"అవునవును. ఇవేళ మీకయింది. రేపు నాకవుతుంది. అవునూ యింట్లోనే సాగించమంటున్నారేమిటి? ఏమన్నా వుందేమిటి?"
"నాకనుమానమే. ఆ పిచ్చిముండ మొగుడు పదిగంటలకి ఆఫీసుకెళ్ళి సాయంత్రం అయిదు దాకా తిరిగిరాడు. ఆ ముసలాళ్ళు రోగం రానూ అంటూ గదిలోంచి యివతలకి తగలడరు. ఆ వన్నెలకత్ర కాలేజీ అఘోరిస్తోంది. కాలేజీ ఆ వంకతో యింకా ఎక్కడికో మనకి తెలీదనుకోండి. ఇంట్లో ఈ వదినా మరుదులు ఇష్టా సామ్రాజ్యం."
"అలాగా? అంతవరకూ వచ్చిందన్నమాట. నాకూ సందేహమెప్పుడో వచ్చిందిగాని, మనసులోనే దాచుకుని వూరుకున్నాను. ఆహా! అదన్నమాట సంగతి."
"ఛఛ. నేనూ అందగత్తెనేగాని ఇలాంటి వెధవ వేషాలు నాకు నచ్చావు. వొళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు ఇలాంటి పనులకు తెగిస్తారు. అయినా కడుపొస్తుందని భయంలేదు. ఎందుకంటే ఎలాగూ గొడ్రాలు కాబట్టి. ఒకవేళ వొస్తే యిదంతా మొగుడి ప్రతాపమే అని సర్టిఫికెట్ ఇచ్చేస్తారు."
"హహహహ. బాగా చెప్పారు. మీ అబ్జర్వేషనూ, తెలివితేటలూ చూస్తోంటే ముచ్చటేస్తోందండి."
ఇద్దరూ కసిగా, ఆనందంగా చాడీలు చెప్పుకుని భుజాలెగురేసుకున్నారు.
* * * *
మధ్యాహ్నం సుజాత వినోద్ ని తీసుకొని డాక్టర్ దగ్గరకెళ్ళి వచ్చేసరికి ఒంటిగంట దాటింది. వినోద్ కి బాగా నీరసంగా వుండి కళ్ళు తిరుగుతున్నాయి. సుజాత భుజంమీద తల ఆనించి కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
రిక్షా యింటి దగ్గర కొచ్చింది.
"వినోద్ లోపలదాకా నడవగలవా?"
"నడవగలనొదినా"
ఇద్దరూ లోపలకొస్తున్నారు. అతని కళ్ళు మళ్ళీ చీకట్లు క్రమ్మి తూలిపడబోయాడు. సుజాత చప్పున అతని భుజం చుట్టూ చెయ్యివేసి గట్టిగా పట్టుకుని ఒక్కొక్క అడుగూ నెమ్మదిగా నడిపిస్తోంది.
రాధాప్రియ తన గుమ్మంలో నిలబడి ఈ దృశ్యం చూసింది.
"ఓహో! ఎంత నేత్రానందంగా వుంది.
ఎంత జ్వరంగా వుంటే మాత్రం ఈ కావిలించుకోవడాలు, గట్టిగా పట్టుకోవడాలూ...వెధవ నటనలు కాకపోతే ఇదంతా ఏమిటి?
నాకిలాంటివంటే చెడ్డ రోత.
ఛఛ. ఈ నటనలూ, పోజులూ నా కసహ్యం.
సుజాత మరిదిని లోపలకి తీసుకెళ్ళి హాల్లో వున్న పొడవాటి సోఫాలో పడుకోబెట్టింది.
"వినోద్!"
"వదినా."
"ఎలా వుంది?"
"బా...గానే వుంది వదినా"
"మంచినీళ్ళు తీసుకొస్తానుండు"
లోపలకెళ్ళి ఓ గ్లాసులో మంచినీళ్ళు తీసుకొచ్చింది.
వినోద్ సోఫాలోంచి లేవబోయాడు.
"వొద్దు. కళ్ళు తిరుగుతాయి" అంటూ తానే కొంచెం కొంచం పట్టింది.
"వదినా" అంటూ ఆమె చేతిని పట్టుకుని గుండెలమీద వుంచుకున్నాడు.
"వినోద్!"
"మీలాంటి అమృతమూర్తులని అన్నయ్య, వదినలగా వుండికూడా నా విధి నేను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను వదినా"
"ఇప్పుడేం జరిగిందని అలా బాధపడుతున్నావు వినోద్."
"ఇప్పుడు రోజులెలా వున్నాయి? గవర్నమెంట్ పాలసీలెలా వున్నాయి? కుటుంబంలోని ప్రతి మనిషి కష్టపడి పనిచేస్తేనేగానీ, రెండు పూటలూ గడవటం కష్టమైనా ఆర్ధిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అలాంటిది అన్నయ్య ఒక్కడి రెక్కల కష్టం మీద ఇంతమంది బతుకుతున్నాం. నేనెంత ప్రయత్నించినా ఉద్యోగం రావటంలేదు. విధిలేక ఈరోజు వ్యాధినైపోయిన కంప్యూటర్ కోర్సులో చేరాను కాని, ఆ తర్వాతయినా ఏమంత గొప్ప ఉద్యోగమొస్తుంది. ఇలా అన్నయ్య మీద ఆధారపడి బతుకుతున్నందుకు సిగ్గేస్తోంది వదినా"
పిల్లలకు రెక్కలొచ్చేవరకూ పెద్దవాళ్ళమీద ఆధారపడక తప్పదు వినోద్. ఇందులో సిగ్గుపడేదేముంది.
కానీ నా స్థితిలో వున్నవాడి కాంప్లెక్స్.
"ఇవన్నీ జీవితములో అనుభవించక తప్పదు వినోద్. ఆందోళన లేకుండా ఎవరూ ముందుకు సాగిపోలేరు. ఈ కలవరపాటు నుండే ఎప్పుడో ఒకప్పుడు కమలం ఆవిర్భవిస్తుంది.
అతడామె ముఖంలోకి చూశాడు. ప్రశాంతత, సంపూర్ణత్వం, ప్రేమ, దయ, స్వచ్చత, తేజస్సు... వీటన్నిటితోబాటు అవసరమైనప్పుడు మొదట సపోర్టు ఇచ్చే ఆత్మవిశ్వాసంతో కూడిన స్వభావం ఇవన్నీ ద్యోతమవుతున్నాయి.
అదే సమయానికి రాధాప్రియ ఆ మధ్య గేటు ప్రక్కనుంచి నడిచిపోతుంది. గేటుకి కర్టెన్ వేసి లేదు. ఈ దృశ్యం ఆమె కళ్ళబడింది. మామూలుగా అయితే మనకు బయటి వెలుగులోంచి మనకి మసగ్గా వుండే లోపలి దృశ్యాలు గోచరించవు. అయితే ఆమె ఎక్స్ రే కళ్ళకి జరగనివి కూడా కనిపిస్తూ వుంటాయి.
ఆమె గుండెల్లోంచి ఆవేశపు మంటలు ఎగబ్రాకాయి.
"ఒసేవ్! సుజాతా! వినోద్ లాంటి మరిది నాకు వుంటేనా? నా తడాఖా ఇంకోరకంగా చూపించేదాన్ని. అలాంటి వెధవ మరిది నీకున్నాడనేగా బడాయిలకి దీమా, పెద్ద సినిమా పోజులు. చూస్తా చూస్తా చూపిస్తా నా తడాఖా ఇంకో రూపంలో.
* * * *
రాధాప్రియ ఇంటి యజమానురాలు సత్యాదేవి దగ్గరకు వెళుతూ వెళుతూ మైసూర్ పాక్, కారపూస కూడా ఓ ప్లేటులో తీసుకెళ్ళింది.
"మైసూర్ పాక్ మీకిష్టమని చేసి తీసుకొచ్చాను." అంది ప్లేటు ఆవిడ ముందు వుంచుతూ.
సత్యాదేవి ఓ మైసూర్ పాక్ చేతిలో వుంచుకుని చిన్న ముక్క కొరికింది. "ఆహా! చాలా రుచిగా వుంది" అన్నది.
