Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 29


    అనూరాధ గుండెల్లోంచి ఎగసి పడుతున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటోంది.
    ఈ ఎదలో ఎగసే భావాలకు సమాజం దృష్టిలో విలువలేదు. వాటికేవేవో వికృతమైన పేర్లు పెడతారు, అదలా నిర్దాక్షిణ్యంగా నలిగి, అణిగి వుండాల్సిందే.
    అతన్నలా చూస్తూ అక్కడ నిలబడి వుండలేకపోయింది. "వస్తాను విజయ్" అంటూ గిరుక్కున వెనుదిరిగి లోపలకు వెళ్ళిపోయింది.


                             *    *    *    *


    విజయ్ ఆ రాత్రి పదిదాటాకగాని యింటికి చేరుకోలేదు. అలా అర్థం పర్థం లేకుండా ఒంటరిగా తిరగటం ఇంతముందెప్పుడూ జరగలేదు. ఈరోజు అతని ప్రవర్తన అతనికే విచిత్రంగా అనిపించింది.
    సుజాత అతని ముఖంలో మార్పు గమనించింది. ఏమీ ప్రశ్నించలేదు.
    "భోజనానికి రండి" అని మాత్రం అంది అతను బట్టలు మార్చుకు వచ్చాక.
    "వొద్దు సుజా, ఆకలిగా లేదు."
    బలవంతం చెయ్యలేదు.
    ఆ రాత్రి సుజాతకెందుకో నిద్రపట్టలేదు. అతను కూడా నిద్రపోవటం లేదని ఆమెకు తెలుసు.
    ఇద్దరి గుండెల్లో మంటలు చెలరేగుతున్నాయి.
    అతనేదో బాదహ్తో కుమిలిపోతున్నాడని తెలుసు. ఎంత తీవ్రమైనదైతే తప్ప అతను చలించడు. అడిగి మరింత బాధపెట్టటమిష్టంలేదు. చెప్పవలసిన సమయమొస్తే అతనే చెబుతాడు.
    మంటలతో రాత్రి గడిచిపోతోంది.


                           *    *    *    *


    రాధాప్రియకు కూడా నిద్రపట్టటంలేదు.
    వాళ్ళిద్దరి మధ్యా చిచ్చు పెట్టాలి. ఆ ఆకాశరామన్న ఉత్తరాలు అతని మీద పనిచెయ్యలేదు. దానిమీద కూడా పనిచెయ్యవు. ఎందుకంటే వాళ్ళిప్పుడు మహా మూర్ఖులు. అజ్ఞానులు. ఒకరి మీద ఇంకొకరికి వున్న ప్రేమతో ఇద్దరికీ కళ్ళు మూసుకుపోయి వున్నాయి.
    ఈసారి డైరెక్ట్ ఎటాకివ్వాలి.
    ఆ వినోద్ గాడు తనంతటి గొప్పదాన్నలా అవమానిస్తాడా?
    వాళ్ళ అంతు చూడాలి. ఆ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి.
    అసూయతో ఆమె అంతరంగం బుసలు కొడుతోంది.
    భర్త చెయ్యి ఆబగా ఆమె గుండెల మీద పడింది.
    "రాధా. ప్లీజ్ చాలా రోజులయింది, యిటు తిరుగు"
    "ఛ. నోరుమూసుకు పడుకోండి. విసురుగా అతన్ని తోసేసి దూరంగా జరిగి పడుకుంది.


                                                *    *    *    *


    మర్నాడు సుజాత ఒంటరిగా వున్న సమయం కనిపెట్టి రాధాప్రియ ఆమె దగ్గరకెళ్ళింది.
    సుజాత పలకరింపుగా నవ్వింది.
    "బొత్తిగా కనబడటం మానేశారు. కనబడినా మాట్లాడటం మానేశారు" అంది రాధాప్రియ.
    "అబ్బే. అదేం లేదండీ. యింట్లో పనుల వల్ల కుదరక."
    "ఇంట్లో పనులెప్పుడూ ఉంటాయి లెండి. కాని స్నేహం అంతకంటే గొప్పది. మీరు నమ్ముతారో లేదో గాని మీరంటే నాకు చాలా యిష్టం. మీతో మాట్లాడాలనీ, కాలక్షేపం చెయ్యాలనీ నాకెంతో కోరికగా వుంటుంది."
    సుజాత నవ్వి వూరుకుంది.
    రాధాప్రియ ఆ కబురూ, యీ కబురూ చెబుతూ కూచుంది. అక్కడ్నించి కదిలే ప్రయత్నం చెయ్యటం లేదు.
    టాపిక్ అనేక విషయాల మీదకు మళ్ళించింది. చివరకు అసలు పాయింటులో కొచ్చింది.
    "మీరెన్నయినా చెప్పండి. మొగవాళ్ళని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ, కంట్రోల్ లో పెట్టకపోతే మనమీద ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూనే బయట వెధవ్వేషాలు ఎన్నయినా వేస్తూ ఉంటారు.
    సుజాత మాట్లాడలేదు.
    "మీరెన్నయినా చెప్పండి. అసలీ మొగాళ్ళని నమ్మటానికి వీలులేదు. మనమెంత సుఖమిచ్చినా సరే_వాళ్ళకు వెరైటీ కావాలి"
    సుజాతకు చాలా అసహనంగా వుంది.
    "మీరేం అనుకోకపోతే మీకో మాట చెప్పాలి"
    సుజాత సైలెంట్ గానే వుంది.
    "మీరిద్దరూ యింత అన్యోన్యంగా వున్నట్లు కనబడతారా? మీవారి కోసం మీరు సర్వం ధారపోసి అహర్నిశలూ ఆయన క్షేమం కోసమే కలవరిస్తూ వుంటారా? మీ మంచితనం నాకు తెలుసు కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాను"
    "ఏమిటండీ మీరనేది?" అన్నది సుజాత సహనాన్ని కోల్పోతూ.
    "నిన్న సాయంత్రం రోడ్డు మీద పబ్లిగ్గా మీవారూ, ఇంకో అమ్మాయి అందంగానే వుందనుకోండి. చెయ్యి చెయ్యి పట్టుకుని చెట్టాపట్టా లేసుకుని నడుస్తూంటే కళ్ళారా చూశాను"
    "డోంట్ టాక్ దట్" అంది సుజాత యిహ ఆవేశాన్నణచుకోలేక.
    రాధాప్రియ ఉలిక్కిపడింది.
    "మీరు లిమిట్స్ ఎక్సీడవుతున్నారు. నా గురించి, నా హజ్బెండ్ గురించీ మాట్లాడే అధికారం మీకెవరిచ్చారు? ఆయన ఇంకో అమ్మాయితో రోడ్డు మీద నడిచినా, చెయ్యి చెయ్యి పట్టుకున్నా_దటీజ్ యిమ్మెటీరియల్ టూ యూ"
    అంత గొప్ప రాధాప్రియకు ఆవలి వ్యక్తి అలా దులిపేస్తున్నట్లు మాట్లాడుతూంటే నోరు పెగలలేదు.
    కాసేపటికి నాలిక కష్టం మీద స్వాధీనంలోకి తెచ్చుకుని "మీ మంచి కోసం చెబుతూంటే..."
    "మీరెవరు నా మంచి కోరడానికి? ఆఫ్ట్రాల్ యు ఆర్ ఎ థర్డ్ పర్సన్. మా మంచి చెడ్డలతో మీకు నిమిత్తమేమిటి? మీలాంటి వెల్ విషర్సంటే నాకసహ్యం. చాడీలు చెప్పే వాళ్ళంటే...ఐ హేట్ ఇట్. ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి"
    "అంటే గెటవుటంటున్నావన్నమాట"
    "అది నెక్ట్స్ స్టెప్"
    "నీ కర్మ" అంటూ రాధాప్రియ విసురుగా వెళ్ళిపోయింది.
    ఆమెలో కోపం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఆమె అవమానంతో దహించుకు పోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS