Previous Page Next Page 
ప్లే పేజి 27


    
    "మీరు..." ధడాల్మని, పోస్టాఫీసు దగ్గర ఇన్ సి డెంట్ గుర్తుకొచ్చింది.
    
    "నేనే.... ఊరు చివర బార్లో.... హీరో హోండాని, మీ రూమ్ దగ్గర ఆ నేనే.... ఏంటి అసలు కనబడ్డంలేదు...."
    
    సూటిగా, కళ్ళలోకి చూస్తూ అడుగుతున్న ఆమెకు ఏం జవాబు చెప్పాలో అర్ధం కావడంలేదు సూర్యవంశీకి.
    
    "డూ యూ హేవ్.... త్రిబులెక్స్ రమ్" టింగు, రంగామని షోకిల్లా అమ్మాయొచ్చి రమ్ అడగడం, థ్రిల్లుగా ఉంది షాపువాడికి.
    
    "ఎస్, మేడమ్..." ఆమె ఎత్తయిన గుండెలమీద కదలాడుతున్న గోల్డ్ చైన్ వేపు చూస్తూ అన్నాడతను.
    
    "ఫుల్ బాటిల్..." చెప్పి, హేండ్ బాగ్ లోంచి డబ్బులు తీసి ఇచ్చింది. బాటిల్ ని చేత్తో అందుకుంది.
    
    అదే సమయంలో సూర్యవంశీ పాకెట్లోంచి వంద రూపాయలనోటు తీసాడు.
    
    "ఆఫ్ బాటిల్.... ఓల్డ్ మాంక్..." చెప్పాడు.
    
    "మనిద్దరికి ఇది చాలదా... ఇంకా ఓల్డ్ మాంక్ ఎందుకు.... కాక్ టైల్ అయిపోద్ది గురూ..." కన్ను గొడుతూ అందా అమ్మాయి.
    
    "మనిద్దరికా..." తడారిపోయిన గొంతుతో అన్నాడు సూర్యవంశీ. గుడ్లప్పగించి చూస్తున్నాడు షాపులోని వ్యక్తి.
    
    "అవును.... ఏం..... వైన్ కి విడాకులిచ్చేసాలే... పద.... రూమ్ కెళ్దాం...."
    
    చెయ్యిపట్టుకుని ముందుకు లాగి, బాటిల్ ని హేండ్ బాగ్ లో పెట్టుకొని తనే హీరో హోండా ఎక్కి స్టార్ట్ చేసింది.
    
    "బేక్ సీట్లో కూచో బాస్..."
    
    సూర్యవంశీకి ఆమె చెప్పినట్టుగా చెయ్యక తప్పిందికాదు.... హీరో హోండా స్టార్ట్ కాగానే హౌస్ ఓనర్ పరబ్రహ్మం ముఖం గుర్తుకు రావడంతో కంగారు పడిపోయాడు సూర్యవంశీ.
    
    ఈ అమ్మాయిని గనక, ఇప్పుడు పరబ్రహ్మం చూస్తే, తన బుర్ర తినేయడం ఖాయం.
    
    ఎలాగైనా ఈ అమ్మాయిని, రూమ్ కి రాకుండా ఆపాలి....
    
    ఎలా... ఎలా... ఎలా...?
    
    "ఏయ్.... అమ్మాయ్....నీ పేరేంటి..." గాభరాగా అడిగాడు సూర్యవంశీ.
    
    "అప్పలమ్మ" చటుక్కున చెప్పింది.
    
    "ఇదిగో.... జోక్స్ తర్వాత..."
    
    "జోకేంటి నాయనా.... నువ్వేం మా మావ కొడుకివా, అత్తమొగుడివా....కొత్త మొగుడివా.... నీతో జోకు లెయ్యడానికా... పేరెందుకు గానీ అసలు విషయం చెప్పు..."
    
    "బండిని కాసేపు ఆపు..."
    
    "ఎందుకు...." బ్రేక్ వేసింది ఆ అమ్మాయి.... ధడ్ మని సూర్యవంశీ గెడ్డం ఆ అమ్మాయి మెడకి తగిలింది.
    
    "చూడు బాసూ... అప్పుడప్పుడు గెడ్డాలు చేయించుకుంటుండాలి.....
    
    "అది సరేలేగానీ.... దిగు..."
    
    "ఎందుకు..." దిగుతూ అంది ఆ ఆమ్మాయి.
    
    "ఇక్కడ ఉండు.... ఫైవ్ మినిట్స్ లో వస్తాను..." గేర్ మారుస్తూ అన్నాడు సూర్యవంశీ.
    
    "ఎక్కడికి...." గుణుస్తూ అందా అమ్మాయి.
    
    జవాబు చెప్పలేదు సూర్యవంశీ బాగ్ లింగంపల్లి బ్రిడ్జి వైపు వెళ్తున్న సూర్యవంశీ వేపు కళ్ళప్పగించి చూస్తోంది ఆమె.
    
    బాగ్ లింగంపల్లి మీదుగా, ఫీవర్ హాస్పిటల్ మీదుగా, మళ్ళీ బాగ్ లింగంపల్లి వచ్చి, సందుల్లోంచి తన ఇంటిముందు హీరో హోండాని పార్క్ చేసి పిల్లిలా మెట్లెక్కి రూమ్ లో కొచ్చి పడ్డాడు సూర్యవంశీ.
    
    "చూసి, చూసి, వెళ్ళిపోతుందిలే..." మనసులో అనుకుని, టేబుల్ వేపు చూసాడు.
    
    అప్పుడెప్పుడో సగం ఖాళీ చేసిన రమ్ బాటిల్ అందుకొని గ్లాస్ లో వేసుకుని టేప్ రికార్డర్ ఆన్ చేసి, నెమ్మదిగా సిప్ చెయ్యడం ప్రారంభించాడు.
    
    పది నిమిషాలు గడిచాయి.
    
    డోర్ చప్పుడైతే, విసుక్కుంటూ తలుపు తెరిచాడు.
    
    ఎదురుగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం.
    
    "ఏందయ్యా... ఏంటిది... ఎవరుబడితే వాళ్ళదగ్గర అప్పుచేసెయ్యడమేనా.... ఆడా... మగా తేడా లేకుండా.... అప్పు చేసెయ్యడమేనా... చెప్పు..."
    
    అలా అడుగుతున్న పరబ్రహ్మం వేపు కోపంగా చూసాడు సూర్యవంశీ.
    
    "అలా కోప్పడిపోకు... చూడు... ఈ పిల్ల దగ్గర అప్పు తీసుకున్నావట గదా..." అంతవరకూ తలుపు చాటున చీకట్లో ఉన్న ఆ అమ్మాయి వెలుగులోకొచ్చి అందంగా నవ్వింది.
    
    "నువ్వా?!"
    
    "అవును... బావా...." దీర్ఘాలు తీస్తూ అంది ఆ అమ్మాయి.
    
    "బావేంటి... బావ... ఈ పిల్ల నీ మరదలా... నీకో మరదలుందని నాకెప్పుడూ చెప్పలేదేం..." కంగారు, కంగారుగా ఇద్దరు ముఖాల వేపు చూస్తూ అడిగాడు పరబ్రహ్మం.
    
    "ఈ పిల్ల నా మరదలంటే.... మీరు నమ్మెయ్యడమేనా...." చికాగ్గా అడిగాడు సూర్యవంశీ.
    
    "అదేంటి బావా అలా... చూడండి అంకుల్... మా నాన్న, మా బావ ఎప్పుడో ఒకసారి కొట్లాడుకున్నారంకుల్.... అప్పట్నించి.... మా ఇంటికి రావడంలేదంకుల్.... అంకుల్....బావకిష్టమని బాటిల్ కూడా తెచ్చానంకుల్...." బాటిల్ తీసి పరబ్రహ్మానికి చూపిస్తూ, సూర్యవంశీకి కన్నుగొడుతూ అంది ఆమె.
    
    "ఇదిగో అమ్మాయ్.... నువ్వు వెళతావా.... లేదా...." డోర్ మూసేస్తూ అన్నాడు సూర్యవంశీ.
    
    "ఈ రాత్రి ఇక్కడ ఉంటానంకుల్....మీరైనా చెప్పండి అంకుల్... చెప్తే మీకే ఈ బాటిల్ ఇచ్చేస్తానంకుల్..."
    
    ఆమె వేపు ఎగాదిగా చూసాడు పరబ్రహ్మం.
    
    "ఈ రాత్రి.... ఒక బ్యాచులర్ రూమ్ లో... నువ్వు.... నువ్వు.... ఉంటావా....నో... నో... ఉండడానికి నేనొప్పుకోను....అంతే..."
    
    పరబ్రహ్మం ముఖాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది సూర్యవంశీకి.
    
    "మీ ఇద్దరూ ఎలా తగలబడతారో మీ ఇష్టం.... నాకు నిద్దరొస్తోంది.....గుడ్ నైట్" చెప్పేసి, ముందుకు కదిలాడు సూర్యవంశీ.
    
    "నువ్వు.... రా అమ్మా.... ఉదయం....మాట్లాడుకుందాం...." అని మెట్లు దిగడం ప్రారంభించాడు పరబ్రహ్మం.
    
    "చూడు తల్లీ.... రాత్రిపూట... వంటరి మగవాడి గదిలో ఉండడం.... మహా..." నెమ్మదిగా చెప్తున్నాడు పరబ్రహ్మం. ఆ మాటల్ని విని మరోసారి నవ్వుకున్నాడు సూర్యవంశీ.
    
                                                    *    *    *    *    *
    
    మంచమ్మీద పడుకున్న సూర్యవంశీకి నిద్రపట్టడం లేదు.
    
    ఇంతకీ ఈ అమ్మాయెవరు?
    
    ఎందుకు తన చుట్టూ తిరుగుతోంది?
    
    ఆరోజు తనకి ఉత్తరం రాసిన అమ్మాయి ఎవరు? ఇద్దరు వేర్వేరా? లేక ఒకరేనా? వేర్వేరు అనుకుంటే ఈ అమ్మాయి ఎవరు? చాలా సేపు ఆ ఇద్దరి గురించి ఆలోచించాడు సూర్యవంశీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS