Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 19


    యిప్పసారా, నల్లమందు, గంజాయి అడవిజాతివాళ్ళకి పుష్కలంగా దొరుకుతాయి. వేటాడి కడుపునిండా మాంసం తిని మత్తుమందులు వేసుకుని వాళ్ళు సుఖంగా కాలక్షేపం చెయ్యటం అతనికి కడుపు మండిస్తోంది. యేదో ఒక వంక చూచుకుని తడవకూ వాళ్ళమీదికి దండెత్తి వస్తాడు. వాళ్ళు దాచుకున్న మత్తు పదార్ధాలను దొంగిలించుకుపోతాడు. అడ్డుపడిన  కోదుజాతివాడైనా, సవరజాతివాడైనా, కోయజాతివాడైనా చావాల్సిందే.
    అట్లా సాగుతోంది షేర్ ఖాన్ పరిపాలన. అతని చేతిలో చిరికాకుల (శ్రీకాకుళం) రాజమహేంద్రవరం పరగణాలు వున్నాయి. ముఖ్యంగా చిరికాకుల అడవుల్లో వున్న అడవిజాతులవాళ్ళు అంటే అతనికి విరోధులు.
    వెలుపలి ప్రపంచంలోని వెలుగునీడలు, పాపపుణ్యాలూ, నాగరికతలూ వాళ్ళకి తెలియవు. సరిగా బట్ట కట్టుకోవటమే తెలియదు. ఆడవాళ్ళు మగవాళ్ళు మొలమీద చిన్న గుడ్డను అడ్డు కట్టుకుంటారు. అంతే! క్షవరం స్నానం బొత్తిగా తెలియవు. నాగరికత బాగా తెలిసిన మగవాళ్ళు యేడాదికి ఒకసారి గడ్డం గీచుకుంటారు గడ్డనీటిలో యెవరి గుడ్డలు వాళ్ళే నెలకొకసారి ఝాడించుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు మరీ విచిత్రం.
    ఒక మగవాడు ఒక పెళ్ళి చేసుకోవాలి. అది రూలు. యెంతమంది ఆడవాళ్ళనైనా వుంచుకోవచ్చు తప్పులేదు. రెండో పెళ్ళి చేసుకున్నాడో చచ్చాడే కుడంగ్ వురిశిక్ష వేస్తాడు. కుడంగ్ అంటే మతగురువు. గోమంగో అంటే కులపెద్ద అతని అసిస్టెంటు మరొకడుంటాడు. అతని పేరు దొలబెహర. పెళ్ళి చేయించే పెద్దని 'బిబ్సాడి' అంటారు. యీ పేర్లు వాళ్ళ పదవులకి సంబంధించినవి. అయినా వాళ్ళని ఆ పేర్లతోనే పిలుస్తారు.
    మన్యప్రాంతం అడవుల్లో పెళ్ళి అయిపోగానే హనీమూన్ వెళ్ళటం వుంది. అర్ధరాత్రి అయినా, తెల్లవారు ఝాము అయినా, వుదయం అయినా, మధ్యాహ్నం అయినా పెళ్ళి అయిపోయిన తక్షణం బయల్దేరి అడవిలోకి వెళ్ళాలి హనీమూన్ కి. యిది నిర్బంధ హనీమూన్.
    కొన్నాళ్ళు భర్త వేటాడి భార్యని పోషిస్తూ అడవి అంతా తిప్పి చూపించాలి అప్పుడే వాళ్ళ శరీరాలుకూడా యేకం అవుతాయి.
    యిప్పసారా, నల్లమందు, గంజాయి వాళ్ళకి అడవిలో కావలసినంత దొరుకుతాయి యెక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటిమీద వాళ్ళకి యెక్కువ ఆపేక్ష వుండదు. ముక్కుపొడుం దొరికితే పెద్ద పండగ దాని పేరు ముక్కుపొడుం అయినా అది వాళ్ళు తింటారు. అది అనాగరికమయిన అభ్యాసం. అయినా వాళ్ళకి అలా ముక్కుపొడుం తినటం అంటే యెంతో యిష్టం.
    దాని గురించి వాళ్ళు రోగిష్టివాళ్ళు అవుతారు. దరిద్రులు అవుతారు. అయినా ఆ అభ్యాసాన్ని విడిచిపెట్టరు.
    వ్యభిచారం అలవాటు పెద్ద మోతాదులో వుంటుంది. రోగాలు చెప్పనలవికానంత విస్తారం. గంజితో కలిసిన అన్నాన్ని సొరకాయ డొల్లల్లో స్టాకు చేసుకుని తింటారు. వెదురుబియ్యంతో అన్నం తయారు అవుతుంది. దాన్లోకి నంజుడు కంజుపిట్ట మాంసం పిట్టల్ని, నెమలి కన్నులు అలంకారం చేసిన బాణాలతో వేటాడుతారు.
    జీలుగుచెట్టు మధ్యలో వుండేదాన్ని పిండిగా మార్చుకుని దాంతో జావ కాచుకు తాగుతారు సొరకాయ డొప్పల్లో దాన్ని స్టాకుచేసి అడ్డాకు డొప్పల్లో పోసుకు త్రాగుతారు. బాగా క్రొవ్వుపట్టిన జంతువుల్ని వేటాడి ఆ మాంసం ముక్కల్ని యినుప వూచలకి గుచ్చి చింతనిప్పులమీద కాల్చి తేనెలో ముంచుకుని తింటారు. యెంత మజా!
    ప్రతి గ్రామంలోనూ, అది యెంత చిన్నది అయినా ఒక గోమంగో, ఒక దొలబెహర, ఒక కుడంగ్, ఒక బిబ్సాడి వుంటారు.
    గోమంగో గ్రామ పెద్ద, దొలబెహర అతని అసిస్టెంటు, కుడంగ్ కులగురువు. అతడు జీలుగుపిండితో ముగ్గువేసి, దానిమీద కడిమిపూల అలంకారంగా, భయంకరంగా చేసి, అర్ధంకాని భాషలో  మంత్రాలు గొంతు చించుకుంటూ చదివితే భూతప్రేతాలు పరార్  అవుతాయి అని వాళ్ళ నమ్మకం. వాళ్ళకి అతి వ్యభిచారం వల్లా, ముక్కుపొడుంలాంటి అలవాట్లు వల్లా, యిప్పసారా వల్లా, నల్లమందు వల్లా, గంజాయివల్లా, వచ్చిన వ్యాధులన్నీ భూతప్రేతాలు తెచ్చిపెట్టిన పీడలే అనిపిస్తాయి.
    అవన్నీ వదలకొట్టవలసిన వాడు కుడంగ్.
    బిబ్బాడి అంటే ఒక్క పెళ్ళి సందర్భంలో మాత్రమే నిర్వాహకం చేసే పెద్ద. అట్టా బ్రతుకుతున్న కోదు, సవర, కోయజాతుల వాళ్ళనిచూచి మొగల్ ప్రభువుల గవర్నరు షేరు ఖాను అసూయపడుతున్నాడు.
    వాళ్ళమీదికి దండెత్తివచ్చాడు వీరుడు. శిస్తు వసూలట, దానిపేరు సేష్ కష్ షేర్ ఖాను పేష్ కష్ కు తిరుగుతున్నాడని, ఒక పెద్దగ్రామంలో విడిది చేసి ఆ చుట్టుప్రక్కల పదిమైళ్ళ దూరం లోపు వున్న గ్రామాల్ని నాశనం చేస్తున్నాడనీ వాళ్ళకి తెలిసింది.
    వాళ్ళకు యే సంపాదనలున్నాయి కనుక పన్నుకట్ట కలుగుతారు. ప్రకృతి యిచ్చే వనరుతో బ్రతికేవాళ్ళు అజ్ఞానంతో, అనాగరికతలో మగ్గి పోతున్న దురదృష్ట ప్రాణులకు డబ్బు యెలా వస్తుంది?
    కోదుకాని, కోయకాని, సవర కాని కన్పిస్తే వాడిని చంపి వాడి దగ్గర వున్నదంతా లాక్కుపోతున్నారు. వూరు కన్పిస్తే తగలపెడుతున్నారు ఆడవాళ్ళు కన్పిస్తే సైన్యానికి సంతోషం. స్పృహ తప్పి పడిపోయాక కాని ఆమెను విడిచిపెట్టి పోరు.
    అల్లకల్లోలం అయిపోయింది. ప్రాణభయంతో అడవి జాతుల వాళ్ళంతా వూళ్ళు విడిచి అడవుల్లోకి పారిపోతున్నారు. మృత్యువు వాళ్ళ మీద విరుచుకుపడిందని వాళ్ళకి అనిపించింది. వున్నదంతా వదులుకుని పోతున్నారు.
    షేర్ ఖాను దారిలోనే వుంది రంగవాకం. పలాసలో విడిది చేశాడని రంగవాకలో వున్న సవరలకు తెలిసింది. గోమాంగో అందరినీ పిలిపించాడు. నెగడు భగ భగ మండుతోంది వాళ్ళ మనస్సుల్లాగే.
    అందరూ ఆయుధాలు పట్టి కూర్చున్నారు. వాళ్ళల్లో గోమాంగో కూతురు కూచిపోతికూడా వుంది. ఆమె కళ్ళు మండుతున్నాయి. ఒళ్లంతా చింత నెగడులా కాలుతోంది, వుడుకుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS