Previous Page Next Page 
ప్లే పేజి 25


    
    ప్రస్తుతం ఈ మర్డర్ కేసులో హతురాలి గోళ్ళు, వాడిగా, బలంగా, హంతకుడి చేతిమీద దిగబడినపుడు కుడిచేతి చూపుడువేలు, బొటనవేలు గోళ్ళు, సరీగ్గా మధ్యలో పగలడం స్పష్టంగా మైక్రోస్కోపులో చూడొచ్చు. ఆ పగిలిన గోళ్ళలో రక్తపు బిందువులు ఇరుక్కోవడంతోపాటు, హంతకుడి శరీరమ్మీద వెంట్రుకలు కూడా చిక్కుకున్నాయి.
    
    హంతకుడి శరీరమ్మీద దిగబడిన హతురాలి గోళ్ళబలం కారణంగా, హతురాలి వయసు స్పష్టంగా నిర్దారించడానికి ఆస్కారముంది.
    
    హతురాలి వయసు నిర్ధారణ ఇక్కడ ప్రధానమైన సమస్యకాదు. కనుక, గోళ్ళకు అంటిన హంతకుడి రక్తం, చేతి వెంట్రుకలను విశ్లేషించడం జరిగింది" అంతవరకూ చదివి, తలెత్తి సుందరనాధ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు సూర్యవంశీ.
    
    "ప్రొసీడ్ మై బాయ్.... మిగతాది చదవండి..... హంతకుడు ఎలా దొరికిపోతాడో మీకే తెలుస్తుంది...." గోల్డ్ ప్లేక్ కింగ్ సైజ్ సిగరెట్ వెలిగిస్తూ అన్నారాయన.        
    
    మళ్ళీ పేపర్స్ లోని రిపోర్ట్ వేపు దృష్టి మళ్ళించాడు సూర్యవంశీ.
    
    "మొదట బ్లడ్ గురించి విశ్లేషించగా-
    
    గుడ్ బ్లడ్ కెనాట్ వై, మనవ శరీరంలో మంచిరక్తం ఎప్పుడూ అబద్దం చెప్పదు. హతురాలి గోళ్ళలో ఇరుక్కున్న హంతకుడి రక్త బిందువుల్ని లేబరేటరీలో విశ్లేషించడం జరిగింది.
    
    హంతకుడి రక్తబిందువులో కల్మషం విషయమై ఫెనోఫెతాలిన్, పొటాషియం హైడ్రాక్సయిడ్, జింక్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితర కెమికల్స్ తో టెస్ట్ చేయగా, హంతకుడు రక్తం పూర్తిగా కలుషితమై పోయిఉంది. హంతకుడి బ్లడ్ గ్రూప్-ఓ. ఆర్.హెచ్ పాజిటివ్ అయినా, ఆ గ్రూప్ లోని "రెడ్ సెల్స్" పర్సంటేజ్ బాగా పడిపోయింది. అందువల్ల హంతకుడికి తీవ్రమైన లైంగిక సమస్యలు, తద్వారా మానసిక వత్తిడి ఉంది. అతి త్వరలో అతను పిచ్చివాడుగా మారే ప్రమాదం ఉంది. తద్వారా అతడు ప్రస్తుతం హంతకుడు, నేరస్తుడు అయినా, అతి త్వరలో భయంకరమైన లైంగిక హంతకుడుగా మారే ప్రమాదం ఉంది!" ఆ తర్వాత హంతకుడు వడ్డు పొడవు, ఆకారానికి సంబంధించి, ఎలా ఉండడానికి అవకాశం ఉందో వివరాలున్నాయి-ఆ తర్వాత హతురాలి గోళ్ళలో చిక్కిన హంతకుడి చేతి వెంట్రుకల విశ్లేషణ! అన్న హెడ్డింగ్ కిందనున్న వివరాలను ఆసక్తిగా చదవడం ప్రారంభించాడు సూర్యవంశీ.
    
    మనిషి శరీరంలోని ఏ భాగానికి చెందిన వెంట్రుక అయినా, మనిషి చేసిన నేరానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. కాలిపోయిన వెంట్రుకలు తప్ప మిగతా వెంట్రుకలన్నీ నిజాలే చెప్తాయి. ఒక ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఒకే ఒక వెంట్రుకను సైతం మైక్రోస్కోప్ లో విశ్లేషించి, ఆ వెంట్రుకకు సంబంధించిన అపరిచిత వ్యక్తి వయసును, సెక్స్ ను, ఆ వ్యక్తి కేరక్టర్ ను పక్కాగా చెప్పగలడు. మనిషి వెంట్రుకలు, చేతివేళ్ళ ముద్రలకన్నా, బలమైన సాక్ష్యంగా నిలుస్తాయి.
    
    ప్రపంచంలో ప్రతి ఒకవ్యక్తి వేలిముద్రలు ఒకేరకంగా ఎలా ఉండవో, అలాగే శరీరమ్మీద వెంట్రుకలు కూడా అంతే - ఏ వెంట్రుకైనా మనకు సన్నగా కనబడినా, ప్రతి వెంట్రుకా సాధారణంగా వర్తులా కారంలో ఉంటుంది - ఒక వెంట్రుకనుబట్టి అది శరీరంలో ఏ భాగానికి చెందినదో నిర్ధారించడమే కాకుండా, దానిసైజు, దాని ఆకారాలనుబట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా నిర్ధారించడానికి అవకాశం ఉంది.
    
    పురుషులు, స్త్రీల జననేంద్రియ ప్రాంతాల్లోని వెంట్రుకల్లో, పురుషుల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి. గట్టిగా ఉంటాయి. అదే సమయంలో స్త్రీల వెంట్రుకలు ముతకగా ఉంటాయి. వీటికి భిన్నంగా ఉండే పక్షంలో, ఆ వెంట్రుకల్ని నిర్ధారించడం ద్వారా ఆయా వ్యక్తుల మనస్తత్వాల్ని మనం విశ్లేషించడానికి ఆస్కారం ఉంది. వయసుని, నేరాన్ని నిర్ధారించడానికి గట్టిగా ఉండే వెంట్రుకలే ఉపయోగ పడతాయి.
    
    ప్రస్తుతం హతురాలి గోళ్ళలో చిక్కిన హంతకుడి శరీరమ్మీద వెంట్రుకలను "న్యూట్రాన్ ఏక్టివేషన్" ద్వారా విశ్లేషించగా హంతకుడు ప్రధానంగా నోటికి సంబంధించిన "ఇన్ ఫెక్షన్" కి గురై ప్రస్తుతం బాధపడుతున్నాడు.
    
    ఆ ఇన్ ఫెక్షన్ కి కారణం స్టీల్ రాడ్! టక్ మని చదవడం ఆపాడు సూర్యవంశీ.
    
    స్టీల్ రాడ్! గబుక్కున తలెత్తి సుందరనాధ్ ముఖంలోకి చూసాడతను.
    
    "స్టీల్ రాడ్ ఏ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది..." ఆ ప్రశ్నకు నవ్వాడు సుందరనాధ్.
    
    "డిటైల్డ్ గా చదవండి....మీకే తెలుస్తుంది..." ఫోన్ రిసీవర్ని అందుకుంటూ అన్నాడు.
    
    "హంతకుడి శరీరంలో కాళ్ళ జాయింట్లు, చేతుల జాయింట్ల మధ్య, స్టీల్ రాడ్స్ అమర్చడానికి అవకాశం ఉన్నా, ఆ వివరాలు వెంట్రుక ద్వారా తెలియడానికి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. వెంట్రుకల్లో దాగిన సెల్స్ ను విశ్లేషించే పరికరాలు ప్రస్తుతం ఇండియాలో దొరకడంలేదు.
    
    కాగా-
    
    హంతకుడి శరీరంలో ఇన్ ఫెక్షన్ కు గురయ్యే ప్రాంతం....బహుశా నోటి ప్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా హంతకుడి పళ్ళ మధ్య స్టీల్ రాడ్ ఉండే అవకాశం కూడా ఉంది....."
    
    సూర్యవంశీ చాలా దిగ్భ్రమకు లోనయ్యాడు ఆ రిపోర్ట్ చదివి.
    
    అంటే.... ప్రెస్ క్లబ్ యాదగిరి ఇచ్చిన సాక్ష్యం ప్రకారం స్టీల్ రాడ్ వ్యక్తి, జగన్నాయకుల్ని చంపిన వ్యక్తి ఒకడే!
    
    కానీ, స్టీల్ రాడ్ వ్యక్తి సల్మాని చంపాడంటే, రెండో వ్యక్తి చచ్చినవాడు.
    
    ఆ రెండో వ్యక్తి ఎవడు? బబ్లూనా? సయ్యదా?
    
    ఇద్దరిలో ఎవరు బతికున్నారు!
    
    ఇంత దూరం వచ్చి, సల్మాని ఎందుకు చంపాడు?
    
    ఫోరెన్సిక్ ప్రొఫెసర్ దగ్గర్నించి, రిపోర్ట్ తీసుకొని ఇన్స్ పెక్టర్ మహంతితో సహా బార్ లో కెళ్ళాడు సూర్యవంశీ.
    
                                                *    *    *    *    *
    
    సరిగ్గా అదే సమయంలో, స్టీల్ రాడ్ వ్యక్తి భువనేశ్వర్ నుండి, హైద్రాబాద్ వచ్చే బోయింగ్ విమానంలో ఉన్నాడు.
    
                                                *    *    *    *    *
    
    అంతవరకూ జరిగిందంతా సూర్యవంశీ చెప్పగా విన్నాడు ఇన్స్ పెక్టర్ మహంతి.
    
    "సీనియర్ రిపోర్టర్ జగన్నాయకుల్ని హత్య చేసిన ఇద్దరిలో ఈ స్టీల్ రాడ్ వ్యక్తి ఒకడు..... ఆ విషయం మీకెలా తెలుసు...." ప్రశ్నించాడు మహంతి.
    
    "ప్రత్యక్ష సాక్షి.... ప్రెస్ క్లబ్ బార్ లోని బేరర్ యాదగిరి...." చప్పున యాదగిరి గుర్తుకు రావడంతో, కొన్ని నిమిషాలు ఆలోచనల్లో పడిపోయాడు.
    
    అకస్మాత్తుగా సూర్యవంశీ ముఖం సీరియస్ గా మారిపోవడం గమనించాడు ఇన్ స్పెక్టర్ మహంతి.
    
    "ఏంటాలోచిస్తున్నారు..."
    
    అదే సమయంలో ఎ.సి.పి. నిరంజనరావు కూడా జ్ఞాపకానికొచ్చాడు సూర్యవంశీకి.
    
    "డోన్ట్ వర్రీ..... ఈ మర్డర్ మిస్టరీని, మీరు సక్సస్ ఫుల్ గా డీల్ చెయ్యగలరు..." పెగ్గును, ఫినిష్ చేస్తూ అన్నాడు మహంతి.
    
    "బట్.... తొందరలో నేనో పొరపాటు చేశాను...." గ్లాసు అందుకుని అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS