Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 16


                                     8    
    లలిత తలంటి పోసుకుంది. తన గది ముందు బాల్కనీ లో నిలబడి తలార పెట్టుకుంటుంది . రత్తి నిప్పుల పళ్ళెం ఓ చేతిలో పట్టుకుని మంచం దగ్గిర పెట్టి కిటికీలు జారవేసింది. 'రండమ్మాగారూ సాంబ్రాణి వేసుకుందురు గాని' అంటూ మంచం దగ్గిర కూర్చుంది.
    లలిత మంచం అంచుకి తల వచ్చేలా పడుకుంది. రత్తి ఆ కబురూ యీ కబురూ చెప్తూ పాయిలు పాయిలుగా జుట్టు విప్పి సాంబ్రాణి పొగ పట్టిస్తుంది. జుట్టులోంచి తల మీంచి పైకి లేస్తున్న ఆ ధూపం చూస్తూ పడుకుంది లలిత. గదంతా చిక్కని సువాసనలు అంతటా వ్యాపించాయి. నివురు కప్పిన నిప్పుల పళ్ళెం మంచం క్రిందుగా తోసి 'కూర్చోండమ్మాయి గారు తల్లో కురువేరు పెట్టి అల్లుతాను. సాయింత్రం విప్పేసి బాగా అల్లుకుందురు గాని' అని వళ్ళో పెట్టుకు వచ్చిన కురువేరు బల్ల మీద పెట్టింది. నల్లబడిన ఎండు గడ్డిలా ఉన్న యీ కురువేరు కింత సువాసన! అనుకుంటూ చిన్న ముక్క తీసి ముక్కు దగ్గిర పెట్టుకుంది లలిత. లేచి కూర్చుంది. ఆరిన జుట్టుని దగ్గిరగా తీసి పాయికీ మధ్య చిన్న కురు వేరు ముక్క పెడుతూ జడ అల్లింది. 'సాయింత్రం విప్పేసి అల్లుకోండి. అప్పటికి వాసనంతా జుట్టుకి పట్టేస్తుంది' అంటూ పని ముగిసిందని కాబోలు బయిటికి నడిచింది. ఇటు వంటి సరదాలు అత్తయ్య కీ ఉండేవి అని జ్ఞాపకం వచ్చింది లలితకి. ఎప్పుడేనా ఒకొక్కప్పుడు మొగలి పూలు అమ్మకానికి వస్తే బాగా వాసనా ఉన్నది తీసుకునేది.
    'నవ్వుతారత్తయ్య ' అన్నా వినకుండా ఒక రేకు మడిచి వాలు జడ పైన పెట్టేది. అత్తయ్య ఏమేనా అనుకుంటుందని పెట్టుకు వెళ్ళినా బస్సులో అది కాస్తా తీసేసి పర్సు లో పదేసుకునేది లలిత. పల్లెటూరి గబ్బిలం లాగా మొగలి రేకు మడిచి పెట్టుకోవడం ఏమిటి? అని తోటి స్నేహితులు వేళాకోళం చేస్తారని భయపడేది....మొగలి పువ్వు కొన్న రోజున ఇల్లంతా సువాసనలే..... అత్తయ్య ఎంత కట్టడి చేసినా సున్నితమైన భావాలని చంపుకోలేదు -- ' అనుకుని పాత తమపులు నెమరు వేసుకుంటూ మళ్లా నడుం వాల్చింది మంచం మీద.
    ఆరోజు భోజనాల దగ్గర కూడా బలరాం కనపడలేదు లలితకి. 'ఉదయం తోటలోనే' అనుకుంది.
    'కారేసుకుని టౌను కెళ్ళాడు. భోజనానికి రానన్నాట్ట' అడక్కుండానే లలిత ముఖం పరీక్షగా చూస్తూ చెప్పింది సరళ.
    'అలాగా! పోనీ అమ్మమ్మ గారింటి కెనా వస్తాడా?' అడిగింది లలిత.
    'రాకుంటే ఆవిడ ఊరుకోదు. అయినా పోనిద్దూ రాకపోతేనే నయం ఏమంటావు?' అంది.
    'ఎందుకు? వస్తేనే సరదాగా ఉంటుంది కదా?' ఆశ్చర్యంగా అడిగింది లలిత.
    'మైగాడ్ బలరాం పార్టీలకి వచ్చినా సినిమాకి వచ్చినా కాల్చుకు తింటాడు. ఇంక పోదాం! అంటూ ప్రాణాలు  తీస్తాడు. ఏ పనైనా తగిలి రాకపోవడమే మంచిది' అంది మెరిసే పొడుగాటి తన గోళ్ళ ని పరీక్ష గా చూసుకుంటూ.
    ఏమనాలో తెలియక భోజనం ముగించడం ప్రారంభించింది లలిత.
    'పోనీ కాస్సేపు కూర్చుని వచ్చేస్తే సరి, అంటూ లేచింది.
    'అక్కడికి వెళ్ళాక రా బుద్ది పుట్టదు. అంతా మన వయస్సు వాళ్ళు. కబుర్లూ, పెకాటా, ఒకటేమిటి? ఎంతో హుషారుగా కాలం గడిచి పోతుంది. చూస్తావుగా?' అంటూ తను లేచింది సరళ.
    బలరాం భోజనానికి కూడా రాకుండా ఎందు కెళ్ళిపోయి ఉంటాడు! అనుకుంటూ చదువుకుందుకో పుస్తకం పట్టుకుని-- తన రూమ్ లోకి వెళ్ళిపోయింది లలిత. ఇంకా ఒంటిగంట దాటలేదు. ఎండ బాగా కాస్తూన్నా గాలి కూడా ఉంది. హాయిగా ఉంది. ఎప్పుడు పట్టిందో యిట్టే కునుకు పట్టేసింది లలితకి. మనస్సు శరీరం కూడా ఒకలాగే అలసిపోతున్నాయి-- అన్న సంగతి గ్రహించలేకుండా ఉంది.... ఆ పడుకోవడం ఎంతసేపు పడుకుందో 'అమ్మాయిగారు, లేవండి నాలుగు దాటి పోతుంది . సరళమ్మ గారు రడీ'-- అంటూ లేపుతున్న రత్తి హడావిడికి తెలివి వచ్చి లేచి కూర్చుంది; లేచి కూర్చోడమే తడవుగా జడవిప్పి ముడి వేసి 'వెళ్లి ముఖం కడిగేసుకోండి ....'అంటూ హడావిడి పెట్టింది. లలిత బద్దకంగా ఒళ్లు విరుచుకుంది. 'కాఫీ తెచ్చి పెట్టవె రత్తీ కొంచెం యీ బద్ధకం వదులుతుంది.' అంటూ లేచి కుర్చీలో కూలబడింది.
    రెండు నిముషాల్లో కాఫీ కప్పుతో వంటావిడ వెనక్కాతల రత్తీ ప్రత్యక్ష మయ్యారు.

                                    
    'ఏం చీర కట్టుకుంటావమ్మా?' అంటూ కాఫీ అందించారు.
    'ఏదో ఒకటి సాయింత్రం కదా, తేలికైన దేదో కట్టుకుంటే వచ్చి దానితోటే పడుకోవచ్చు.' అంది లలిత--
    'పిచ్చితల్లీ, సరళమ్మ వోసారి వెళ్లి చూడు మెరిసిపోతుంది!' అన్నారావిడ . అంతా సిద్దంగా వుంది -- త్వరగా తెములుతల్లీ. వెళ్ళే ముందు నాక్కానిపించెం?' అంటూ వెళ్లి పోయారావిడ. గుమ్మాని కవతలే నిలబడి ఉంది రత్తి.
    ముఖం కడిగి అడ్డం ముందు కూర్చుంది లలిత. సన్నని కాటుక రేఖలు దిద్దింది కళ్ళకి. కొసలు గీతల్లాగా లాగడం అంటే నచ్చదు లలితకి. నల్లంచు ఆల్చిప్పల్లాగా ఉన్నాయి కాటుక తీర్చిన లలిత కళ్ళు. కొంచెం పౌడరు రాసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టింది. ముఖాన్ని బిగతీసే చాందుబొట్టు అంటేనే అసహ్యం లలితకి. 'ముఖం చిట్లించుకున్నట్లు నీ స్నేహితురాలికే బోట్టేమిటే' అని అత్తయ్య ఎప్పుడూ వేళాకోళం చేసేది తన కొలీగ్ విమలని చూసి. ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి-- బొట్టు దిద్దుకుంటున్నప్పుడు చెవులకున్న ముత్యాలోక సారి తడి తువ్వాలుతో తుడుచుకుంది. లేచి బీరువా దగ్గిరకీ వచ్చేసరికి కుతూహలం పట్టలేక రత్తి వచ్చేసింది లోపలికి.
    "అమ్మాయిగారూ ఆకుపచ్చ చీర కట్టుకోండి. మీకెంత బాగుంటుంది' అంది-
    'సరెలేవే ,' అంటూ అలీవ్ గ్రీన్ వేంకటగిరి చీర తీసింది. అదే రంగు జాకెట్టు తీసింది.
    చీరకట్టి తలవిప్పి దువ్వుకుని వదులుగా జడ వేసుకుంది. చెవుల మీది జుట్టు లోంచి ముత్యాలు మేఘానికి వెనక మెరుపు ముక్కల్లాగా ఉన్నాయి. జడ ముందుకి వేసుకుని వాసన చూసుకుంది-- 'రత్తీ చూడే ఎంత బాగా కురువేరు వాసన పట్టిందో'  అంది. రత్తి ముఖం నే చెప్పలేదా అన్నట్టు ఆనందంతో విచ్చుకుంది. అమ్మాయి గారి జడ కొస వాసన చూసి కళ్ళు తెలవేసుకుంది.
    'ఇంకేం పెట్టుకోరా అమ్మాయిగారూ.' అంది.
    'నాకాట్టే నగలు లేవే రత్తీ. చాల్లే.' అంటూ జోళ్ళ కోసం లేచి నిలబడింది.
    గుమ్మంలో నిలబడి ఉన్న బలరాం ని అప్పుడే చూసింది -- అనుకోకుండా ఎదురు చూడకుండా అతనలా కనిపించేసరికి లలిత చెక్కిళ్ళు ఎర్రపడ్డాయి--
    'రా బలరాం అక్కడే నిలబడి పోయావెం!' అంటూ కుర్చీ చూపెట్టి తను మంచం అంచున కూర్చుంది.
    'ఏం లేదు లలితా నీకి విద్దామని వచ్చాను రడీయేనా?' అంటూ పల్చగా ఉన్న ప పెట్టి అందించాడు బలరాం.     
    ఆత్రంగా పెట్టి తెరిచి చూసిన లలిత ఆశ్చర్యపడి పోయింది.
    "పగడాలా? నాకెందుకిప్పుడు?"
    "వేసుకుందుకు. ఆడవాళ్ళకి నగలేందుకేవిటి లలితా. బాగున్నాయా?' కూతూహలంగా లలిత ముఖంలోకి చూస్తూ అడిగాడు బలరాం.
    'చాలా బాగున్నాయి. పాతకాలపు ని అనుకుంటాను అవునా?'
    'అవును అమ్మని. ఈ రోజు పార్టీకి పెట్టుకుంటావని వెళ్లి తెచ్చాను.' అన్నాడు. యధాలాపంగా అన్నట్టు అతని కంఠస్వరం ఉన్నా తను పెట్టుకోవాలని అతని కోరిక అన్నది ఆ కంఠస్వరం లో అంతర్లీనంగా తెలుస్తూనే ఉంది.
    'అమ్మగారివా? నాకెందుకు బలరాం. ఈ రోజుల్లో ఇవి చాలా విలువ కలవి. నేనసలే అశ్రద్ధ మనిషిని...' నసిగింది లలిత.
    'ఎప్పటికేనా జాగ్రత్త అలవాటు కావాలంటే ఎప్పుడో ఒకప్పుడు బాధ్యతలు స్వీకరించడం అలవాటు చేసుకోవాలికా; పెట్టుకో .' అన్నాడు జేబు లోంచి సిగరెట్టు తీసి ముట్టించుకుంటూ అగ్గి పుల్లకి దగ్గిర వంగిన అతని తల ఎంతో అందంగా కన్పించింది లలిత కి చూస్తూ కూర్చుండి పోయింది. గదిలో రెండు క్షణాల పాటు నిశ్శబ్దం తాండవించింది.
    పెట్టె మంచం మీద పెట్టి అందంగా కట్టిన పగడాల దండ పైకి తీసింది లలిత కొక్కెం విప్పి కంఠం దగ్గిర పెట్టుకు చూసుకుంది. పాతకాలపు నగకి ఉన్న హుందాతనం ఈకాలం వాటికీ ఎక్కడ్నించి వస్తుంది? జడను తప్పించి మెడ మీద కొక్కిం తగిలించాలని చూసింది ఎంతకీ పెట్ట పడలేదు.
    సిగరెట్టూ పొగ మధ్య నుంచి లలిత అవస్థ గమనిస్తున్న బలరాం -- సిగరెట్టూ బల్లకి చివరగా పెట్టి ' ఇటు తిరుగు లలితా నే పెడతాను' అన్నాడు చేతులేత్తుతూ లలిత నిలబడి వెనక్కి తిరిగింది -- జడ పట్టుకుంటూ. బలరాం మునివేళ్ళ స్పర్శ తో లలిత శరీరం పులకరించింది. ఒళ్ళు గగుర్పొడిచింది. చెంపలు కెంపుల్లాగా తయారై -- చామన చాయ వర్ణానికి కొత్త రంగు నిచ్చాయి.
    కొక్కెం పెడుతూ వంగి, సువాసనలు వెదజల్లుతున్న లలిత జడని వాసన చూశాడు బలరాం. ఒక్కసారి అలాగే వంగి మృదువుగా అందంగా ఉన్న మెడ మీద ముద్దు పెట్టుకుందాం అనిపించింది.
    కాని సాహసించలేక పోయాడు...అదే క్షణంలో గుమ్మంలో చిన్నదగ్గు విన్పించింది. దానితో పాటే 'సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిసనట్టున్నాను అంటూ వెకిలిగా నవ్వుతూ సరళ వచ్చింది మధురమైన క్షణం కాస్తా చేయి జారి పోయిందనిపించింది లలిత కి.
    'నాకో చెంపపిన్ను కావాలి లలితా అందుకని వచ్చెను.' తన రాకకి కారణం చెప్పింది.
    'సారీ నా దగ్గరే లేదే' అంది తన మనసులో చెలరేగిన ఉద్వేగాన్ని అణచుకుంటూ.
    'పోనిలే' అంటూ వచ్చినట్టే వెళ్లి పోయినా సరళ చూసిన చూపులో నడచి వెళ్ళిన తీరులో-- ఎంతైనా కోపం గోచరించింది లలితకి. అది బలరాం కనిపెట్టక పోలేదు.
    'అల్ రైట్! రడీ అయితే కిందికి రా లలితా. ఓ పది నిముషాల్లో బయల్దేరి పోదాం-- అంటు అందంగా లలిత మెడని అలంకరించిన పగడాలని  చూస్తూ.
    "మా అమ్మ చనిపోయేదాకా ఎప్పుడూ తియ్యలేదట యీ పగడాలు. అమ్మకి ఎంతో జహ్వారి ఉంది. అయినా ఇది ఆవిడ కిష్టమైన నగ. అమ్మమ్మ గారింట అన్నీ ఉన్నాయి. ఈమరేప్పుడైనా చూపిస్తాను.' అన్నాడు బలరాం.
    'అయితే వెళ్లి తెచ్చారా!' ఆశ్చర్యంగా అడిగింది లలిత. అవునన్నట్టు నవ్వుతూ తలవూపాడు బలరాం.
    ఒక్కసారతన్ని కౌగలించి 'థాంక్యూ' అనాలన్నంత ఆవేశం వచ్చింది లలితకి. లలిత కళ్ళు మిలమిల మెరిశాయి.
    'థాంక్యూ బలరాం. నా ప్రాణం కంటే జాగ్రత్తగా చూసుకుని రేపే వీటిని నీకు తిరిగి అప్పగించేస్తాను.' అంది తల వాల్చుతూ.
    "నీకెంతో అందంగా ఉన్నాయి లలితా. పాతకాలపువీ నాటి వాళ్ళు ఫాషను కాదంటారని భయపడ్డాను.'
    'నో, నో వాటి కున్న అందం వేటి కొస్తుంది? నాకు నచ్చాయి.' ఆప్యాయంగా పగడాలని తాకుతూ అంది లలిత. 'నువ్వు పెట్టావు కనుక మరీ నాకు దగ్గరయ్యాయి. నువ్వు తాకిన యీ పగడాలు నా మెడ మీద వెచ్చగా నీ నిట్టుర్పులాగా, నీ వూపిరి లాగా ఉన్నాయి బలరాం, నీకెలా చెప్పగల్గుతాను?' అనుకుంది.
    బలరాం వెనకాలే తలుపులు జేరవేసి మెట్లు దిగడం ప్రారంభించింది లలిత.
    మెట్ల కింద పూలదండ పట్టుకు నిలబడ్డ రత్తి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇద్దర్నీ. అమ్మాయిగారూ పూలు పెట్టేసుకోండి అని అందించింది.వేసుకుని
    హల్లో సరస్వతమ్మ సరళ అసహనంగా నిలిచి ఉన్నారు. రత్తి గొంతు వినగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది సరస్వతమ్మ.
    'అదేమిటి లలితా ఆ నూలుగుడ్డ కట్టుకు తయారయ్యావు?' అంది గెడ్డం మీద చేయి వేసుకుని.
    లలిత నవ్వేసి ఊరుకుంది -- రత్తి కేసి చూసి.
    రత్తికి , వింటేనా కోపం వచ్చింది సరస్వతమ్మ మీద.
    'అదేంటమ్మగోరూ చిలకమ్మనా గున్నారు అమ్మాయి గారు.' అంది.
    'నీ సెలక్షనా! రామరామ! పని మనిషి కోసం బట్టలు కట్టుకోడం మొదలు పెడితే తెమిలినట్టే ' అంది సరస్వతమ్మ.
    'నాకూ ఇదే ఇష్టం- రండి వెడదాం అంది లలిత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS