"మా ఫ్రెండ్స్ గ్యాంగుని మీకు పరిచయం చేద్దామని తీసుకువచ్చాను ఆంటీ!" అంది భావన శారదతో.
భర్త డాక్టర్ వెంకయ్యనీ, తన కొడుకునీ, కూతురినీ కూడా ఒకేరోజున అత్యంత విషాదకర పరిస్థితులలో కోల్పోయి, మతి చలించి ఉన్న శారదని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలని భావనా, అరుణా చెయ్యని ప్రయత్నం అంటూ లేదు.
"లేట్ లతీఫ్ ఎట్లాగూ మీకు తెలిసినవాడే! అతనెందుకోగానీ రావటం లేటయింది. ఇతనేమో ఆడిట్ త్య. ఆడిటరు. ఇతను జోకేశ్వరరావు. అసలు పేరు జోగేశ్వరరావనుకోండి. ఇతను కామెడేశ్వరరావు. వీడేమో ప్రమాదరావు" గబగబ చెప్పింది భావన, నిక్ నేముల స్పెషలిస్టు!
"అసలు పేరు ప్రమోదరావు ఆంటీ! అడపా దడపా దెబ్బలు తగిలించుకుంటానని భావన నాపేరు ప్రమాదరావుగా మార్చేసింది." అని నవ్వాడు ప్రమాదరావు. అంటూ నమస్కారం చేసి, కూర్చోబోయాడు.
ఆలస్యంగా అక్కడికి చేరుకున్న లేట్ లతీఫ్, అనుకోకుండా అదే క్షణంలో, అదే కుర్చీని లాక్కుని తను కూర్చున్నాడు.
తన వెనక, కుర్చీ ఇంకా ఉందనే భ్రమలో ఉండి, యదాలాపంగా కూర్చున్న 'ప్రమాదరావు' దబ్బున క్రింద పడ్డాడు.
"సార్థక నామధేయుడు మా ప్రమాదరావు" అంది భావన, అతనికి చేయూత అందిస్తూ.
అందరూ నవ్వేశారు శారద తప్ప!
ఆవిడ మొహం చాలా సీరియస్ గా వుంది.
"వేళాపాళా లేకుండా ఏమిటీ ఈ వేళాకోళాలూ? అవతల దేశం దహించుకుపోతోంది...అన్యాయాలు - అక్రమాలూ - అవినీతి - దేశంలో దొంగలు పడ్డారు. మనం మన ఆదర్శాలు మర్చిపోకూడదు. డాక్టర్ వెంకయ్యగారు బతికే ఉంటేన, సర్జరీ చేసి ఈ కేన్సరుని తీసిపారేసి వుండేవాళ్ళు. అబ్బో! ఆయన ఎన్నెన్ని ఆపరేషన్లు చెయ్యలేదూ - అది సరే! అమ్మా అరుణా! ఇంక మనం పేపర్లు చదువుకుందామా?" అంది శారద, తన ధోరణిలో.
ఆమె ఈ మధ్య రోజుకి అరడజను పేపర్లు తెప్పిస్తోంది. మూడు తెలుగు, మూడు ఇంగ్లీషు.
"అన్ని పేపర్లూ చదివితే తప్ప ఎవరే అర్థ సత్యాలు రాస్తున్నారో, ఎవరే అసత్యాలు రాస్తున్నారో తెలియదు. సత్యం వధ - ధర్మం చెర!" అంది శారద. "చదువమ్మా చదువూ! నేను నోట్ చేసుకుంటూ వుంటా! ధర్మయుద్ధం చేద్దాం!"
ఆమె చేతిలో ఒక ఎక్సర్ సైజ్ నోట్ బుక్కు ఉంది. రూళ్ళ పుస్తకం.
అది చూస్తూ అదోలా నవ్వింది శారద.
"ఈ పుస్తకంలో రూళ్ళు వున్నాయిగానీ, ప్రజానాయకులకు రూల్సు లేవు. రూళ్ళ కర్రతో వీళ్ళ కాళ్ళు విరగ్గొట్టాలి! చదువమ్మా చదువూ!"
రోజూ పేపరు కొనే స్తోమత కూడా లేదు అరుణకి. రేడియోలో వార్తలు వినేది. అంతే!
ఇప్పుడు శారద తెప్పిస్తున్న దొంతర్ల కొద్దీ న్యూస్ పేపర్లు ఆమెకి తోడుగా వుండి చదివి వినిపించడంతో అరుణ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా అయింది.
'సెన్సేషన్ సృష్టిస్తున్నారు' అనుకుని సగానికి సగం తగ్గించినా కూడా, మిగతా సగం నిజమే కదా!
దానికితోడు, చావు కబుర్లకి కూడా జీవం పోస్తున్న టీవీ ఛానెళ్ళూ!
ఒకదాని తర్వాత ఒకటిగా పేపర్లు చదివేస్తూ వుంటే, అరుణకి రక్తం ఉడుకెత్తి పోతున్నట్లుగా వుంది.
శారద మాత్రం -
"ఆగాగు ఆగు! ఏం చదివావ్? టెండర్లు వేయడంలో కాంట్రాక్టర్లు రింగు అయ్యారా! ఎలెక్షన్లలో రిగ్గింగు అయినాదా? ఇది ఏమి కొత్తనా ఏమిటి? అయినా ఎప్పటికప్పుడు కొత్తే కదా! మనకి మొన్నమొన్ననే స్వాతంత్ర్యం వచ్చింది. ఇంకా కాళ్ళ మీద నిలబడటం రాదే! చిన్న వయసులో చిన్నబిడ్డ చేష్ట మామూలేనమ్మా! అయినా మనం మందేయించకుండా వూరుకుంటామేమి? నోట్ చేసుకున్నవే! ముందుకు చదువు."
అరుణకి అనిపించింది. ఫ్యామిలీకి వచ్చిన కష్టాలతో శారద ఆంటీకి మతి స్థిరం తప్పింది.
తనకేమో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వుంటూనే పిచ్చిపట్టిపోతున్నట్లుగా వుంది!
"చదువమ్మా చదువూ! నేనన్నీ నోట్ చేసుకుంటూనే వున్నాలే!" అంది శారద మళ్ళీ.
అప్పుడు -
అరుణ దృష్టిని ఆకర్షించింది ఒక వార్త!
చెన్నైలో విస్ఫోటనం !
నిన్న మధ్యాహ్నం చెన్నై నగర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద కార్ల కంపెనీలో శక్తివంతమైన బాంబు ప్రేలి ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వందమందికి తీవ్రమైన గాయాలు అయినట్లుగా అధికారికంగా అంచనా! వాస్తవానికి మృతుల సమాఖ్య ముప్పయ్ దాకా ఉంటుందనీ, గాయపడినవారి సమాఖ్య రెండువందలకి పైగానే వుంటుందనీ భోగట్టా! కార్లు అమ్మే ఒక షోరూమ్ లో ఇంతమంది ఎందుకు పనిచేస్తున్నారన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మరిన్ని వివరాలు తెలియవలసి వుంది. దర్యాప్తు జరుగుతోంది.
ఇంకో పత్రిక తీసుకుంది అరుణ.
ఆ పేపర్లో పతాక శీర్షిక ఇండియన్ క్రికెట్ టీము కెప్టెన్ కాలివేలికి ప్రాక్టీసు సమయంలో గాయం అయిందని! అతను మ్యాచ్ ఆడగలడో లేడో అన్న విషయం మీద సంపాదకీయం! మూడో పేజీలో ఎక్కడో మారుమూలన చెన్నై ప్రేలుడి గురించి మూడుముక్కలు రాసి వుంది. ప్రేలుడు జరిగిన కారు ఓనరు తండ్రి ధీరేంద్రషా క్రికెట్ పాలిటిక్సులో ఉన్నాడనీ, అతనిమీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయనీ కధనం!
ఇంకో పేపరు వేరేవిధంగా రాసింది.
కారు డీలరు గుణమణికి విదేశాలతో రహస్య సంబంధాలు ఉన్నాయనీ, అతనివెనక 'అభిరాం' అనే వ్యక్తి ఉన్నాడనీ, సంఘ వ్యతిరేక చర్యలతో హిందువులలో భయోత్పాతం సృష్టించి, అందరినీ క్రైస్తవమతంలోకి మార్చే వ్యూహమే ఇది అనీ రాసింది.
మరో పత్రిక కధనం మరోలాగా ఉంది.
చెన్నై ప్రేలుడు అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రే అనీ, దీనివెనక నిశ్చయంగా ఇజ్రాయెల్ దేశపు హస్తం వుండి వుంటుందనీ, అందుకనే మనం అవశ్యం అరబ్ దేశాలతో సంబంధాలు పటిష్టం చేసుకోవాలనీ రాసింది. ఆ ప్రేలుడితో అభిరాం అనే సంఘ సేవకుడికి సంబంధం ఉండి వుంటుందని వదంతులు వ్యాపిస్తున్నాయనీ, కానీ నిజానికి అతను గొప్ప సెక్యూలరిస్టు అనీ, అందుకనే అబ్రహాం అనే తన పేరుని 'అభిరాం'గా మార్చుకున్నాడనీ, అతన్నే ఇబ్రహీం అని పిలవడం కూడా వద్దనీ, అందుచేత హిందూ మతోన్మాదుల ఒత్తిళ్ళకు లొంగి అభిరాం మీద తొందరపాటు చర్యలు తీసుకోవడం తప్పు అనీ రాసింది.
పేపర్లలో న్యూస్ కంటే 'వ్యూస్'కే ప్రాముఖ్యం కదా! ఎవరి ధోరణి వాళ్ళది!
మరో పత్రిక కథనం మరీ తమాషాగా వుంది.
"ఐదున్నర కోట్ల ఖరీదు చేసే కారులో బాంబు ప్రేలుడు!!"
వజ్రాల వర్తకులలో ఇండియాలోనే నెంబర్ వన్ అయిన ధీరేంద్ర షా, తన కుమారుడికి బహుమతిగా కొని ఇచ్చిన ప్రపంచంలోనే అతి ఖరీదయిన లగ్జరీ కారు మెర్సెడెస్ మేబాక్ లో విస్ఫోటనం జరిగింది. ధీరేంద్ర షా కుమారుడు ఆ కారుని అందుకున్న అరగంటలోపే అమ్ముకోవడానికి గానూ తమ ఇంటికి ఎదురుగానే ఉన్న 'రాయల్ ఛేరియట్స్' కార్ల ఏజన్సీలోకి వెళ్ళాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
బేరం కుదిరీ కుదరకముందే బ్రహ్మాండమైన బ్లాస్ట్ జరిగింది.
'రాయల్ ఛేరియట్స్' ఎప్పుడూ కూడా అతి ఖరీదయిన కార్లనే కొని అమ్ముతుందని ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఆర్డర్ ఇస్తే అప్పుడు తయారీ మొదలెట్టే కోట్ల విలువ చేసే ఫెర్రారీ లాంటి అరుదయిన కార్లని కూడా గుణమణి కొని అమ్ముతూ వుంటాడు.
ధీరేంద్ర షా తన కుమారుడికి కొని ఇచ్చిన మెర్సెడెస్ మేబ్యాక్ దేశంలోనే రెండవది. మొదటికారు మాణిక్ చంద్ గుట్కా ఓనరు కూతురి బర్త్ డేకి కొనిచ్చారు.
ధీరేంద్రషా దగ్గర మేబ్యాక్ మాత్రమే కాక, ఫెర్రారీ జాగ్వార్ లతో బాటు రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కూడా ఒకటి.
"ఒకొక్కడూ ఒక్కొక్క యాంగిల్ లో రాస్తున్నాడు! ఎవడిగోల వాడిదీ!" అంది అరుణ అసహనంగా.
"వీడిగోల చూడు!" అంది భావన ఒక పేపరు అందిస్తూ.
ప్రేలుడు వెనక ప్రేమ గోల ! ?
(మా ప్రత్యేక విలేఖరి)
ఆ విలేఖరి ఎవరోగానీ భీభత్సంలో కూడా హాస్యరసం ఒలికించే వెకిలి ప్రయత్నం చేశాడు. ట్రాజెడీ గురించి కార్టూనిస్టులు కార్టూనులు వేసినట్లే.
వజ్రాల వర్తకుడు ధీరేంద్ర షా పుత్ర 'రత్నం' సూరజ్, అరుణ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె దగ్గర ప్రేమ డైలాగులు పేల్చేసరికి ఆమె కోపం తారాజువ్వలా ఎగసిపడింది. బ్లాస్ట్ అయిపోయిన తన ప్రేమకి సూచనగా తను కూడా సూసైడ్ బాంబర్ గా మారాలని అనుకున్న సూరజ్, పదమూడు బెడ్ రూములు ఉన్న తన తండ్రి ఇంట్లోనుంచి మేబ్యాక్ కారులో బయటికి వచ్చి...
పేపరు గిరాటేసి, టీవీ దగ్గరికి పరిగెత్తింది భావన.
ఏమయింది సూరజ్ కి?
టీవీ న్యూస్ లో బాంబ్ బ్లాస్ట్ గురించి చెప్పిందే చెబుతున్నారు గానీ, సూరజ్ గురించిన సమాచారం లేదు.
ఆదుర్దాగా చూస్తోంది అరుణ కూడా.
ఇంతలో భావన సెల్ ఫోన్ మోగింది.
దడదడలాడుతున్న గుండెలతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది భావన.
"హలో!"
"నేను సూరజ్ ని"
"థాంక్ గాడ్! థాంక్ గాడ్! సూరజ్! నీ గొంతు వింటుంటే ఎంత సంతోషంగా ఉందో!" అంది భావన.
"నేను ఇక్కడే వున్నాను భావనా! హైదరాబాద్ వచ్చేశా!"
"హైదరాబాద్ వచ్చేశావా? అమెరికా..."
"అరగంటలో అక్కడికే వస్తున్నా! అన్ని విషయాలూ చెబుతా! అరుణతో మాట్లాడాలి!" అని ఫోన్ డిస్ కనెక్ట్ చేసేశాడు సూరజ్.
"ఏమిటి?" అంది అరుణ ఆదుర్దాగా.
"సూరజ్ వస్తున్నాడు అరగంటలో!"
"అయితే అతనికి ఏమీ కాలేదన్నమాట!" అని తేలిగ్గా నిట్టూర్చి, "మళ్ళీ వస్తున్నాడా? ఇదంతా నీ పనే! మళ్ళీ వస్తున్నాడంటే మళ్ళీ నా వెనక పడతాడు - ప్రేమ ప్రేమ అంటూ" అంది అసహనంగా.
