Previous Page Next Page 
మైదానం పేజి 29


    "ఆ మాసంపు కూర చల్లారిపోదూ!"
    "మిగిలిందే పెట్టు వాళ్ళకి."
    "పోనీలెండి! మూతపెట్టిపోదాం. వొచ్చి వడ్డించుకు తింటారు" అని నవ్వుకుని లేవబోతున్నాను. మీరా వొచ్చాడు.
    ఆ ఉదయం వెళ్ళిన మీరా మళ్ళీ యిదే రావడం.
    భోజనం చేశాం. కాని అమీర్ వుత్సాహం నశించింది. అంత కోపమున్నవాడు రాత్రి మీరానెందుకు రక్షించాడో నాకు తెలియలేదు. అడగడానికి అసలు మీరా సంగతెత్తడానికి భయం.
    అమీర్ గుడిశకి దూరంగా పచారు చేస్తున్నాడు. నేనూ, మీరా గుడిశ ముందు కూచున్నాము. షికారు ప్రస్తావనే లేదు.
    "మీరా, యిన్నేళ్ళేమయినావు?"
    మీరా నా దగ్గిరిగా జరిగి, గొంతు తగ్గించి "దీదీ నిన్ను వొదిలి నిన్ను చూడక నేను బతకలేను, నిశ్చయం" అన్నాడు.
    ఆ గొంతులోంచి నాకు వినపడ్డది ఆ సంగతి ఇన్ని రోజులు నా బాబు ఎంత బాధపడివుంటాడో! నాకోసం, నా క్షేమం కోసం, నా సౌఖ్యం కోసం. నా వేపు రాకుండా వుండాలనే నిశ్చయం నిలబెట్టుకోడానికై ఎంత ప్రయత్నించి వుంటాడో! దగ్గరికి జరిగి అతని తలని నా రోమ్ముకి అదుముకుని కూచున్నాను. అమీర్ చూస్తాడని భయపడే సమయం కాదు. నా పమిట మీరాకి వీవన వీస్తోంది. నా హృదయం అతనికి జోలపాట పాడుతోంది. నా పెదవులు అతని కన్నులకి శీతలాంజనం రాస్తున్నాయి. ఆనందంతో నేనూ కళ్ళు మూశాను.... "నిద్రవొస్తోంది. రా పడుకుందాం" అన్నాడు అమీర్. ఉలికిపడి కళ్ళు తెరిచాను. ఆ కంఠం వినేప్పటికి అంతసేపూ అమీర్ హృదయంలో యెంత యుద్ధం జరిగి వుండాలో గుర్తించాను. నా సాహసం, మీరాని అంత దగ్గిరగా, అతని యెదుటనే ముద్దు చెయ్యడం, దాని అర్థాన్ని గ్రహించడానికీ, పొంగే ఈర్ష్యని అణుచుకోవడానికీ అతను చేసిన ప్రబల ధైర్యంగాని, నిబ్బరంగాని నా దగ్గిర లేవు. నెమ్మదిగా మీరా తలని నా రొమ్ముమీద నించి దించి కటిక నేలని పెట్టిన కఠినాత్మురాలిని. అమీర్ దగ్గరికి వెళ్ళాను. "రా పడుకో" అని తన పక్కన పడుకోపెట్టుకుని మీద చెయ్యేసి ఒక్కమాట మాట్లాడకుండా నిద్రపోతున్నాడు. ఏమేమో ఆలోచనలతో దూరాన కట్టేసిన తన లేగను డొక్క లేగరేసుకుంటూ చూసే ఆవువలె మీరా నా పాదాల దగ్గిర కూచుని వున్నాడు. మాట్లాడబోయినాను. కాని అమీర్ లేస్తాడని భయం. కదలలేదు. నేను లేచినట్టే తెలియనీయలేదు. నా పాదాలని వొళ్ళో పెట్టుకుని తన పొడుగైన మెత్తని వేళ్ళతో తాకుతూ, తన జుట్టుతో తుడుస్తూ కన్నీళ్ళతో, నిట్టూర్పులతో వాటిని తడిపి ఏడుస్తూ గడిపాడు. ఎట్లా ఆపను, ఎట్లా వూరుకోను? అమీరు చేతికింద కొట్టుకునే హృదయానికి మీరాని లాక్కుని అడ్డుకుంటే?
    తెల్లారేటప్పటికి మీరా లేడు. అమీర్ లేడు. కాని యెవరేమైనారనీ, యేం జరిగిందోనని హడలు పడడం మానేసింది హృదయం. క్షోభపడి క్షోభపడి రాయైపోయింది గావును. అట్లా కొండలకేసీ, వాటినాక్రమించుకున్న యెండకేసీ, యెండని తరిమి వాటిని కప్పుకున్న మబ్బులకేసి చూస్తూ కూచున్నాను. నామీద రెండు రవికలు పడవేసి,? "ఈవాళనించి యివి వేసుకుని వుండు" అన్నాడు.
    దవడ పగిలేట్టు కొట్టినట్టయింది నా మనసు. మధ్యాహ్నమైనా అమీర్ నాతో వొక్క మాట మాట్లాడలేదు. అతను నన్ను మీరా విషయమై ప్రశ్నలు వేసి పరీక్షించి నా మాటలు నమ్మక తిట్టినా కొట్టినా, కాల్చినా కొంత భయం వొదిలిపోను. కాని వొక్కమాట లేకుండా, మబ్బు లేని ఆకాశంలాగా తీక్షణంగా మౌనం పూనడం నాకమితమైన ఘోరంగా వుంది.
    రాత్రి అట్లానే ఒక్కమాట లేకుండా పడుకున్నాము. ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైనట్టయి కళ్ళు తెరిచాను. అమీర్ చేతులు నన్ను బిగించాయి. అతని కళ్ళు భీషణంగా నా కళ్ళల్లోకి మెరుస్తున్నాయి. అతని వేళ్ళు నా భుజాన్ని పిండేస్తున్నాయి. అతని వొళ్ళు బిగుసుకుని, నా వొంటిని బిగిస్తోంది. అతని శ్వాస నన్ను కాలుస్తోంది. నా బతుకు అంతమయిందేమో? నేను చిన్నప్పుడు చదివిన కథలోని "డెసి డిమోనా" గతి నాకు పడుతుందేమోననుకొని వొణికాను.
    "అమీర్, అమీర్, ఎందుకు? నే-"
    "అతని కఠినమైన పెదవులు నా పెదవుల్ని నలిపాయి. అతని ముందరి పన్ను నా కింది పెదవిలోకి దిగింది. ఆ రాత్రికి మాత్రమే నేను దొరికినట్టు, ఆ వూళ్ళోని బ్రాహ్మణకన్య, ఆ యెడారిలో ఆ రాత్రికి మాత్రమే, తనకి కనబడకుండా నేను మాయమౌతానేమో అన్నట్లు ఆ యెడారి మధ్య ఆ వేడిగాలిలో, ఇసుకలో, ఆకాశపు నక్షత్రాల కాంతిలో, తోడేళ్ళ అరుపుల మధ్య నన్ననుభవించాడు అమీర్. అతని ప్రాణం వున్నదో లేదో తెలీక, అతని రొమ్ముమీద తల పెట్టుకుని నా జుట్టు అతని చుట్టూ స్థలాన్ని కప్పుతూ, చిరిగినా రెవిక పీలికలు నాకూ ఇతని రొమ్ముకీ అడ్డంగా, నా చేతులు అతని మెడని కావలించుకుని నిద్రపోయాను- చివరి నిద్ర అమీర్తో.
    మెల్లిగా రెండు వేళ్ళు నా చెంపమీద తగిలాయి. కళ్ళు తెరిచి నక్షత్ర కాంతిలో మీరాని గుర్తుపట్టాను. నేలకి జీరాడే నా జుట్టుని పాపం మెల్లిగా పైకెత్తి, కళ్ళకద్దుకుని మృదువుగా లాగాడు- ఎట్లా లేచి వెళ్ళనూ? నా చేతులు అమీర్ మెడకింద. నా జుట్టు అతని వీపుకింద నా తల అతని రొమ్ముమీదకి. అతని కాలు నా కాలుమీద మెలిక. కదలక పడుకున్నాను. దగ్గిరికి వొచ్చి నా గడ్డం పట్టుకుని వూయించాడు. ఏమిటా సాహసం సింహం నోట్లోంచి లేడిపిల్లని తప్పించాలని? ఆశ్చర్యపోయాను. మీరాయేనా? నాకు చాలా భయమేసింది. ఎట్లాగో తెలిసింది. అదే ఆఖరు రాత్రి యీ మైదానానికి. యీ లోకానికి- నా జీవితానికి, ఆనందానికి ఆఖరు రాత్రి. ఈ పోట్లాటలు యీ తీవ్ర సమస్యలూ- యీ హృదయ ఆరాటాలు- యీ ఘోర ఆకర్షణలు అంతమయ్యే రాత్రి వొచ్చింది. నా పిల్లిపిల్ల మీరాకి అంత సాహసమా? ఏం చెయ్యను. "రా" అంటున్నాడు. మెల్లిగా వొదిలించుకున్నాను, కడసారి-నా జుట్టుని-అమీరు చుట్టూ అల్లుకుని రానంటున్న నా జుట్టుని అమీరు రొమ్ముమీద పడుకున్న నా చంపల్ని - అతని మెడనల్లుకున్న నా చేతుల్ని, కఠినాత్మురాల్ని విడదీసుకున్నాను. అతను లేవలేదు. మెల్లిగా మీరా వెంట నడిచాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS