Previous Page
మైదానం పేజి 31


    "మీరా పొదల వెనక మాయమైనాడు. త్వరత్వరగా అమీర్ని వెతికాను. వొళ్ళంతా ఎక్కడ తాకినా రక్తమే. నా ముద్దు ఉంగరాల జుట్టు, నన్ను కావలించుకుని వొత్తుకున్న రొమ్ము! ఆ బలమైన చేతులు వేళ్ళాడిపోతున్నాయి. "అమీర్, అమీర్?" కళ్ళు తెరిచాడు.
    "ఏమిటి అమీరు, యిది! ఎందుకు అమీరు యిట్లా చేశావు? నేనేం గాను? నువ్వు లేక ఎట్లా బతకను అమీర్? నన్ను చంపు" అని ఏడ్చాను.
    "నిన్ను చంపదలచుకోలేదు. చంప వొద్దనుకున్నాను. నేనో మీరాయో, ఒకరమే బతకాలి. నీకు మీరా కావాలి."
    "నువ్వు చావడమెందుకు అమీర్!"
    "నిన్ను విడిచి బతకలేను."
    "విడవడమెందుకమ్మా!"
    "ఆ మీరాతో నిన్ను పంచుకుంటాననుకున్నావా? తురక బిడ్డని."
    "రా. యిట్లారా!" అని నా తలకోసం చెయ్యి యెత్తబోయి బలం లేక కింద పడేశాడు. నేను గొల్లున ఆ చీకట్లో, అరణ్యంలో బిగ్గరగా యేడుస్తూ బరువుగా వేళ్ళాడే అతని చేతిని భుజమ్మీద పెట్టుకున్నాను. నా తలని మెల్లిగా తన రొమ్ము మీదికి లాక్కున్నాడు. ఏమేమో మాట్లాడాను.
    "అమీర్, అమీర్! నమ్ము. నీమీద నాప్రేమ ఏమాత్రమూ తగ్గలేదు. మీరా విచారం చూడలేక అతన్ని నిరాకరించలేదు. కాని నువ్వేకావాలి నాకు. నేను నీ దాన్నే. ఎందుకిట్లా చేశావ్ అమీర్?...." అని ఎంతో ఏడ్చాను. అమీరు మాట్లాడలేదు. మెల్లిగా అతని ఊపిరి తగ్గిపోయింది. తలెత్తాను. నా జుట్టు అమీరు పళ్ళ సందున కరుచుకుపోయింది. అమీరు ఇంక నాకు లేకుండా పోయినాడు. బతికివున్న అమీర్ని చూసేకంటే అతని శవాన్ని చూస్తే నాకు భయం వేసింది. నేను వొంటరిగా వున్నానని అప్పుడు తట్టింది. చుట్టూ చూశాను.
    ఎక్కడో నేనెరగని స్థలం అది, నల్లని నీళ్ళగుంట పక్కన నా అమీరు పడి వున్నాడు. నేను కదిలినప్పుడల్లా కప్పలు నీళ్ళలోకి దూకుతున్నాయి. తుంగలోంచి గాలి యీడ్చుకుంటూ పోతోంది. చల్లనైన అమీరు చెంపలు తాకడం భయమేసింది నాకు-నా అమీరు చంపల్ని తాకడానికి ఇప్పుడు నన్ను కావలించుకున్న అమీర్ని తాకడం, అతని వంక చూడడం భయంగా వుంది. నా అమీరు కాడు.
    "అమీర్! అయ్యో, అమీర్!" అని పెద్దగా యేడ్చి, నా కంఠం విని భయపడి, నేనే వూరుకున్నాను. అట్లా పిలిస్తే అమీరు లేస్తాడేమోనని వణికాను. కాని నిజంగా అమీరు పోయినాడా? బతికి లేస్తాడేమో?
    చుట్టూ కటిక చీకటి, పొదలు, దోవ తెలీదు. ఆకాశంమీద మబ్బులు కప్పి, ఊపిరాడనట్టు చేశాయి. నక్కలు కూస్తున్నాయి. రావుకద, యీ శవం దగ్గిరికీ! యమదూతలు రారుకదా! వెళ్ళిపోనా? ఎట్లా వుండడం అంత భయంతో! అమీర్ని నా వంక అంత ప్రేమగా చూసే అమీర్ని నా కోసం ప్రాణమిచ్చే అమీర్ని నేను వొదిలి వెళ్ళనా? వున్నాను. వొణుకుతో కొంతసేపు యేడ్చాను. కొంతసేపు వొణికాను. కొంతసేపు అమీరు వంక చూశాను. దైవకృపవలన, ఇంక భరించలేక మోడునై పడివున్నాను. తెల్లవారదు. ఎడతెగని రాత్రి అది. ఇంక అసలు లోకానికి పునఃకాంతిలేదు. ఇంతే. ఈశ్వరుడే అస్తమించాడనిపించింది. కాని నా కోసం లోకం ఆగుతుందా? మెల్లిగా తూర్పు తెల్లనై నీళ్ళు మెరిశాయి. తుంగ కదిలింది. అమీర్ మొహం కనబడ్డది. ఇంకెన్నడూ కళ్ళు తెరవని నా అమీరు మొహం. అతని రొమ్ముమీద లోతైన గాయం. అప్పుడేడ్చాను, నా అమీరు కోసం దిక్కులు మారుమోగేట్టు. నా గుండె పగిలేట్టు, లోకం నామీది చీకటి ముసుగు తీసి నా వొంటరితనాన్ని చూసింది.
    మీరా, డాక్టరూ, పోలీసులూ వచ్చారు. మీరా చేతికి సంకెళ్ళు.
    "ఇదేమిటి మీరా?"
    త్వరత్వరగా.
    "అమీర్ని చంపింది నేనేగా" అన్నాడు.
    తెల్లబోయి చూశాను.
    "నువ్వా!"
    "కాదు, మీరా. అతనే పొడుచుకున్నాడు."
    మీరా తెల్లబోయాడు.
    పోలీసులు చిత్రంగా చూశారు.
    "వీళ్ళందరూ ఎందుకు వచ్చారు?"
    "నేను డాక్టర్ని పిలిస్తే, అతను పోలీసుల్ని పిలిచాడు. నన్నడిగితే నేనే పొడిచానన్నాను."
    "ఎందుకట్లా అన్నావు మీరా?"
    "నాకు అమీర్ పొడుచుకున్నాడని తెలీదుగా?"
    "తెలీకపోతే...."
    "నేను అనుకున్నా."
    "ఎట్లా అనుకున్నావు? అబద్ధం. నిజం చెప్పు."
    పోలీసుల వంక చూసి నెమ్మదైన గొంతుకతో.
    "నువ్వు పొడిచావనుకున్నా" అన్నాడు నా మీరా.
    "అతనే పొడుచుకున్నాడు అన్నాడు."
    నమ్మకం లేకపోవడం చూపించే చిరునవ్వు నవ్వాడు ఆ పోలీసు మనిషి.
    తప్పు చేశా ననుకుని.
    "కాదు, నేనే పొడిచాను" అన్నాను.

                                           * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS