"ఆ పనెప్పుడో జరిగిపోయింది."
"ఏమిటి నిజంగా?"
రాధాప్రియ అవునన్నట్టుగా తల ఆడించింది.
"ఎలాగ? ఏం చేశారేమిటి?"
"ఎవరికీ చెప్పరుగా"
"ఛీ ఛీ. నా గుండెలోకి ఒకమాట ఎక్కిందంటే...గుండె ఆగిపోయేదాకా అదక్కడ ఉండిపోవల్సిందే"
"ఒట్టేయండి"
"నా మొగుడు చచ్చినంత ఒట్టు"
"ఆ విజయ్ కుమార్ గాడికి శ్రేయోభిలాశిగా ఆకాశరామన్న ఉత్తరాలు రాశాగా?"
"అమ్మో మీ దస్తూరి గుర్తుపడితే?"
"అమ్మా! అంత తెలివితక్కువ దాన్ననుకున్నారా? ఎడం చేతితో చింకిరి కొంకిరిగా రాశా"
"ఏమిటీ మీకు ఎడం చేతితో రాయడం కూడా వచ్చా?"
"ఆహా! ఎప్పటికైనా అవసరమొస్తుందని ప్రాక్టీస్ చేసి ఉంచా.
"అబ్బో! మీ తెలివితేటలు అఖండమంటే. మీ లాంటి ప్రాణ స్నేహితురాలున్నందుకు నేను గర్విస్తున్నా. మన ఆశయాలు ఇలాగే నెరవేరుతూ, మన స్నేహం కలకాలం వర్థిల్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా.
రాధాప్రియ జవాబు చెప్పకుండా మౌనంగా కూచుంది.
"అదేమిటి? అలా సైలెంటుగా వుండిపోయారేమిటి!"
"ఆ విజయ్ కుమార్ గాడికి ఈ శ్రేయోభిలాషి ఉత్తరాలంటున్నా, పెళ్ళాన్ని అనుమానించకపోగా ఇంకా ఎక్కువ ప్రేమ వొలకబోస్తూ ముద్దులూ, మురిపాలూ గుమ్మరిస్తున్నాడేమిటి? నా అస్త్రం గురి తప్పదే"
"కొంతమంది పిచ్చి వెధవలుంటారండీ. పెళ్ళాంమీద అపారమైన నమ్మకం. ప్రేమ_ఎవరెంత చెప్పినా తలకెక్కదు."
రాధాప్రియ ఆవేశంతో వూగిపోతూ ఆలోచిస్తోంది. విజయ్ కుమార్ గాడు అంతకన్నా బడుద్దాయి అందుకేనేం? ఈ రాధాప్రియ అంటే ఏమిటో చూపిస్తాను. నా తడాఖాలు చూపిస్తాను. అది ఆఫ్ట్రాల్ సుజాత తన నంగనాచి వేషాల్తో నలుగురిలో గొప్పలు సంపాదించుకోవాలని ఎత్తులు వేస్తోందా? మై హాబ్బింగ్ ఎస్ పూర్ ఫెలో...చీటికి మాటికి దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఈ చేతకాని, ఎందుకూ పనికిరాని మొగుడు పొగడ్తలందుకునే ఆడదాన్ని నేను సహిస్తూ ఊరుకుంటానా? నో...అది యింకా యింక అడుక్కి వెళ్ళిపోవాలి? నాశనమైపోవాలి. అప్పుడే...అప్పుడే...ఈ రాధాప్రియకు మనశ్శాంతి."
* * * *
సుబ్బారావు విజయ్ కుమార్ దగ్గరకొచ్చాడు.
ఈ మధ్య ఏదో పని కల్పించుకొని అతను విజయ్ కుమార్ దగ్గరకు తరచు వస్తున్నాడు. ఓ అరగంటో గంటో టైము వేస్టు చేసి పోతున్నాడు.
జీవితంలో చిత్రమిదే. తప్పించుకునేందుకు అవకాశాలున్నా అర్థం పర్థం లేకుండా వాళ్ళని భరిస్తూ వుంటాం. అంతేకాదు. వాళ్ళవల్ల అనవసర విషయాల్లో ఇరుక్కోబడి అనర్థాలక్కూడా గురి కాబడుతూ వుంటాం.
తెలిసి చేసే తప్పులు మానవ బలహీనతకు తిప్పలు.
సుబ్బారావులాంటి వ్యక్తులు మామూలుగా మాట్లాడరు. చిన్నదే అయినా సమస్యల్ని సృష్టిస్తూ అనవసర విషయాలు కెలుకుతూ. వాటిలోకి ఎదుటివార్ని ఈడ్చుకుపోతూ గందరగోళంలో పడేస్తూ వుంటారు. వాళ్ళని అసహ్యించుకుంటున్నా లెక్కచెయ్యరు. అసహ్యించుకోబడుతూ పనులు చేయించుకోవటం వాళ్ళ ప్రత్యేకత.
కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పాడు. "మీ యింట్లో కాఫీ బాగుంటుందని కాఫీ తాగేవాడు. తర్వాత రెండ్రోజుల్లో ఇస్తానని ఓ యాభై రూపాయలు పట్టుకుపోయాడు. రెండ్రోజుల తర్వాత సుబ్బారావు విషయం గుర్తుండదు. అవతలి వాళ్ళ ఫీలింగ్స్ కు విలువ ఇవ్వటమంటే అతనికి తెలీని సంగతి."
అతను వెళ్ళిపోయాక సుజాత భర్త దగ్గరకొచ్చింది.
ఆమె ముఖం కొంచం కోపంగా వుంది.
"నీక్కోపమొచ్చిందని నాకు తెలుసు" అన్నాడు విజయ్ అప్పుడప్పుడూ.
"అతన్నెందుకు భరిస్తున్నారు?" సూటిగా అడిగింది.
"నా చిన్నతనంనుంచీ జీవనపథంలో, పోనీ నా జీవనపథంలో ఓ విచిత్రమైన విషయాన్ని గమనిస్తున్నారు?"
"ఏమిటది?"
"నా బాల్యదశ అంటే నాకు అయిదారేళ్ళ వయసొచ్చినప్పట్నుంచీ జరిగిన సంఘటనలు చాలావరకూ నాకు గుర్తున్నాయి. చదువులో, క్రీడల్లో, జనరల్ నాలెడ్జిలో ఎంతోకొంత చురుకుతనం, తెలివితేటలు వున్నవాడ్నే. ఆ మాత్రం స్టఫ్ తో ఎదురులేకుండా ఎప్పటికప్పుడు విజయ పతకాన్ని ఎగురవేస్తూ ఎదురులేకుండా దూసుకుపోయేవాళ్ళెంతోమంది వున్నారు. కాని నా వ్యక్తిత్వంలో లోపమో, సున్నితత్వమో మొహమాటమో చెప్పలేను, ఇవే క్వాలిపికేషన్స్...యించుమించు ఇంతే స్థానంలో నా సహచరుల్ని చూస్తూ...వాళ్ళకు కొంత అగ్రస్థానమిచవాడ్ని. వాళ్ళని చూసి ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫలమే వెనక్కి తగ్గుతూ వుండేవాడ్ని. దాంతో అవతల వ్యక్తి అతని మాటలతో, ప్రవర్తనతో నన్ను డామినేట్ చేసే అవకాశమొచ్చేది. చాలాసార్లు ఎందుకు జరుగుతుందో అర్థమయ్యేది కాదు. స్కూల్లో, కాలేజీలో ఉద్యోగంలో...యిలా ఎప్పుడూ నాకంటే మించిన శక్తి నన్ను వెంటాడుతూనే వుంది. ఓ రకమైన నిస్సహాయస్థితి ఆదరించి ఈ భరించడమనే గుణం వీడివల్ల నాలో జీర్ణమైపోయి వుంటుంది."
అతని కళ్ళలోకి చూసింది. నిష్కలంగా వున్న చూపులు, అమాయకమైన నిజాయితీ...
తనని గురించిన సత్యాలని ఎంత చక్కగా చెప్పాడు. తనని గురించి తనకు ఎంత అవగాహన వుంది.
అతన్ని వెంటనే దగ్గరకు తీసుకుని, గుండెలకు అలా...హత్తుకోవాలనిపించింది.
* * * *
"మాధురీ!
నీకు దగ్గరవ్వాలని ఎంతో ఉబలాటపడుతున్నాను. కాని నువ్వు బయటికెంత మృదువుగా, అందంగా కనబడతావో లోలోపల అంత కాఠిన్య మూర్తివి. అందుకే నీ కరుణపూరిత ప్రేమ తీక్షణాలు నాపై ప్రసరించబడటంలేదు.
నేను అల్లరి చిల్లరి జులాయికోరును కాదు. నీ మీద ప్రేమలో, అంకితభావంతో పున్మత్తుడినై నీ చుట్టూ పరిభ్రమిస్తున్న వాడ్ని.
