Next Page 
ఆఖరి మజిలీ పేజి 1

 

                         ఆఖరి మజిలీ
                                                 కాశీనాధుని సువర్చలా దేవి

                           

    అవి చైత్రమాసపు తోలి రోజులు
    వసంతం ప్రవేశిస్తూనే అన్ని దిశలా తానై, ప్రకృతి కాంత మీద వయ్యారం ఒలక పోస్తున్నది. లేత చిగుళ్ళతో , లేలేత ఎండలతో ప్రకృతి ఆహ్లాదకరంగా వుంది. కాని ఆరోజు మాత్రం ఎండ ఫేళ ఫేళా కాస్తున్నది -- ఇందిర మనసు లాగే!
    బెడ్ మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతూ ఎటూ పడక కుదరక పక్క మీదున్న దుప్పటి తన్నేసింది కోపంగా . పాశ్చాత్య సంగీతాన్ని తారా స్థాయిలో అందుకుని చెవిలో గోల పెడ్తున్న రేడియో ని బలంగా ఆపేసింది.
    అప్పటికి ఒక గంట క్రితమే తను ఇల్లు చేరింది. కాలేజీ నుంచి సరాసరి ఇల్లు చేరటం తన కెన్నడూ అలవాటు లేదు.తన ఉద్దేశ్యం కాలేజీ నుంచి ఏ హోటలు కైనా వెళ్ళి ఐస్ క్రీమ్ తిని -- అటు నుంచి నీరజ తో తోటలో స్వేమ్మింగ్ పూలు కెళ్ళాలనుకుంది. కాని తన ప్రోగ్రాం అంతా తారుమారయింది. ఇంటి కొచ్చి చల్లని నీళ్ళతో షవర్ బాత్ తీసుకున్నది. ఫ్రిజ్ లోంచి యాపిల్స్, ద్రాక్ష తీసుకుని తిన్నది. తడి ఆరని జుత్తు కి చల్లని గాలి మరింత హాయిని కలిగిస్తున్నా -- తన మనసు మాత్రం చల్లారటం లేదు. అవమానంతో ఉదికిపోతున్నది. ఆఫ్ట్రాల్ -- ఒక అనామకుడు -- ఏ రకమైన ప్రత్యేకతా లేని ఒక సామాన్యుడు -- తనని అవమానించేటంత మొనగాడా!
    శ్రీధర్ గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఇందిర మనసు లావాలా ఉడికిపోసాగింది. చిన్నప్పటి నుంచి విదేశాల్లోనే ఉండి ఆ సప్రదాయాలు, అక్కడి వేష భాషలు జీర్ణించుకు పోయిన తనకి కాలేజీ లో శ్రీధర్ ని చూడగానే చులకన భావం ఏర్పడింది. ధోవతి కట్టుకుని, లాల్చీ వేసుకుని కాలేజీకి వచ్చిన శ్రీధర్ ని ఒక వింత మృగాన్ని చూసినట్టు చూసింది. శ్రీధర్ తోటి అందరూ సరదాగా మాట్లాడేవారు. తను మాత్రం దూరంగానే ఉంటూ వచ్చింది. తన ఫ్రెండ్స్ అందరూ అతను చాలా మంచివాడు మెరిట్ స్టూడెంట్ అంటే నిర్లక్ష్యంగా తీసి పారేసింది.
    "తనకి 'కాలేజీ బ్యూటీ" అని పేరు."
    "ఆహా! ఎమిటావిడ అందం! 'నేనందంగా ఉన్నాను." అని ఆవిడకి అహంభావం!" నిర్లక్ష్యంగా శ్రీధర్ గొంతు.
    "కాదు లేవోయ్! ఆవిడ చాలా అందంగా ఉంటుంది."
    "ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయినా మాట్లాడుకోవలసిన విషయం లేనట్టు -- ఇందిర ఇందిర- అంటూ మొదలు పెట్టావు! ఇంకేదైనా మాట్లాడు!" ఈ సంభాషణ స్పష్టంగా తన చెవులతో తను' విన్నది. చూస్తున్న వాళ్ళను చిత్తరువుల్లా నిలబెట్టే అందం నీది. అంటుంది నీరజ.
    అగ్నికి వాయువు తోడైనట్టు -- అసలే నిరసన భావం కలిగిన తనకి, శ్రీధర్ మీద కోపం పెరిగిపోయింది.
    కళ్ళ ముందు జరిగిన సంఘటన సినిమా రీలులా తిరగసాగింది.
    "ఇందూ, ఇంకా నెలరోజులు కూడా లేవు పరీక్షలు -- బాగా చదువుతున్నావా?" ఆరోజు లేడీస్ రూము లో కూర్చుని వుండగా అడిగింది నీరజ.
    "ఇంకా లేదు -- మొదలు పెట్టాలి! ఎవరిదయినా మంచి నోట్సు దొరికితే బాగుండును!"
    "మంచి నోట్సం టే శ్రీధర్ దగ్గరే దొరుకుతుంది. కాని చాలా పౌడ్? ఇస్తాడా! చచ్చినా ఇవ్వడు.
    "ఎందుకని . నేనడిగితే కూడా ఇవ్వడా?"
    "ఇవ్వడు." ఖచ్చితంగా అంది నీరజ.
    "ఎట్లా ఇవ్వడో చూస్తాను! శ్రీధర్ దగ్గర నుంచి నోట్సు తీసుకోకపోతే చూడు ......! తప్పకుండా తీసుకు వస్తాను. దృడంగా అన్న తనను చూసి నీరజ నవ్వుతూ.
    సౌందర్యం -- నీ గొప్పతనం నీ హోదా వీటికి లొంగి నువ్వడగ్గానే ఇస్తాడనుకుంటున్నావా చిట్టి తల్లీ -- ఇంపాజిబుల్!"
    తనలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా సాధించి తీరాలనే కోరిక బలపడింది.
    'అంతటి మొనగాడా! నాలుగు రోజులిస్తేనే అతని చదువంతా పాడై పోతుందా?"
    "అతను మెరిట్ స్టూడెంట్ నాలుగు రోజులు కాదు గదా నాలుగు క్షణాలు కూడా ఇవ్వడు."
    "చూస్తాను! ఎలా ఇవ్వడో!" రోషంగా అంది తను.
    ఆ సాయంత్రం కాలేజీ లో ఫంక్షను. ఇంటి కెళ్ళి డ్రస్ చేసుకుని వచ్చారు తను, నీరజ.
    తెల్లని చెక్కిళ్ళు -- ఎర్రని పెదవులు -- లేత నీలి రంగు కళ్ళు-- నీ డ్రస్ -- నిన్ను చూస్తె భారతీయ యువతివని, అందులోనూ తెలుగు పిల్లవని ఎవ్వరూ పొరపాటున కూడా అనుకోరు!" అంది నీరజ నవ్వుతూ. మోకాళ్ళ పైకి ఆలివ్ గ్రీన స్కర్ట్ -- పాల నురగ లాంటి స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని- ముత్యాల దండ మెళ్ళో వేసుకుంటున్న తను నీరజను తేరిపార చూసింది.
    కనకాంబరం ఫ్యూర్ సిల్కు చీరలో నుదుట కుంకుమతో నీరజ కళకళలాడుతున్నది.
    నీరజంటే తన కెందుకో అంతులేని అభిమానం - ప్రేమ.
    "నీలాంటి వాళ్ళకు బాగుంటాయి గాని, నాకేమిటో ఆ చీరలంటే భయం నీరజా! అయినా ఆ డ్రస్ నాకు నప్పదు!" అంది తను.
    ఇద్దరూ కారులో కాలేజీ కి బయలుదేరారు.
    "ఎట్లాగైనా నీ జీవితం వడ్డించిన విస్తరి ఇందూ! నిన్ను చేపట్టేవాడెవడో గాని చాలా అదృష్ట వంతుడు!" అంది నీరజ ఇందిరను వాత్సల్యంగా చూస్తూ.

                 
    "పోదూ ! పెళ్ళంటే నాకు మంచి అభిప్రాయం లేదు. హాయిగా ఆడుతూ పాడుతూ లల్లీగా గడపక ఎందుకొచ్చిన బాదర బందీ!"
    ఇట్లా మాట్లాడుకుంటుండగానే కాలేజీ చేరుకున్నారు.
    అప్పటికి ఫంక్షన్ మొదలు పెట్టలేదు. కాని కుర్చీలన్నీ నిండిపోయాయి. వెనగ్గా కూర్చున్నారిద్దరూ. ఇంతలోనే సూర్యం, రవి, శ్రీధర్ వరసగా వచ్చారు. ఇందిర పక్క సీటు ఖాళీగా ఉండటం వలన శ్రీధర్ ఇందిర పక్కనే కూర్చున్నాడు.
    నీరజ ఇందిరా వంక చూసి చిన్నగా నవ్వింది. అతన్ని నోట్స్ అడగమన్నట్లు కను సైగ చేస్తూ .
    "మిస్టర్ శ్రీధర్! చిన్న రిక్వస్ట్!" అంది తను వినయంగా.
    అతను ఇటు తిరిగి ఏమిటన్నట్లు చూశాడు. తను పలాకరించినప్పుడు ముఖంలో ఏ భావమూ ప[ప్రస్పుటము కాలేదు సరికదా "ఏమిటని" అడగనైనా అడగలేదు.
    "మీ ఫిజిక్స్ నోట్సు ఒకసారి ఇస్తారా! నాలుగు రోజుల్లో ఇచ్చేస్తాను." అంది తను రోషాన్ని నిగ్రహించుకుంటూ.
    "నోట్సా! సారీ! ఏమనుకోకండి!" అన్నాడు ముభావంగా.
    చెంపమీద కొట్టినట్టయింది. ఇంతలో క్లాస్ మేట్ శారద వచ్చింది హడావుడిగా.
    "శ్రీధర్ నోట్స్ తెచ్చారా?' అంది ఆత్రంగా.
    "ఆ కాని నాకు రెండు రోజుల్లో ఇచ్చేయాలి. అంటూ నోట్సు అందిచ్చాడు.
    "ఒకే." నల్లగా పాము లాంటి జడ ఊపుకుంటూ వెళ్ళిపోయింది శారద.
    అంతటితో ఊరుకోక తనవేపు చూసి చిరునవ్వు నవ్వాడు. మొగుడు కొట్టినందుకు కాదు -- తోడికోడలు నవ్వినందుకు -- అన్నట్టయింది తన పని.
    తనడిగితే ఇవ్వనివాడు, తన ఎదురుగుండా శారద కి నోట్సు ఇస్తాడా! పోనీ ఆ సంగతి చెప్పవచ్చు గదా! "శారద కిస్టానన్నాను-- తరువాత ఇస్తాను!" అని - ఎంత పొగరు -- ఒక్క ఉదుటున లేచి వచ్చేసింది.
    తన వెనకాలే నీరజ కూడా వచ్చేసింది.
    అప్పటి నుంచీ తను పగ బట్టిన త్రాచులా సమయం కోసం ఎదురు చూడసాగింది.
    విధి తన కనుకూలించింది. ఆరోజు కాలేజీకి బయలుదేరబోతుంటే ఫోను వచ్చింది. అది శారద దగ్గర నుంచి. శారద తన తమ్ముడి చేత ఫోను చేయించింది. తనకి జ్వరంగా ఉండటం వలన తను కాలేజీ కి రావటం లేదని -- దోవలోనే తన ఇల్లు కాబట్టి కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చి శ్రీధర్ నోట్సు తీసుకెళ్ళి శ్రీధర్ కి అప్పగించమని చెప్పింది.
    రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది తన పని. నీరజ కూడా కాలేజీ కి రావడం లేదు. తన పధకం పారింది అని సంతోషంతో. శారద ఇంటి కెళ్ళి శ్రీధర్ నోట్స్ తీసుకుంది. అసలది శారద తెరిచి చూడనైనా చూడలేదుట.కాని శ్రీధర్ ఏమయినా అనుకుంటాడని ఇచ్చేస్తున్నాని, జాగ్రత్తగా ఇమ్మని పది సార్లు చెప్పింది శారద. తను నోట్సు తీసుకుని కాలేజీ కి వెళ్ళకుండా ఇంటిదారి పట్టింది. కాలేజీ కంటూ వెళ్ళి వెంటనే తిరిగొచ్చిన తనని చూసి తండ్రి "అదేమిటి అప్పుడే వచ్చేశావని అడిగితె తలనొప్పిగా ఉందని అబద్దం చెప్పి సరాసరి తన గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుని నోట్సు తెరిచింది. అందులో నుంచి కాగితం ఒకటి జారి పడింది. ముత్యాల్లాంటి అక్షరాలతో శ్రీధర్ ఏదో వ్రాసుకున్నాడు. తన ఊహా సుందరిని-- తన ప్రియురాలిని శ్రీధర్ కవిత్వం వ్రాస్తాడని వినటమే గాని చూడలేదు ఆ పద్యాలలోని భావం అర్ధమయింది కాని కఠినమైన పదజాలం మాత్రం తన కర్ధం కాలేదు. ఇంతలో తన కర్తవ్యం గుర్తు కొచ్చింది. ఆ కాగితాన్ని పక్కన పెట్టి నోట్సు తీసి గబగబా కాగితాలన్నీ చించి పోగులు పెట్టింది. కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నవన్నీ తీసి ఓపిగ్గా చించింది. అయినా తన కసి తీరలేదు. ఇంకా ఏదో చెయ్యాలి. ఇంతలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది తనకి. అవును ఈ కాగితం తనకి -- అంటే తన నుద్దేశించి వ్రాసినట్టుగా ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తే ఆ దెబ్బతో శ్రీధర్ పనయిపోతుంది. అవును అలాగే చేయ్యాలి అని మర్నాడు అక్షరాల తన ఆలోచనని ఆచరణ లో పెట్టింది.


Next Page 

WRITERS
PUBLICATIONS