Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 22


                                                     నాగార్జునుడు - శిష్యులు

              

    నాగార్జునుడు గొప్ప విజ్ఞానవేత్త. ఆయన సర్వశాస్త్రములు అభ్యసించెను. ఆయన వైద్యశాస్త్రములో "అందెవేసిన చేయి" అని పేరుగాంచెను.
    నాగార్జునాచార్యుని ఖ్యాతి విని దేశదేశముల నుండి వేలకొలది శిష్యులు వచ్చి ఆయన దగ్గర చదువుకొనుచుండెడివారు. ఆయన విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించి వారిని కన్నబిడ్డలవలె ఆదరించెడి వాడు.
    ఆయన నివాస స్థలము నాగార్జునకొండ. నాగార్జునాచార్యుడు అక్కడ నుండియే బౌద్ధ ధర్మములను శిష్యబృందమునకు బోధించెడివాడు.
    ఒకప్పుడు నాగార్జునుని దగ్గర ఆయుర్వేదము నభ్యసించిన విద్యార్థులు కొందరు ఆయనకు గురుదక్షిణ ఇవ్వవలెనని నిశ్చయించుకొనిరి. వారు ఆచార్యుని వద్దకు వచ్చి "ఆర్యా! తమరు మాకింత విద్యా దానము చేసితిరి. తమ యనుగ్రహమున మేము వైద్యశాస్త్రములో ప్రవీణులమైతిమి. ఇక మా గృహములకు మరలిపోవుచున్నాము. ఇప్పుడు తమకేదైన కానుక సమర్పించుకొనదలచితిమి. ఏమి కావలయునో తెలుపుడు?" అని అడిగిరి.
    ఆచార్యుడు వారి పలుకులు విని ఆనందము నంది "శిష్యులారా! మీభక్తి భావమునకు మెచ్చితిని. నాకేమియు వలదు. మీరు సుఖముగా వెళ్లిరండు" అని పలికెను. కాని శిష్యులు కాదుకూడదని పట్టుపట్టిరి. అంతట నాగార్జునుడు చిరునవ్వుతో "అట్లయిన మీరు నాకు దక్షిణగా ఒక నిష్ప్రయోజనకరమైన ఆకును తెచ్చియిండు" అనెను.    శిష్యులు నాలుగు దిక్కులకు పోయి 'పనికిరాని ఆకును వెదకసాగిరి. నాగార్జునకొండ చుట్టు నాలుగామడలు గాలించినను వారికి పనికిరాని ఆకు దొరకలేదు. ఏ ఆకు చూచినను ఏదో ఒక మందుగా పనికివచ్చునదిగనే వారికి తోచుచుండెను.
    వారు విసిగి వేసారి గురుదేవుని సన్నిధికి పోయి "ఆచార్యా! చాలా దూరము వెదకితిమి. మాకు నిష్ప్రయోజనకరమైన ఆకు ఎక్కడకు దొరకలేదు" అని పలికిరి.
    నాగార్జునుడు మందహాసముతో "శిష్యులారా! ఇప్పుడు మీ విద్య పరిపూర్ణమైనది. ఇదే నాకు మీరీయదగిన గురుదక్షిణ. నేను చాలా సంతోషించితిని. ఇక మీరు గృహములకు బోయి హాయిగా జీవింపుడు" అని పలికి వారిని ఆశీర్వదించి పంపెను.

                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS