Next Page 
మూడుముళ్ళూ పేజి 1

 

                                         మూడుముళ్ళూ
                                                     ---అచ్యుతవల్లి

                         


    చైత్రమాసపు తొలిరోజులు. మధ్యాహ్నం ఒంటి గంట అవుతూంది.
    మెయిన్ రోడ్డులో ఎక్కడా జనసంచారం లేదు. బస్సులు అటునించి వకటీ ఇటునించి వకటీగా వస్తూపోతూ వున్నాయి.
    ఆ మెయిన్ రోడ్డుకి, ఇటూ అటూ రెండు కంకర రోడ్డులు కలిసే చోట పెద్ద రావిచెట్టు వకటి వుంది. దాని క్రింద, రేకులుతో చిన్న షెడ్డులా వేసుకుని, కిళ్ళీ, షోడా కొట్టు పెట్టుకొన్నాడు గవర్రాజు.
    ఆ కిళ్ళీ కొట్టు వెనకాతలనించి మొదలయింది ఇళ్ళ వరస. ఆ ఇళ్ళ వరసలోని మొదటింటిలో, వుంటున్నారు. కామేశ్వరి వాళ్ళూను.
    ఆ ఇల్లు చిన్న బంగళా పెంకుటిల్లు ముందు బాగా ఖాళీజాగా వదిలేసి, వెనకగా కట్టబడి వుంది. ఆ ఇల్లు ఖాళీజాగా లోనికి ఎత్తయిన అరుగులు వున్నాయ్. ఖాళీ జాగా చుట్టూ, బార్బ్ డ్ వైర్ తో, మధ్య మధ్య సిమెంటు స్తంభాలు నిలువబెట్టి కట్టిన ఫెన్సింగ్ వుంది. లోపలికి వెళ్ళే దారి ప్రక్కన రెండు వెదుళ్ళు నిలబెట్టి, దానికి అడ్డంగా, ఒక నీలంరంగు బోర్డు కట్టబడి వుంది. ఆ నీలంరంగు బోర్డు మీద తెల్లని అక్షరాలు పెయింటు చేసారు 'కవిరాజ ధన్వంతరీ నిలయం నరసయ్య- అని. దాని యజమాని నర సయ్యగారు. నరసయ్యగారికి, ఇద్దరు కూతుళ్ళు పెద్దపిల్ల కామేశ్వరి, చిన్నది సుభద్ర. ఇద్దరు కొడుకులు, పెద్దవాడు చిట్టిబాబు కామేశ్వరి కన్న చిన్నవాడు సుభద్రకన్న పెద్దవాడు. ప్రీ యూనివర్సిటీ చదువుతున్నాడు. చిన్నవాడు జగ్గూ సెకండ్ ఫారం చదువుతున్నాడు. తల్లి జగదాంబ. ఈ ఆరుగురూ, నరసయ్యగారి సంపాదనమీద జీవించాలి. కామేశ్వరికి ఇరవయి సంవత్సరాలుంటాయి. పెళ్ళి చేయాలని, అయిదారేళ్ళబట్టీ జగదాంబగారూ, నరసయ్యగారూ, తాపత్రయపడుతున్నారు.
    ఆ ఎండవేళ కామేశ్వరి చెల్లెలు సుభద్ర అరుగుమీదకు వచ్చి నించుని నాలుగురోడ్లూ కలిసే వయిపు చూడసాగింది. అటూ ఇటూ నరమానవ సంచారం, ఏమాత్రం కన్పించలేదు ఆమెకి, దాహం వేస్తూన్న కాకులు మటుకు, ఆ చెట్టుమీంచి, ఈ చెట్టు మీదకు ఈ చెట్టుమీదనుంచి ఆ చెట్టు మీదకు అప్పుడొకటి అప్పుడొకటి ఎగురు తున్నాయి. సుభద్ర కాస్సేపు అల్లా నిలబడగానే అయిదు క్షణాల్లో వేడెక్కిన సిమెంటు అరుగులు, ఆమె అరికాళ్ళని చుర్రుమనిపించాయి. చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది.
    'వస్తున్నారా?' హాలులో చాపమీద కూర్చున్న కామేశ్వరి అడిగింది.
    'ఉఁహు' అంది సుభద్ర.
    ఈలోగా వంటింట్లోంచి, జగదాంబ వచ్చింది. ఆమె తల అంతా రేగిపోయి వుంది. ఆ రేగిన జుట్టు కొసలమీద తెల్లని మెత్తని బూడిద, అంటుకుని వుంది. ముఖానికి పట్టిన చమటవల్ల ఆమె నుదుట వున్న గుండ్రని కుంకుమ కరిగి, ముక్కు చివరదాకా, పాకుతోంది. కళ్ళనున్న కాటుక చెంపలదాకా, చీకిరి బాకిరిగా, అలమిపోయింది. అప్పటిదాకా ఆమె, పొయ్యివద్ద కూర్చుని వచ్చిందని, ఆమెని చూడగానే చెప్పేయొచ్చును.
    'అమ్మా! ఇంకనన్నా కాస్త ముఖం కడుక్కొని బట్టలు మార్చుకోమ్మా! పొద్దుటినించీ ఒకటే శ్రమపడుతున్నావు.' అంది కామేశ్వరి.
    'అంతా అయిపోయింది. చిట్టిబాబూ, జగ్గూ వస్తారేమో అని చూస్తున్నాను. వాళ్ళు గమ్మునవస్తే బాగుండును. అంది జగదాంబ.
    'ఇంకే ఏమన్నా చేయాలా?' అంది సుభద్ర.
    'చిట్టిబాబుని మైదా రవ్వ తెమ్మన్నాను. రవ్వలడ్డూ చేద్దామని. స్కూలునుంచి వొచ్చేటప్పుడు తెస్తానన్నాడు. జగ్గూ రాగానే నాలుగు కిళ్ళీలు కట్టించుకు రమ్మని చెప్పు!' అన్నది జగదాంబ.
    'ఇంకేం చేయొద్దు అమ్మా? నువ్వు బట్టలు మార్చేసి ముఖం అదీ కడుక్కో! రెండుగంటలు ఇట్టే అయిపోతుంది'. అంది కామేశ్వరి.
    'స్వీట్ ఏదన్నా చేయకపోతే బాగుంటుందా?' అన్నది జగదాంబ.
    'ఇంకా స్వీటు చెయ్యాలంటూ, కూర్చుంటావేమిటి? ఉప్మా, బూందీ, చేసావు చాలదా? మన మేదో హోటలు పెట్టుకున్నట్లు, నాలుగు రకాలు చెయ్యటం ఆ వచ్చేవాళ్ళు, పీక మొయ్యాతిని, తర్వాత మొండి చెయ్యి చూపెట్టటం తప్ప లాభమే ముంది? అసలు పూర్వపురోజుల్లో కతికితే అతకదని, పెళ్ళిచూపులప్పుడు ఏమీ తినేవారుకారట! ఇప్పుడేమిటి! ఏదో టీ పార్టీకి వచ్చినట్లు తినేస్తున్నారు!' అంది కామేశ్వరి.
    'అయితే ఇంకేం చేయొద్దు అంటావా? నేనూ తయారవుతాను.' అని లోపలికి వెళ్ళింది. జగదాంబ.
    'అక్కయ్యా!' అంది సుభద్ర.
    'ఏం?' అన్నట్లు తలెత్తింది కామేశ్వరి.
    'అమ్మని ఇందాకట్నించి, బట్టలు మార్చుకోమని వేధిస్తున్నావు. ఇంతకీ పెళ్ళివారు ఎవర్ని చూస్తారు? నిన్నా అమ్మనా!' అంది చిలిపిగా సుభద్ర.
    కామేశ్వరి, నిజంగా ఏమీ తయారు కాలేదు. చాపనిండా, పెన్సిలు, రబ్బరు, తెల్లకాయితాలు, కంపస్ బాక్సు, పెన్నూ, గాన కళాబోధినీ, భారతీ, ఆంధ్రపత్రికా, మున్నగునవి చిందర వందరగా వున్నాయి. తెల్లని మల్లు పరికిణీ, నీలం వాయిలు వోణీ, వేసుకునుంది. కామేశ్వరి పరికిణీ నిండా, సిరామరకలున్నాయి. గ్రాఫ్ లో లెక్క చేస్తోంది. తల ఆట్టే రేగలేదు. కాని ముఖంనిండా చమట పోసింది. తెల్లని జాకెట్టు వంటికి అతుక్కుపోయి, లోపలనున్న, స్లీవ్ లెస్ జుబ్బా కనపడుతూంది. కామేశ్వరి, కంపస్ బాక్స్ లో పెన్సిలూ, రబ్బరూ, పడేసి, కాయితాలూ పుస్తకాలూ సర్దుతూ,
    'నేనేం తయారు కానక్కర్లేదు!' అంది కామేశ్వరి.
    'ఇల్లాగే దర్శన మిస్తావా! అపర వాణీమూర్తి అనుకోవాల్నా!' అంది సుభద్ర.
    'నేను ఎంత అలంకరించుకున్నా, దర్శనీయంగా వుండను! వచ్చే వాళ్ళకు, ఎల్లానూ నచ్చను! ఇంక వృధా సింగారింపులో కాలం వేస్టు చెయ్యటమెందుకు? ఆ సింగారించుకునే కాలంలో నాలుగు లెక్కలు చేసుకుంటే పరీక్షలన్నా ప్యాసవు తావేమో!' అంది కామేశ్వరి.
    'అదేమిటి అక్కా! కొంత మందికి నచ్చనంత మాత్రాన్న ఇంక ఎవరికి నచ్చనవి రూఢి ఏమిటి? నువ్వు బాగా, అందంగా కనపడవని, నీకు నువ్వు అనుకుంటావు కాని, నాకు మటుకు, నీవు చక్కగా, అలంకరించు కుంటే, నీకేసే చూడాలనిపిస్తుంది! లే అక్కా! ఇవన్నీ, నేను సర్దుతాను. నీవు వెళ్ళి ముఖం రుద్దుకుని, బొట్టూ కాటుకా పెట్టుకో!' అని సుభద్ర, చాపమీద వున్న సామాన్లు అన్ని తీసి అలమారులోసర్ది చాపతీసి, ఆ హాలు వూడవటానికి ఉపక్రమించింది.
    కామేశ్వరి, నల్లగా వుంటుంది. నలుపు అంటే మరీ కాటుకలా కాకపోయినా, చామనఛాయకంటే కొంచెం తక్కువగా వుంటుంది. చెంపకు చారెడేసి కళ్ళు, ఒత్తుగా, ఒంకులు ఒంకులుగా, మడమలదాకా వుండే పొడుగాటి జుత్తు, ఆ పిల్లకి పెట్టని ఆభరణాలు. ఇరవయి సంవత్సరాలు నిండుతూన్నా కొంచెం సన్నపాటి శరీరం, అవటం నించి పదహారు పద్దెనిమిది సంవత్సరాల మధ్యనున్న బాలికలాగా చూపరులకు కన్పడుతుంది. సుభద్రకి పదిహేడు సంవత్సరాలుంటాయి. పచ్చగా సన్నగా పొడుగ్గా చలాకీగా వుంటుంది సుభద్ర. సన్నటి కోలముఖం. ఆ లేత ముఖంలో దట్టమైన కాటుక గీతలా కన్పించే చీలిక కళ్ళూ, సన్నగా ఎత్తుగా నించునే ముక్కూ, చలించే గులాబీ రేకుల పెదాలూ, హుషారైన కన్నెలేడి! ఆ సుభద్రముందు, కామేశ్వరి, జీవితం అంతా కాచి వడబోసి పసివాడిన విరాగిణిలా వుంటుంది.

                       
    సుభద్ర సిక్స్త్ ఫారం చదువుతోంది. వంగి హాలు వూడుస్తూన్న సుభద్ర వెంపు చూసింది కామేశ్వరి. వంగినప్పుడు, సుభద్ర రెండు జడలూ, భుజం మీంచి క్రిందకు జారాయి. సుభద్రకి, కామేశ్వరికున్నంత నిడుపాటి జుత్తు లేదు. పొట్టిగా జానేడుంటాయి వెంట్రుకలు. వంకులు మూలంగా రెండు జడలు వేసుకున్నా పొట్టిగా వున్నా ముద్దుగా వుంటాయి ఆ పిల్లజడలు! అరుగునానుకుని సైకిలు ఆగిన చప్పుడుకీ ఒక వురుక్కున సుభద్ర వీరి గుమ్మం దగ్గిరికి వెళ్ళింది. లేత గులాబీరంగు జార్జెటు వోణీ ముదురాకు పచ్చని పట్టు పరికిణీతో సుభద్ర కన్పించే సరికి చిట్టిబాబు.
    'అరరే!' అన్నాడు, అంటూనే సైకిలు వెనక్కి తిప్పి మళ్ళీ ఎక్కేసాడు. ముందు దిగిపోయిన జగ్గూ,
    'మళ్ళీ ఎక్కడికిరా! నేనూ రావొద్దా!' అంటూ గునుస్తున్నా విన్పించుకోలేదు.
    'ఏరా చిట్టీ మళ్ళీ పోతున్నావ్!' అని కేకేసింది సుభద్ర.
    'అమ్మ ఒకటి తెమ్మన్నది. మర్చిపోయేను. నిన్ను చూస్తే, జ్ఞాపకం వచ్చింది.' అంటూనే తుర్రుమని వెళ్ళిపోయేడు చిట్టిబాబు.
    'ఇప్పుడింక అవసరం లేదురా'! అని సుభద్ర కేక వేస్తోన్నా విన్పించుకో లేదు చిట్టిబాబు.
    'చూడక్కా! అన్న నన్ను తీసుకో వెళ్ళటం లేదూ!' అంటూ పుస్తకాల సంచీ ఆ అరుగుమీద పడేసి చిందులు తొక్కటం మొదలు పెట్టాడు జగ్గూ.
    జగ్గూ బొద్దుగా ముద్దుగా వుంటాడు. పదేళ్ళుంటాయి. సుభద్ర తర్వాత చాలా  కాలానికి జగ్గూ పుట్టాడు. ఇంట్లో వాడంటే అందరికీ ముద్దు! వాడికి సైకిలెక్కి తిరగటం సరదా! అంచేత రోజూ చిట్టిబాబు, తను కాలేజీనుంచి ఇంటికి వొచ్చేప్పుడు వాడి స్కూల్ దగ్గర ఆగి, వాణ్ని సైకి లెక్కించుకొని, తీసుకవస్తాడు.
    'అన్నయ్య పనిమీద వెళ్ళాడు! అల్లా ఏడవకు! తప్పు! ఇవ్వాళ పెద్దక్కకి, పెళ్ళివారు వొస్తున్నారు. నీకూ చిన్నపని చెప్తాను చెయ్యాలి!' అంది సుభద్ర ఇంటికి చుట్టాలు వస్తున్నారనేసరికి చొక్కాతో ముక్కూ కళ్ళూ తుడుచుకుని పెద్ద మనిషిలా నిలబడ్డాడు జగ్గూ.
    'చూడు! గవర్రాజు దగ్గరికి కెళ్ళి నాలుగు కిళ్ళీలు కట్టించుకుని తెచ్చి పెట్టు! అంది సుభద్ర.
    'మరి నాకు దాహం వేస్తోంది! ఒక సోడా తాగొద్దా!' అన్నాడు జగ్గూ.
    'సోడా ఎందుకు! అమ్మ ఇవ్వాళ బోలెడు కాఫీ చేస్తోంది.' అంది సుభద్ర.
    జగ్గూ ముఖం నుంచి గుమ్మడి పూవల్లె విచ్చింది.
    'నిజంగా, మనింట్లో కాఫీ చేస్తోందా అక్కా!' అన్నాడు ఆశగా జగ్గూ.
    'మనింటికి చుట్టాలు వస్తారుగా మరి! అందుకని కాఫీ చేస్తోంది. మరి కిళ్ళీలు, గమ్మున తెచ్చిపెట్టు! చుట్టాలు, నాన్నారు కూడా వచ్చేస్తారు.' అంది సుభద్ర.
    జగ్గూ సంతోషంగా అరుగుమీంచి ఒక్క ఉరుకు ఉరికాడు. కాలుజారి, బోర్లిగిలా పడ్డాడు. మోచేయి చెక్కుకు పోయింది. ఒకప్పుడయితే రాగాలు తీసే వాడే! కాని ఈ రోజు ఏమీ కిక్కురుమన కుండా లేచి, చొక్కా దుమ్ము దులిపేసుకుని, 'గవర్రాజు' కిళ్ళీ కొట్టుకి పరుగెట్టాడు. కిళ్ళీషాపు దగ్గర వేసివున్న బెంచీమీద ఇద్దరు యువకులు కూర్చుని వున్నారు. అందులో వకతను నల్లకళ్ళజోడు పెట్టుకున్నాడు. గవర్రాజు కిళ్ళీలు కడుతూ.
    'దేనికి జగ్గూ! మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చేరా?' అన్నాడు. జగ్గూకి ఎంతో సంతోషం కలిగింది. ఏమంటే సాధారణంగా గవర్రాజు, జగ్గూతో మాట్లాడడు. చిట్టిబాబయితే సరదాగా కూర్చోమని, హుషారుగా కబుర్లు చెప్తాడు. జగ్గూకి గవర్రాజు క్రాఫింగ్ అంటే మహ ఇష్టంగా వుంటుంది. బుట్టలా, ఎత్తుగా వుంటుంది గవర్రాజు జుట్టు! తెల్లని పల్చని, వాయిలు లాల్చీ వేసుకుంటాడు ఎప్పుడూ గవర్రాజు! సాధారణంగా చారలున్న పైజామా కూడా వేసుకుంటూంటాడు. మెళ్ళో వంటిపేట సన్నని బంగారు గొలుసు, దాని మధ్య పులిగోరు పతకం వుంది. కొట్లో గాంధిజీ, నెహ్రూజీ నేతాజీల ఫోటోలు వున్నాయి. వాట్లకి కాగితం పూవులదండలు వేస్తాడు గవర్రాజు.   


Next Page 

WRITERS
PUBLICATIONS