Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 5


    వెంకట్రామయ్య ఒకవేళ రైల్వే ప్రయాణానికి ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్న పక్షంలో అది సాధారణంగా కాన్సిల్ చేసి తీరతాడు. కాన్సిల్ చేసుకునే అవకాశం లేదని తెలిస్తే అయన రిజర్వేషన్ చేయించుకోడు. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల కాయన బస్సులోనే ప్రయాణాలు చేస్తాడు.
    కోడల్ని పుట్టింట్లో దిగబెట్టటానికి రెండో కొడుకు రాజారావు వస్తున్నాడని వెంకట్రామయ్యకు తెలిసింది. కొడుకు వచ్చేసరికి తను లక్ష్మీ పెళ్ళి వ్యవహారం నిశ్చయం చేసి ఆశ్చర్యపరచాలని అనుకున్నాడాయన. అందుకే ఆర్టీసీ బస్సులో బయల్దేరి హైదరాబాద్ వెళ్ళాడాయన.
    హైదరాబాద్ లో దిగగానే అయన ముందుగా హోటల్లో దిగి కాలకృత్యాలు ముగించుకుని నీటుగా ముస్తాబై వాకబు చేసుకుంటూ భీమరాజు గారింటికి వెళ్ళాడు. నిదానం ఒకోసారి పనిచేస్తుంది. ఉదయం పదకొండు గంటలకు వాళ్ళింటికి వెడదామనుకున్న అయన సాయంత్రం అయిదున్నరకు వెళ్ళగలిగాడు. అదే మంచిదయింది. పదకొండు గంటలకైతే తండ్రీ కొడుకు లిద్దరూ ఆఫీసులో వుంటారు. అయిదున్నర కిద్దరూ ఇంట్లోనే వుంటారు.
    వెంకట్రామయ్య ఎవరో తెలియగానే ఆయనకు చాలా మర్యాదలు జరిగాయి. వెంకట్రామయ్య కా యిల్లూ, పరిసరాలూ వాతావరణం తన యింటిని గుర్తుచేశాయి. భీమరాజుకు అయిదుగురాడపిల్లలూ, అయిదుగురు మగపిల్లలూ. ఇంట్లో అందరికీ మంచి సంస్కారమున్నట్లు కనబడుతోంది. భీమరాజుగారబ్బాయి బాబురావు పెద్దల పట్ల వినయ విధేయతలు గలవాడు. మాత్రంకాక మనిషి అందంగా కళగా వున్నాడు. వెంకట్రామయ్య మనసు నిండా తృప్తి చోటు చేసుకుంది. తన కూతురీ యింట్లో సుఖపడుతుందని ఆయనకు అనిపించింది.
    వెంకట్రామయ్య హోటల్లో దిగినందుకు భీమరాజు నొచ్చుకున్నాడు. మరోమాటలా చేయవద్దని మరీమరీ అన్నాడు. వెంకట్రామయ్య ----"మనం మళ్ళీ మళ్ళీ కలవ్వలసిన వాళ్ళమే కదండీ ఇంకోసారి అలాగే చేద్దాం -- మీరు మాత్రం మా ఊరొచ్చినప్పుడు పట్టుదల కొద్దీ హోటల్లో బస చేయాలనుకుంటే మాత్రం కుదరదు. మా ఉళ్ళో హోటళ్ళు లేవు సరిగదా - కొత్త వారెవరైనా వస్తే మా చుట్టాలు కానివారు కూడా మా ఇంట్లోనే మకాం చేస్తారు " అన్నాడు.
    "వియ్యమందుకునే వాళ్ళం మనకి పంతాలు పట్టింపు లూ ఎందుకండీ ' అన్నాడు భీమరాజు.
    ఆయనలాగనడం వెంకట్రామయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. పెళ్ళికొడుకు తండ్రి అయన. ఇంకా పిల్లనైనా చూడకుండా సంబంధం స్థిరమైనట్లు మాట్లాడుతున్నాడు. మనిషి బొత్తిగా కల్మషం తెలియని వాడైనా అయిండాలి. లేదా ఈ వ్యవహారంలో ఏదైనా మోసముండి వుండాలి.
    "వీలు చూసుకుని పిల్లను చూసుకుందుకు రండి బావగారూ" అన్నాడు వెంకట్రామయ్య.
    "వస్తామనుకొండి , కానీ ఏదో లాంచనప్రాయంగా మాత్రమే. ఎందుకంటె మీ కుటుంబపు సంప్రదాయం మాకు తెలుసు. అందుకని అన్నీ నిశ్చయమైనట్లే భావించండి. మీ కభ్యంతరం లేకుంటే అన్నీ యిప్పుడే మాట్లాడేసుకుందాం. పిల్ల గురించి ,మాకేం సందేహం లేదు. మాకు సంప్రదాయం ముఖ్యం గానీ అందచందాలతో నిమిత్తం లేదు. అయినా అందాన్ని కొరుక్కుతింటామా చెప్పండి" అన్నాడు భీమరాజు.
    వెంకట్రామయ్య చిన్నబుచ్చుకుని "మీ మాట కాదనను కానీ కోరుక్కుతిన్నా తినకపోయినా మా పిల్ల అందంగానూ వుంటుంది." అన్నాడు.
    భీమరాజు నవ్వేసి "నా అభిప్రాయం అది కాదు బావగారూ. సత్సంప్రదాయం గల రెండు కుటుంబాల కలయికకు అందంతో నిమిత్తముండదని మీకు చెప్పాలనుకున్నాను. అందుకే అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడేసుకుందామంటున్నాను" అన్నాడు. వెంకట్రామయ్య మాట్లాడకపోవడం చూసి "ఏ పనైనా నాకు వాయిదా వేయడానికి కిష్టముండదు. అన్నీ నచ్చితే వేరే ఆలోచన లెందుకనేది నా మనస్తత్వం. ఏ అభ్యంతరాలూ లేవని నేనంటున్నప్పుడింకా ఇతర లంచనాలన్నీ ముగిసే దాకా మాటలెందుకు ఆపడం/ వీలైనంత త్వరలో మా అబ్బాయి పెళ్ళి జరిపించేయాలని తొందర పడుతున్నాను.' అన్నాడు మళ్ళీ.
    వెంకట్రామయ్య చిన్నగా ఇబ్బందిగా నవ్వాడు - "మీ సంగతి చెప్పారు కదా బావగారూ - ఇక నా సంగతి నన్ను చెప్పనివ్వండి . ఏ పనీ వెంటనే చేయలేను నేను. నెమ్మది మీద బాగా అలోచించి చేస్తాను. మీకు నా మీద యింత గౌరవముంటుందని నేనూ హించలేదు. ఊహిస్తే ముందుగానే అన్నీ అలోచించి ఉంచుకునేవాడిని. కాబట్టి నాక్కాస్త సమయం కావాలి. ముందుగా మీరో మంచిరోజు చూసుకుని- పెళ్ళి చూపులకు రండి. తర్వాత తాంబూలాలుచ్చుకునేటప్పుడు ఎలాగూ అన్ని విషయాలు మాట్లాడేసుకుంటాం."
    బీమరాజు ఇంకేమీ అనలేదు. పురోహితుడితో మాట్లాడి ముహూర్తం నిశ్చయించి ఉత్తరం రాస్తామని చెప్పాడాయన. కూతురి జాతకాన్నాయన భీమరాజు కదించి - బాబూరావు జాతకం తీసుకుని వెళ్ళిపోయాడు.
    వెంకట్రామయ్య వెళ్ళిపోయాక బాబూరావు చిరాగ్గా తండ్రి వంక చూసి -----'ఆయనేమో నిమ్మకు నీరెత్తినట్లుంటే -- మీరేమో హడావుడి పడిపోతున్నారు - ఇంతకూ ఇప్పుడాడపిల్ల పెళ్ళి చేస్తున్నదీ ఆయనా లేక మీరా? అన్నాడు.
    భీమరాజు కొడుకు వంక చూసి అదోలా నవ్వాడు -----"ఒరేయ్ మనకూ అయిదుగురాడపిల్లలున్నార్రా- మనం మగ పెళ్ళివారనుకునే టప్పుడా విషయాన్ని మరిచిపోను నేను -----"
    
                                                  5

    భార్యను పురిటికి పుట్టింట్లో దిగవిడిచి వచ్చిన రాజారావును గుమ్మంలోనే పలకరించాడు వెంకట్రామయ్య - "ఎరా కోడల్ని సరాసరి పుట్టింట్లో వదిలి పెట్టకపోతే ముందుగా యిక్కడ కొన్నాళ్ళు ఉంచకూడదా -- మీ అమ్మకు చాల కోపంగా వుంది ---'
    "అన్నీ వివరంగా ఉత్తరం రాశాను గదా - తనకు ఆరోగ్యం బొత్తిగా బాగుండడం లేదు. వాళ్లూర్లో తన శరీరతత్వం బాగా తెలిసిన ఫామిలీ డాక్టరుంది ....'
    'సరేలే - అదంతా పాతపాటే కానీ - రేపొద్దున్న లక్ష్మీని చూసుకుందుకు పెళ్ళి వారోస్తే ఇంటి కోడళ్ళు ఇద్దరూ కూడా వుండరని బాధగా వుంది. వాడేమో తిరుపతి వెళ్ళొచ్చి పెళ్ళి వారోస్తార్రా నాల్రోజులాగరా అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో సరేసరి - సరాసరి మామగారి దర్శనం చేసుకుని కోడల్నక్కడ దిగవిడిచి వచ్చావు .....మీకు బాధ్యత లేప్పటికి తెలిసోస్తాయో - ఏమిటో ......?"
    "లక్ష్మీని చూసుకుందుకు పెళ్ళి వారోస్తున్నారా - ఎప్పుడు ?" ఆత్రుతగా అడిగాడు రాజారావు.
    "ఏమో - ఎప్పుడో నాకూ తెలియదు. నావిధి నేను చేసి వచ్చాను. అబ్బాయిదీ హైదరాబాదు. సంప్రదాయమైన కుటుంబం. మనం వాళ్ళకు నచ్చాము. ఏదో లాంచనప్రాయంగా పెళ్ళి చూపులకు వస్తున్నాం కానీ - సంబంధం స్థిరపడిందనే అనుకోమన్నారు. బహుశా ఈ వేసంగుల్లో లక్ష్మీకి పెళ్ళి అయిపోయినా ఆశ్చర్యం లేదు ----" అన్నాడు వెంకట్రామయ్య.
    రాజారావు ఆశ్చర్యంగా తండ్రి వంక చూసి ----"ఎలా వచ్చింది నాన్నా -- ఈ సంబంధం మీదాకా?" అనడిగాడు.
    వెంకట్రామయ్య అన్నీ వివరంగా చెప్పి -----"పెళ్ళి కుదుర్చుకోవడమంటే  చెప్పులరిగేలా తిరగడం కాదురా - సమయం కోసం కాచుకునుండి- సమయం రాగానే సంబంధాన్ని పట్టడం . పెళ్ళిళ్ళు దైవనిర్ణయాలు. ఘటన ప్రకారం అలా జరిగిపోవలసిందే. ఆ టైము వచ్చేవరకూ మనం చేసిన ప్రయత్నాలన్నీ వమ్మైపోతాయి. టైమొచ్చిందంటే - మనం వద్దనుకున్నా పెళ్ళి జరిగిపోతుంది. అనుభవం నాకు నేర్పిన విషయమిది. ప్రతిదానికి మీ కుర్రాళ్ళూరికె హడావుడి పడిపోతుంటారు. ముఖం మీద అనలేక ఊరుకున్నా చాటుగా అయినా నాకు బద్దకమనుకుంటుంటారు. ఏమనుకోకండి. ఇప్పుడు లక్ష్మీ పెళ్ళికి టైమొచ్చేసింది- పెళ్ళి స్థిరపరిచే బాధ్యత నాది. మిగతా ఏర్పాట్లతో మీరు సిద్దంగా వుండండి ' ----అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS