బైజూ
అది ఆగ్రా నగరానికి సమీపంలోఉన్న అరణ్యప్రాంతం. ఆ అరణ్యప్రాంతంలో ఒక చిన్న పర్ణశాల. ఆ పర్ణశాలలో పది పన్నెండేళ్ల బాలుడు చింకి చాపమీద పడుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. "అయ్యయో! ఎక్కడున్నావు నాన్నా! ఏమి చేస్తున్నావు! ఇక్కడ నాకు దిక్కెవ్వరు? అసలు నీవు అక్బరు పాదుషా ఆజ్ఞ తెలుసుకోకుండా ఆగ్రా నగరంలో ఎందుకు అడుగుపెట్టావు? తోడి సాధువులతో వీథి వీథులా భగవంతుడి మీద పాటలు పాడుతూ ఎందుకు తిరిగావు! అక్బరుపాదుషా ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ గారికి అకారణంగా ఆగ్రహం తెప్పించావు! అన్యాయంగా మరణశిక్ష పొందావు! ఇప్పుడు నీకు ఎక్కడున్నావు నాన్నా! ఏమి చేస్తున్నావు నాన్నా!" అని గుండెలు కరిగిపోయేటట్లు విలపిస్తున్నాడు బాలుడు.
అంతలోనే రామనామ ధ్యానం చేస్తూ ఒక మహాయోగి అక్కడకు దయచేశాడు. బాలుడి ఏడుపు విని ఆయన కుటీరంలో అడుగుపెట్టాడు. "దుఃఖపడకు నాయనా! కలిగిన నష్టాన్ని మరచిపోయి కర్తవ్యం గుర్తుంచుకోవాలి! అంతేగాని అలా దుఃఖిస్తూ కాలం వ్యర్థం చేయకూడదు" అన్నాడు యోగీంద్రుడు.
బాలుడు చివాలునలేచి ఆ మహాత్ముని పాదాల మీద వ్రాలాడు. "స్వామీ! నేను దిక్కులేని దీనుణ్ణి! నన్ను కాపాడండి" అన్నాడు బాలుడు. యోగీంద్రుడు ఆ చిన్నారి పాపని శిరస్సు నిమురుతూ, "భయపడకు నాయనా! దిక్కులేని దీనులందరినీ దేవుడు కాపాడుతాడు. ఇంతకూ నీకు వచ్చిన ఆపద ఏమిటి తండ్రీ" అని ప్రశ్నించాడు.
బాలుడు కన్నీరు తుడుచుకుంటూ, "వినండి స్వామీ! అక్బరు పాదుషా ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ ప్రపంచంలో తానొక్కడే సంగీత పండితుడనని భావిస్తుంటాడు. అందువల్ల ఆగ్రా నగరంలో తాను తప్ప అన్యులెవ్వరూ పాటలు పాడరాదని ఆయన శాసించాడు. ఆవిధంగా ఎవరైనా పాటలు పాడితే రాజభటులు వాళ్లను బంధించుకొని పోయి తాన్ సేన్ గారి ముందుంచుతారు. ఆయన వాళ్లను సంగీత విద్యలో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గని వాళ్లకు మరణశిక్ష విధింపబడుతుంది. అలా ఓడిన సంగీత పండితులు ఎందరెందరో ఆస్థాన గాయకుడి చేతిలో హతమారిపోయారు. అందువల్ల ఆగ్రాలో పాటలు పాడటం మృత్యువుతో ఆటలు ఆడటమే! ఆ సంగతి తెలియక నిన్నటి రోజున మానాన్న గారు సాధుబృందంతో దైవభజనచేస్తూ ఆగ్రానగరం నడివీథిలో నడిచిపోతున్నారు. రాజభటులు అందరినీ పట్టుకొని వెళ్లి ఆస్థాన గాయకుడికి అప్పగించారు. ఆయన వాళ్లను సంగీత శాస్త్రంలో ప్రశ్నలువేసి పరీక్ష చేశాడు. శాస్త్రం తెలియని సాధువులందరూ నిరుత్తరులై నిలబడ్డారు. తాన్ సేన్ అందరినీ తానే జయించానని ప్రకటించాడు. అక్బరుపాదుషా అనుమతితో అందరికీ మరణదండన విధించాడు. చిన్నవాణ్ణి కావటంవల్ల వెంట ఉన్న నన్ను మాత్రం దయతలచి విడిచిపెట్టారు. ఆ విధంగా కన్నతండ్రిని పోగొట్టుకొని ఏకాకినై ఏడుస్తున్నాను. స్వామీ! నన్ను తాన్ సేన్ సర్వనాశనం చేశాడు. నా తండ్రిని చంపిన పాపానికి ఎప్పటికైనా అతనికి ప్రతీకారం చేయాలి స్వామీ! నా రక్తం ఉడికి పోతున్నది. అధికారమదంతో అమాయకులను పీడించే ఆ పాపాత్ముడికి బుద్ధిచెప్పాలి. అందుకు తగిన ఆయుధం ఇవ్వండి స్వామీ!" అని పలికాడు బాలుడు.
ఆ మాటలు విని మహాయోగి మౌనం వహించాడు. "అలాగే నాయనా! తండ్రి ఋణం తీర్చటం కోసం నీకు తగిన ఆయుధం ఇస్తాను. అయితే అందుకు నీవు చాలా కష్టపడాలి. అఖండమైన దీక్షతో మహా తపస్సు చేయాలి. పన్నెండేళ్లపాటు నా వద్ద అద్భుతమైన గానవిద్య అభ్యసించాలి. ఆ విద్యాబలంతో విరోధిని జయించి అఖండకీర్తి ఆర్జించాలి. అందుకు నీవు సిద్ధంగా ఉన్నావా?" అన్నాడు యోగీంద్రుడు. బాలుడు భక్తితో చేతులు జోడించి "మహా ప్రసాదం స్వామీ! ఈ బైజూ ఈ క్షణం నుంచీ మీ శిష్యుడు" అని పలికాడు. యోగీంద్రుడు బైజూను వెంట బెట్టుకొని ఆ దగ్గరలో ఉన్న ఆశ్రమం వైపుకు బయలుదేరి వెళ్లాడు.
క్రమంగా కాలం గడచిపోతున్నది. కళా కోవిదుడైన యోగీంద్రుడు గానవిద్యా గురువైనాడు బైజూకు. బైజూ అచంచల దీక్షతో గాంధర్వ విద్య అభ్యసిస్తున్నాడు కళారహస్యాలు గ్రహిస్తున్నాడు. అతని సంగీత సాధనలో పన్నెండేళ్ళు గడిచిపోయినవి. బైజూ కంఠంలో గానలక్ష్మి కాపురం పెట్టింది. అతని కంఠంలో సంగీత సరస్వతి పొంగిపోతున్నది. బైజూ గొంతెత్తి పాడితే శిలలు కరిగిపోతున్నవి. చెట్లు పులకరిస్తున్నవి. పశువులూ పక్షులూ పారవశ్యం పొందుతున్నవి. జనం మహానంద పడుతున్నారు. బైజూ "గాన కళాప్రపూర్ణు"డైనాడు.
ఒకనాడు గురుదేవుడు శిష్యుణ్ణి చూచి, "నాయనా బైజూ! నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పాను. ఇప్పుడు లోకంలో నిన్ను మించిన గాన కళావేత్త లేడు. ఇక నీవు స్వేచ్చగా దిగ్విజయం చేయవచ్చు" అని పలికాడు. బైజూ కృతజ్ఞతాపూర్వకంగా గురుదేవుని చరణాలకు నమస్కరించాడు. "స్వామీ! మీరు నా జీవితానికి నవజీవనం ప్రసాదించారు. ఇంత విద్యాదానం చేశారు. నేను మీ ఋణం ఎలా తీర్చుకోగలను? మీకు గురుదక్షిణగా ఏమి యివ్వగలను?" అన్నాడు బైజూ.
గురుదేవుడు మందహాసం చేస్తూ "కుమారా! నేను నేర్పిన విద్యతో నీవు ఎవ్వరికీ ఎప్పుడూ ఏవిధమైన అపకారమూ చెయ్యకూడదు. అదే నీవు నాకు ఇవ్వగల గురుదక్షిణ! ఆ విధంగా నా మాట పాటిస్తానని వాగ్దానం చెయ్యి. అంతే నేను కోరేది!" అని పలికాడు.
ఆ మాటలు విని బైజూ కుప్పకూలిపోయాడు "తన తండ్రిని చంపించిన తాన్ సేన్ ను జయించి తగిన ప్రతీకారం చెయ్యటానికే తాను ఇంతకాలం ఈ గానవిద్య అభ్యసించాడు. ఇప్పుడు గురువుగారు కోరిన ప్రకారం తన గాన విద్యతో ఎవ్వరికీ ఏ అపకారమూ చెయ్యనని ప్రమాణం చేస్తే తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది! అయినప్పటికీ గురుదేవుల మాట పాటించి తీరాలి." అందువల్ల బైజూ గురువుగారు కోరిన ప్రకారం వాగ్దానం చేశాడు. ఆయన సెలవు తీసుకొని సితారా చేత ధరించి ఆగ్రా నగరానికి బయలుదేరాడు.
ఆ మరునాటి ఉదయం ఆగ్రా నగరంలోని రాజోద్యానంలో అక్బరు పాదుషా సంగీతసభ ఏర్పరచాడు. నగరంలో ఉన్న పిన్నలూ, పెద్దలూ, స్త్రీలూ, పురుషులూ ఆబాలగోపాలం గుంపులుగుంపులుగా సభాస్థలానికి చేరుకున్నారు. అనేక శాస్త్రాలలో ఆరితేరిన ఆస్థాన గాయకుడు తాన్ సేన్ కూ, పాతికేండ్ల బాల గంధర్వుడు బైజూకూ సంగీతయుద్ధం జరగబోతున్నది. అక్బరు పాదుషా "ఈ వివాదంలో విజయం పొందినవాడు సంగీతకళా సార్వభౌముడని పేరు పొందుతాడు. ఓడిపోయిన వాణ్ణి శిక్షించటానికి గెలిచినవాడికి అధికారం ఉంటుంది." అని సభారంభంలో ప్రకటించాడు.
