Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 9


    గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే పగా, ప్రతీకారాలు యిక్కడ ముఖ్యం. నువ్వు చేయగలవు- కానందులో నా మీద కృతజ్ఞత మాత్రమే వుంటుంది. హతమార్చవలసిన వ్యక్తులపై వ్యక్తిగతమైన పగ, ప్రతీకారాలుండవు. పర్సనల్ డ్రైవింగ్ ఫోర్స్ నీలో వుండదు. అఫ్ కోర్స్ - నీకు తెలీకుండానే నీలో ఏ మూలో ఆ డ్రైవింగ్ ఫోర్స్ లోపిస్తుంది.

    దానిమూలంగా అనుకున్నవి అనుకున్నట్టుగా, అనుకున్న టైమ్ కి జరగవు. దానిమూలంగా నేను నా జీవిత ధ్యేయాన్ని త్యాగం చేసుకోవలసి వస్తుంది. బయట ఉండి నువ్వు చేయవలసిన పని కూడా ఎంతో రిస్కుతో కూడుకున్నదే- ఇక వెళ్ళిరా. వాళ్ళు తయారవగానే మన వాళ్ళనీ తయారు చేయ్- నా జీవితం చివరిఘట్టంలో జరగబోతున్న ఆఖరి పోరాటం ఆరంభం కాబోతోంది. గుడ్ బై" అంటూ రామదాసు కిట్టూ చేతివేళ్ళను ఆప్యాయంగా స్పృశించి లోపల కెళ్ళిపోయాడు వడివడిగా.

    ఎన్నాళ్ళగానో పనిలేక గోళ్ళు గిల్లుకుంటున్న తమ బ్యాచ్ కి చేతినిండా పని తగలబోతోంది. ఆయుధాలు బయటకు రాబోతున్నాయి....ప్రాణాలు రెపరెపలాడడం ఖాయం అని స్వగతంలో అనుకుంటూ బయటకెళ్ళిపోయాడు కిట్టూ.


                          *    *    *    *


    He will be hanged by neck till he is dead...." జడ్జీ అన్న పై మాటలే వివేక్ మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకే లంచ్ కోసం ప్లేట్ చేతబట్టుకొని క్యూలో నించున్నా యాంత్రికంగా కదిలి ముందుకెళుతున్నాడే తప్ప ఈ ప్రపంచంలో లేడు.

    వివేక్ నే శ్రద్ధగా పరికిస్తున్నాడు రామదాసు. రామదాసు మనసులోకి ఆలోచన రానేలేదు. వస్తే అది వాస్తవరూపం ధరించేవరకు నిద్రపోడు.

    వివేక్ సత్తుపల్లెంలో పెద్ద అన్నం ముద్ద, గరిటెడు సాంబారు పడ్డాయి.

    మరికొంచెం ముందుకెళ్ళి నించున్నాడు. కానీ భోజనం చేయటం లేదు.

    అంతలో అనుకోని సంఘటన జరిగింది. జస్పాల్ అనే ఖైదీ దృష్టి వివేక్ మీద పడింది.

    "నీకు ఆకలిగా లేనట్లుంది. నాకు పెట్టేయ్" అంటూ వివేక్ వైపు చేయి చాపాడు జస్పాల్.

    చటుక్కున స్పృహలోకొచ్చి వివేక్ ఒకింత భయంగా వెనక్కి తగ్గి ప్లేట్ ని తనకు మరింత దగ్గరగా జరుపుకొన్నాడు.

    "నీ ప్లేట్ ని నా ప్లేట్ లో వంచుబే" తిరిగి అన్నాడు జస్పాల్ జబర్దస్తీగా. జస్పాల్ ఆ నగరంలో చిన్నసైజు గూండా.

    "పెట్టుబే...." జస్పాల్ అంతకంతకు రెచ్చిపోతున్నాడు. ఇదంతా దూరం నుంచి రామదాసు గమనిస్తూనే వున్నాడు.

    అప్పటికే వివేక్ జైల్లో దారుణమైన అనుభవాల్ని ఎదుర్కొన్నాడు. తరచూ జైలుకొచ్చే రౌడీలు, గూండాలు వివేక్ ని విసిగించటం, బాధించటం మామూలైపోయింది.

    సీనియర్ రౌడీలు, గూండాలు జైల్లో గ్రూప్స్ తయారు చేసుకొని వివేక్ లాంటి మెత్తటివార్ని, కొత్తగా జైలుకొచ్చినవార్ని బెదిరించి, భయపెట్టి సర్వెంట్స్ గా వాడుకోవడం జైల్స్ లో సర్వసాధారణం.

    ఒకరాత్రి జరిగిన అతిదారుణమైన సంఘటన వివేక్ కి తీవ్రమైన డిప్రెషన్ కి గురిచేసింది.

    జైల్స్ లో- మెన్స్ హాస్టల్స్ లో- మిలటరీలో హోమో సెక్స్ సర్వసాధారణమైన విషయం.

    అది తెలీని వివేక్ ఆదమరిచి నిద్రపోతుంటే దాడి జరిగింది- పర్ వర్డెడ్ సెక్స్ అతనిపై ప్రజ్వరిల్లింది. అలాంటి హేయమైన అనుభవం అతడ్ని అప్పటికే పీడకలలా వెంటాడుతోంది.

    ఆ రోజు నుంచే మోకాళ్ళ మధ్య తల దూర్చి ఏడ్వడం తగ్గించుకొని, తనను తాను కాపాడుకొనే ప్రయత్నంలో పడ్డాడు. రెసిస్ట్ చేయకుంటే జైల్లో తన జీవితం మరింత దుర్భరమవుతుందని భావించాడు.

    కానీ మొండిగా ఎలా ఎదురుతిరగాలో తెలీక తన అసమర్ధతకి తానే చింతిస్తూ గడుపుతున్నాడు.

    "మర్యాదగా అడిగితే యివ్వవుగా...." అంటూ జస్పాల్ వివేక్ చేతిలోని ప్లేట్ ని లాగేసుకొని ఒక్క తోపు తోశాడు.

    ఊహించని ఆ పరిణామానికి వివేక్ నాలుగడుగులు ఆవలకెళ్ళి దబ్బున కింద పడిపోయాడు.

    జస్పాల్ వివేక్ ప్లేట్ లోని అన్నాన్ని తన ప్లేట్ లోకి ఒంపుకొని, ఖాళీ ప్లేట్ ని వివేక్ ముఖం మీదకు విసిరి వెళ్ళిపోయాడు.

    వివేక్ కళ్ళవెంట నీరు.... అలా కూలబడిపోయే, లోలోన రోదించాడు తప్ప లేవలేకపోయాడు. లేచి ప్రతిఘటించలేకపోయాడు.

    "నీకు సిగ్గుగాలేదు....? నీ నోటిముందు కూడుని లాగేసుకుపోతే అసమర్ధుడిలా చేతులు ముడుచుకు కూర్చున్నావేం....?" రామదాసు నెమ్మదిగా వివేక్ దగ్గరకు వచ్చి....అతను లేచేందుకు చెయ్యి అందిస్తూ అన్నాడు.

    "నా ఖర్మ సార్! నా ప్రారబ్ధం. ఇలా తగలడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు?" అన్నాడు వివేక్ చిన్నపిల్లాడిలా కళ్ళొత్తుకుంటూ.

    రామదాసు నవ్వాడు.

    ఆపైన కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయాడు.

    అయిదారు వందలమంది ఖైదీలు సందడిగా అరుస్తూ, కేకలేసుకుంటూ భోజనాలు చేస్తున్నారు. సెంట్రీలు అప్రమత్తంగా వారినే గమనిస్తూ పహరా కాస్తున్నారు. ఖైదీలు ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటుంటారు. అక్కడ ఆధిపత్యం కోసం.

    ఆ సందర్భంలో వాళ్ళు గాయపడినా, (ఒక్కోసారి చనిపోవటం కూడా జరుగుతుంటుంది) పై అధికారుల నుంచి మందలింపు, అక్షింతలు తప్పవు.

    "మీ అమ్మ చెప్పినట్టు జైలునుంచి తప్పించుకుని, మీ కుటుంబాన్ని నాశనం చేసిన వారిమీద పగ తీర్చుకోరాదూ....!" వున్నట్టుండి అన్నాడు రామదాసు.

    వివేక్ ముందు ఆశ్చర్యపోయి చూశాడు రామదాసువైపు ప్రపంచ వింతను చూసినట్లు.

    "ఇక్కడ ఎదురవుతున్న ప్రత్యక్ష నరకం నుంచి పరిపోవాలనే వుంది. కానీ ఎలా....?" మరోరకంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు.

    "సెభాష్....కానీ పగ తీర్చుకోవటానికి కాదన్నమాట. ఇక్కడ తోటి ఖైదీలు పెడుతున్న నరకం భరించలేక అంతేనా?"

    వివేక్ మాట్లాడలేదు. మౌనంగా వుండిపోయాడు.

    "జైల్లోంచి ఏ ఖైదీ అయినా ఎందుకు తప్పించుకోవాలనుకుంటాడో తెలుసా? పగ, ప్రతీకారాలు తీర్చుకోటానికి- లేదా ఫాల్స్ ఐడెంటిఫికేషన్ తో బయట సరదాగా బ్రతికేందుకు. కానీ నువ్వు జైలు జీవితపు నరకాన్ని తప్పించుకోవటం కోసం. కనీసం ఉరిశిక్ష నుంచి తప్పించుకోవటం కోసం కూడా కాదు....!"

    రామదాసు మాటల్లో వున్న వ్యంగ్యాన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకుడేంకాదు వివేక్. అందుకే అతని ముఖం ఒకింత పాలిపోయింది.

    "తప్పించుకోవాలనే వుంది- కానీ ఎలా అని అడిగావ్ గుర్తుందా?" రామదాసు అంటుండగానే వివేక్ భయపడిపోయి దూరం నుంచి తనకేసి చూస్తున్న సెంట్రీని చూపించాడు.

    "నీ భయాన్ని నాకు నేర్పేలా వున్నావు.... గ్రేట్ ఎస్కేప్ సినిమా చూశావా? భోంచేసే సత్తుపళ్ళాలతో మూడువందల గజాల సొరంగాన్ని రెండు నెలలపాటు తవ్వి బయటపడ్డారు ఖైదీలు. తప్పించుకోవాలని మనస్సులో స్థిరంగా అనుకోవాలేగాని అదేమంత కష్టసాధ్యం కాదు."

    వివేక్ వణికిపోతూ చూశాడు రామదాసువైపు.

    "మీ కుటుంబాన్ని నాశనం చేసినవారిమీద నీకు పగ తీర్చుకోవాలని లేదా?"

    "ఊ....ఉంది....కాని ఎలా....?"

    "నీ పరంగా ప్రతిదీ ప్రశ్నతో ఆరంభం కావటం చిరాగ్గా వుంది. నీపై నీకు నమ్మకంలేదు. నీ శక్తిపై నీకు నమ్మకం లేదు. ముందు అది రావాలి. ఎలా....అని ప్రతిదానికి ప్రశ్నిస్తున్నావుగా- ఇప్పుడే చూపిస్తాను. నేను చెప్పినట్లు చేస్తావా....?"

    శాసిస్తున్నట్లుగా అడిగిన రామదాసువైపు చూసి చేయలేనని అనలేకపోయాడు వివేక్.

    "జస్పాల్ ని నేను ఇక్కడికి రప్పిస్తాను. కళ్ళు మూసుకుని, ధైర్యాన్ని కూడదీసుకుని, లాగిపెట్టి ఒక్కటివ్వు-ఇవ్వగానే జస్పాల్ కేసి చూడకుండా, ఎటో తిరిగి నిర్లక్ష్యాన్ని నటించు. ఏం జరుగుతుందో చూద్దూగాని. అతను నిన్నేం చేయకుండా, ఇకపై నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నాపై నమ్మకముంచు" రామదాసు మెస్మరైజ్ చేస్తున్నట్లుగా అన్నాడు.

    ఎందుకో, ఏమిటో తెలీకపోయినా వివేక్ క్రమంగా రామదాసు మెస్మరిక్ స్పెల్ లో పడిపోతున్నాడు.

    దానికితోడు ఒకింత ఆసక్తి కూడా అతనిలో చోటుచేసుకుంది. ఏ మూలో ప్రతీకారపు ఛాయ లేకపోలేదు.

    "చేస్తాను" అన్నాడు వివేక్ తన కాళ్ళ దగ్గర పడున్న తన సత్తుపళ్ళాన్ని చూస్తూ.

    వివేక్ మాటల్లో ఓ విధమైన స్థిరత్వాన్ని పసిగట్టాడు రామదాసు.

    వెంటనే జస్పాల్ కోసం కబురుపెట్టాడు పెక్కనే వున్న ఓ ఖైదీతో.

    రామదాసు అవిటివాడే అయినా- మాజీ గూండా అయినా, చిల్లర గ్యాంగులకి, గూండాలకు, రౌడీలకు ఓ విధమైన గౌరవమేకాదు- భయం కూడా.

    మొండిగా, మూర్ఖంగా భుజబలంతో నేరాలు చేయటం వేరు. తెలివిగా చట్టంలోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని, చట్టానికి దొరక్కుండా నేరాలు చేయటం వేరు.

    ఇదుగో....ఇలాంటి చౌరస్తా దగ్గరే రామదాసు మిగతావారినుంచి ప్రత్యేకంగా గుర్తించబడతాడు.

    వివేక్ పరంగా రామదాసు చెప్పింది కేవలం సాహసమే కాదు- దుస్సాహసం కూడా.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS