్ లో చదువు ముగించి, పది రోజుల క్రితమే ఇక్కడ మహిళా కళాశాల లో అధ్యాపకురాలుగా చేరింది. అభ్యసించినది ఆంగ్ల భాషా సాహిత్యము , ఇంక వయసు చెప్పబడదు. రూపు రేఖా విలాసుదలు కనిపిస్తూనే ఉన్నాయి...... చాలా?" ఊపిరి పీల్చుకుంది.
"చాలవు" అన్నాడు మాధవరావు. గంబీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ . "ఊ........' ఆలోచించింది మంజుల. ఇందిర మాత్రం అతని ముఖాన్ని పరికిస్తుంది. వాసన్ తో మాట్లాడుతున్న గోపాలరావు గారూ, సుందరమ్మా వీళ్ళని పట్టించు కోలేదు.
"మరీ.........సంగీతం రాదు. నాట్యము అంతే. పుస్తకాలయితే తెగ చదువుతుంది. ఆ ఇద్దరు అక్కలను కలిగి ఉన్న ఈ ముగద శ్రీ కందుకూరి కృష్ణ మూర్తి గారి తనయ. వీరి స్వస్థలము విశాఖపట్టణము. వీరికి మంజుల యను...." అంటూ తెలుగు పాఠ్యపుస్తకంలా వాగుతున్న మంజులను చూడటం లేదిందిర. రంగులు మారుతున్న మాధవరావు ముఖాన్ని గమనిస్తుందామె. క్షణం సేపు నిశితంగా ఇందిర వంక చూసి, సంభాషణ మార్చాడు మాధవరావు. భోజనాలు పూర్తీ అయ్యేదాకా అతను ఏదో ఆలోచనలో ఉన్నట్టే కనబడ్డాడు. మంజుల కూడా అతన్ని కదిలించలేక పోయింది.
భోజనాలయి తిరిగి హాల్లోకి వస్తుంటే మాధవరావు ఇందిరతో అన్నాడు. "నేనొకసారి ఈ ఇంటికి వచ్చాను. కానీ మిమ్మిల్ని చూసిన గుర్తు లేదు. మీకు నన్ను తెలుసా?"
అతని గొంతులో ధ్వనిస్తున్న కౌతుకాన్ని ఏవగించు కుంది ఇందిర. సాధ్యమైనంత నెమ్మదిగా , స్పుటంగా అంది. "మిమ్మల్ని గురించి విన్నాను కానీ, చూడటం ఇదే మొదటి సారి. మీరూ నన్ను చూడలేదు, చూస్తె మాత్రం తేలిగ్గా మరిచిపోయేవారు కాదు."
ఆఖరి మాటలతన్ని ఆశ్చర్యపరిచాయి. అందమైన ఆడపిల్ల సవాలులా లేదు. దెబ్బలాట కు దిగే దుడుకు అబ్బాయి కరుకుదనం ఉంది అందులో.
"ఉహూ......నేను మీ అక్కని మాత్రమె చూశాను. అదీ తమాషా పరిస్థితుల్లో........" అంటూ ఏదో చెప్పబోతున్న అతనిని ఆపి.." ణా కంతా తెలుసు. దయచేసి ఆ ప్రసక్తి తేకండి. ణా కిటువంటి సంభాషణలంటే బొత్తిగా ఆసక్తి లేదు. " అని కఠినంగా అని గబగబా వెళ్ళిపోయింది ఇందిర. అతని ఆశ్చర్యాన్ని కంతు లేదు! మళ్ళీ మంజుల పలకరించే దాకా అతను ఆలోచనలో నించి తేరుకోలేదు.
ఒంటరిగా తన గదిలో కూర్చుని ఆలోచిస్తున్న ఇందిరను, మంజుల పిలవడానికి వచ్చింది.
"ఇదేవిటి అందరూ అక్కడుంటే నువ్విలా ఇక్కడ కూర్చున్నావేం? నన్నగారడిగారు నీ గురించి. రా" అంది.
"ఏం లేదు. కొంచెం తలనొప్పి గా ఉంటె........"
తప్పనిసరిగా మంజుల వెనకాల నడిచింది ఇందిర. హాల్లోకి వస్తూనే "ఇందిరకు తల నొప్పిట" అంది మంజుల ముక్తసరిగా. ఇందిర క్షణం సేపు సిగ్గుపడి, మంజుల మీద కోపగించుకుంది.
"అస్తమానమూ పుస్తకం ముందేసుకుని కూర్చుంటే మరేమవుతుందే తల్లీ" సుందరమ్మ గారు మందలించింది.
"ఎక్కువగా లేదు, తగ్గి పోతుందిలే అత్తా" అంది ఇందిర కొంచెం చిరాకు పడుతూ.
"ఏమండీ, మాతో మాట్లాడినదానికా యేమి?" అని అడిగాడు వాసన్.
"మరే" అంది ఇందిర.
మాధవరావు క్షణ కాలం ఆమె పై దృష్టి నిలిపాడు. కాసేపటి తరవాత ఇద్దరూ లేచారు "వెళ్తా"మని.
'వస్తుండండోయ్ ఇదివరకట్లాగ" అన్నారు గోపాలరావు గారు.
"వెళ్లి వస్తాను మంజులా" అని అన్న మాధవరావు ఇందిర వంక చూడకుండా ముందుకు నడిచాడు. వాసన్ మాత్రం అందరి పాటూ, ఆమె దగ్గిర కూడా సెలవు తీసుకున్నాడు. పైగా వెడుతూ అన్నాడు "ఇక మీ తలనొప్పి తగ్గును అనుకుంటాను" అని.
నవ్వి ఊరుకుంది ఇందిర. అసలు తలనొప్పి ఇప్పుడేగా మొదలయ్యింది!
ఆ రాత్రి పక్క మంచం మీద పడుకున్న మంజుల , మాధవ సంకీర్తన చేస్తుంటే విసుగు వచ్చి, "మంజూ, నాకు నిజంగా తలనొప్పిగా ఉంది. దయచేసి నన్ను విసిగించక" అని విసురుగా గోడ వేపు తిరిగి పడుకుంది. రెండు నిమిషాల తరవాత మంజుల దీపం తీసేసి నిద్ర కుపక్రమించింది.
* * * *
గురు ద్వారా రోడ్డు దగ్గిర బస్సు దిగి గబగబా ఇంటి వైపు నడవసాగింది ఇందిర. అప్పుడే రోడ్డు మీద దీపాలు కూడా వెలిగించేశారు. "చలికాలం దగ్గిర్లోనే ఉంది' అనుకుంది ఇందిర. ఎందుకో మనస్సంతా తృప్తి తో నిండింది. తన మీద తనకు నమ్మకం ఎక్కువయింది. మీటింగు లో అందరూ కూడా తన తెలివైన దానినని హర్షించారు. ఎటొచ్చి ఉపన్యాసకుడే కొంచెం ఇరుకున పడ్డాడు. 'అసలు ఈ విషయం మీద తానొక చక్కని వ్యాసం రాస్తేనో?' అప్పుడే కూర్చుని రాసేడ్డామా అన్నంత హడావిడి గా కాలింగ్ బెల్ నొక్కింది ఇందిర. నాయర్ తలుపు తీసాడు. ఎవరో వచ్చినట్టున్నారు. నవ్వులూ మాటలూ వినబడుతున్నాయి. తల వంచుకుని డ్రాయింగు రూము దాటి, తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. పుస్తకాలూ, పర్సూ మంచం మీద పడేసి కిటికీ దగ్గర నుంచుని ఆలోచిస్తుంది. రాయబోయే వ్యాసానికి ఉపోద్ఘాతం. "విలువలు పడిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో .......'అంటే? కానీ, 'ఇమేజ్' చక్కనిది కుదరలేదు. "నిరశామయ మయిన........"
"అమ్మాయి గారూ......."
"ఏమిటి నాయర్?" గిరుక్కున తిరిగింది ఇందిర.
"మిమ్మల్ని హాల్లోకి రమ్మంటున్నారు అమ్మగారు." అని వెళ్ళిపోయాడు నాయర్.
"ఎవరబ్బా ఆ వచ్చినది అని నాయర్ వెనకాలే వెళ్లి "ఎవరున్నారక్కడ " అంది.
"మాధవరావు గారు, వాసన్ బాబు" అన్నాడు నాయర్.
"ఇంక మొదలు గాబోలు" అనుకుంది ఇందిర. కిందటి సారి వచ్చినప్పుడు తిరిగి రమ్మని పదేపదే చెప్పారు తల్లీ కూతుళ్ళు మరీ. 'ఇక ప్రతి శనివారమూ వీళ్ళు వస్తారన్న మాట' అనుకుంది. తొందరగా మొహం కడుక్కుని డ్రాయింగ్ రూములోకి వెళ్ళింది. ఇద్దరు యువకులకు లేచి నిలబడి నమస్కారం చేసి కూర్చుంది ఇందిర , కొట్టుకునే గుండెలతో ఏదో ఆరాటం మనస్సులో.
"ఇంత ఆలస్యం అయిందెం ఇందూ" అంది మంజుల.
"ఇలియట్ గురించి సాహిత్య సభ జరిగింది " అంది ఇందిర ముక్తసరిగా.
"ఎవరు మాట్లాడారేమిటి?"
"నీహార్ ముఖర్జీ"
"అతనా? బాగా మాట్లాడుటాడని విన్నాను. నిజమా?' అనడిగాడు వాసన్.
"నేనూ ఇదే మొదటి సారి వినడం. ఫరవాలేదు. బాగానే మాట్లాడాడు" అంది ఇందిర, ఇబ్బందిగా కదులుతూ, మాధవరావు కన్నార్పకుండా చూస్తున్న చూపుల కింద. ఇంతలో మంజుల తను మొన్న చూసిన సినిమా గురించి చెప్పడం మొదలు పెట్టింది . గోపాలరావు గారు ఓ పక్కగా కూర్చుని పత్రిక చూస్తున్నారు. ఇందిర అత్తయ్య స్వెట్టరు అల్లుతూ కూర్చుంది వీళ్ళ మాటలు వింటూ. తనూ చేతిలోకి ఓపుస్తకం తీసుకుని చదువుతున్నట్టు నటిస్తూ కూర్చుంది. ఆ సినిమా ఏదో వాసన్ కూడా చూశాడల్లె ఉంది, ఏమిటో అంటున్నాడు. మాధవరావు గొంతు మాత్రం వినబడడం లేదు -- ఒక్కడైనా శ్రోత ఉండాలి కదా! తన వంకనన్నా చూడకుండా నిర్లక్ష్యంగా చేతులో పుస్తకం వంక చూస్తున్న ఇందిర ను చూస్తుంటే పాఠం మీద దృష్టి లేకపోయినా , తప్పనిసరిగా క్లాసులో కూర్చున్న పదేళ్ళ పిల్ల గుర్తు వస్తుంది. తను చూసిన పెద్ద పిల్లకీ, ఈమెకు పోలిక అట్టే లేదు -- బక్క పల్చగా , చామన ఛాయలో కళ్ళ జోడుతో ఉన్న ఈ పిల్ల , అక్క కంటే ఆకర్షణీయంగా ఉంది. కళ్ళల్లో ను, పెదిమల కదలిక లోను, తెలివితేటలు, చురుకుదనం కనిపిస్తున్నాయి. అదే కారణం అయి ఉంటుందనుకున్నాడతను.

"అన్నీ టేబిల్ మీద పెట్టేశాను" అని నాయర్ చెప్పగానే అందరూ లేచారు భోజనాలకి.
భోజనాల దగ్గిర కూడా సాధ్యమైనంత ముభావంగా ఉండడానికి ప్రయత్నించింది ఇందిర. అయితే వాసన్ పట్టుదలకు లొంగక తప్పింది కాదు. తన భోజనం గురించీ, పుస్తకాలను గురించీ అతనడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, మాధవరావు ను మరిచిపోయింది కాసేపు. భోజనాలయి , తిరిగి హల్లో కూర్చుని ఉండగా మాధవరావన్నాడు "అసెంబ్లీ హల్లో రేపో చక్కని నాటకం వేస్తున్నారు వెళదామా?" అని.
"తెలుగా , ఇంగ్లీషా?' అని అడిగింది సుందరమ్మ గారు.
"ఇంగ్లీషండీ. మిల్లర్ అని అమెరికన్ నాటక రచయిత రాశాడు. చాలా బాగుందిట చూసిన వాళ్ళన్నారు."
"నాకు పనుందోయ్ , నేను రాలేను. పిల్లలూ, మీరూ వెళ్ళండి" గోపాలరావన్నారు.'
మంజుల ఆనందంగా సరేనంది.
"మీరూ వస్తారుగా" వాసన్ ఇందిర వంక తిరిగాడు.
"క్షమించండి రాలేను" అంది ఇందిర జవాబుగా.
"ఏం?' కటువుగా అడిగాడు మాధవరావు.
సౌమ్యంగా కారణ మడిగితే ఏమనేదో కాని, 'చేయబోయే రాచకార్యలెమున్నాయని అలా అంటున్నావు ' భర్త అన్నట్టున్న అతని ప్రశ్న విని భగ్గుమంది ఇందిర.
"కొత్త మనుష్యులతో వెళ్ళటం నాకలవాటు లేదు" అంది ఇందిర కోపానికి కళ్ళెం వేస్తూ.
"వెళితే గానీ, పాత ఎలా అవుతారు?' అంటూ నవ్వింది మంజుల.
"కొందరిని చూడగానే పరిచయం ఎక్కువ చేసుకోబుద్దేస్తుంది. కొందరిని చూస్తె , మళ్ళీ జన్మలో కలవబుద్ది అవదు" అంది ఇందిర, అసందర్భంగా ఏదో కఠినంగా అనాలనే తప్ప, ఏమంటుందో తెలుసుకోకుండా.
ఎదురుచూడని ఈ అవమానానికి అప్రతిభుడయ్యాడు మాధవరావు. "మర్యాద తెలియని పిల్ల' అనుకున్నాడు మనసులో.
లేవబోయే ముందు "నువ్వు అడగరాడూ వస్తుందేమో" అంటూ గొణిగాడు వాసన్. మాధవరావు చెవిలో. దగ్గిరే కూర్చున్న ఇందిర, అతనేమంటాడో అని చూసింది.
"మళ్ళీనా? కావలిస్తే నువ్వడుగు, ఆ కోతిని వెంటేసుకుని పోవాలని నాకైతే కోరిక లేదు" అన్నాడతను కొంచెం గట్టిగా. ఎర్రనైన ముఖాన్ని పుస్తకం చాటు చేసుకుంది ఇందిర. "ఎంత మోటు మనిషి -- మరే నీరూ ని గురించి కూడా ఇలాగే అని ఉంటాడు -- ఎంత అహంకారం మనిషికి !' మనసులో అనుకుంది ఇందిర.
* * * *
