3. తెల్ల తెల్లని - మబ్బుల బోలిన
పెద్ద పెద్ద భవ | నమ్ములలోన |
మెల్ల మెల్లగ - మెట్లవెంబడి
కూడినడయాడు - రమణుల సందడి
ఒడ్డాణపు చిరు | గజ్జల రవళి
ఘల్లుఘల్లుమను - అందెల సవ్వడి |
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
4. బుగ్ యజుస్సా | మ వేదత్రయమును
అధ్యయనము చే | యు యాతుదానులు
అరివీరులను - అగ్నిగుండముల
మారణ హోమము - చేయు మాంత్రికులు |
యజ్ఞ దీక్షితులు - జటాధారులు
ముండితులు ద | ర్భ ముష్టిధారులు |
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
5. ఏక కర్ణులు - ఏకాక్షులు
లంబోదరులు - వికృత రూపులు |
ధనుర్ధరులు - ఖడ్గధారులు |
వివిధ కవచముల - దాల్చిన వారలు |
అస్త్రశస్త్రముల - దాల్చిన యోధులు
వీరవిహారులు - కామరూపులు |
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
6. నల్లనివారు - తగు పొడగరులు
దృఢకాయులు - తేజోవంతులు
కనకమణిమయ భూషణధారులు
స్త్రీలోలురు మ | ధుమాంస ప్రియులు
నిశాచరులు - నరహంతకులు
విచ్చలవిడిగా | విహరించువారలు
వెన్నెలలో లం | కాపురి శోభను
శోధనగా హ | రీశుడు గాంచెను .... ||శ్రీ||
__:- 4 వ. స. సంపూర్ణము :__
5వ. సర్గ
1. ఆలమందలో - వృషభేంద్రునివలె
మందరగిరి గుహ - మృగరాజువలె |
రజిత పంజరా | న రాజహంసవలె
బంగరు పొన్నుల - దంతివోలె |
కాంతిలక్ష్మిక | ళా నిలయమువలె |
విజయ విరాజిత - రాజేంద్రునివలె |
వెలిగెడు పూర్ణ శ | శాంకుని కాంతిలో
వెదకెను సీతను - మారుతి లంకలో ... ||శ్రీ||
2. మధువుగ్రోలి మ | త్తిల్లిన రమణులు
దిస మొలలతో | శయనించు స్త్రీలు
మురిసి మురిపించు - కామినీమణులు
అతిరతి కెగసే | మిఠారి కొమ్మలు |
పరవశ మొందించు - ఆటలు పాటలు
అందెవేసిన - మోహనాంగనలు |
కామక్రీడల - లంక తేలగ
కపివరుడు గాంచె - పరిశీలనగ ... ||శ్రీ||
3. మేలిమి బంగరు - మేనికాంతుల
రాజిల్లెడు ఉ | త్తమజాతి స్త్రీలు |
మేడలపై విహ | రించు యువతులు
ప్రియాంకముల సు | ఖించు కామినులు |
డెందమున కుందు - విరహక్లాంతలు
వెలవెల బోయెడు - చంద్రవదనలు |
కామక్రీడల - లంకతేలగ
కపివరుడు గాంచె - పరిశీలనగ ... ||శ్రీ||
4. మనమున రాముని | విడువక దలచు
క్షణమొక యుగముగ - గడువక గడుపు |
ధరణీజాత - సీతామాత
ధర్మచరిత మ | హా పతివ్రత |
ఈ కామాంధుల కలసి యుండునని
ఇందు వెదకుట - మతిలేక యని |
లలిత కుసుమలత - సీతను గానక
మారుతి వగచె మ - రేమి తోచక .... ||శ్రీ||
__: 5 వ. స. సంపూర్ణము :__
6వ, సర్గ
1. మూలబలముల - పరివేష్టితమై
గిరి శిఖరాన - ప్రతిష్టితమై
నవ రత్న ఖచిత - స్వర్ణమయమై
దివ్యకాంతుల - దీప్యమానమై |
బంగారు తోరణ - శృంగార మొలుకు
స్వర్గ పురముతో | సరితూగ కులుకు |
లంకేశ్వరుని - దివ్య భవనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది | .... ||శ్రీ||
2. సుందరమైన - హేమ మందిరము
రత్న ఖచితమౌ - సింహద్వారము |
పతాకాంకిత - ధ్వజాకీర్ణము
నవరత్న కాంతి - సంకీర్ణము |
నృత్య మృదంగ గం | భీరనాదితము
వీణాగాన వి | నోద సంకులము |
లంకేశ్వరుని - దివ్య భవనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది | ... ||శ్రీ||
