Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 28


    "ఏమయ్యా బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. ఎక్కడికెళ్ళావు ఇప్పటిదాకా?" కనకారావు కళ్ళెర్ర చేస్తూ అన్నాడు.

 

    "మరో కప్పు టీ తెప్పించుకుని తాగు. కోపం తగ్గుతుంది" నవ్వుతూ అన్నాడు సామంత్.

 

    "వరదలొచ్చి జనం ఏడుస్తుంటే తిట్లతో సరిపుచ్చుకోమన్నాడట నీలాంటి పెద్ద మనిషి. ప్రమాదం ముంచుకొచ్చి నేను టెన్షన్ పడుతుంటే నవ్వెలా వస్తుందయ్యా నీకు? నీ గురించి పీటర్ సాబ్ అడిగాడు ఇప్పటికే లేటయి పోయింది. త్వరగా స్టూడియోకి పదా పోదాం" అన్నాడు కనకారావు హడావుడిగా బెంచి మీంచి లేస్తూ.

 

    "నాకు సినిమా వేషాల మీద మోజు లేదు" సీరియస్ గా అన్నాడు సామంత్.

 

    కనకారావు బిత్తరపోయాడు.

 

    "సినిమా వేషాలేంటి?" అర్థంకాక అడిగాడు కనకారావు.

 

    "నేను హీరో వేషాలెయ్యనుగాక వెయ్యను. మాలాంటి జీవితాల్నే గదా సినిమాల్లో హీరో పాత్రలుగా మలిచేది?"

 

    సామంత్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థంగాక పిచ్చి చూపులు చూశాడు కనకారావు.

 

    "ముందేమో ఒకటి చెప్పి... ఇప్పుడేమో వేషాలంటావా? నేను రాను" అన్నాడు సామంత్ కూడా బెంచీ మీంచి లేస్తూ.

 

    కనకారావు ఒక్కసారి సామంత్ రెండు చేతుల్ని పట్టుకున్నాడు. "నన్ను... నన్నెందుకయ్యా ఇలా ఏడిపిస్తావు? నాకు అర్థమయ్యేలాగ మాట్లాడవయ్యా" దాదాపు ఏడుస్తున్నట్టుగా అన్నాడు.

 

    "తెలుగేగా నేను మాట్లాడింది? అర్థం కాలేదంటావేమిటి? నువ్వెన్ని వేషాలైనా వేసుకో. నేను మాత్రం సినిమాల్లో వేషాలెయ్యను" సామంత్ తెగేసి చెప్పాడు.

 

    "నిన్ను సినిమాల్లో వేషాలెయ్యమన్నానా నేను? ఎప్పుడు?!" దీనంగా ముఖంపెట్టి అడిగాడు కనకారావు.

 

    "ఇప్పుడే గదా... స్టూడియోకి వెళ్దామన్నావ్? నేను చచ్చినా రాను" అంటూ సామంత్ బయటకు నడవసాగాడు.

 

    త్వరత్వరగా టీ చిల్లర అక్కడే టేబుల్ మీద పడేసి సామంత్ ని అందుకునేందుకు కనకారావు పరుగులాంటి నడకతో బయటకు సాగిపోయాడు.    

 

    "స్టూడియో అంటే సినిమా షూటింగ్స్ జరిగే స్టూడియో కాదయ్యా మగడా? పాస్ పోర్ట్ ఫోటోలు దిగే స్టూడియో... ఓర్నాయనో... నీతో మాట్లాడాలంటే మానవమాత్రుడికి సాధ్యం కాదయ్యా" కనకారావు తల పట్టుకుంటూ అన్నాడు.

 

    "ఈ కొత్త ట్రైనింగ్ ఎప్పుడు మొదలెట్టావు?" సామంత్ సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు.

 

    "ట్రైనింగా?!"

 

    "అవును"

 

    "ట్రైనింగేమిటి? దేనికి? నీకేగా నేను ట్రైనింగిచ్చేది"

 

    "నేననేది నాకిచ్చే ట్రైనింగ్ గురించి కాదు - జంతువులకిచ్చే ట్రైనింగ్ గురించి"

 

    "జంతువులకా?"

 

    "ఆహా..."

 

    "నేనా?"

 

    "అవును నువ్వే"

 

    "నాకర్థం కాలేదు"

 

    "జంతువులకు మాట్లాడటం నేర్పే పని"

 

    "నేను మనుష్యులకే... అంటే నీకే నేర్పలేకపోతున్నాను. నా బ్రతుక్కి మళ్ళీ జంతువుల కొకటా?"

 

    "ఇప్పుడేగా నాతో మాట్లాడడం మానవమాత్రుడికి సాధ్యం కాదన్నావ్?"

 

    కనకారావు ఒక్కసారి సామంత్ కాళ్ళమీద పడిపోయాడు.

 

    "ఒక స్పూన్, రంపం తెచ్చిస్తా. నా మెదడు ఓపెన్ చేసి ఒకేసారి తినెయ్యవయ్యా. ఇలా డ్రిల్లింగ్ చేసి తినకు. నేను తట్టుకోలేక పోతున్నాను. ఇంతకీ మీదేవూరు నాయనా?" కనకారావు ఏడుపును దిగమింగుకుంటూ అడిగాడు.

 

    తన కాళ్ళ దగ్గర వున్న కనకారావు కేసి సామంత్ తలవంచి చూస్తూ తాపీగా అన్నాడు. "స్టూవర్టుపురం" అని.

 

    అంతే... కనకారావు భయంతో ఎగిరి అవతల పడ్డాడు.

 

    ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అతనికి దాదాపు ఐదు నిమిషాలు పట్టింది.

 

    "నువ్వు... నువ్వు... చెప్పేది నిజమేనా?" భయం భయంగా చూస్తూ అడిగాడు కనకారావు.

 

    "నీలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా నాది స్టూవర్టుపురమే"

 

    "ఏదీ... ఆ బాపట్లకు, చీరాలకు మధ్య వున్న దొంగల ఊరు?"

 

    "అవును... ఇంతకీ పాస్ పోర్టు ఫోటోలు అక్కర్లేదా?"

 

    కనకారావు చప్పున లేచి సామంత్ ని ఆటోకేసి లాక్కెళ్ళి ఆటో ఎక్కించి "దర్గా" అన్నాడు.

 

    ఆటో బయలుదేరింది.

 

    కనకారావు మరేమీ మాట్లాడలేదు. సామంత్ కూడా మౌనంగా వుండిపోయాడు. అతని ఆలోచనలన్నీ ఎస్.ఐ. నరసింహం చుట్టే పరిభ్రమిస్తున్నాయి.

 

    అరగంటలో ఆటో దర్గా చేరుకుంది. ఆటోకి డబ్బులిచ్చేసి ఇద్దరూ లోపలికెళ్ళి తిరిగి అరగంటలో బయటికొచ్చి మరో ఆటో ఎక్కారు.

 

    సామంత్ అప్పుడప్పుడు మౌనంగా వుండాలనుకుంటాడు. నిశ్శబ్దాన్ని ఇష్టపడతాడు. అది కనకారావుకి బాగా తెలుసు. అందుకే అతనూ ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. పైగా సామంత్ తో ఏ మాటంటే ఏ తంటా వస్తుందోనని భయం కూడా వుంది.

 

    పావుగంటకు ఆటో ఓ ఫోటో స్టూడియో ముందాగింది. ఆ ఆటోని పంపించేసి సామంత్ ని స్టూడియోలోకి తీసుకెళ్ళి బ్లాక్ అండ్ వైట్ ఒకటి, కలర్ ఒకటి తీయించి అక్కడే సెటిలైపోయి, అరంగట్లో ఫోటోలు ఇవ్వగలిగితే వంద రూపాయలు అదనంగా ఇస్తానని ఆశ పెట్టాడు.

 

    అయినా కనకారావు టెన్షన్ తగ్గలేదు.

 

    క్షణాలు, నిమిషాలు లెక్కపెడుతూ అటూ ఇటూ ఆందోళనగా తిరగసాగాడు.

 

    అయితే అంత టెన్షన్ లోనూ అతనికో విషయం గొప్ప సంతృప్తిని కలిగించింది - హోటల్ నుంచి సరాసరి దర్గాకి తీసుకెళ్ళి సామంత్ కి ప్రత్యేకించి కుట్టించిన డ్రస్ వేయించినప్పుడు అతను అచ్చం దొరబాబులా, దర్జాగా, హైక్లాస్ సొసైటీ నుంచి వచ్చినవాడిలా కనిపించాడు.

 

    తను ఎన్నుకునే వ్యక్తి అచ్చం అలాగే వుండాలని పీటర్ కోరిక.

 

    సామంత్ స్టూవర్టుపురానికి చెందినవాడని కొత్తగా అతని నోటి ద్వారా తెలిసిన విషయం బ్రహ్మాండమైన సంతృప్తిని కలిగించింది. పీటర్ ఆ కోరిక కూడా కోరాడు. అప్పుడు వాచీ చూసుకున్నాడు. టైమ్ 7-05 అయింది. అప్పటి వరకు వాచీ చూసేందుకు కూడా భయమేసి చూడలేదు కనకారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS