Previous Page Next Page 
మహావృక్షం పేజి 4

"మేనమామ అని ఏదో చెప్పాడు."
"వచ్చినవాళ్ళు ఆమె శ్రేయోభిలాషులైతే ఆ అమ్మాయి ఎందుకు పారిపోతుంది? డెలివరీ అయి ఇరవైనాలుగ్గంటలు కూడా కాకుండా ఆమె పిల్లాడిని తీసుకుని పారిపోయిందంటే, సిట్యుయేషన్ ఎంత భరించరానిదై వుంటుందో ఊహించు. ఇలాంటి స్థితిలో ఆమెని వాళ్ళెవరికో అప్పగించడం ఒక డాక్టరుగానే కాదు, ప్రస్తుతానికి ఆశ్రమానికి తీసుకెడదాం. తరువాత యిద్దరం వెళ్ళి మీ చీఫ్ తో మాట్లాడదాం అవసరాన్నిబట్టి పేపర్ వాళ్ళతో కూడా మాట్లాడదాం అవసరాన్నిబట్టి పేపర్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. నీ ఉద్యోగానికిగానీ, నీక్కానీ ఏ భయంలేదు. ఎవరొచ్చినా, ఎవరు ప్రశ్నించినా నా పేరు చెప్పు. ఓ.కే...."
"అంతేనా? అనవసరంగా రిస్కు తీసుకుంటున్నావేమో. ఆ అమ్మాయి ఎందుకు పారిపోయిందో! వాళ్ళకీ వున్న గొడవలేంటో తెలీకుండా ఎందుకు?"
"మణీ! జీవితంలో అనేకరకాల అనుభవాలను, అనేకరకాల జీవితాలను చూసినదాన్ని. నాకు తెలీదా ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో? నువ్వన్నట్లు ఆ అమ్మాయిదే తప్పు అయితే నచ్చచెప్పి పంపించేద్దాం... అంతేగానీ విపత్కర పరిస్థితుల్లో నాకు తారసపడిన ఆమెనలా వదిలేయడం నా ఆదర్శానికే విరుద్దంకాదా?"
"అవుననుకో. కానీ...."
"నో కానీ.... నథింగ్... నువ్వు రెడీ అవు. ఈలోగా మీ చీఫ్ ఫోన్ చేస్తే ఆమెని నేను తీసుకెళ్ళానని చెప్పు. తరువాత వచ్చి పర్సనల్ గా మాట్లాడతానని చెప్పు. ఫరవాలేదు. ఆయన చాలా మంచివారు.... పెద్దవారు. అర్థం చేసుకుంటారు. నా ఉద్దేశం.... ఆయనకీపాటికి సిట్యుయేషన్ అర్థమయ్యే వుంటుంది. కాకపోతే... బలీయమైన కారణం ఏదో ఆయనని భయపెడుతోందనుకుంటా... నువ్వు చెప్పిన విషయాన్ని వింటుంటే. ఎనీవే....నువ్వు మాత్రం ఆశ్రమానికి వచ్చేయ్ మీ ఇంటికి దగ్గరగానే వుంది ఆశ్రమం."
"ఓ.కే.... నువ్వు చెప్పాక కాదని ఎలా అంటాను? ఉంటానుమరి."
"అలాగే, ఆ చూడు. ఆ అమ్మాయికి ప్రస్తుతం వాడాల్సిన మందులు తీసుకునిరా."
"ఓ.కే." అని మణి రిసీవర్ పెట్టేసింది.
కాస్సేపలాగే సోఫాలో కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. ఆ అమ్మాయి పేరు తెలుసుకుంటే మణి పేషంటు ఈమె అని కన్ ఫర్మ్ అవుతుంది.
సోఫాలోంచి లేచి, ఆమె పడుకున్న గది దగ్గరికి వెళ్ళి తలుపుతోసింది. గాఢంగా నిద్రపోతోందా అమ్మాయి. పక్కనే దుప్పటిలో బాబు తెల్లగా వున్నాడు. గుప్పిళ్ళు మూసుకుని, కళ్ళు ,మూసుకునివున్న వాడిని అలాగే తదేకంగా చూస్తూ నిలబడిపోయింది అనూష.
దైవానికి మారురూపాలంటారు పసిపిల్లలు....
లేత గులాబీల్లా ముద్దొచ్చే పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చెత్తకుండీల్లో, డ్రైనేజీపైపుల్లో ఎలా వదిలేస్తారు?
ఈమధ్య భర్తమీద కోపంతో పిల్లల్ని కాల్చిచంపిన తల్లి అనే వార్త చదివింది పేపర్లో.
ఎలా చేస్తారీ దారుణాలు?
మనిషి ఒక్కోదశలో మృగంలా మారతాడంటారు. అలా మృగంలా మారిన దశలో జరిగే దారుణాలా ఇవి?
ఆమె ఇంక ఆలోచించలేకపోయింది.
అక్కడినుంచి కదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది. అరగంటలో కాలకృత్యాలు, స్నానం వగైరా ముగించి వచ్చేటప్పటికి వంటమనిషి భారతమ్మ వచ్చి దోసెలు వేస్తోంది.
ఆమెను చూడగానే "భారతమ్మగారూ! ఇంట్లో ఓ పసిపిల్లాడు, ఓ బాలింతరాలూ వున్నారు. నేను వాళ్ళని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాలి. ఆమెకి ఇవ్వాల్సిన ఆహారం ఏమిటో మీకు తెలుసుకదా. ఆ ప్రయత్నాలు చేయండి" అని చెప్పింది.
"ఎవరమ్మా? బంధువులా?" అని అడిగింది భారతమ్మ.
"నాకు ఈ ప్రప్రంచంలో అందరూ బంధువులే కదండీ!" అంటూ నవ్వింది అనూష.
'అవునమ్మా! అభాగినులను ఆదుకోడానికి ఆ భగవంతుడు తనకు మారుగా పంపించిన దూతవి నువ్వు' అనుకుంది ఆవిడ మనసులో.
అనూష ఆ అమ్మాయిని నిద్రలేపే అవసరం లేకుండానే పసివాడు లేచి సన్నగా ఏడుపు మొదలుపెట్టాడు.
ఆమె తృళ్ళిపడి లేచింది.
అనూష గబుక్కున లేవబోతూన్న ఆ అమ్మాయిని పట్టుకుని.
"నెమ్మదిగా లేచికూర్చో. వేణ్ణీళ్ళు తెచ్చిస్తాను. మొహం కడుక్కో.బాబు సంగతి నేను చూస్తాను" అంటూ ఆమెను లేపి, తలగడ వీపుకింద పెట్టి, మంచంమీద వెనక్కి జారగిల కూర్చోపెట్టింది. బాబు పక్కబట్టలు మార్చి, వాడిని ఎత్తుకుంది.
భారతమ్మ వేడినీళ్ళు తీసుకొచ్చి ఆమె మొహం కడిగించి, వేడి కాఫీ యిచ్చింది.
కాఫీ తాగి గ్లాసు అందించిన ఆ అమ్మాయి మొహంలోకి చూస్తూ అడిగింది అనూష-
"నీ పేరేంటి?"
కళ్ళు వాల్చుకుని నీరసంగా చెప్పింది.
"నీరజ"
"ఈ బాబు... నీ బాబేనా?" కన్ ఫర్మ్ చేసుకోడానికన్నట్టుగా అడిగింది.
తల ఊపింది నీరజ.
"సరే.... భారతమ్మగారు బట్టలు మార్పిస్తారు. మార్చుకో .ఇదిగో ఈ చీరా, జాకెట్టూ తీసుకుని వేసుకో, తరువాత బాబుకి పాలివ్వు,మనం బైటికి వెళదాం."
"ఏం భయంలేదు తల్లీ! ఈ దేవత చేతుల్లో పడ్డాక..." చెప్పింది భారతమ్మ.
అనూష బాబునెత్తుకుని హాల్లోకి వెళ్ళిపోయి, వేణ్ణీళ్ళలో గుడ్డ ముంచి వాడి ఒళ్ళంతా తుడిచింది. వాడి ఒంటిమీద వున్న జుబ్బానే మళ్ళీ తొడిగి, పాతబట్ట చింపి లంగోటీలాగా కట్టింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS