త్యాగమయి
అనురాగమయి
అనసూయాదేవికి
.jpg)
నీవొక 'సాఖి'వై మధువు నింపితి వీ రసహీనమైన నా
జీవితపాత్రలో; పరవశించితి నీయనురాగపూర్ణ బృం
దావనమందు చిందు కవితామకరంద రసమ్ము త్రావి నా
భావ మధువ్రతాలు ప్రభు పాదసరోజములందు వ్రాలెడిన్.
పోయిన జంటగా కలిసిపోయెదమంటివిగాదె! ముందుగా
పోయితి వేమిటో మునిగిపోయినయట్లుగ నన్నువీడి అ
మ్మాయిని వీడి నీ ప్రియకుమారుల మన్మల వీడి ఎవ్వరో
'రా'యని పిల్చినట్టు లవురా! విధి చెయ్దము లెంతవింతలో!!
మంచి ఫలాలు రెండు గొని, మంజుల పుష్పమొకండు పూని, ని
ర్వంచితభక్తి మాసశివరాత్రికి కోవెల కేగి - స్వామి న
ర్చించి నమస్కరించి వినుతించి ప్రసాదము తెచ్చి చేతి కం
దించి - క్షణమ్ములో సురలు తెచ్చిన పుష్పక మెక్కిపోతివా!
త్యాగమయీ! త్వదీయ సముదాత్త మహత్తర చిత్తశుద్ధియే
లోగొనె నన్ను నా యెడదలో బడబాగ్నిని నీ దయాసుధా
సాగర వీచితో ఒక ప్రశాంతివనమ్ముగ మార్చినావు; దే
వీ! గయికొమ్ము నీవు మొలపించిన మొక్కల వీప్రసూనముల్!!
