Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 23


                                      వజ్రసంకల్పుఁడు
    
    క్విట్టిండియా కాదు క్విట్టేషియా యంచు
        గర్జించె నెవని భీకరగళమ్ము
    పడగలెత్తిన త్రాచుపాముల గరళమ్ము
        గ్రక్కించె నెవని మంత్రాంగమహిమ
    ఐదువందల యర్వదాఱు సంస్థానాలు
        కరగించె నెవ్వాని కార్యదీక్ష
    బార్దోలి వీరవిప్లవములో జయలక్ష్మి
        గాంచె నెవ్వాని దీక్షాబలమ్ము
    
    అతఁడు సామాన్యుఁడే ! మహోన్నత సమైక్య
    సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠాపటిష్ఠ    
    భవ్యభారత నిర్మాణ పండితుండు
    వజ్రసంకల్పుఁడోయి! మావల్లభాయి !!
    
    స్వాతంత్ర్య బార్డోలి సమరసేనాని "య
        పప్రథ"లేని "యుపప్రధాని"
    అసమాన ధైర్యసాహస శౌర్యవారాశి
        మొక్కపోవని మేటి యుక్కుమనిషి
    సంపూర్ణ దేశరక్షణ సూత్రధారుండు
        జవహరునకుఁ గూర్చు సహచరుండు
    జంకెఱుంగని వజ్రసంకల్ప సంధాత
        తిరుగులేనట్టి జాతీయనేత
    
    నవ్యభారత నిర్మాణ సవ్యసాచి
    వీరసర్దారు - ధీర గంభీరమూర్తి -
    కనులుమూసె నల్వదికోట్ల కనులనుండి
    జలజల కవోష్ణ బాష్పధారలు స్రవింప !!
    
    మా సరదారు - మా యనుపమాన మహోజ్జ్వలశౌర్యసాహసా
    గ్రేసరమూర్తి - మా విజయకేసరి - మా ప్రియనేత - మా నవో
    ల్లాసవిధాత - మా భరతలక్ష్మిని దిద్దిన పెద్దశిల్పి - మా
    యాసల పాలవెల్లి చనెనా ! యిక కంటికి కానిపింపఁడా !!
    
                                   అజ్ఞాతనేపధ్యము
    
    పాత్రధారులమై కళాక్షేత్రమందు
    అడుగు తడబడకుండ మే మభినయింప
    సూత్రధారుండవై పైనఁ జూచుచున్న
    ఓ జగన్నాట్యసందర్శకా! "జయోస్తు".
    
    నవరస భావపూర్ణమగు నాటక వేదిక మీఁద నెల్ల మా
    నవులును గజ్జె గట్టి నటనం బొనరించెడు వేషధారులే;
    యవనిక ముందెకాని తెర కావల వేసము విప్పినంత "రా
    జెవఁడొ? భటుండెవండొ?" స్ఫురియింపదు; సర్వము నొక్కరూపమై!
    
    ఆంగిక వాచికా ద్యభినయంబు లొనర్చుచు, హావభావముల్
    భంగిమముల్ వెలార్చుచును, పాత్రలు వచ్చెడు నిష్క్రమించెడున్;
    రంగము వెంటనే మఱొక రంగము సాగుచునుండె; దృశ్యముల్
    రంగులు మార్చుచున్నవి; తెరల్ పడుచున్నవి; లేచుచున్నవిన్.
    
    ఆడుచు పాడుచున్, తగవులాడుచు, నవ్వుచు నేడ్చుచున్, జతల్
    వీడుచు పోయినారు తెరవెన్కకు; పోయినవాఁడు వెండియున్
    రాఁడొకఁడేని; చిత్ర మగు నాటక మియ్యది; "నాంది" నె
    వ్వాఁడు పఠించెనో "భరతవాక్యము" విన్పడ దెన్నినాళ్ళకున్.
    
    వేసము వేసి పంపితివి వేదిక మీఁదికి; పాడువేళ నా
    మీసము జారిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ
    హాసము చేయనుండిరి; రహస్యముగా తెరవేయు మంచు నీ
    కోసము చూచితిన్; కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో!
    
    ఎన్నో వేషములన్ ధరించితిని స్వామీ! నిన్ను దర్శింప; నె
    న్నెన్నో రంగులు పుల్ముకొంటిని దయాబ్దీ! నిన్ను మెప్పింప; నిం
    కెన్నెన్నో కృతులాలపించితిని తండ్రీ! నిన్ను రప్పింప; నెం
    దున్నావో కనరావు; నీకు వినరావో అస్మదభ్యర్దనల్!
    
                                       కల్యాణవాణి
    
    శ్రీశైల మల్లీశు శిరసుపై జాబిల్లి
        చిందించు కళల చక్కందనాలు
    ఏడుకొండల వేంకటేశ్వరు మెడలోని
        మందారమాల కమ్మందనాలు
    సింహాద్రి శ్రీనారసింహదేవుని తనూ
        చందన చర్చ చల్లందనాలు
    భద్రాద్రి రఘురామ పాదారవింద మ
        రంద బిందువుల తియ్యందనాలు
    
    జల్లులై కొల్ల కొల్లలై మెల్ల మెల్ల
    పెల్లుబికి వెల్లి విరియ మీ యుల్ల మెల్ల
    పసుపు పారాణి నూత్నదంపతులు మీరు
    ముద్దుగా కాపురము తీర్చిదిద్దుకొనుఁడు !
    
    శ్రీమద్దివ్యమహర్షి మండల శుభాశీర్వాద పుష్పాంజలి
    శ్రీమంతంబు, మహేశహస్తయుగ హారిద్రాక్షతారోపణ
    శ్రీమంతంబు,ముహుర్ముహుర్వరశిరశ్శీతాంశురేఖాస్మిత
    శ్రీమంతంబు నగాధిరాజతనయాసీమంత మోమున్ మిమున్ !!
    
    "ఎంచఁగ మీకు నాకు వలె నిందుధరా! తల్లిదండ్రు లేరి చూ
    పించుఁ" డటంచు త న్నపహసించు హిమాలయారాజపుత్రితో
    "మంచిది నీకు మాకువలె మామయు అత్తయు నెచ్చటుండిరో
    యించుక చూపు" మంచు హసియించు మహేశ్వరుఁడేలు మిమ్ములన్!
    
    ఇద్దరు నొక్కమాటుగనె యీవల నావల వచ్చి, చెక్కిళుల్
    ముద్దిడఁబోవు ప్రేమమయమూర్తుల హైమావతీ మహేశులన్
    దద్దయు నవ్వఁజేయ సరదాపడి స్వాస్యము వెన్కలాగి వా
    రిద్దరు ముద్దులాడఁగ హసిఁచు గణేశ్వరుఁ డోము మిమ్ములన్ !
    
    నిద్దపు నీలిముంగురుల నిగ్గుల చిక్కని పెండ్లి సిగ్గులున్,
    ముద్దులు మూటగట్టు నగుమోమున దాగుడు మూతలాడ, మీ
    రిద్దరు జంటయై పులకరించిన పెద్దల నోముపంటయై
    దిద్దుకొనుం డిఁకన్ దెరలుతీయని సాహచర్యముల్ !
    
                                ఔచితీక్షేమేంద్రము
    
    క్షేమంబే కద నీకు నీ కృతులకున్ క్షేమేంద్ర! మా మాధవా
    రామక్షోణిఁ ద్వదీయ దర్శనము సంప్రాప్తించె నిన్నాళ్ళకున్;
    శ్రీమంతమ్ములు తావకీన కవితా సిద్దాంతముల్ సాహితీ
    సీమంతమ్ము నలంకరించె సుషమా సిందూర పూరమ్ములై !!
    
    ఆలోకంబు లభించిన, ట్లభినవంబౌ లోచనం బబ్బిన,
    ట్లే లావణ్యవతీ కటాక్షములో మత్తెక్కించుచున్నట్లు, కా
    వ్యాలంకారము గన్నటుల్! భరతనాట్యారంభమో యన్నటుల్ !
    మాలో మా కనిపించు నేమిది రసాత్మా! నిన్ను దర్శించుచోన్ !!
    
    నిత్య నితాంత కావ్య రమణీ రమణీయ రసానురాగ సాం
    గత్యముతో "సువృత్త తిలక" మ్మలికంమున దిద్దితీర్చి "యౌ
    చిత్య విచార చర్చ" విరచించు భవద్దరహాస ముద్రలో
    నృత్య మొనర్చెనోయి రసనిర్ఘరి గుండెలు పుల్కరింపఁగన్.
    
    అందము ఛందమై, యభినవార్ధ్ర మనస్సుమనో మరంద ని
    ష్యంద మమందమై, నవరసప్రకృతుల్ కృతులుల్లసిల్ల; స్వ
    స్పంద మనోజ్ఞమౌ మధురభావపరంపర పొంగులెత్త నా
    నంద తరంగితమ్ముగ నొనర్చితివా సకల ప్రపంచమున్ !!
    
    "ఇందుముఖీ ముఖాగ్రమున నింపగు కస్తురి; శ్యామసుందరీ
    సుందర ఫాలభాగమున శోభిలు చందన బిందు; వట్లె కా
    వ్యేందిర కౌచితీ తిలక మెంతయు కాంతి ఘటించు" నంచు నీ
    వందువు; ధన్యవాదములయా హృదయప్రియ! నీదు వాణికిన్!
    
    "మునిమత మీమాంసా" కృతి
    సనాథ మగు నీ యుదాత్త సాహితికి రస
    ధ్వని శాంతముతో సాష్టాం
    గ నమస్కృతి సేయు "సుకవి కంఠా భరణా!"
    
    ఉరుశీలోజ్జ్వల విద్య చందమున, త్యాగోదగ్ర భాగ్యంబటుల్
    సరసౌచిత్య సమృద్ధవాక్యము సుధీసంస్తుత్య; "మౌచిత్యమే
    స్థిరమౌ జీవిత మౌను కావ్యమున" కన్ సిద్దాంత మందిచ్చు నీ
    "హర కోటీర కుమారచంద్రు" లెవరయ్యా! మీరు "క్షేమేంద్రులా!"
    
    ఔచిత్యైక మరందతుందిలములై ఆనందమందారముల్
    పూచెన్ నీ యెదలోని నందనవనంబుల్; నీ కళామంజరుల్
    రోచిష్మంతములై దిగంతము లలర్చున్; నీ వచోవైభవం
    బాచంద్రార్కము పంచిపెట్టు కవిచంద్రా! సాంద్ర చాంద్రీ సుధల్!
    
    అతఁడు మాధవుం, డభినవైక కళాధరుఁ డుల్లసన్మహా
    ద్వైత రసజ్ఞమూర్తి, విబుధ ప్రియదర్శనుఁ, డంచితాగమ
    జ్యోతిరుదాత్తచిత్తుఁడు, సముజ్జ్వలలోచనుఁ, డౌచితీ జగత్
    ప్రీతివిధాత యంచు విహరింతురు "క్షేమపథాన" భావుకల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS