"వెధవ సణుగుడు చలించి, వెళ్ళు. చెప్పిన పని చేతగాక ఏమిటో చెబుతున్నాడు." గట్టిగా కసురు కొన్నాడు.
"నేనేం చెయ్యనండీ, ఆమెగారు పంపించనప్పుడు?" గొణుగుతూ వెళ్ళిపోయాడు పడుకోడానికి, వాసు.
పక్కన బాబులేనిది నిద్రపట్టేట్లు లేదు కళ్యాణ్ కు. బాబుమీద చెయ్యివేసుకొని పడుకొనే అలవాటు అతడికి. గోకుల్ లేకపోవడంతో పక్కన దేనినో వెదుకుకొన్నట్లుగా ఉంది. అసలు రెండు రోజులుగా గోకుల్ కు దూరంగా ఉండి ఇంటికి వస్తే అతణ్ణి చూచుకోకుండా రూపకల్పించిన ఈ అవాంతరం కళ్యాణ్ కు దుస్సహంగా ఉంది. గోకుల్ వియోగం దుర్భరమవుతూన్న కొద్దీ అతడికి రూపపై ఉండే క్రోధద్వేషాలు రెట్టింపు అవుతున్నాయి.
పక్కమీద మేను నిలవక లేచి గదిలో పచార్లు చెయ్యసాగాడు. కాస్సేపటికి పచార్లు కూడా ఆపి డ్రెస్ వెసుకొని బయటికి వచ్చాడు.
తమ్ముడి అవస్థ అంతా కనిపెడుతూనే ఉన్న కృష్ణ ప్రియ గదిలోనించి బయటికి వచ్చింది.
"ఎక్కడికి, కృష్ణా?"
"అక్కడికే బాబులేనిది నిద్రపట్టేట్లు లేదు ఈ రాత్రి."
"టైం ఎంత అయిందో తెలుసా?"
"పన్నెండు."
"ఏమిటీ అపరాత్రిప్రయాణం? ఆమె మర్యాదస్తుల ఇంటిపిల్ల ఆప్తులెవరూ దగ్గిర లేకుండా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంటికి ఇంత రాత్రివేళ నువ్వు వెళ్ళడం బుద్ధిమంతుడి లక్షణంగా ఉందా? ఏం మునిగిపోయిందని నిద్రపోయినవాన్ని లేపుకురావడం ఈ రాత్రి?"
అక్కగారి మాటలు వినేస్థితిలో లేడు కల్యాణ్ గారేజీలోంచి కారు తీశాడు.
"నీ తిక్క నీది నా మాట ఎందుకు వింటావు? చల్లగా చలిగా ఉంది. బనీను వేసుకొని మఫ్లరు చుట్టుకో చెవులకు." ఇంట్లోకి వెళ్ళి తీసుకువచ్చేసరికే కళ్యాణ్ కారు గేటు దాటింది.
'అయ్యో భగవంతుడా! వెర్రికోపంతో వెళ్ళి ఈ రాత్రి రూపను ఏం నొప్పించివస్తాడో కదా, వీడు!' అనుకొని నిట్టూర్చింది.
హేమంత ఋతువు, గజగజలాడించే చలి. చల్లగా మంచు కురుస్తూంది. కదిలితే కొరుక్కుతినేటట్లున్న ఆ చలిబాధ కల్యాణ్ కు తెలిసినట్లు లేదు. కారు రూప ఇంటిముందు ఆపి వెళ్ళి తలుపు తట్టాడు.
నిద్రకళ్ళతో తలుపు తీసింది రూప. "మీరా?!"
"బాబును తీసుకుపోవడానికి వచ్చాను." ద్వారంలో నిల్చున్న రూపను రాసుకొంటూ లోనికి వెళ్ళాడు కళ్యాణ్.
"గాఢ నిద్రలో ఉన్నాడు బాబు. నిద్రాభంగంచేసి తీసుకువెళ్ళడమేమిటి? ఇంతరాత్రి.... ఈ చలిలో..."
"అహఁ. తీసుకువెళ్ళడానికే వచ్చాను.....అసలు, మీరు ఎవరి అనుజ్ఞతో బాబును తెచ్చుకొన్నారు?"
కళ్యాణ్ పరుష కటుధోరణికి తలవాల్చి నిల్చుంది రూప.
నచ్చగా ధోమతెరలో పట్టె మంచంమీద పడుకొని ఉన్నాడు గోకుల్. అతడికి కప్పిన శాలువా తొలగించి నెమ్మదిగా భుజంమీదికి ఎత్తుకొన్నాడు. గోకుల్ చెవులకు చుట్టిన మఫ్లరు ఊడి పడింది కింద. అందుకో కుండానే వెళ్ళిపోయాడు కళ్యాణ్. వెనక నిలువునా మనిషి విసురుగా నడిచిన శబ్దం వినిపించినా అతడు ఆగలేదు.
* * *
"అమ్మగారు పంపించారండీ, నన్ను."
"ఎందుకు?"
"బాబును తీసుకు రమ్మన్నారండి. ఇవాళ సెలవట. ఇంట్లోనే ఉంటారట. ఒక్కదానికీ ఏం తోచడంలేదని బాబును తీసుకురమ్మన్నారండీ. సాయంత్రం అమ్మగారే తెచ్చి దిగబెడతరాట బాబును."
"డాక్టరుగారు పంపించనన్నారు, బాబును - అని చెప్పు."
"సాయంత్రం తీసుకువస్తారట. ఏమిటో, ఆ అమ్మగారికి నల్లమాలిన ప్రేమ పిల్లలంటే. మీ బాబు గారిమీద ఇంకా మక్కువ, అమ్మగారికి."
"అయితే?" కొరకొరా చూశాడు. "పంపించనని చెప్పు. పొద్దుపోకపోతే, పిల్లలతో ఆడుకోవాలనుంటే బజార్లో ప్లాస్టిక్ బొమ్మలు బోలెడన్ని దొరుకుతాయి. ఎన్ని కావలిస్తే అన్ని తెచ్చుకొని చుట్టూ పెట్టుకొని ఆడుకోమను. పిల్లలంటే వల్లమాలిన ప్రేమ ఉన్నది. మంది పిల్లలకు ఎగబడేబదులు మెడలో మూడుముళ్ళు వేయించుకొంటే ముందుకల్లా ముత్యాల్లాంటి బిడ్డ నెత్తుకోవచ్చునే!"
"కృష్ణా!" కోపంగా అరిచింది కృష్ణ ప్రియ. "ఇష్టముంటే పంపించు: లేకుంటే లేదు. వచ్చిన మనిషితో ఏమిటా వెక్కిరింపులూ, ఎకసక్కాలూ? మంచీ మర్యాదా మంటగలిసి పోతున్నాయి, గోకుల్ వ్యామోహంలో పడి. ఆ సంస్కారమూ, సహృదయతా ఏమయిపోయాయో తెలియడం లేదు. మోటు తేలావు!"
"నా ఇష్టం. గోకుల్ నావాడు."
"గోకుల్ నీవాడు కాదని ఎవరన్నారు? ఊరికే రోడ్డుమీద పడిన వస్తువుపై బాటసారుల కందరికీ హక్కు ఉంటుంది. ఒకరి చేతిలో పడ్డాక ఎవరికీ హక్కు ఉంటుంది?"
"అదీ నాకు కావలసింది.'
"ఏమిటో వెర్రి మతంలో పడిపోయావు, కృష్ణా! చూస్తూ భరించలేను. ఒక ఇంటివాడివి కాగల గీత లేనట్లుంది, నీకు. అదే లేకపోయాక నా ప్రయత్నాలేం ఫలిస్తాయి? నీ ఇష్టం. గోకుల్, గోకుల్ అంటూ గోకుల్ ను నెత్తిన పెట్టుకొని ఊరేగు. నేను ఈ రెండుమూడు రోజుల్లో నా ఊరికి వెళ్ళిపోతున్నాను." తమ్మున్ని బెదిరింపజూచిన అక్కగారే బెదిరిపోవలసి వచ్చింది, అతడి సమాధానం విని.
"నీ ఊరికి నువ్వు వెళ్ళిపో, నేనూ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకొంటున్నాను, గోకుల్ ను తీసుకొని. అందుకు ఏర్పాట్లు ప్రారంభించానుకూడా."
8
"చీకటి పడింది తెలియదా, కృష్ణా? లైటు వేసుకోకుండా గదిలో ఏం చేస్తున్నావ్?" ఆశ్చర్యపోతూ కళ్యాణ్ గదిలోకి వచ్చింది కృష్ణప్రియ.
"గోకుల్...నా గోకుల్..." కంసితగాత్రంతో పలకరిస్తూ సన్నగా రోదిస్తూన్న ధ్వని విని అదిరిపోయిన కృష్ణప్రియ, "ఏమొచ్చిందయ్యా?" అంటూ లైట్ వేసింది.
గోకుల్ ను వక్షస్థలంపై పడుకోబెట్టుకొని అబల భాగా రోదిస్తున్నాడు కళ్యాణ్ కన్నీళ్లు చెంపలమీద కాలవలు కట్టాయి.
"ఏమిటిది, కృష్ణా? ఏమైందయ్యా?" హడలెత్తి పోతూ, అతణ్ణి తట్టింది.
"గోకుల్!" అంటూ బావురుమన్నాడేగాని మాట పెగలలేదు కళ్యాణ్ కు.
అతడు ఉన్న దయనీయస్థితికి కారణం తెలియక కృష్ణప్రియకు మతిపోయినట్లనిపించింది. "గోకుల్ కు ఏమైందిరా? హడలెత్తించిపంపక చప్పున చెప్పరా!"
"....................." గోకుల్ ను గుండెలకు ఇంకా ఇంకా గట్టిగా అదుముకొని ఏడుస్తూనే ఉన్నాడు.
అయోమయంలో పడిపోయిన కృష్ణప్రియకు గదిలో చెల్లాచెదురుగా పడిఉన్న కాగితాలేవో కనిపించాయి. అన్నీ ఏరి వరసగా పెట్టి టేబుల్ మీద ఉన్న గుండుసూది గుచ్చి చదవడానికి ఉపక్రమించింది ఆత్రంగా, తమ్ముడి దైవ్యావస్థకు కారణం అందులోనే ఉందన్న నమ్మకంతో.
"శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారూ!
మీకు వ్రాస్తున్నది లేఖే అయినా తెలియజేసేది ఒక విధివంచిత భగ్నప్రణయగాథ. సంఘభీతిచే కన్నబిడ్డకు దూరమై దుర్భర కఠోరశోకంతో కుమిలి కృశించి పోతూన్న ఒక మాతృమూర్తి కరుణబాష్పగాథ.
తొలి పర్వంలోని స్త్రీకి భర్త చనిపోతే సంఘం కొండంత సానుభూతి ప్రకటిస్తుంది. 'అయ్యో! చిన్నది, పాపం!' అంటారు.
అటువంటి సానుభూతి నోచుకోడానికి నేను వివాహిత స్త్రీని కాదు. ప్రేమకు పెళ్ళి ప్రమాణం కాదని భావించిన నేను వివాహం కాకముందే వలచి వలపించుకొన్న పురుషుడికి ఆత్మార్పణంతోపాటు దేహార్పణం కూడా చేసుకొన్నాను. కలిసి జీవించడానికి వివాహబంధం పడేలోగా అతణ్ణి విధి క్రూరసర్పమై కాటువేసి నానుండి విడదీసింది. మూడుముళ్ళ బంధం పడకుండానే శీల భంగం పొందాను కనక పతితను. ఆ విధవకు ఉండే సానుభూతి గౌరవాలు ఈ మానహీనకెక్కడ? ఓహ్! ఏమి చిత్రాలీ సంఘధర్మాలు!
ఆ విధవకు ఉండే శోకసంక్షోభాలు ఈ పతిత అనుభవించదా? అయితే సానుభూతిమాత్రం ఒకరికే!
'నువ్వు చేసింది పాపం. శిక్ష అనుభవించవలసిందే' అన్నట్టు, విధి కఠోరశాపంలా జరిగినగాథ మాసిపోయినా మచ్చగా, నా కళంకితజీవితానికి ప్రత్యక్షనిదర్శనంగా వెల తప్పింది. అబ్బా! విధి వింతచేష్టల్లో ఎంత క్రౌర్యం!
నన్ను పట్నం పంపించి కాలేజీ చదువులు చదివించడానికి అమ్మానాన్నలకు ఎంతమాత్రం ఇష్టంలేదు. వారికి నేనూ, అన్నయ్యే సంతానం. ఆడపిల్లనని నేనంటే ప్రేమ అధికం, అమ్మా నాన్నలకూ, అన్నయ్యకూ. ఎంత ధనసంపద ఉన్నా మగవాడికి విద్యాసంపదకూడా ఉండాలి కదా? అన్నయ్యను బస్తీ పంపించి చదివించక తప్పదు, ఎంత విడిచి ఉండలేకున్నా. కొడుకును పంపించి, బిడ్డనుకూడా పంపించి ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు అమ్మా, నాన్నా. 'ఆడపిల్ల కేమిటి చదువులు? ముచ్చటగా మూడుముళ్ళు వేయించి ముద్దుముచ్చటలు చూసుకొంటాం' అన్నారు. నేను మంకు పట్టుపట్టి కూర్చోవడంవల్లా, తనూ నన్ను విడిచి ఉండలేకపోవడంవల్లా తనతోపాటు ఉంచి చదివించడానికి బలవంతాన ఒప్పించాడు అమ్మానాన్నలను, అన్నయ్య.
అన్నయ్య ఎమ్. ఎ పాసయ్యాడు. ఇంక రెండు సంవత్సారాలలో పూర్తి కానున్న నా చదువుకోసం లెక్చరర్ గా ఉద్యోగం వేయించుకొన్నాడు మా కాలేజీలోనే. ఉద్యోగం తాత్కాలికమే. తరవాత వదిలేసి స్వగ్రామంచేరి ఇంటి వ్యవహారాలు చూచుకోవాలని అన్నయ్య ఆకాంక్ష! నాన్నకు వృద్దాప్యం పైపైన పడుతూంది మరి!
సెలవుల్లో ఇంటికి వచ్చాం నేనూ, అన్నయ్యా వచ్చిన రెండో రోజో, మూడో రోజో అనుకొంటా-ఉదయం నాన్నతో, అన్నయ్యతో కలిసి కాఫీ తీసుకొని నాన్న దినపత్రిక తిరగవేస్తూంటే ఊరికేనే కూర్చున్నాను, వరండాలో, అన్నయ్య పొలంకేసి వెళ్ళాడు.
'నమస్కారమండీ!'
నాన్న తలఎత్తి చూచి, పత్రిక మడుస్తూ, 'రావోయ్ కిషన్! బాగున్నావా? చాలా రోజుల తరవాత నీ ఊరు గుర్తు వచ్చిందా?' అని ప్రశ్నించాడు చిరునవ్వుతో.
చామనచాయకలిగి బక్కపలచగా ఉన్నా సౌందర్య వంతుడనిపించుకొనే ఆ యువకుడు చిరుహాసంచేసి, 'ఇహ ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను, మామయ్యా, అన్నాడు.
'దేశదిమ్మరిని దేశదిమ్మరివిగానే ఉండిపోతావను కొన్నాను. ఇంటిపట్టున ఉండదలిచావన్నమాట. సంతోషం, నాయనా!'
అతడు కూర్చోడానికి నా కుర్చీ ఖాళీచేసి ఇంట్లోకి వచ్చి కిటికీ దగ్గర నిల్చున్నాను, వారి సంభాషణ వింటూ. అతడు మా బంధువూ, మా ఊరివాడూ కావడమేగాని అతఃది నింతవరకూ నేను చూడలేదు. కిషన్ అంటే తెలిసింది, మా ఇంటిముందు కొన్ని సంవత్సరాలుగా దీపంపెట్టే దిక్కులేక కళలు తప్పిఉన్న మేడవారి అబ్బాయిఅని, కిషన్ చిత్రకారుడనీ, దేశదేశాలుతిరుగుతూ బొమ్మలు గీస్తుంటాడనీ వినడమేగాని అతనిని ప్రత్యక్షంగా చూడడం అదె ప్రథమం. వాళ్ళకూ మాకూ దూరపు చుట్టరికమేదో ఉందని విన్నాను. కిషన్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి అతడు ఇంటర్ లో ఉండగా పోయాడు. తండ్రి ఉండగా కూడా అతడు ఇటు వచ్చేవాడు కాదు.
విశ్వవిద్యాలయం పట్టభద్రుడయినా ఉద్యోగం సద్యోగం లేక దేశదిమ్మరి అయి డబ్బు కావలసినప్పుడల్లా వచ్చి బంగారం పండేటటువంటి పొలాలు ఒక్కొక్కటి అమ్మేస్తూ డబ్బు తీసుకువెళ్ళేవాడు. అతడి పొలాలన్నీ నాన్నే ఖరీదుచేశాడు. నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని కనక అతడు మా ఊరు వచ్చినప్పుడు చూచే అవకాశం కలగలేదు.
అయిదారేళ్ళలో లక్షలుచేసే ఆస్తి అతడు కరిగించి తిన్నాడంటే అతడెంత విలాసపురుషుడో జల్సా రాయుడో అనుకోవచ్చు కాని కిషన్ వేషభాషలు అతి నిరాడంబరంగా ఉన్నాయి.
'వ్యవసాయం పెట్టాలనుకొన్నావా?' నాన్న అడిగాడు.
'ఎకరం పొలం కూడా మిగలలేదే?' పేలవంగా నవ్వాడు.
'మరి?'
'ఇల్లు ఎవరైనా ఖరీదు చేస్తారేమో చూడండి. మామయ్యా ఆ డబ్బుపెట్టి చిన్నపాటి పొలం ఒకటి కొనుక్కుని అందులో పర్ణశాలవంటి టెంట్ వేసుకొని కాలక్షేపం చెయ్యాలనుకొంటున్నాను. నాకీ ఊళ్ళో ఎవరితోటీ పరిచయం లేదు. మీరే కొంచెం శ్రమ తీసుకోవాలి. ఇల్లు అవసరమైతే మీరే ప్రయత్నించండి. ఇతర ప్రయత్నాలు దేనికి?'
'నాకు ఎంతమంది కొడుకులున్నారని ఇళ్ళమీద ఇళ్ళుకొనిపెట్టను?' అన్ననాన్న సరదామాటలు మెల్లిగా వ్యవహారంలోకి దిగాయి. 'ఎంతమీద ఉన్నావు?'
'పట్నాలలో అయితే లక్ష ఖరీదుచేసే మేడ. ఇక్కడ అంత డబ్బిచ్చి కొనేవారెవరు? పాతికవేలు చివరిమాటగా కుదర్చండీ' అని లేచాడు కిషన్. 'మరొకమాట మీరు నాదగ్గిర కొన్న ఊరంచున పొలం తిరిగి విక్రయించ కోరుతున్నాను. అందులో నా ఆశ్రమ నిర్మాణానికి అనువుగా ఉంటుంది. దానిమీద మీరు కొంత లాభం కోరినా నేను కాదనను.'
