Previous Page Next Page 
మారిన విలువలు పేజి 15

                              

    దారి పొడుగునా సాంబశివం అన్న మాటలే జానకి మనసులో మెదులుతున్నాయి. "వాడు అలాటి పని చెయ్యగా లేనిది....' ప్రకాశం చేస్తున్న పని సిగ్గు మాలిన పని అని, అది వాడు చెయ్యగా లేనిది వాడు నా తమ్ముడు అనుకొందుకు నే సిగ్గు పడతానా? అని సాంబు ప్రశ్నించుకొంటున్నాడు.
    నిజంగా ప్రకాశం చేస్తున్న పని సిగ్గు మాలిందేనా? మనిషి దేనికి సిగ్గుపడాలి? సోమరిగా ఇతరుల పై ఆధారపడి బ్రతికేందుకు సిగ్గు పడాలి. పని చేసుకు బ్రతక గలిగిన శక్తి ఉండీ, అడుక్కు తింటే సిగ్గుపడాలి. లేక దొంగతనంగా పై వాళ్ళ సంపదను అనుభవిస్తే సిగ్గుపడాలి. కాని ప్రకాశం అటువంటి పనేం చెయ్యలేదే? అరవై రూపాయల కోసం పగలల్లా ఆఫీసులో చాకిరి చేస్తే గౌరవం; అదే సొమ్ము కోసం ఇంటింటి కి తిరిగి పేపర్లిస్తే , లేక ఇంకో విధమైన కాయకష్టం చేస్తే అగౌరవం ఎలాగవుతుంది? రెండింటికి పరమార్ధం ఒక్కటే. అదే ధనార్జన. దానికోసం అందరూ తలో వృత్తినీ, వారి మానసిక , శారీరక ప్రవృత్తిని బట్టి తెలివి తేటల్ని , అవకాశాలను బట్టి ఎంచుకొంటారు.
    గౌరహ గౌరవాలను డబ్బు ను పట్టి కోలుచుకొన్నా కొంత నయం. కాని ఇద్దరు చేస్తున్నపని బ్రతికేందుకే అయినప్పుడు, ఇద్దరూ పైవారి అజ్ఞాలను పాలిస్తూ పని చేస్తున్నప్పుడు,గుమస్తా పని కన్న కాయకష్టం చేసేవాడి పని హీనం అని ఎలా చెప్పగలం? ఈ రోజుల్లో తాలూకా ఆఫీసులో లోవర్ డివిజన్ క్లర్క్ కన్నా ఒక రైల్వే లైసెన్సు కూలీ ఎక్కువ గణిస్తున్నాడెమో? ఆత్మాభిమానం,స్వేచ్చ లెక్కలోకి తీసుకొన్నా, ఈ కులీ కన్నా,ఆ గుమస్తా అధికంగా పొందుతున్నాడని చెప్పలేము. కాని లోకం దృష్టిలో గుమస్తా ఉద్యోగానికి ఉన్న విలువ , గౌరవం కూలీ, నాలీ చేసేవారికి లేదు. కారణం ఏమిటి?
    రాత్రి పక్కమీద దొర్లుతూ కూడా జానకి ఇదే ఆలోచించింది. ఎప్పుడో ఆమెకు తెలీయకుండానే ఆలోచనలను తోసుకుని నిద్ర ముందుకు వచ్చింది.
    జానకి గత దినపు చాయాలలో తిరుగుతుండగానే ప్రకాశం వచ్చేడు. తనకోసమే ఎదురు చూస్తున్నట్లు, వీధి అరుగు మీద నిలబడ్డ అక్కను చూసి, ఇంక తను బయలుపడక తప్పదనుకున్నాడు.
    "ఏం అక్కయ్యా! ఇంకా నీ ఆఫీసుకు వేళ కాలేదా, ఇలా తాపీగా పచార్లు చేస్తున్నావు?" అన్నాడు.
    "నీకోసమేరా" అన్నది నెమ్మదిగా.
    ప్రకాశం మాట్లాడలేదు. అక్క నోట రాబోయే ఇంకొక మాట కోసం ఎదురు చూస్తున్నాడు.
    "నిన్నుఒక విషయం అడిగి తెలుసుకుందామని." లోపలికిదారి తీసింది జానకి.
    "సాంబు చెప్పేడా?' ప్రకాశం అక్కను అనుసరిస్తూ ప్రశ్నించేడు.
    'అవును. చెప్పేడు. అందుకే."
    "వినగానే నీకేమనిపించింది, అక్కా? ఏమిటీ దౌర్భాగ్యుడు ఇలాటి పని చేపట్టాడనుకొన్నావా?లేక బ్రతక నేర్చిన బండబ్బాయి అనుకొన్నావా?"
    "ఏమనుకొందికీ నీ అభిప్రాయం ,నీ ఆశయం నా కింకా స్పష్టంగా తెలియందే?నువ్వు పట్టిన మార్గం గురించి నాకు చింత లేదు.అది నిన్ను ఎంతవరకు తీసుకు పోగలదనే నేనాలోచిస్తున్నాను."
    "అది నన్నుతీసుకుపోయే దేమిటి, అక్కా? నేనే దాన్ని నడిపిస్తాను. పరుగులు పెట్టిస్తాను. గమ్యం చేరేదాకా కాలు అగనివ్వను."
    "నీ గమ్యం ఏమిటి, ప్రకాశం?"
    "ఈ ప్రపంచంలో పుట్టినఅందరికీ వేరు వేరు గమ్యాలు లేవు అక్కా! అందరి గమ్యం ఒక్కటే --  సుఖంగా బ్రతకడం. అయితే, నీకేపటి ఇల్లు కావాలో నిర్ణయించుకొని మరీ పునాదులు తీసుకొంటావు. ఓటి పునాదుల మీద పెద్ద భవంతి కడితే అది కూలి పోతుంది. చిన్న ఇంటికి పెద్ద పునాదులు తీస్తే నీకున్న డబ్బు కాస్తా ఆ పునాదులే మింగేసి ఇల్లు కట్టుకొందికి ఇంకేం మిగల్చావు.
    "అలాగే ఈ సుఖజీవనం అన్న పదానికి కూడా మనకి తగినట్లు అర్ధం చెప్పుకోవాలి. నా మట్టుకి నాకు, ఒకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరి ముందు చెయ్యి జాపకుండా జీవితం గడిచి పొతే చాలు, చేతనైతే ఇంకొకరికి సహాయం చేస్తాను. లేకపోతె నా బ్రతుకునే బ్రతుకు తాను. బ్రతికినంత కాలం నా అడుగు ముందుకే పడాలి. అదే నా ఆశయం. గమ్యం." అన్నాడు ప్రకాశం.
    జానకి మాట్లాడేలోగా కూరల సంచితో సూర్యారావు చమటలు కార్చుకొంటూ ఇంట్లోకి వచ్చేడు.
    "జానకీ, అమ్మా! ఈ మాట విన్నారా?" అని సూర్యారావు ఉద్రేకంగా గావు కేకలు పెట్టేడు.
    "ఏం సంగతి రా? ఏం జరిగింది?" సుందరమ్మ వంట ఇంట్లో నించి పరుగున వస్తూ ప్రశ్నించింది.
    "ఈ దౌర్భాగ్యుడు ఇంటింటికి పేపర్లు పంచి పెడుతూ తిరుగుతున్నాడుట." ప్రకాశం వైపు మింగేసెంత కోపంగా చూస్తూ అన్నాడు.
    "ఎవరురా? ఏం పేపర్లు రా?"
    "ఇంకెవరో అయితే నాకీ గోల ఎందుకే? నీ ముద్దుల కొడుకు ప్రకాశమే. వీధిలో కనిపించిన తెలిసిన వాళ్ళంతా ఒకటే అడగడం. అదేమిటయ్యా , సూర్యారావూ, మీ తమ్ముణ్ణి అలా వదిలేశావు? ఇంత పుట్టుక పుట్టి ఇలాటి పని చేస్తాడా? ఎవరో అలగావాడిలా ఇంటింటికి తిరిగి, పేపర్ , పేపర్! అని కేక వేస్తుంటే ఎంత అపఖ్యాతి! అని బజార్లో అంతా నిలదీస్తుంటే ఏం చెయ్యమన్నామ్మా!
    "ఇంతకాలం వీడికి తిండి పెట్టి మేపింది, ఇటువంటి వెధవ పనులు చెయ్యడానికా? ఎలాగైనా మెట్రిక్యూలేషన్ పాసైతే మా ఆఫీసులో పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకొని, ఏదో ఒక ఉద్యోగం వేయిద్దామనుకొన్నాను.  పోనీ, స్కూలుకి పోవడం చిన్నతనమైతే ప్రైవేటు గా అయినా కట్టి పాసవరా అని నేను మొత్తుకుంటుంటే వినకుండా, నేను నలుగురిలో బుర్రేత్తుకోలేని పనులు చేస్తాడా?
    "ఇదా వీడు నాకు చేస్తున్న ఉపకారం? చిన్నప్పుడు వీడి నెత్తుకొని మోసినప్పటి కాయలింకా నా చేతుల మీదున్నాయి. శాంత పుట్టినప్పుడు నీకోసం ఏడుస్తుంటే, భుజం మీద వేసుకొని రాత్రల్లా తిప్పి నిద్ర పెట్టేవాడిని, ఏరోజైనా నాన్నగారు నాకు అణా నో బేడో ఇస్తే నే కొనుక్కొని తినకుండా వీడి క్కోసం.... ఈ వెధవ కోసం పిప్పెర మెంట్లు , బిస్కెట్లు కొని తెచ్చేవాడిని. వీడిని వెనకేసుకొని నాన్నచేత ఎన్నిసార్లు......
    'అంత కంటక పడవలసిన సంగతి ఏముందన్నయ్యా ఇందులో?" అన్నగారి వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది జానకి.
    "కంటక పడిందికి ఇందులో ఏం లేదా? కోపగించుకొందికి ఏం లేదా ? నీకూ అలాగే తోస్తున్నదా తల్లీ!"
    "అనవసరంగా ఆవేశపడకు, అన్నయ్యా! ప్రకాశానికి చదువు రాలేదని నువ్వే అంటున్నావు కదా! మరి బ్రతికిందికి ఏదో ఒక వృత్తి చూసుకోవాలా, వద్దా. ఎంతకాలం నువ్వు పెట్టగలవు? నువ్వు  ఔదార్యం తో పెట్టినా, అన్నం తిని బట్ట కడుతున్న మనిషి ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడి బ్రతకగలడు?"
    "అంటే నా అవసరం లేకుండా ఈ పేపర్లమ్ముకోని  నీ తమ్ముడు బ్రతికేయగలడను కొంటున్నావా?"
    "అన్నయ్యా, బ్రతుగలడో, లేడో కాలం గడుస్రే కాని తెలియదు. కాని బ్రతకాలనే వాంఛ ,మాత్రం ఉంది. ప్రయత్నం చెయ్యాలనే పట్టుదలా ఉంది. అనుకున్నట్లు జరుగక అవసరం వస్తే నాకు నువ్వు  నీకు నేను కాకుండా పోతామా? అన్నదమ్ముల మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుండా పోతాయా?"
    తమ్ముడి వైపు చూసి హేళన గా నవ్వేడు సూర్యారావు. "పేపర్లు అమ్ముకొంటూ నువ్వు సొమ్ము గడింఛి నాకు పంపుదువు గాని. మా తమ్ముడు పంపేడని నేను రెండు చేతులా అందుకొంటాను."
    "ఏమోరా! ఒక్కొక్క దశలో నవ్విన ఊళ్ళే పట్నాలవుతాయంటారు. మా మేనమామ మనుమడు వీడిలా చదువు సంధ్య లేక తిరుగుతుండేవాడు. ఆవెనక ఎవరో చెప్పగా పేపరు మిషను పెట్టి , లక్షలు గడించేడుట, మన ప్రకాశం రాతెలాగుందో!"
    "నక్కకీ నాగలోకానికి సామెతేమిటమ్మా! అతను వేలకి వేలు పెట్టుబడి పెట్టి ప్రింటింగ్ ప్రేసు పెట్టుకొన్నాడు. వ్యాపారం బాగా సాగి లక్షలు గడించాడేమో? వీడికే ముంది? మూతి మీద మీసమైనా లేదు.
    అన్నగారి ఆఖరి మాట విని కులాసాగా నవ్వుకున్నాడు ప్రకాశం. "ఈరోజు నుంచి మంచి మీసం పెంచుతానన్నయ్యా! ఎప్పుడైనా అవసరం పడితే, దాన్ని నీ దగ్గర అయివేజుగా పెట్టి సొమ్ము తీసుకొంటాను."
    'చూసేవమ్మా వీడి పోగరేలా ఉందో?"
    "ఏమిటిరా , ప్రకాశం! పెద్ద చిన్న చూసుకోకుండా నోటికెంత వస్తే అంతా అని ఊరుకోడమే!' సుందరమ్మ మందలించింది.
    "నా పెట్టుబడిని గూర్చిన బెంగ అన్నయ్యకి అక్కర లేదమ్మా! నా నీతి, నిజాయితీ ని , కష్టించి , పట్టుదలతో చేసే పనిని పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేస్తాను. నాకు శుభం కలుగుతే నన్ను చూసి మరి కొందరైనా ఈ ఊబి లోంచి బయటపడతారు." అన్నాడు ప్రకాశం.

                              *    *    *    *
    ఆ ఊబి లోంచి బయట పడ్డానికి ప్రయత్నిస్తున్న ప్రకాశాన్ని చూసి చాలా మంది విచారించలేదు. కొందరు తమ సానుభూతి చూపించేరు. "ఛీ, ఛీ! పిదపకాలం , పిదప బుద్దులు! ఇటువంటి పనులు చెయ్యడం వాళ్ళింటా, వంటా ఉందా!" అని చీదరించుకొన్నారు మరికొందరు.
    "కక్కుర్తి పడినా, కడుపైనా నిండాలి. దీనితో వై=వీడి బతుకు గడుస్తుందా? కాళ్ళరిగేలా తిరిగితే మహా ఇస్తే రూపాయో, అర్ధో ఇస్తారు. దానితో ఏమైనట్లు? హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఏ కోమటి కొట్లోనో నౌకరీ చూసుకొంటే పోలా?" అని వ్యాఖ్యానించేరు కొందరు.
    తమ్ముడు పేపర్లమ్మి జీవిస్తానన్నప్పటి నుండి సూర్యారావు కుతకుత ఉదికిపోతున్నాడు. "ఏదో నాకింత కన్న ఏ పని చెయ్యడం చేతకాదు. నీలా ఉద్యోగం చేసింది కి చదువు సంధ్యలేదు. నా పడివాట్లేమిటో నన్ను పడనీ, అన్నా!' అని నిదానంగా చెప్తే సూర్యారావుకు అంత అక్కసు లేకపోవును.
    "గౌరవప్రదమైన గుమస్తా గిరి వెలిగించి నువ్వు ఆర్జిస్తున్నపాటి నేనూ ఆర్జించగలను. కాకపొతే గాలి, వెలుతురూలో తిరుగుతూ నాలుగు రకాల మనుష్యుల్ని చూస్తుంటాను కాబట్టి, జీవితాన్ని నీకన్న బాగా అర్ధం చేసుకొనే అవకాశం నాకుంటుంది.
    "నేను చెడి పోతానన్న భయం నాకు లేదు, అన్నయ్యా! నమ్మికతో కష్టపడి మనిషి ఏ పని చేసినా అపజయం అతని చాయాలలోకి రాదనీ నా నమ్మకం. నేను పిరికి వాడిని కాను. కాలం ఓడిన పందాన్ని ఎదిర్చి, నిలిచి గెలుచుకొంటాను." అని భీకరాలు పలుకుతుంటే, తనను , తన ఉద్యోగాన్ని హేళన చేస్తుంటే సూర్యారావు కు అరికాలి మంట నెత్తి కేక్కేది.
    ఇంట్లో తల్లి దేనికోసమైనా సొమ్ము అడిగితె, "అన్నిటికి నామీద పడతావెం? ఆర్జనపరుడు నీ చిన్న కొడుకు నడుగు. నా జీతమనగా ఎంత? నేనెంత? వాడి సిగరెట్ల కి, కిళ్ళీ లకి అయినంత ఉండదు" అనేవాడు.
    "ప్రకాశం సిగరెట్లు కాలుస్తున్నాడా?" తల్లి ఆత్రుత చూసేది.
    "లేకపోతె ఆ అప్పన్నతో పొత్తు ఎలా కలిసిందంటావు? వీడికి వాడు ఎందుకు డబ్బు మదుపు పెడుతున్నాడు? ఏవో కొన్ని పత్రికలకి ఏజెన్సీ లు తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడుట. మంచిదే, మంచిదే. వాడు బాగుపడితే నాకు సంతోషం కాదేమిటి?" అనేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS