ఋతుపవనాలు
తులసి కృష్ణ

'నన్నయ్యా!' కేకేశాడు వాసవి. లోపలి గుమ్మం దగ్గర గడప మీదుంచి ములుగర్ర బాడిశతో చెక్కుతూ , పారుకోల అమరుస్తున్నాడు వాసవి. ఒక్క క్షణం జవాబు కోసం ఆగాడు. రెండోసారి గట్టిగా పిలిచాడు.
ఆ నన్నయ్యకు మొదటి పిలుపు వినిపించలేదు. రెండో పిలుపు వినిపించినా, పలుకలేని స్థితిలో ఉన్నాడు. గాధా సప్తశతిలోని పద్యం జ్ఞప్తికి తెచ్చే సన్నివేశం జరుగుతుందక్కడ. భాగీరధమ్మ చెయ్యెత్తి పెద్ద చెంబుతో నీళ్లు పోస్తుంది. మజ్జిగ అంబలి కారిన చేతుల్ని దోయిలి పట్టి , వంగుని తాగేస్తున్నాడు నన్నయ్య. అతని దప్పి అగ్నిహోత్రుడి ఆజ్యదాహం లాంటిది! భాగీరధమ్మ విసుక్కుంది ; 'ఓరి నీ దప్పి కాలిపోనూ! ఇదేందిరా -- చినుకు పైన బడితే జిల్లు మనిపించే కార్తీక మాసం పొద్దున్నే ఇన్ని నీళ్ళు తాగడం?' అప్పటికి చెంబులో నీళ్ళు ఖాళీ గావడమూ , 'ఇక చాలు' నన్నట్లు నన్నయ్య తల ఊపటమూ ఒక్కసారే జరిగాయి.
నన్నయ్య లేచి నిలబడి, 'గర్రున' త్రేన్చాడు. నన్నయ్య ఆకలీ, దప్పికా నిత్య నూతనంగా కనిపించడం ఆ ఇంటి ఆడవాళ్ళకు పరిపాటే. వాళ్లు మరీ విసుక్కుని తిడితే, నన్నయ్య సంతోషంగా నవ్వుతాడు. 'నన్నయ్యా!' మళ్ళీ పిలుపు.
'ఆ.....ఆ......ఇదో.....' అప్పటికి హాజరయ్యాడు.
'ఇంతసేపెంజేస్తున్నావ్?'
'అంబలి దాగి వచ్చేత్తున్నాను...'
'రొంత కోదువుంది...'
'ఎకరన్నర దుక్కి మూడ్రోజుల్నుండీ అయిపోలా?'
నన్నయ్య పలుకలేదు.
'ప్చ్! లాభం లేదు, నన్నయ్యా! నువ్వు తిండికి తిమ్మరాజువూ, పనికి పోపరాజువూ అయిపోతున్నావు. సర్లే, దుక్కికినే పోతాను గానీ, నువ్వు గడ్డి కన్నా వెళ్లు. అట్లనే ఆ తోట్ల కాడి పంపులో కొత్తిమీర ఎవరూ పెరక్కుపోకుండా చూడు....'
'గడ్డికి ఎంగటి పోయింది. నిన్న పుల్లమ్మ 'చారులో కొత్తిమీర ఏసుకుందని , మల్లమ్మ ఎంగటితో సెప్పిందంట. అదియ్యాల ఎవరైనా సరే, కొత్తిమీర మీద సెయ్యేత్తే కొడవల్తో కొప్పు కొత్తానని పోయింది. పుల్లమ్మంటే దానికి మంటలే...'
'సర్లే! నీ పని జూస్తే నాకూ మంటగానే ఉంది. ఆ పేరయ్య దగ్గర కెళ్లి కొత్త నాగేలు చేసినాడేమో చూడు. లేకపోతె అక్కడే కూచొని చేయించి తీసుకొని రా....అమ్మా! ఆ కొయ్య కున్న తువ్వాలిట్లాతే!'
భాగీరధమ్మ తువ్వాలు చేత పట్టుకుని వచ్చి , "ఏం? నన్నయ్య పోలేదూ?' అంది.
'నన్నయ్యా ...ఎందుకు పోడు ? పోతాడు. అయితే నన్నయ్య దుక్కి దున్నితే , ఆ పంపులో ఉలవ వెయ్యడం ఈ సంవత్సరం కాదు. అమ్మా! ఎండేక్కి నాక సరస్వత్తో కాఫీ పంపు!'
నన్నయ్య కు కోప మొచ్చింది. చరచరా వెళ్ళి బోడెద్దు తలుగు విప్పాడు. అక్కడి నుంచే 'మేట్టకొమ్ము' దాన్నదిలించాడు!
రెండు ఎద్దులూ నెమరేసుకుంటూ వీధిలో ఉన్న కోటేరు దగ్గరికి పోతున్నాయి. వాసవీ , భాగీరధమ్మ ముఖాలు చూసుకున్నారు.
'ఇప్పుడు నిన్నే మన్నాడురా? తనే సేద్యానికి పోతా నన్నాడు. నువ్వా నాగలంట చేయించరాదూ? మళ్లా ఇదేం రోగం?'
నన్నయ్య అంతకంటే బిగ్గరగా అన్నాడు; 'అయిపోలా, అయిపోలా అంటే ఎట్టయిపోతాది? మూద్రోజులకూ ఇరసాలు దున్నోద్దూ?'
'ఇరసాలా?' అన్నాడు వాసవి.
'కాకుంటే-- ఇయ్యాలకూ సాలుకే దున్నుకుంటూ పండుకున్నాననా?'
'మరి ముందుగా ఆ సంగతి చెప్పాద్దూ?'
'ముందుగానే చెబితే వాడూ రెండు తిట్లు తినేదెట్లా!' అంది భాగీరధమ్మ.
'అదీ సంగతి' అన్నట్టు నవ్వాడు నన్నయ్య.
'అది గాదమ్మా! నేలంతా ఒకటే గరికి. ఇరసాలు దున్నితే గానీ గరికి సచ్చి , సేను మెత్తబడదు.'
'మంచిది. అదే నేను చెప్పాలను కున్నాను.'
'నువ్వు సెప్పక పొతే మాత్తరం నాకు తెల్డూ?'
'పొద్దు పొడుస్తోంది . పో, పో. ఇదిగో ములుగర్ర.'
నన్నయ్య ములుగర్ర అటూ ఇటూ చివ్వున ఊపాడు. నేలకేసి 'టకటకా' కొట్టాడు. 'ముల్లుగర్రంటే ఇదీ....'
వాసవి ముఖం కేసి పాశుపతాస్త్రం ఇచ్చేసిన ఈశ్వరుని అర్జునుడు చూసినట్టుగా చూసి, బయటి కడుగేశాడు.
'ఉండు నన్నయ్యా!' వాసవి మళ్ళీ కేకేశాడు.
నన్నయ్య వెనక్కోచ్చేశాడు.
లోపలి కెళ్లబోతున్న భాగీరధమ్మ ఆగి నవ్వుతూ : ;సరిపోయింది . ఏదో సామెత చెప్పినట్లుంది ఏ వేళ లేచినా రాళ్ల వాగున్నే తెల్లారుతుందని...'
'అది గాదమ్మా! మా నాయన స్టేషన్ కు బండి పంపమని జాబు రాయలేదూ?'
'అవును . అయ్యో! మరిచే పోయినాం....'
'నన్నాయ్యా, మరో గంటాగి బండిలో కండువా పరుచుకొని వెళ్ళు! నేను దుక్కికి పోతున్నా.'
'టేశన్ నువ్వే పో, అయ్యా....'
"ఏం ? నువ్వు పోలేవూ?'
'ఆ సిన్న కోడె నన్ను జూత్తె బస్సు మంటాది. అదీ గాక వారం రోజుల్నించీ పన్లేక మాంచి పొగరుమీదుంది....'
'సరే, నేనే పోతాను , పో!' వాసవి చొక్కా వేసుకుంటూ లోపలి కెళ్ళి పోయాడు.
'అది గాదమ్మా, దుక్కి తేమ పదునుగా ఉండి సెప్పులు తోడ్కుకోటాని కిల్లేదు. అంతా పల్లెరుగా ఉంది.
దుక్కికి పోతాడంట...' అంటూనే నన్నయ్య గబగబా పరుగెత్తాడు.
చొక్కా విప్పి వంకేన తగిలిస్తున్న వాసవి కి నన్నయ్య మాటలు వినిపిస్తున్నాయి. తడి కళ్ళతో వస్తూన్న అమ్మ కేసి చూశాడు. నన్నయ్య ప్రేమ మలయానిలంలా ఆ మనసుల్ని కదిపింది.
ఇద్దరూ నవ్వుకున్నారు. వాసవి తువ్వాలు భుజం మీదుగా కప్పుకుని, పళ్ళు తోముకుంటూ వీధి వసారాలో కొచ్చేశాడు.
ఇంకా మంచు కురుస్తుంది! ఏరు, ఏటి కావలి ఇసుక తిప్పల్ని కనిపించకుండా వాన జల్లులా కురుస్తుంది . చౌడమ్మ గుడి దగ్గర కొందరు పిల్లలు చలి మంట వేసుకుని చుట్టూ కూచుని వణుకుతూ చలి కాచుకుంటున్నారు.
బారేడేక్కిన సూర్యుడు -- మంచు తెరల మాటున, మబ్బు పొదల చాటున కిరణాలన్నీ అర్పెసుకుని బోడీగా చలి మంటలాగే ఉన్నాడు. చలమయ్య కాడీ, మేడీ వీధిలో చేరవేసి భార్య , తనూ చెరో ఎద్దునూ పట్టుకొచ్చి కాడి కట్టుకుంటున్నాడు. ఏటి నించీ నీళ్ళు మోసుకెళుతున్న ఇద్దరాడవాళ్ళ మధ్య, బురద పూసుకున్న బర్రేగొడ్డు అరుస్తూ, వాళ్ళ అదలింపుల్ని లెక్క చెయ్యకుండా తోకతో అత్తరు చిలికిస్తూ పరుగెత్తింది. జోగయ్య గారింటి ముందర , తల పైన తుండు గుడ్డ కప్పుకుని, ఒక చెయ్యి మోకాలి పైన ఊనుకుని, విల్లులా వంగి ముగ్గు లేస్తుంది మాంచాల! బుట్ట నిండా కార్తీకపువ్వులుంచుకుని, ఏట్లో మునిగి వచ్చి, తడి గుడ్డలతో తంబళ్ళ బసవమ్మ శివాలయానికి వేడుతుంది. వాసవి కళ్ళు ఆ దృశ్యాల్ని చూస్తున్నాయి. మనస్సులో వాటి గురుతులేమీ లేవు. పది రోజుల క్రిందటి తండ్రి ఉత్తరం మెదులుతుంది. నన్నయ్య భట్టు, నారాయణ భట్టూ లను తలపింపజేసే తండ్రీ రాఘవరెడ్డి గార్ల స్నేహం! రాఘవరెడ్డివెళ్లి పోయి నందుకు అయన ఆవేదన! రాఘవరెడ్డి కుమార్తె గోదాదేవిని ఓదారుస్తూ ఉండడం, కొద్ది రోజులా ఊళ్ళో ఉండటాని కామె ఒప్పుకోవటం ఈ వేళ ఉదయం స్టేషన్ కు బండి పంపమని వ్రాయటం .....ఆలోచిస్తున్నాడు.
పన్నెండేళ్ళ నాటి ఛాయా చిత్రాలు! గంబీరుడైన రాఘవరెడ్డి ఉన్నత స్వరూపం, సన్నగా , చామన చాయగా గౌను తొడుక్కుని వీధి అరుగు మీద ఆడుకున్న గోదాదేవి! వాత్సల్యపూరితమైన భువనేశ్వరి చిరునవ్వుల ఆహ్వానాలు! మనస్సేదో అవ్యక్తమైన అనుభూతి నందిస్తుంది. పన్నెండేళ్ళ నించీ ఈ మధ్య తండ్రీ , రాఘవరెడ్డి చరిత్ర చాలా విచిత్రంగా , అపూర్వంగా కనిపిస్తుంది. రాఘవరెడ్డి , అయన కుమార్తె ఇంతకాలమూ ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. తెలిసిన తండ్రి తనలోనే దాన్ని దిగ్భంధం చేశాడు. రాఘవరెడ్డి పాతి కేకరాలు సాగు చేశాడు. తను వ్యవసాయం లోకి రాకముందు తండ్రి చాలా కష్టపడ్డాడు. భూమి పన్ను రాఘవరెడ్డి పేర వేసేవాడు. సాలు కైదువేల రూపాయలిస్తూ మధ్యలో అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉండేవాడు. రాఘవరెడ్డి ఎన్నడూ ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదు. 'వాళ్ళెక్కడున్నా ' రని ఒక్కసారడిగిన తనకు కూడా 'అ విషయం చెప్పటం తన స్నేహితుని కిష్టం లేదన్నాడు. స్నేహ సంపదను కాపాడుకునే అయన పద్దతికి మనస్సు పులకించింది. స్నేహితుడి తో పాటు స్నేహితుడి కిచ్చిన కట్టు బాటుకు కూడా కాలాతీత మయిందన్నట్టు , వాళ్ళింతకాలమూ తిరుపతి లో ఉన్నట్లు వ్రాశాడు.
'అయ్యా! పెద్దయ్యోచ్చినాడా?' వాసవి ఆలోచన్నించీ మేలుకున్నాడు. ఎదురుగా తన ముఖం కేసి చూస్తున్న కంబన్న.
'రాలేదు. ఈవేలోళోస్తాడు....' పొద్దుకేసి చూసి, హడావుడిగా ఇంట్లోకి లేచాడు.
'సరే, సరే, కర్నాం అడిగిరారా అంటే ...అయితే, రాలేదని చెప్తానయ్యా.......'
'ఆ....' అన్నాడు వాసవి , లోపలి కెడుతూ.
'సరే, సరే! ఇయ్యాళోత్తాడని సేప్పమంటావయ్యా'.... ఇంకొంచెం గొంతు హెచ్చించి.
'ఆ....ఆ......చెప్పు' ఇంకొంచెం లోపలి కేళుతూ .
'సరే,మ సరే, అయ్యా?' గట్టిగా.
అయ్య పలకలేదు. సరే, సరే అనుకుని వెనక్కి తిరిగాడు కంబన్న.
వాసవి మూడు నిమిషాల్లో స్నానం ముగించాడు. తల్లి అందించిన కాఫీ రెండు గుక్కల్లో త్రాగి పసువుల గొట్టం వేపు పరుగెత్తాడు. చెల్లెలు సరస్వతి ఒకచేత జంబుఖానా , మరో చేత సెలగోలూ అందుకుని వీధిలో బండి దగ్గరగా నిలుచుంది. పగ్గాలేసి రెండు కోడేల్నూ పట్టుకొచ్చాడు వాసవి.
'నేనో వైపెత్తనా?' అంది సరస్వతి.
'ఎత్తడమా? నా కోడెలంటే ఏమి టనుకున్నావ్!' గూటం మీదున్న నోగల్ని రెండు కోడేలూ తలలు దూర్చి చట్టున మెడ మీద వేసుకున్నాయి. 'చూశావా' అన్నట్టు చెల్లెలి వేపు నవ్వుతూ చూసి, పట్టెడ బిగించి సెలగో లందుకుని చివుక్కున నోగల్లో కెగిరాడు.
'అరె! మరిచాను....అమ్మా! సరస్వతీ, భగవతీ , పూర్ణేందు బింబాననా! ఆ మువ్వ లిట్లా పారేస్తావూ?'
'ముందు తెచ్చుకోకూడదూ?' కసురుకుంటూ వెళ్ళి తెచ్చింది.
'ఆ చేత్తోనే వాటి మెళ్ళో వేయి....'
'అమ్మో!'
'ఏమీ ఆనవు. నేనున్నాగా....'
'సరే గానీ, వచ్చేటప్పుడు పెసరగాయాలు తెస్తావూ?'
