పదిహేడు
చిన్నప్పుడు భావ కవిత్వపు రోజుల్లో ఒంటరితనాన్ని ఆహ్వానించి ఆరాధించిన నాకు ఆ రాత్రి కున్మింగ్ హాల్లో ప్రతినిధులంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కణ్ణే వుండిపోవడంతో ఎంతో దుర్భరమనిపించింది. నా చుట్టూ డెబ్భయికోట్ల మంది చైనా మిత్రులున్నప్పటికీ ఆ క్షణంలో నేను యేకాకినే. రవిరాజ్ సినిమా వాళ్ళని నమ్ముకుని, వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని, అందర్నీ కాదని తిరుగు ప్రయాణానికి తయారుకావడం పొరపాటేమో అని కూడా అనిపించకపోలేదు. (తరువాతి సంఘటనలు పొరపాటే అని స్థిరపరిచాయి)
కున్మింగ్ నగరం బర్మా సరిహద్దున వున్న యున్నాన్ రాష్ట్రానికి ముఖ్యపట్టణం. రంగూన్ మీదుగా కలకత్తాకు (అక్కడ నుంచి మద్రాసుకు) వెళ్ళడం చాలా దగ్గరి దారి. అయితే, నా పాస్ పోర్ట్ లో మన ప్రభుత్వ రాయబారి నుండి రంగూన్ కు ఎండార్స్ మెంటూ, బర్మా ప్రభుత్వం నుంచి వీసా తీసుకోవాలి. ఇందుకు కొంత ఆలస్యం జరగవచ్చు. అంతేకాక అంతకుముందు హాంగ్ కాంగ్ నుంచి నన్ను పంపించడానికి గాను మన రాయబార కార్యాలయం నుంచి కామన్వెల్తు దేశాలన్నింటికీ ఎండార్స్ మెంట్ తీసుకోవడం జరిగింది. (నేను వీలయినంత త్వరగా స్వదేశం చేరడానికి ఎంత గట్టి ప్రయత్నాలు జరిగాయో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.) ఎక్కడ నుంచి ఏ విమానం ఎంత పెందరాళే అందుబాటులో ఉంటే అందులో నన్ను పంపించాలన్నదే నా చైనా మిత్రుల సంకల్పం. ఈ యేర్పాటు ప్రకారం 27వ తేదీ రాత్రి పీకింగ్ నుంచి ఎథియోపియన్ ఎయిర్ లైన్సు విమానంలో నేను బయలుదేరడం జరిగింది. ఆ వివరాలు మున్ముందు.
25-12-76
ఉదయం 6 గంటలకు బెడ్ కాఫీ.
చైనాలో ఉన్నన్నాళ్లూ ఇది నాకు నిత్యకృత్యం. నేనెప్పుడూ గది తలుపులు తాళం వేసుకోను. సరిగ్గా ఆరు గంటలకు రూం కుర్రాడు తలుపు తడతాడు. నేను లోనికి రమ్మంటాను. అతని (రు. 400 ఖరీదు చేసే) చేతి గడియారంలో నా వాచీని సరిచేసుకుంటాను. అతను కాఫీ సామాగ్రిని టేబిల్ మీద వుంచి వెళ్ళిపోతాడు. నేను ముందుగా దంత ధావన చేసి మొగం కడుక్కొని కాఫీ తీసుకుంటాను.
ఒక్కొక్కప్పుడు బెడ్ టీ తీసుకునేవాణ్ని. యేదైనా క్రితం రాత్రే ముందుగా చెప్పాలి. (ఒకసారి చైనావారి అలవాటు ప్రకారం పాలూ పంచదారా లేకుండా టీ వచ్చింది. అందుచేత టీ అయినా "పాలూ చక్కరతో సహా" అని ముందు రాత్రి చెప్పేవాణ్ణి)
కున్మింగ్ నగరానికి చలికాలం లేదు. అసలు కున్మింగ్ అంటేనే "వసంత నగరం" అని అర్థం. సంవత్సరం పొడుగునా, వికసించిన పూలతో చెట్లన్నీ కలకలలాడుతూ ఉంటాయి. వాతావరణం చలికాలంలో వెచ్చగానూ, ఎండాకాలంలో చల్లగానూ ఉంటుంది. కున్మింగ్ లో ఉన్నన్నాళ్ళూ నాకు మద్రాసులో ఉన్నట్టే తోచింది.
ఈ రాజధాని నగరానికి రెండు వేల సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర ఉంది. హాన్ చక్రవర్తుల పాలనలో ప్రాముఖ్యానికి వచ్చిన ఈ నగరానికి ఉజ్జ్వలమయిన విప్లవ వారసత్వం ఉంది. సుప్రసిద్ధమైన "డిసెంబర్ ఒకటి" ఉద్యమానికి ఈ నగరమే రంగస్థలం. మిగిలిన చైనా భూభాగంతో బాటు యున్నాన్ రాష్ట్రం కూడా 1949లో విమోచనం పొందింది.
విమోచనానంతరం కున్మింగ్ నగరంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలులోనికి వచ్చాయి. ఛైర్మన్ మావో సూచించిన విప్లవ పంథా ననుసరించి ఈ నగరంలో 400కు పైగా కొత్త ఫ్యాక్టరీలు గనులు, తదితర నిర్మాణ కేంద్రాలూ రూపొందాయి. పరిశ్రమలతో బాటు వ్యవసారం కూడా ఉన్నత స్థాయిలో సాగింది! సాగిపోతోంది. రాష్ట్రమంతటా దుర్గమారణ్య పర్వత ప్రాంతాలతో సహా, రహదారులూ, రైలు మార్గాలూ వెల్లివిరిశాయి. నివాస గృహాల నిర్మాణం ఇప్పటికీ అవిచ్చిన్నంగా సాగిపోతోంది.
25వ తేదీ ఉదయం 9 గంటలకు ఒక చైనీస్ మిత్రునితో కలిసి "యున్నావ్ రాష్ట్రపు గిరిజన సంక్షేమ భవనం" చూశాను. ఒకప్పుడు ఆటవికులుగా వుండే గిరిజనులు ఈ పాతికేళ్ళలో ఎంతగా మారిపోయిందీ గమనించాను. ఈ భవనంలో ముఖ్యంగా నన్నాకర్షించినవి పాఠశాలలు. లిపి కూడా లేని నాలుగయిదు భాషలు మాట్లాడే రకరకాల కొండజాతుల వారికి వాళ్ళ మాతృభాషలోనే రోమన్ లిపిలో విద్యాబోధన జరుపుతున్నారు. "వెనుకబడిన" జాతులను ముందుకు తీసుకు రావాలంటే వారిలో నిరక్షరాస్యతను తొలగించాలనేదే యే సంక్షేమ కార్యక్రమంలోనైనా ప్రధానాంశం కావాలి. నీరులాగ, గాలిలాగ, చదువుకూడా అందరికి అందుబాటులోకి రావాలి.
Institute of the minority nationalities of yunnan province ఉపాధ్యక్షుడు మాకు స్వాగతం ఇచ్చాడు. నాలుగు ఉపజాతులకు చెందిన నలుగురమ్మాయిలను నాకు పరిచయం చేశాడు. ముగ్గురి వయస్సు 20 యేళ్ళు. ఒక అమ్మాయి వయస్సు 19. ఈ సంస్థలో వారు ఉపాధ్యాయులుగా శిక్షణ పొందుతున్నారు. ట్రెయినింగ్ పూర్తి అయిన తర్వాత తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. నలుగురూ అవివాహితులే. ఇంత త్వరలో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని నేనడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా అందరి తరఫునా ఒకమ్మాయి చెప్పింది.
భవనం మెట్లు దిగి వస్తూంటే ఎందరో బాల బాలికలు చప్పట్లు చరుస్తూ "సెబియాన్ సెబియాన్" అంటూ కేకలు వేశారు. చైనా అంతటా వీడ్కోలు సమయంలో ఈ మాటలే విన్నాను. "సెబియాన్" అంటే "మళ్ళీ కలుద్దాం" అని అర్థం. ఇది మన భారతీయ సంప్రదాయానికి ఎంతో సన్నిహితమైనదని వేరే చెప్పనక్కరలేదు. అలాగే పగలు గాని, రాత్రి గాని మొదటిసారి కలుసుకున్నప్పుడు "నీహా" అని పలుకరిస్తారు. "నీహా" అంటే "బాగున్నారా?" అని అర్థం.
