Previous Page Next Page 
ప్లే పేజి 3


    "ఏడుపు గొట్టు సినిమాలు...అదేరా...సెంటిమెంటు సినిమాలు తీసి, తీసి అలా తయారై పోయాడు..." మొదటివాడు మరింత హుషారుగా నవ్వుతూ అన్నాడు.
    
    సరిగ్గా అదే సమయంలో ఓ నడి వయస్కుడు హడావుడిగా ప్రెస్ క్లబ్ బార్ లో కొచ్చి, నలువేపులా పరికించి చూసి-జగన్నాయకులు కూర్చున్న స్థలాన్ని గుర్తించి, ఆవేపుకే వేగంగా వెళ్ళి జగన్నాయకులుకి ఎదురుగా కూర్చున్నాడు.
    
    ఆయన ఈనాడు సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్నాడు.
    
    అంత మత్తులోనూ ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వాడు జగన్నాయకులు.
    
    "మీతో చిన్న పనుండి వచ్చాను..." నాందీ ప్రస్తావనగా అన్నాడా వ్యక్తి.
    
    "చెప్పు.... నాకింకా నిషా పూర్తిగా తలకెక్కలేదు..." అన్నాడు జగన్నాయకులు మత్తుగా - చిన్నగా నవ్వుతూ.
    
    "ఈ మధ్య మీరొక విచిత్రమైన కబ్జా కుంభకోణాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. మీకలాంటి అన్యాయాల్ని అక్రమాల్ని వెలికితీసి భూబకాసురుల్ని, కబ్జాసురుల్ని వీధికీడ్చటం అలవాటే గదాని ఊరుకున్నాను. కాని ఒక విషయం తెలిసాక ఆగలేక పరుగెత్తుకు వచ్చాను...." అన్నాడు రిపోర్టర్ ఒకింత ఆందోళనగా.
    
    "ఏంటా విషయం...? నా ప్రాణాలు ప్రమదంలో ఉన్నాయి- అంతేకదా?" ఆ విషయాన్ని ముందుగానే ఊహిస్తూ - తేలిగ్గా చూసుకుంటూ అన్నాడు జగన్నాయకులు.
    
    ఈనాడు రిపోర్టర్ ఒక్కక్షణం విస్తుపోయాడు జగన్నాయకులు వ్యక్త పర్చిన నిర్లక్ష్యాన్ని చూస్తూ.
    
    "ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మీరెలా తీసుకుంటున్నారో నాకర్ధం కావటంలేదు. ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధిలో అత్యధిక విలువచేసే లాండ్స్ కేవలం బంజారా హిల్స్-జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉన్నాయి.
    
    బొంబాయిలో జుహల, లోఖండ్ వాలా, మల్ బార్ హిల్స్, బాండ్రా పాలీహిల్స్, నారీమన్ పాయింట్, నెయపిసినో ప్రాంతమెంత ఖరీదైనవో హైదరాబాద్ లో బంజారా, జూబ్లీహిల్స్ ప్రాంతం అంత విలువైనవి.
    
    ఈ రెండు ప్రాంతాలు షేక్ పేట్ విలేజ్ పరిధిలోకొస్తాయి.
    
    నిజాం నవాబులకి చెందిన నాలుగొందల ఎకరాల చిరాన్ ప్యాలస్ కూడా షేక్ పేట విలేజ్ పరిధిలోకే వస్తుంది.
        
    ఆ గ్రామ పరిధిలోకొచ్చే మరో నాలుగొందల ఎకరాల స్థలాన్ని నిజాం టైమ్ లో లాస్ట్ నిజామ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన దగ్గర పనిచేసిన ఒక సలహాదారుకిచ్చాడట - అయితే ఆ సలహాదారు వారసులు ఇప్పుడు లేరని-వాళ్ళు దుబాయ్ లో ఉంటున్నారని - దాన్ని ఆసరాగా తీసుకొని కబ్జాసురులు కొందరు ఆ స్థలాన్ని దిగమ్రింగేస్తున్నారనే వార్తకి ఊపిరి పోయబోతున్నారట మీరు. దాన్ని రుజువుచేసే ఒరిజినల్ డాక్యుమెంట్- లాస్ట్ నిజామ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సంతకం - అధికారిక ముద్ర ఉన్న డాక్యుమెంట్ మిరాక్యులస్ గా మీ చేతికి చిక్కిందని ప్రెస్ వర్గాల్లో ఒక పుకారు బయలుదేరింది.
    
    ఆ వార్త బకాసురులకి చేరినట్లు-వాళ్ళు దానికోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా ఒక పుకారు. ఇదెంతవరకు నిజమో నాకు తెలీదు. కాని ఒకటి మాత్రం నిజం - మీ ప్రాణాలిప్పుడు ప్రమాదం అంచుల్లో ఉన్నట్లేనని మన ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. మీమీద గౌరవంతో - భక్తితో - ప్రేమతో మీకీ విషయం చెప్పి - కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ వెళ్ళిపొమ్మని చెప్పటానికే వచ్చాను....దయచేసి అపార్ధం చేసుకోవద్దు - నా ఆవేదనని అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నించండి" ఎంతో అర్దింపుగా అన్నాడా ఈనాడు రిపోర్టర్.
    
    అంతా విన్న జగన్నాయకులు ఒక్కక్షణం సీరియస్ గా ఆలోచించి తలపైకెత్తి ఈనాడు రిపోర్టర్ వేపు చూసాడు నిశితంగా.
    
    "నిన్ననే - అంటే మార్చి 17, 1994 నాడు అసెంబ్లీలో షేక్ పేట్ విలేజ్ సర్వే నెంబర్ 403/2 స్థలంమీద ఎంత వివాదం చెలరేగిందో చూసావా? దాన్ని మీ ఈనాడులోనే బాగా కవర్ చేసారు. అదీ గట్స్ అంటే - దటీజ్ రామోజీరావు- హేట్సాఫ్ టు హిమ్ - అదే మీ ఈనాడులో మార్చి 14, 1994 నాడు పేపర్ లో బాలానగర్ మండలంలోని అల్లాపూర్ గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 30లో ఉన్న ఇరవై నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నంచెరువు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుంటే నిర్భయంగా ఆ విషయాన్ని పేపర్ లో వేసి బాంబు పేల్చారు.
    
    దాంతో సంబంధిత అధికారుల్లో చలనం వచ్చి చర్య తీసుకున్నారు. అదీ మీ ఈనాడులోనే వచ్చింది.
    
    ఆ చెరువుక్రింద 60 ఎకరాల్లో ఎందరో పేదరైతులు నిజాంకాలం నాటినుంచి పంటలు పండించుకొని తమ బతుకుల్ని లాక్కుంటూ వస్తున్నారు. వారి కడుపు కొట్టిన వాళ్ళకు నిజానికి ఉరిశిక్ష వేయాలి. అంతదాకా ఎందుకు-యూసఫ్ గూడాలో ఉన్న గవర్నమెంట్ చెరువు ఏమయిపోయింది?
    
    కులీకుతుబ్ షా టూంబ్స్, గోల్కొండకోట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఏమైపోయింది?
    
    ఏమిటీ అన్యాయాలు...? ఎవడబ్బ స్థలాలివి? ఎవడమ్మమొగుడి సొమ్ము... ఏమైపోయాయి మన చట్టాలు-ఏమై పోయింది ప్రభుత్వ యంత్రాంగం...? ఏం చేస్తున్నారీ అధికారులు.
    
    ఇవన్నీ చేస్తున్న దెవరు?
    
    భూ బకాసురులు- అంటే రౌడీలు-గూండాలు వీళ్ళ వెనుక ఉన్నదెవరు? అవినీతి పరులైన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు - ప్రభుత్వ సిబ్బంది... ఈ నీచులు ఇలా ప్రభుత్వ స్థలాల్ని, పేద ప్రజల పొలాల్ని ఆక్రమించుకొని, లే అవుట్స్ వేసుకొని ఇష్టారాజ్యంగా అమ్ముకొని జేబులో నింపుకొంటుంటే, ఏం చేయలేని నిస్సహాయులైన ప్రజలు ఊరుకోవచ్చు ఫోర్త్ ఎస్టేట్ లో పనిచేస్తున్న మన జర్నలిస్టులు ఊరుకోవచ్చా? పత్రికలు కళ్ళు మూసుకుని ఉండవచ్చా?"
    
    అసలు పత్రికలెందుకు! పాత్రికేయులెందుకు? జర్నలిజం ఎందుకు?
    
    పత్రికలు ప్రజల కళ్ళు తెరిపించటానికా? పొట్లాలు కట్టుకోటానికా?
    
    అవినీతిపరులైన అధికారుల్ని, నాయకుల్ని, మంత్రుల్ని నిలదీయటానికా లేక వారికీ బాకా ఊదటానికా?
    
    ఈనాడు ఇండియాలో ఎన్ని పత్రికలు ఇంపార్టియల్ గా నడుస్తున్నాయి....? ఎన్ని పత్రికలు నిజాల్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నాయి? డామిట్....
    
    పార్లమెంట్ సీట్లకోసం - లైసెన్స్ ల కోసం - పర్మిట్లకోసం ప్రాకులాడే పత్రికాధిపతుల పత్రికలు నిజంగా సమాజానికి మేలు చేస్తాయా? ఏవో కొన్ని మంచి పత్రికలు లేకపోలేదు. ఒక్కసారి ఆలోచించు - కనీసం ఈ పాటి పత్రికలైనా లేకపోతే - గూండాలు, రౌడీలు, అవినీతి పరులైన అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వారి బంధువులు ఈ దేశాన్ని ఏం చేసుండేవారు? నంజుకు తినుండేవారు-


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS