Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 23


    "ఒక సత్యం చెప్పమంటావా?"
    "ఏమిటది?"
    "నువ్వు ఈ యింటికి యజమానురాలివిగాని ఆవిడక్కాదు. మనం అద్దెలకిచ్చుకోగలంగాని మనుషుల్ని శాసించలేం."
    "అంటే...మీరావిడ్ని వెనకేసుకొస్తున్నారా?"
    "వెనకేసుకు రావటం లేదు. వాస్తవాన్ని విన్నవిస్తున్నాను."
    "మీరు వాళ్ళని వెంటనే ఖాళీ చేయిస్తారా లేదా?"
    "నిజం చెప్పాలంటే అంత బలమైన హక్కు మనకి లేదా?"
    "ఏమిటి? మనమీద మనకు హక్కు లేదా?"
    "లేదు. ఇది వినియోగదారున కాలం. మనం శాసిస్తూంటే తిరగబడే హక్కు వాళ్ళకుంది. పత్రికలన్నీ వాళ్ళకున్న హక్కుల్ని ఎలుగెత్తి చాటిచెబుతున్నాయి. అగ్గిపెట్టె కొనటం దగ్గర్నుంచి, ఇళ్ళు అద్దెకియ్యటం దాకా అన్నీ వినియోగదార్ల పరిధిలో కొచ్చేశాయి. రెస్టు కంట్రోల్ డిపార్టుమెంటని ఒకటుంది. అది నియమించిన దానికంటే మూడురెట్లు అద్దె మనం అనధికారంగా తీసుకుంటున్నాం. ఆ డిపార్టుమెంటుకి గనక వాళ్ళకి కోపమొచ్చి ఫిర్యాదు చేస్తే అది నిర్ణయించిన రేటుకే మనం అద్దెకివ్వాల్సి వుంటుంది. అంతేకాదు...మనం ఇంత అద్దె వసూలు చేస్తున్నామని గవర్నమెంటు దృష్టిలో కెళితే ఇప్పుడు కడుతున్న హౌస్ టాక్స్ కన్న మూడు నాలుగురెట్లు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. నాకు తెలిసినంతవరకూ వాళ్ళు మనకేం యిబ్బంది పెట్టటంలేదు. అద్దె ఖచ్చితంగా పే చేస్తున్నారు. ఒకరితో ఏ గొడవా లేకుండా వాళ్ళదార్న వాళ్ళు బతుకుతున్నారు. ఊరికినే కెలకటం మంచిది కాదేమో."
    సత్యాదేవి అసహనంగా ముఖం పెట్టి సైలెంటుగా వుండిపోయింది.
    అతనికి ఎవరితోనూ వాగ్వివాదాలు పెట్టుకోవటం ఇష్టముండదు. అంతేగాక పెళ్ళాన్ని ఎలా సంతోష పెట్టవచ్చో, డబ్బుతో ఎలా కొనెయ్యవచ్చు ఈ దెప్పికలన్నీ బాగా తెలుసు.
    "ఇదిగో చూడూ" అన్నాడు.
    ఆమె మాట్లాడలేదు.
    "ఇందాక రమా జ్యూయిలరీషాపుకెళ్ళి రవ్వల దుద్దులు ఆర్డరిచ్చి వచ్చాను. పదిహేను రోజుల్లో వస్తాయి.
    ఆమె...ఒక్కసారిగా చల్లబడిపోయింది.
    "బిజినెస్ ఇలాగే సాగితే వచ్చే ఏడాదికి రవ్వల గాజులు చేయిద్దామనుకుంటున్నాను."
    సత్యాదేవి...వున్నట్టుండి...ఆనంద సాగరంలో తేలిపోతోంది.


                                                          8


    విజయకుమార్ ఉత్తరం పూర్తిగా చదవకుండానే చించి అవతల పారేశాడు.
    అతనిలో ఏ అలజడి లేదు.
    ఇది ఏడో ఉత్తరం.
    సుజాత, వినోద్ ల మధ్య అక్రమ సంబంధం బ్రహ్మాండంగా సాగిపోతున్నదని, అతను పట్టించుకోకపోతే వాళ్ళిద్దరూ లేచిపోయే అవకాశం పుష్కలంగా వున్నదనీ, అతని క్షేమం కోరిన వాళ్ళం కాబట్టి శ్రేయోభిలాషులుగా మరీ మరీ హెచ్చరిస్తున్నామని...
    శ్రేయోభిలాషులు...
    ఈ లోకంలో ఇలాంటి శ్రేయోభిలాషులు ఎక్కడ పడితే అక్కడ సాక్షాత్కరిస్తుంటారు. తాము పరమ నీచమైన తప్పుడు పనులు చేస్తూ ఇతరులు చెయ్యని తప్పుల గురించి హెచ్చరికలు చేస్తూ వుంటారు.
    ఇతరుల జీవితాలతో ఆడుకోవడం వాళ్ళకు సరదా.
    కొంచం జాగ్రత్తగా ఆలోచిస్తే _ ఈ లోకంలో నీచులెక్కువ వున్నారనిపిస్తుంది. ప్రక్కవాళ్ళని తమ అవసరాలకు నిర్ధాక్షిణ్యంగా వాడుకోవటం, ప్రక్కవాళ్ళని దూషించటం, వాళ్ళు బాధపడుతూంటే చూసి సంతోషించటం, వాళ్ళలో మంచితనాన్ని ఎక్లస్టాయిట్ చెయ్యటం, కనిపించిన ప్రతి స్త్రీని హీన దృష్టితో చూడటం, డబ్బున్నవాళ్ళు ఆ మదంతో ప్రక్కవాళ్ళని తొక్కేస్తూ వుండటం, అడుగడుక్కి స్వార్థం, వంచన, దొంగతనాలు, ఆరోపణలు, మాటలతో, చేతలతో పీల్చి పిప్పి చెయ్యటం... ప్రస్తుతం సమాజ ధర్మంగా పరిగణించబడుతోంది.
    విజయ్ ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి అవతల పారేశాడు.
    సుజాత లోపల్నుంచి వచ్చింది.
    "ఏమిటా ఉత్తరం అలా కసిగా చింపేస్తున్నారు?" అంది నవ్వుతూ.
    విజయ్ నవ్వాడు. అవినీతిని మసి చేస్తున్నాను.
    "నీతి కన్నా అవినీతి చాలా బలమైంది. మసై కూడా పగ సాధిస్తుంది."
    "అవునా?"
    "అవునండి"
    "సుజా! నాకో పాయింటు చెప్పు"
    "ఏమిటండీ?"
    "రోజు రోజుకీ నీ మీద నా ప్రేమా, ఆకర్షణా ఎక్కువవుతున్నదేంటి?"
    "ఏమో! మీ మీద నాకా రెండూ తగ్గిపోతున్నాయి."
    "అవునా?"
    "అవునండీ"
    "ఎందుకంటావు?"
    "బహుశా మీలో ప్లాష్ తగ్గిపోయిందేమో."
    "ఎందులో?"
    "ఎందులో అంటే?"
    "విడమర్చి చెప్పమంటావా?"
    "అక్కర్లేదులెండి" అంటూ లోపలికి వెళ్ళబోయింది. చప్పున ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
    "ఇదేమిటి?" అంటూ ఆమె అంటుండగానే తప్పించుకునే అవకాశము లేకుండా తనవైపే లాక్కున్నాడు. ఒళ్లోకి వచ్చి పడింది.
    "అయ్యో. ఇదేమిటండి ఇంత పబ్లిక్ గా" అని ఆమె అంటుండగానే "ముద్దొచ్చినప్పుడే..." అంటూ గభాల్న ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS