Previous Page Next Page 
ప్రతీకారం పేజి 4


    జగన్నాథం కళ్ళలో నీరు తిరిగింది.
    "అన్నీ తెలిసిన నువ్వే ఇంత పిరికివాడిలా బాధపడటం ఏమీ బాగాలేదు."
    "అన్నీ తెలిసిన వాళ్ళకు బాధ వుండదా? వాళ్ళకు మనసు ఉండదా? ఆ మనసులో మమతలు ఉండవా? మూర్తీ! లేదు... లేదు...నాలో మానవత్వం లేదు, నేను కౄరుడ్ని. పాపిని. నా వంటి దుర్మార్గుడ్ని నువ్వు ఇంతకు ముందెన్నడూ చూసివుండవు" ఆవేశంగా అన్నాడు అతడు.
    "ఏమిటో నీ ధోరణి నాకు అర్థం కాదు. నీ భార్యను నువ్వే చంపినట్టు బాధపడతావేం? ఆ రోజు నువ్వు ఆమె దగ్గరగా లేనిమాట నిజమే. కాని నువ్వు వేటకు వెళ్ళేముందు ఆరోగ్యంగా వున్న ఆమెకు అంతలోనే ముంచుకొస్తుందని నువ్వు కలగన్నావా! చావు బతుకులు మన చేతుల్లో లేవు. పిల్లవాడి ముఖం చూసైనా నువ్వు ధైర్యంగా ఉండాలి" అన్నాడు మూర్తి.
    "నా బాధ నీకు అర్థంకాదు మూర్తీ! పాపం చేసిన వాళ్ళంతా బాధపడరు. తాము చేసింది పాపం అని తెలుసుకొన్నప్పుడు నరకయాతన అనుభవిస్తాడు. నా భార్యను నేను చంపలేదు. కానీ నేను మరొకర్ని చంపాను. దానికి వెంటనే నాకు శిక్ష పడింది" తనకు తానే చెప్పుకుంటున్నట్టు చెప్పుకుపోసాగాడు.
    "నువ్వు ఎవర్నో చంపడం ఏమిటి? పిచ్చి మాటలు మాట్లాడకు" అన్నాడు మూర్తి.
    "నిజం మూర్తీ! నేను హంతకుడ్ని. నిండు ప్రాణం తీశాను. నువ్వు పోలీసు ఆఫీసరువి. ఎందరో అపరాధుల్ని పట్టుకున్నావ్. కానీ నిత్యం కలుసుకునే ఈ అపరాధిని పట్టుకోలేకపోయావ్. పెద్దమనిషిగా, మంచివాడిగా నువ్వు గౌరవించే నాలాంటి హంతకుడ్ని నువ్వు చూసి వుండవు.
    అతడు అనునయంగా జగన్నాథం కళ్ళలోకి చూశాడు. ఏదో ఆలోచనలో పడ్డాడు.
    "నువ్వు హత్య చేశావా? ఎప్పుడు? ఎవర్ని? కుర్చీలో విసురుగా కూర్చుంటూ ప్రశ్నించాడు అతడు."
    జగన్నాథం అదోలా నవ్వాడు.
    "అవును! నేను హత్య చేశాను." కానీ నువ్వు నన్ను అరెస్టు చేయలేదు. ఏ కోర్టూ నన్ను శిక్షించలేదు. అందుకే భగవంతుడు నన్ను శిక్షించాడు.
    మూర్తి విస్మయంగా స్నేహితుని ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
    "ఏమిటి అలా చూస్తావు? నీకు నేను చేసిన పాపం ఏమిటో చెబుతాను. చేతనైతే నన్ను అరెస్టు చెయ్యి, శిక్ష పడేలా చూడు, కనీసం ఈ రంపపుకోత తగ్గుతుంది!"
    మూర్తి మౌనంగా సిగరెట్టు తాగుతూ ఆలోచనలో పడ్డాడు. జగన్నాథం హంతకుడా? నిజంగా హత్యే చేసివుంటే తను అరెస్టు చెయ్యక తప్పదా? చెయ్యకపోతే తన డ్యూటీ? ధర్మం?
    "అప్పన్నా బాబును తీసుకువెళ్ళు" అంటూ జగన్నాథం నౌకర్ను పిలిచాడు.
    అప్పన్న వచ్చి రవిని తీసికెళ్ళాడు.
    మూర్తి జగన్నాథం ముఖంలోకి "ఇక చెప్పు!" అన్నట్టు చూశాడు.
    జగన్నాథం దూరంగా కనిపించని దేన్నో చూడ్డానికి ప్రయత్నిస్తూ చెప్పసాగాడు__

                                            4

    మా నాన్నగారు ఫారెస్టు కాంట్రాక్టరనే౧ నేను ఇంజనీరింగ్ పాసయ్యాననీ నీకు తెలుసు. మా నాన్నగారికి నేను ఎవరి క్రింద పనిచేయడం ఇష్టంలేదు. వ్యాపారంలో పెట్టేశారు. నాకూ స్వతంత్రంగా జీవించడమే ఇష్టం. మా నాన్నగారి కాంట్రాక్టు పనులు నేను చూడటం ప్రారంభించాను.
    ఒకరోజున వర్క్ పూర్తి చేసుకొని, సాయంకాలం ఆలస్యంగా ఇంటికి బయలుదేరాను. హైద్రాబాద్ అక్కడకు దాదాపు అరవై మైళ్ళలో వుంది. దారిపక్కగా ఆగివున్న కారు కన్పించింది. ఒక మధ్య వయస్కుడు జీప్ కు దగ్గరగా వచ్చి చెయ్యి చూపించాడు. జీపు ఆపాను.
    "బాబూ! మా కారు ఆగిపోయింది. ఊరు ఇంకా ఇరవై మైళ్ళుంది. డ్రైవరు ప్రయత్నం చేస్తున్నాడు. కాని అది ఎప్పటికి కదులుతుందో తెలియదు. రాత్రంతా ఆడపిల్లతో ఈ ఊరి బయట అంత, వుండటం మంచిది కాదు. ఈ ప్రాంతాల్లో దొంగల హడావుడి కూడా ఎక్కువగా వుంది. నువ్వు సహాయం చేసి, మమ్మల్ని ఊళ్ళోకి చేర్చాలి" అన్నాడు ఆదుర్దాగా ఆ వ్యక్తి.
    నేను కారులో కూర్చున్న యువతికేసి కుతూహలంగా చూశాను. పరువంలో ఉన్న వయసు. వురకలు తీస్తున్న రక్తం ఆ అమ్మాయి నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయాను. వేషం సాదాగా వుంది. కాని మహారాణిలా, హుందాగా, ఠీవిగా, అందంగా వుంది. నేను అలా కళ్ళప్పగించి చూస్తుంటే ఆ యువతి కార్లో ఇబ్బందిగా కదిలి ముఖం పక్కకు తిప్పుకుంది. అప్పటికి కాని నేను ఎంత అనాగరికంగా ప్రవర్తించానో అర్థం కాలేదు. వెంటనే ఆమె తండ్రివైపు తిరిగి "అలాగేనండీ!" కారును జీపు వెనక కట్టమనండి. మీరు ఇద్దరూ జీప్ లో కూర్చోండి!" అన్నాడు.
    "థాంక్యూ" అంటూ నాకు కృతజ్ఞత తెలిపి "రా బేబీ!" అన్నాడు కూతురుతో.
    ఆ యువతీ కారు దిగింది. డ్రైవరు జీపుకు కారు కట్టాడు. తండ్రీ కూతుళ్ళు నా పక్కగా జీప్ లో కూర్చున్నారు.
    మాటల్లో, అతను మా నాన్నగారితో కలిసి కాలేజీలో బి.ఏ. వరకూ చదివాడనీ, మోతుబరి రైతు అనీ తెలిసింది. చదువు పూర్తయ్యాక ఆయన వ్యవసాయం చూసుకుంటూ ఊళ్ళోనే స్థిరపడిపోయాడు. మళ్ళీ ఈ విధంగా మా కుటుంబంతో స్నేహం కలిసినందుకు ఆయన చాలా సంతోషించాడు, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అప్పుడప్పుడు ఓరగా ఆ యువతీకేసి చూడసాగాను.
    వారి ఇంటిముందు జీపు ఆగింది. అందరం దిగాం. కారు ఊడదీశాడు డ్రైవరు.
    "వెళ్ళొస్తానండీ! నమస్కారం!" అంటూ జీపు ఎక్కబోతున్న నన్ను ఆపి రఘురామయ్యగారు ఇంట్లోకి ఆహ్వానించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS