Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 1

 

                               ప్రేమకు పగ్గాలు
                                                                 --వీరాజీ

                       


    నగరంలో సాయంకాలమయ్యింది! ఇంకా సూర్యుడస్తమించలేదు! అన్ని మ్యాటనీలు విడిచిపుచ్చలేదు. దీపాలు అక్కడా అక్కడా వెలుగుతున్నాయి!
    'నేనంటే ఎంత నిర్లక్ష్యం? ఇంకా నేను గ్రుంకిపోకండానే ఈ నగర వాసులు దీపాలతో నన్ను వెక్కిరిస్తున్నారే' నన్నట్లు పశ్చిమాద్రిన సూర్యుడు కందిపోయాడు. అతగాడి కోపానికి అల్లనల్లన విహారం చేస్తున్న కొన్ని మేఘాలు సైతం గభిక్కున కందిపోయాయి!!

              
    నగరంలో సాయంకాల మంటే ఆఫీసులు వదలి గుమస్తాపక్షులు ఇల్లుపారేవేళ; నిరుద్యోగ ప్పిట్టలు పైరుసాగేవేళ! మ్యాటనీలు విడిచే గోల!!
    అందంగా ఉండాలని అన్నిషాపులూ, రంగు దేపాళ మొహాలు వెలిగించుకున్నాయి. అందంగా ఉండాలని బాటసారుల మొహాలు సైతం ప్రయత్నిస్తాయి. ఇది నగర లక్షణాల్లో ముఖ్యమైనదని లాక్షణికులు గ్రంథస్తం చెయ్యని నిజం!
    ఉసూరుమని ఆఫీసు మెట్లుదిగి, బరువుగా రోడ్డు మెట్టు ఎక్కుతున్న మోహన్రావుని, అందమైన భాస్కరం ఉషారుగా "ఒరేయ్! మోహన్.....హలోవ్.....ఇట్రా......ఇటూ" అంటూ పలకరించాడు.
    "అరె, మాంచి పూలరంగడిలా ఉన్నావురా భాయ్! శలవులా? ఎప్పుడొచ్చావ్.....?' అంటూ భాస్కరాన్ని పలకరించాడు మోహన్రావు.'
    అంతలో దూసుకున్న లారీని తప్పించుకుని అది రేపిన దుమ్మును అరచేత విదలించుకుని, మిత్రులిద్దరూ ఫుట్ పాత్ మీదకు లంఘించారు!
    అరగంటలోపల సాయం సందడి తిరుగు ముఖం పట్టింది. గడియారం రెండు ముళ్ళూ ఏడుకేసి పరిగెడుతున్నాయి.
    భాస్కరం తన మిత్రుడికి యూనివర్శిటీ విశేషాలు చెబుతూంటే......మోహన్రావు గుమాస్తా గిరీలో ఆర్నెళ్ళకే వాలిన భుజాలను నిలబెట్టాలని వృధా ప్రయత్నం చేస్తూ విన్నాడు.
    అంతలో టక్కున జ్ఞాపకం వచ్చింది. భాస్కరానికి.... ఆ వేళ పద్మావతి వస్తుందన్న సంగతి.
    "ఒరే భాయ్! నన్ను వదిలెయ్యాలి.... మళ్ళీ రేపు కలుద్దాం..... ఇప్పుడు అర్జంటుగా వెళ్ళాలి." అంటూ క్షమాపణ చెప్పుకుని స్టేషనుకేసి గబ గబా నడిచేడు భాస్కరం.

                              *    *    *

    ఐదు మార్గాల రైలుకూడలి ఆ నగరం! ఆ  రైల్వేస్టేషన్లో, అయిదునొక్క ఫ్లాట్ ఫారాలున్నై!
    "ఫ్లాట్ ఫారా లెంతమంచివి! కొందర్ని కలుపుతాయి!"
    "ఫ్లాట్ ఫారా లెంతచెడ్డవి! కొందర్ని విడదీస్తాయి!"
    క్యూలో నిలబడడం నాగరికత కాకపోగా, బలవంతుడైన వాడికి నామోషీ కూడాను!
    టిక్కెట్ల కౌంటరు దగ్గర ఉన్న పదిమందీ ఒకర్ని ఒకరు పెనవేసుకుని ఉండగా, ఒక మెడా మరో భుజానికీ మధ్య యేర్పడిన ఖాళీలో నించి భాస్కరం చెయ్యిదూర్చి
    "ఫ్లాట్ ఫారమ్ ప్లీజ్!" అని గొణుక్కున్నాడు. అంతేమరి..... భాస్కరం యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుకుంటున్నాడు!
    బుకింగ్ క్లార్క్ ఇక్కడ ఈ కిటికీలోని, వ్యక్తులను వడాలి, మరో కిటికీ కంతలోనుంచి ఇంకో "క్యూ" లాంటి దాన్ని అచ్చు వేదాంతిలాగ తిలకిస్తున్నాడు!
    "మాష్టారూ! మాష్టారూ! అన్న కేకలకి తాపీగా 'ఆఁ' అన్నాడు ఎట్టకేలకు తనపని చూసుకుందికే నిశ్చయించుకుని.
    భాస్కరం చేతిలోని తెల్లని అర్ధరూపాయి కాసు అతని అరచేతి చెమటకి తడిసి పోయింది. మొహానకూడ చిరు చెమటలు చిమ్మేయి.
    "అంతా రూపాయిలు అర్ధలూ తెస్తారు. చిల్లరలేదు."
    కర్కోటకుడైన డాక్టర్ మొహంలోకి చూసి నట్లు చూశాడు బాస్కరం, బుకింగ్ క్లార్క్ మొహంలోకి.
    "ప్లీజ్! ఐవిల్ హావ్ టురష్..... నేను పరుగెత్తాలి. కావాలంటే ఛేంజి రిటన్ లో ఇవ్వండి.."
    అపూర్వమైన త్యాగం చేయబోయే వాడిలాగ అర్ధరూపాయి తీసుకుని ఫ్లాట్ ఫారం టిక్కట్ విసిరేశాడు గుమాస్తా.
    భాస్కరం చూసుకున్నాడు.
    మెట్లన్నీ గబగబా యెక్కి, బ్రిడ్జిమీద, దబదబా పరిగెత్తి దిగి రెండో నెంబరు ఫ్లాట్ ఫారంకేసి ఉరుకుతీద్దామని- అంతలో మానేశాడు.
    బోసిగా ఉంది ఫ్లాట్ ఫారమ్!
    చివుక్కుమంది అతగాడి మనసు,
    రైలు లేటు!-
    ఇది తత్దర్మకాల వాక్యమే!!
    అడావుడిలో రాగా, వూడిన బూతు లేసులను బిగించుకున్నాడు.
    తను రెండు నిముషాలు ఆలస్యం ఐనందుకెంత ఆందోళన పడ్డాడు? కాని రైలు బండి కెందుకు ఆందోళన? అదెవరికోసం తహతహ లాడుతూ రావాలిగనుక?!
    తను పద్మావతిని చూడాలని వచ్చేడు.
    "దయజేసి వినండి: మదరాసుబోవు మెయిలు : మరి తొంబది నిముషాల్లో రెండవ నెంబరు ఫ్లాట్ ఫారమునకు వచ్చును"
    తెలుగుభాషలాంటి అనౌన్సుమెంటు వినవచ్చింది లౌడుస్పీకరులో.
    "ఈ అనౌన్సు మెంటు వింటే తెనుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు' అనుకుంటారూ ఎవరైనా?"-అని తలపోస్తూ : కాళ్ళీడ్చుకుంటూ హిగ్గిన్ బాదమ్స్ కేసి దారితీశాడు భాస్కరం.
    "కాశ్మీర్ ను సందర్శించండి"
    "భారత దేశాన్ని పరిశోధించండి"
    గవర్నమెంటువారి రంగురంగుల పోస్టర్లు అగుపించేయి.
    'తనూ పద్మా ఇంచక్కా కాశ్మీర్ వెళితే బాగుండును....' అనిపించింది.
    హిగిన్ బాధమ్స్ పుస్తకాలను కలియజూసేడు. గడియారం చూసుకున్నాడు.
    ఒక రెండు జెడల నైలాన్ సింధీ సుందరి బొద్దుగా ఉన్నది; పుస్తకాలు తిరగేస్తూ ఉన్నదల్లా-మరిరెండు వరుసల కవతలి పుస్తకాలను సవరించసాగింది భాస్కరం తన చెంతకు రాగానే....
    పాపం!..... అక్కడి సేల్సు గుమాస్తా ఆవిడను కాదనలేక ఆముదం తాగుతున్నట్లు నించున్నాడు.
    "ఉహ్ఁ" మని భుజాలు విరుచుకున్నాడు భాస్కరం.
    తను పద్మావతి కోసరం వచ్చానని ఈమెకు తెలియదుకాబోలు!
    తన పద్మ ఎంత అందంగా ఉంటుందో ఈమెకు అస్సలు తెలియదు!
    "బ్లిట్జ్" పేపరు కొనుక్కుని దాని పేజీలను కట్ మని ఆమెకేసి దులిపి ఫాన్ క్రిందగా గల పాసింజరు బల్లమీదకి నడిచి, చతికిలబడ్డాడు.
    'బ్లిట్జ్' ఆఖరి పేజీలో "దొరసాని" బొమ్మ ఉంది. తెగనవ్వుతోంది. దాని క్రింద 'నవ్వులో బోస్తున్నది తార...." అని రాసికూడా ఉంది.
    "ఏడ్చినట్లుంది" చప్పరించేడు.
    తన పద్మ కళ్ళతో నవ్వగలదు! ఆ నవ్వు ముందు, ఇదొక లెక్కా?
    పద్మ..... పద్మావతి?......
    ఎన్నాళ్ళయిందా పిల్లని చూసి!....ఎన్ని రోజులయ్యింది మాట్లాడి!!
    ఆ అమ్మాయి కంఠంలో జల్తరంగులున్నై!!
    ఆమె చూపుల్లో విద్యుత్ కిరణాలుంటాయ్!!
    భాస్కరం గడియారం చూసుకున్నాడు.
    "అవసరమైనప్పుడు గడియారాలున్నూ హంస గమనమే: పదిహేను నిముషాలు మాత్రమే గడిచేయి.
    ఐతే ఆ కొద్దిసేపట్లోనూ అతగాడి పరిసరాలన్నీ పోల్చలేనంతగా మారిపోయాయి!    
    'హిగ్గింబాధమ్సు' దగ్గర బొద్దుపాటి సుందరి లేదు! నలుగురు కొత్తమ్మాయిలూ, ఒక బొద్దుపాటి - ఇంకో బక్కపాటి మనుషులు.
    లైసెంసు కూలీలు అలాగా దింపుతూనే ఉన్నారు సామాను.
    కుంపటీ, విసనకర్రా మొదలుకొని 'టేబిల్-ఫాన్'దాకా ఉన్న సరంజామా అంతా దింపుకొని మెయిల్లో ఎక్కదామని చతికిల బడ్డారు తన కుడిప్రక్క నెవరో!!
    "మొత్తం ఇల్లు తెచ్చేసుకున్నారు" అని జాలి పడ్డాడు భాస్కరం. మళ్ళీ నవ్వుకున్నాడు తనలో..
    ఆవిడ చంటిపిల్లను సముదాయించి పాలుకుడుపుతూనే, ఎడపిల్లను చేరదీసింది. పెద్దపిల్లలను "రైలు వస్తుందంటు వెళ్ళకండర్రా!" అని హెచ్చరించింది.
    "ఇదుగో! మిమ్మల్నే...... బాబిగాడి జోళ్ళు జట్కాలో వదిలీలేదుకదా!"
    "చంటిదాని పాలపీక ఏదీ?" అని అడుగుతున్నది భర్తని.
    జీవితాన్నంత బాధ్యతగా, చక్కగా అనుభవించే వాళ్ళమీద తనెవరు జాలిపడేందుకు?
    "ఇవతల కొత్త దంపతులల్లే ఉన్నాడు. తగదు పేపరు చేత పుచ్చుకుని పచార్లు సాగిస్తున్నాడు?"
    ఆ పిల్ల కూర్చున్న భంగిమ బాగుంది!!
    అంతలో ఏవో అనౌన్సుమెంట్లు!
    దడదడా అవతల ఫ్లాట్ ఫారమ్ మీదికి రైళ్ళు. ....ఇవతల ఇంకో రైలు!!    
    జనం!
    గందరగోలం!!
    అంతలో కాస్త తెరిపి!
    "అయ్యో! ఆ ఫ్లాట్ ఫారం ట!!" అని ఆరున్నొక్కి పెట్టెలతో ఒక ఫ్లాట్ ఫారానికి మారుగా ఇంకో దానిమీదికి తప్పుదారి తొక్కిన ప్రయాణీకుల యాతన.
    నడిచే ఫలహార శాలలు!!
    వీటిమధ్య అతగాడెవరో మిలిట్రీ వాడంత ఉన్నాడు. హోల్డాలు విప్పుకుని పడుకుని పైగా గుర్రుకూడా పెడుతున్నాడు!
    "హారి భగవాన్! ఈ ఆడవాళ్ళింతే! అదో వాళ్ళు చూడు..... రైలు ప్రయాణం కదా! అందులోనూ; మెయిలు ప్రయాణంకదా..... అలా చింతపండు ముద్దల్లాగ నగలన్నీ దిగవేసుకుని......పట్టుచీరె, మువ్వల వడ్డాణం ధరించి..... రావడం ఏమిటీ?"
    "సరిపోయింది! కూచోవయ్యా అంటే, ఆ యువకుడు ప్యాంటు నలిగిపోతుందన్నట్లు న్యూస్ పేపరు మీద అంత మొహమాటంగా కూచుంటాడేం? మరి మెయిలె లా ఎక్కుతాడు?"
    భాస్కరం నవ్వుకున్నాడు.
    తనూ అంతే......మెయిలుదాకా ఎందుకు; పాసింజర్ కూడా ఎక్కలేడు.
    పద్మ......పద్మ! తనను చూడగానే ఏమంటుంది.
    క్రాపింగు సవరించుకున్నాడు. దుస్తులు సవరించుకున్నాడు. లేచి అమాంతంగా పచార్లు చసి, తన జాగా నెవరో ఆక్రమించుగోడంతో, మరో సిమెంటు బెంచీకోసరం వెళ్ళి అక్కడ కూచోడం మనస్కరించక......ఆ కొసకంటా పచార్లు చేశాడు.
    'రైలు బళ్ళు గమ్మత్తైనవి!'
    'ఎద' నేదో ఆనందం కలిగింది!!
    'ఫ్లాట్ ఫారమ్ లింకా మజా అయినవి!'    
    వెనకనించి, పోస్టలు ట్రాలీ ఢీకొన్నంత పని జేసింది!!
    గడియారం చూసుకుందామని పూర్తిగా చూడకుండానే దూరంగా చీకట్లోకి పట్టాల వెంట దీపాల కేసి రైలు వచ్చేస్తున్నదేమోనని చూశాడు.
    ఇంకా అరగంట ఉంది.
    పద్మని చూడగానే ఏమంటాడు తను?
    నవ్వుకున్నాడు. తన చిన్మయానందానికి దూరంగా నించున్న కన్నెపిల్ల సిగ్గుపడ్డది. సిగ్గు పడ్డాడు భాస్కరం కూడా.
    ఫ్లాట్ ఫారం అంత తండోపతండాలుగా నిండిపోయింది.
    రైలు వచ్చేవేళ ఐనకొద్దీ సందడి ఇనుమడించింది.
    "పెరుగుపొట్లాలు......సాంబారు పొట్లాలు' : దొంతులు దొంతులు; ఎన్ని క్షణాలు కావాలన్నీ ఉడాయించుకుపోడానికి.
    "విజయవాడ వస్తోంది. భోజనం దొరుకుతుంది" అని 'ఔటర్' దగ్గర్నించీ ఎంతమంది అరవ, హిందూస్థానీ వాళ్ళు మెడ లివతలికి రిక్కించి ఆవురావురని చూస్తూ ఉంటారో!!
    కాని, తన పద్మ?
    తన పద్మ తనకోసరం చెయ్యి ఊపుతుంది! అవతలనించి ఒక రైలు వెళ్ళిపోయింది. ! మరో అవతల ఇంకోటి వచ్చింది!...... ఇవతల ఇంకోటి రావల్సి ఉంది..... అలాగే క్షణాలు కరిగి పోయేయి!
    "భాఁ!" మంది అల్లంత దూరాన మెయిలు.
    'మెయిలు!'.....'మెయిలు.....!' 'కూలీ!' 'కూలీ!' జాగర్త..... భద్రం..... 'కమాన్'..... 'పదండి పదండి'......
    దడదడలాడుతున్నాయి పట్టాలు. భాస్కరం గుండెల్లో ఆ శబ్దం ఉద్వేగంగా, వేగంగా నిండుతున్నది.
    అక్కడే నిలబడ్డాడు. ప్రతీ కిటికీ-ఫ్రేము లోనూ రెండేసి, ఒక్కోటి తలకాయలు. ఆ వెనుకాతల అంతా మనుషులు.
    "పద్మ!..... పద్మ!?... ఉహూఁ..."
    ఫస్ట్లాసు!....
    సెకండ్....సెకండ్..... ఫైలట్ క్రూ.... ఆర్మీ.... అరెమ్మన్..... లేడీసు....దాంతోటే వెళ్ళా యతని చూపులు.... లేదు! పద్మ అగుపించలేదు.. అతని మనసు మాత్రం పద్మ రాలేదని ఒప్పుకోలేదు.
    ఎటు పరిగెత్తి వెతకాలో అర్ధం అవలేదు.    
    పద్మ రావాలి..... గుంటూరు రైలెక్కాలి. పద్మ రాక తప్పదు. వచ్చే ఉండాలి. అటూ ఇటూ గాలించే శాడు భాస్కరం.
    చెమటలు పోసుకున్నాడు. ఏమయింది చెప్మాఁ! 'ఆవేళ మెయిలుకేగా వస్తాన'ని రాస్త..... తన కోసరం చూసి..... ఆ ముందు కంపార్టు మెంటులో ఉందేమో.....అక్కడ దిగిపోయి ఉంటుంది.
    భాస్కరానికి నిరాశకలిగింది. నిస్పృహ పెనవేసింది. ఉడుకుమోత్తనం వచ్చింది. ఏడుపు వచ్చింది.
    "పద్మ అగుపించలేద"నుకున్నాడు. అంతేగాని "రాలేదన్న"మాట అనలే దతని మనస్సు.
    'ఆ ముందు కంపార్టుమెంటులోనూ లేదు. ఈ వెనక్కంపార్టుమెంట్ లోనూ లేదు.' విసుక్కున్నాడు.

                                     2

    "మరి వ్వొక పది నిముషాల్లో....." మెయిలు వెళ్ళిపోతుందని అరవ కంఠం ఎనౌన్సుమెంటు.
    "అరె! అక్కడెవరు చెప్మా......పద్మలాగుందే?" భాస్కరానికి అరక్షణంలో ప్రాణం లేచివచ్చింది.
    "ఆఁ.... అది పద్మ సూట్ కేసే..... పోయిన సారి దాన్ని చూసినట్లు జ్ఞాపకం"-
    మరి అట్నుంచి పట్టాలు దాటి రావాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతేగాదు; ఆ రెండో అమ్మాయి ఎవరు? చూసినట్లుందే.....
    'ఔను' 'కాదు' ల మధ్య వూగిసలాడిందతని మనసు.
    ఆ రెండో అమ్మాయి కూలివాని వెనకాతల చెంగున పట్టాలను దాటి ప్లాట్ ఫారం మీదికి ఎక్కిపోయింది.
    పద్మావతి, భాస్కరం దగ్గరపడుతుండగా, ఆ రెండో అమ్మాయి - సాయంతో ఎక్కుతున్నదల్లా మళ్ళా పడినంత పనిజేసి పట్టాల మీదికి దిగిపోయింది.
    "అయ్యో! ఇలాగయితే ఎలాగే..... అందుకే టెన్నిస్ ఆడమంటా నం"టూంది రెండో అమ్మాయి; పద్మని రెక్కపుచ్చుకుని మీదికి లాగుతూ.
    భాస్కరం దగ్గరకు వచ్చేడు.
    పద్మావతి, మీదికి ఎక్కగలిగింది ఎట్టకేలకు.
    "అమ్మయ్య! ప్రాణాలు పోయాయి" అన్నది.
    పద్మావతి భాస్కరాన్ని చూసింది.
    "పద్మా!" అందామనుకునాడు. గట్టిగా అరుద్దామనుకున్నాడు. పెదాలు విడలేదు భాస్కరానికి.
    పద్మావతి మిలమిలా మెరిసే కళ్ళతో; హృదయాన పులకించిన ఆనందమంతా చూబించాలన్నట్లు చూస్తూ ఉండిపోయింది రెండు క్షణాలు.
    ఆమె చూపులతన్ని గాఢంగా పెనవేసి కౌగలించినట్లు ఉక్కిరి బిక్కిరయ్యింది భాస్కరానికి.
    ఎదను పారిజాతాల జడివానయై కురిశాయి ఆ అమ్మాయి చూపులు!
    అతని చుట్టూ విద్యుల్లతలై మెరిశాయామె దృక్కులు!!
    "మరి ఇట్నుంచి దిగుదామా అంటే, రైలు వెళ్ళిపోతుందేమోనని భయమేసింది. దిగడానికి ఇంత పిసరేనా సందులేదు. అందుకని ఇదో మా 'సురేఖ' చెప్పినట్లు అవతలవేపు దిగిపోయామ్." సంజాయిషీ చెప్పుకున్నట్టు- తప్పు చేసినట్లు మాటాడింది పద్మ.


Next Page 

WRITERS
PUBLICATIONS