Previous Page Next Page 
నానీ పేజి 20


    సరళ అప్పటికే అన్నం కలిపి తెచ్చింది. "ఇలా రా... అన్నం తిందువుగాని."

 

    ఎప్పుడూ లేనిది అత్తయ్య అంత ప్రేమ చూపించడంతో ఎంతో అబ్బురపడిపోయాడు. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు.

 

    "నిన్నేరా... రా అమ్మా."

 

    ఆ మాత్రం ప్రేమ చాలు నాకు అన్నంత ఉద్వేగంతో వెళ్ళబోయాడుగాని తాతయ్యకిచ్చిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయాడు.

 

    "నే తింటానత్తయ్యా"

 

    "ఏం... నేను తినిపించకూడదా?"

 

    "అదికాదత్తయ్యా... నేనిక్కడ తింటానన్నానుగా."

 

    "చెప్పేది నీకే" ఈసారి ఆమెకంఠం కర్కశంగా మారింది.

 

    "ఎందుకమ్మా వాడ్నలా ఇబ్బంది పెడతావు? వాడికి తినిపించడమెందుకు? చిన్నపిల్లాడు కాదుగా" జోక్యం చేసుకున్నారు విశ్వేశ్వరశాస్త్రి.

 

    ఈసారి తండ్రివేపు క్రోధంగా చూసిన సరళ ఉక్రోషంగా అన్నంగిన్నె నానీముందుంచి వెళ్ళిపోయింది.

 

    ఆ అవకాశం కోసమే తనూ ఎదురుచూస్తున్నట్టు వేగంగా చిన్ని పిడికిలితో ముద్దలుచేసి తాతయ్య నోటిలో ఓ ముద్ద పెట్టాడు.

 

    పొలమారిన విశ్వేశ్వరశాస్త్రి ఊపిరందనట్టు ఉక్కిరిబిక్కిరౌతుంటే భయంగా చూశాడు నానీ.

 

    దాహం తీరని మృత్యువులా తీతువొకటి ఆకాశంలో ఆక్రోశిస్తూ అప్పుడే సాగిపోతూంది.

 

                                    *    *    *

 

    "సరిగ్గా అరగంట లేటు" అంది హరిత పోర్టికోలో బులెట్ ఆపిన యశస్విని చూస్తూ.

 

    "పాపం ఓ అర్థగంట వియోగంతో బాధపడ్డావన్నమాట" అన్నాడు హాల్లోకి అడుగుపెడుతూ.

 

    "నాకు తెలుసు మీ డిపార్ట్ మెంట్ సంగతి."

 

    వాల్ టూవాల్ కార్పెట్ పై అందంగా అమర్చబడిన సోఫాలో కూర్చుంటూ "ఏం తెలుసు" అన్నాడు.  

 

    "ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కి- పోలీస్ డిపార్ట్ మెంట్ కి పెద్దతేడా లేదని."

 

    "అంటే"

 

    షాండ్లియర్ వెలుతురు ఆమెమొహంపై అందంగా ప్రతిఫలిస్తుంటే గుంభనంగా నవ్వింది. "మరేంలేదు... వాళ్లు ఇళ్ళు తగలబడిపోతున్నాయని ఫోన్ చేస్తే స్పాట్ కి వచ్చి నీళ్ళకోసం గాలింపు మొదలుపెడతారు. నేరం జరుగుతుందని ఫోన్ చేస్తే నేరస్థుడు పోయేదాకా తీరుబాటుగా వచ్చిన మీరేమో సాక్షుల కోసం గాలింపు ప్రారంభిస్తారు.

 

    "అది తెలుగు సినిమాల్లో" మృదువుగా నవ్వి అభ్యంగన స్నానంతో గాలి కెగురుతున్న ఆమె కురుల్నే ఆసక్తిగా గమనిస్తూ అన్నాడు "డాడీ లేనట్టున్నారు."

 

    "చెప్పానుగా ఆయన ఈ సమయంలో వుండరని" యశస్వి సమీపంలో కూచుని అడిగింది. "అంటే జవాబుతో వచ్చావన్నమాట."

 

    "అవును... ఇప్పుడు సెక్షన్ 375తో అవసరం లేకుండా పందెం నెగ్గేయబోతున్నాను."

 

    "వెల్! నేనూ ప్రిపేరయ్యే వున్నాను" మోకాళ్ళపై చేతులాన్చి ఉత్సుకతగా అతడికళ్ళలోకి చూసింది.

 

    పజిల్ నోమారు మననం చేసుకుంటున్నట్టు అరక్షణంపాటు కళ్లు మూసుకున్నాడు.

 

    "ఆ యువకుడు ఏదన్నా ఓ నిజాన్ని వాక్యంగా చెబితే సులభంగా ఉరితీయబడతాడు లేకపోతే రాక్షసంగా సెడ్యూస్ చేయబడి ప్రాణాలు కోల్పోతాడు. అంతేగా."

 

    "అవును."

 

    "అతడు తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏ నిజం చెపితే సాధ్యమా అన్నది నేను చెప్పాలి. అంతేగా?"

 

    "యస్."

 

    "నిజానికి జవాబు ప్రశ్నలోనే వుంది."

 

    నిశ్చేష్టురాలౌతూనే "నిజమా" అంది.

 

    నిజానికి ఆమె నిశ్చేష్టురాలయింది అంత సునాయాసంగా జవాబుదగ్గరకు వచ్చినందుకు.  

 

    ఎందర్నో తికమకపెట్టింది. అసలు దానికి జవాబే లేదని అందరూ అంటుంటే యశస్వి అందరిలో ఒకడౌతాడూ అని అనుకుంది తప్ప చెప్పగలడని వూహించలేకపోయింది.

 

    "ఆ యువకుడు రాణిని చూస్తూ మీరు నన్నిప్పుడు సెడ్యూస్  చేయించి ప్రాణాలు తీయాలనుకుంటున్నారన్నదే నిజం అన్నాడు."

 

    "అయితే."

 

    "అతడు నిజం చెపితే సుఖంగాఉరితీయిస్తానూ అన్న కండిషను ప్రకారం యిప్పుడు రాణి ఆ పని చేయలేదు. ఎందుకంటే సెడ్యూస్ చేయించబోతున్నారన్నది నిజం అంటూ ఆమె వూహించని ఓ నిజం చెప్పాడు కాబట్టి."

 

    "అప్పటికైనా సెడ్యూస్ చేయించి చంపేయొచ్చుగా."

 

    "అప్పుడతను చెప్పింది అబద్ధం కావాలి. కాని సెడ్యూస్ చేయించడం నిజమన్నాడుగా. సో... ఇప్పుడు రాణి ఉరి తీయనూ లేదు. సెడ్యూస్ చేయించనూలేదు."

 

    "తప్పయింది" అంటూ దూరంగా జరిగింది.

 

    "ఏంటి జవాబా?"

 

    "కాదు. నీ గురించి నేను వేసిన అంచనా" వేగంగా నడిచి టేబుల్ పై వున్న ఫోన్ రిసీవర్ని అందుకుంది. ఎవరికో డయల్ చేసి "ఒసేవ్ ఆశా... నేనే ఓడిపోయాను. ఆయనా చెప్పేశారు కాబట్టి నువ్వూ ఓడిపోయావు. సో... విశాల పెళ్ళికి నువ్వు విజయవాడ వస్తున్నావు... సరేనా... థ్యాంక్యూ" అంటూ క్రెడిల్ చేసింది.

 

    యశస్వికి హరిత ఏం మాట్లాడిందీ అర్థంకాలేదు.

 

    "ఆశ్చర్యపోకండి మాష్టారూ... విజయవాడలో స్నేహితురాలి పెళ్ళికి రమ్మని నేను ఆశనే ఫ్రెండుని అడిగాను. రాను పొమ్మంది. ఒప్పందం ప్రకారం నేనడిగిన పజిల్ కి అది జవాబు చెప్పేస్తే దాన్ని నేను విడిచిపెట్టెయ్యాలి. పజిల్ అంతా విని అదేమందో తెలుసా... అసలు ఆ పజిల్ కి జవాబే లేదు. వుంటే నువ్వంతగా ఇష్టపడే యశస్విని చెప్పమను అంటూ గమ్మత్తుగా లింకుపెట్టింది."  

 

    వింటున్నాడు ఉత్సుకతగా.             


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS