లేదంటే రోజురోజుకీ నేరాలు పెరిగిపోతూనే వుంటాయి. వాటితో పాటు చిక్కుముడి విడని కేసులు నేరపరిశోధక శాఖల్లో పేరుకు పోతూనే వుంటాయి. అమాయక ప్రజలు రాజకీయ నాయకులూ, పోలీసులు, క్రిమినల్స్ ఆడుకొనే చదరంగంలో బలయిపోతూనే ఉంటారు. -రచయిత)
* * * * *
"ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. బట్ నా అవసరానికి సరిపడే రైఫిల్ ని తయారుచేసివ్వాలి..." జోహ్రా బేస్ వాయిస్ లో అన్నాడు.
"మంచి ఆఫర్...చెప్పండి...ఎలా వుండాలి?" త్యాగరాజన్ పాన్ పరాగ్ టిన్ ఓపెన్ చేసి ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసుకోబోతూ ఒక్కక్షణం ఆగి అన్నాడు.
"ముఖ్యంగా ఆ రైఫిల్ నా భుజం నుంచి రిస్టు అంత పొడవే వుండాలి. బాగా సన్నగా ఉండాలి. నేను ఫుల్ హేండ్స్ షర్టు వేసుకొని దాన్ని నా కుడిచేతికి బయటవాళ్ళకు కనిపించకుండా కట్టుకోగలగాలి. నా మోచేయి వంగేచోట రైఫిల్ కూడా ఫోల్డ్ అవ్వాలి. నేను ఎయిమ్ చేసుకున్నప్పుడు నా చేతిలాగే అది స్ట్రయిట్ అయిపోవాలి. పనిచేయటం మాత్రం థాంప్సన్ సబ్ మెషిన్ గన్ అంత బాగా పనిచేయాలి. నేనప్పుడు బాగా లూజ్ గా వుండే బేగీషర్టు వేసుకుంటాను. అది దళసరిగా కూడా ఉంటుంది. అది ప్రత్యక్షంగా కనిపించదు. అలాగే పరోక్షంగా దాని షేప్ కూడా కనిపించకూడదు. అదేమాత్రం లావుగా వున్నా నా చేతిని చూసిన ఎవరికయినా అనుమానం వస్తుంది. మీరు తప్పక దాన్ని లావుగా చేస్తే నేను నా మొత్తం చేతికి బేండేజ్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గన్ నా చేతికి, బేండేజ్ కి మధ్య ఉంటుంది కనుక. అలా అయితే నాకు మరికొంత స్ట్రెయిన్, పరిమితులు పెరుగుతాయి..."
* * * * *
ఖలీల్ వాచీ చూసుకున్నాడు.
అప్పటికే ఆ ప్రాంతానికి వచ్చి అరగంట దాటిపోయినట్లు గ్రహించి అసహనంగా డ్రయివింగ్ సీట్లో కదులుతూ తలమాత్రం వెనక్కి తిప్పి జోహ్రా జాడ కోసం చూసాడు. జోహ్రాకి ఈ అసాసినేషన్ విషయంలో సహాయం చేసి పెడితే తనకు యాభై లక్షల నుండి కోతి మధ్యలో డబ్బు ముడుతుంది. మంచి ఆఫర్... బట్.... జోహ్రా లాంటి అంతర్జాతీయ స్థాయి కిల్లర్ బొంబాయి నగరం ప్రవేశం చేసినట్లు పోలీస్ కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్ పసిగడితే? నగర పోలీసు వ్యవస్థ మొత్తం అప్రమత్తమయి పోతుంది. సోదాలు.... శోధనలు.....దాడులు.... ఇంటరాగేషన్స్......ఇన్ వెస్టిగేషన్స్ ముమ్మరమవుతాయి. తీగ క్రమంగా కదులుతూ తన వేపుకే మలుపు తిరిగి తన వెనుక ఉండే డొంక కదిలే పరిస్థితులు కూడా ఉద్భవించవచ్చు. అసలే తనమీద సిద్దేశ్వర్ బాగా కోపంగా ఉన్నాడు. సాక్ష్యాధారాలతో పట్టుకొనేందుకు వేటకుక్కలా కాపుకాసి ఉన్నాడు. ఇప్పటివరకయితే పోలీసుల దృష్టికి తమ కదలికలు వచ్చి ఉండకపోవచ్చు. అని మనస్సులో అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి పొగను వలయాలుగా వదులుతూ వాటిమధ్యలోంచి ముందుకు చూడసాగాడు.
తమ డొంకను కదిలించే ప్రయత్నానికి మిల్లర్ శ్రీకారం చుట్టినట్లు, సిద్దేశ్వర్ లాంటి డేంజరస్ పోలీసు ఆఫీసర్ దేవానంద్ ఇంటి వాచ్ మెన్ అబూని తన అధీనంలోకి తీసుకొని పరిశోధనలో శరవేగంతో తనవేపుకి కదిలి వస్తున్నట్లు ఖలీల్ ఊహించలేకపోయాడు.
ఖలీల్ కి దాదాపు బొంబాయిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ తో అధికార సంబంధాలున్నట్లు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ కేసు రిజిష్టరయింది పోలీసులు ఎవరిని అనుమానిస్తున్నది ఏ దిశకేసి పరిశోధనలో ముందుకు వెళుతున్నది మొదలగు వివరాలు ఎప్పటికప్పుడు ఖలీల్ కి అందించి సొమ్ము చేసుకొనే లంచగొండి పోలీసురైటర్స్ (పోలీసు స్టేషన్ లో రికార్డ్సు వ్రాసే ఉద్యోగి) ఉన్నట్లు సిద్దేశ్వర్ పసిగట్టబట్టే అబూ వ్యవహారం నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిపించాడు. దాన్ని అక్కడికక్కడే వారిమధ్యే సమాధి అయ్యేలా వార్నింగ్ ఇచ్చినట్లు ఖలీల్ కి తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు.
* * * * *
"రైఫిల్ పార్ట్సు అన్నీ చాలా సన్నగా పల్చగా వుండాలి. ఇక ఒక దశకు మించి స్లిమ్ చేస్తే ఆ రైఫిల్ పర్ ఫెక్టుగా వర్క్ చేయదన్న స్టేజ్ వరకు వెళ్ళాలి. ట్రిగ్గర్ గార్డు అవసరం లేదు. ట్రిగ్గర్ కూడా లోపలకు ఉండాలి. గన్ కి బ్యారెల్స్ కి మధ్య ఫోల్డింగ్ సిస్టమ్ ఉండాలి. సాధారణంగా రైఫిల్ వెనుకవేపు ఫిట్ చేసే వుడ్ స్టిక్ అక్కరలేదు. తూటాని ముందుకు నెట్టే హేమర్ కూడా లోపల వేపే వుండాలి. సపోర్టింగ్ స్టాండ్స్ తో పని వుండదు. నేను కుడిచేతిని ఎత్తగానే ఐమీన్ నేను చంపాలనుకుంటున్న వ్యక్తిని ఎవరికో చూపిస్తున్నట్లు నేను నా కుడిచేతిని సమాంతరంగా తీసుకువచ్చి, నా చూపుడువేలిని ఆ వ్యక్తికేసి చూపించే సమయానికే రైఫిల్ సేఫ్టీ కేచ్ ప్లిక్ అయిపోవాలి. ఆ మరుక్షణం నా ఎడం చేతిని కుడిచేతి భుజం కిందకు చేర్చి బొటనవేలుని అడుగుభాగానికి చేర్చుతాను. మిగతా నాలుగువేళ్ళు పైభాగాన వుంటాయి. చూసేవారికి నా ఎడం చేత్తో నా కుడిచేతి కండరాల్ని మృదువుగా పట్టుపడుతున్నట్లుగా ఉంటుంది.
నా బొటనవేలు ట్రిగ్గర్ పై ఆనిన మరుక్షణం బుల్లెట్ నిప్పులు కక్కుతూ రిలీజ్ అవ్వాలి" జోహ్రా చెప్పటం ఒక్కక్షణం ఆపాడు.
అన్ని పరిమితులకు లోబడి రైఫిల్ ని తయారుచేయటం సాధ్యమౌతుందా అని త్యాగరాజన్ విస్తుపోయాడు. దేశవిదేశాల్లో తయారయ్యే ఎన్నో రకాల ఫైర్ ఆర్మ్స్ గురించి క్షుణ్ణంగా తెలిసుండకపోతే అంత వివరంగా తనకు కావల్సిన రైఫిల్ గురించి చెప్పలేడు! ఇంతకీ ఎవరీ జె? త్యాగరాజన్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ "ఇంతకీ మీరెవరు? ఎవరిని ఎసాసినేట్ చేయాలనుకుంటున్నారు?" అని అడిగాడు.
"ఆ వివరాలు తెల్సుకోవటం నీకు క్షేమం కాదు. నాకవసరమైన రైఫిల్ తయారుచేసి నీకు అవసరమైన డబ్బు నువ్వు తీసుకో అక్కడితో మనిద్దరి మధ్య వుండే డీల్ సమాప్తమయి పోతుంది. సబ్జెక్టులోకి వద్దామా?" గంభీరంగా వున్న జోహ్రా కంఠాన్ని అతని కళ్ళలో తొంగిచూసిన ఎరుపు జీరను చూసి త్యారాజన్ ఓ క్షణం భయపడ్డాడు. వెంటనే సర్దుకుంటూ అలాగే అన్నట్లు మౌనంగా తలూపాడు.
"ఎన్నిరోజుల్లో రడీ చేయగలవు...?"
"నెలపట్టవచ్చు.... రైఫిల్ లోని ప్రతిభాగాన్ని తయారుచేసి అదెలా పనిచేస్తుందో పరీక్షించుకుంటూ వెళ్ళాలి."
