Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 3


                                జయభేరి


    

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

                          *  *  *
ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలంవలె
క్రాగిపోలేదా!
వానాకాలం ముసిరిరాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీతకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసి కేకలేశానే!

                        *  *  *
నే నొక్కణ్ణే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమౌతాయి!
నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీథాలు విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది

                                            *  *  *

నే నొకణ్ణీ ధాత్రి నిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

                            *  *  *
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

                                                                  2-6-1933


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS