'హల్లో , లెక్చెరర్ గారూ! ఎలా వుంది హాస్టల్ లైఫ్ ,' నవ్వుతూ అతనే ముందు పలకరించాడు లోపలికి అడుగు పెడుతున్న సురేఖ ని.
"హాస్టల్ లైఫ్ కేం, దివ్యంగా వుంది-- నువ్వు చెప్పు నీ ప్రాక్టీసు ఎలా వుందో -- పని మీద వచ్చావా ఈ వూరు -- నరసమ్మ చేతిలో ట్రే అందుకుని టీ పాయ్ మీద పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.
"నా ప్రాక్టీస్ దివ్యంగానే ఉంది -- మెడికల్ కాన్ఫరెన్సు కి వచ్చా నిక్కడికి -- మూడు రోజుల నుంచీ ఆ హడావిడి లోనే సరిపోయింది -- రాత్రి రైల్లో వెళ్ళి పోవాలనుకుంటున్నాను-- ఇందాకా వస్తేనూ నువ్వింకా రాలేదని....'
"అవునుట-- మా రూమ్ మేటు శ్యామల చెప్పింది -- కాఫీ తాగాక ఈ వుత్తరం చదివి సలహా చెప్పాలి. కాన్సల్టేషను ఫీజు మాత్రం ఇవ్వనులే -- కాఫీ కప్పు .' అందిస్తూ అంది.
డాక్టర్ని చూసేసరికి సలహాలు కావలసి వస్తాయిలా వుంది -- వుత్తరం ఎవరు వ్రాసింది , ఇలాతే -' ఉత్తరం కోసం చెయ్యి జాచాడు.
* * * *
సురేఖ తండ్రి రమణమూర్తి గారు ప్లీడరు -- తండ్రి దగ్గర నుండి వారసత్వంగా వచ్చే ఆస్తి తో పాటు కేసులు కూడా వస్తాయని 'లా' చదివాడే కాని తీరా ప్రాక్టీసు పెట్టాక తను ఆ వృత్తి లో బొత్తిగా రాణించలేనని తెలుసుకున్నాడు. అయినా కట్టిన బోర్డు తీసెయదలుచుకోలేదు అయన -- "ఏదో ఓ మాదిరిగా వస్తోంది నాకేం లక్షలు గడించాలనే పెద్ద పెద్ద ఆశలు లేవు. ఇప్పుడు హాయిగానే వుంది.' అంటూ బింకంగా పైకి ఖబుర్లు కూడా చెప్పేవాడు. అతని భార్య మాత్రం వాళ్ళాయన సంపాదనని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఏనాడూ నెలకి వెయ్యి రూపాయలకి తక్కువ కాలేదన్నట్లే మాట్లాడుతుంది-- అసలు సంగతి గ్రహించగలిగిన వారు మాత్రం చాటుగా నవ్వుకుంటుండేవారు ఆవిడ మాటల్ని తలుచుకుని--
పెద్ద పెద్ద పార్టీలు ఒక్కొక్కరే మరో లాయరు గారిని వెతుక్కుంటూ పోతున్నా, తండ్రి గురించి ఇచ్చింది వుంది కదా- అనే ధీమాతో నిశ్చింతగా వుండేవారు రమణమూర్తి గారు. తన ప్రయోజకత్వం మీద తనకే నమ్మకం లేని స్థితిలో అంతకన్న అయన చేయగలిగింది ఏమీ లేదు -- రాను రాను సంసారం పెరగటం -- దానికి తగినట్లు సంపాదన లేకపోవటం తో క్రమంగా ఆస్తి కరగటం ప్రారంభించింది.
ఆయనకి నలుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు-- పెద్ద కూతురు కామాక్షి ని స్వంత బావమరిది కే ఇచ్చాడు-- తరువాత వాడు సుబ్బారావు ఇంజనీరింగు ప్యాసాయి భిలాయి లో పనిచేస్తున్నాడు.
'చెల్లెయిల పెళ్ళిళ్ళు అయితేనే కాని నేను పెళ్ళి చేసుకోను' అని మొదట్లో అన్నాడే కాని తీరా ఉద్యోగంలో ప్రవేశించాక అక్కడి హోటలు భోజనం కొద్ది రోజులు తినే సరికే హడలు పుట్టి ఇంటి భోజనం కోసం మొహం వాచినట్లాయి పోయాడు. అందుకే ఓసారి శలవలకి వచ్చినప్పుడు తల్లీ తండ్రి చూపించిన అమ్మాయిని వద్దనకుండా బుద్దిగా తాళి కట్టేశాడు--
అ తరువాతది సురేఖ. ఎమ్మే ప్యాసయింది. ఇరవై అయిదేళ్ళు నిండి పోయాయి-- కాలేజీ లో లేక్చెరరు.
సురేఖ కంటే మూడేళ్ళు చిన్నది ఉమ, తరువాత ఊర్మిళ -- ఊర్మిళ తరువాత సుందరం, సూర్యం.
చామనచాయ రంగు, కోలా ముఖం సామాన్యమైన రూపు రేఖలు -- చూడగానే కళ్ళని ఆకట్టుకునే అందం కాదు సురేఖది. ఆ పిల్ల మొహం లో కనిపించే కళ అంతా విజ్ఞానాన్ని జిజ్ఞాసనీ నింపుకున్న ఆ విశాలమైన నేత్రాలలోనే ఉంటుంది -- ఉమా, ఊర్మిళా తల్లి పోలిక పుణికి పుచ్చుకున్నారేమో ఆడవాళ్ళ కే ముద్దొచ్చే సౌందర్యం వాళ్ళది.
కామాక్షి ని గురించి ప్రత్యేకం చెప్పటానికి ఏమీ లేదు కాని, అసలు అందచందాల ప్రసక్తి లేకుండానే ఆ పిల్ల మేనమామ రాఘవరావు కోసమే పుట్టింది అన్నట్లు ముచ్చట పడిపోయారు అమ్మమ్మా తాత గారూ -- ధర్డు ఫారం ప్యాసు కాగానే మరింక స్కూలు కి పంపించకుండా లక్షణంగా పెళ్ళి చేసి అత్తవారింటికి పంపించేశారు ఆ ముసలివాళ్ళ కోరిక మేరకు - అందుచేత రమణ మూర్తి గారికి అల్లుడ్ని వెంకటనే అంటే ఏమిటో అనుభవం లోకి రాలేదు.
రమణమూర్తి గారి పెద్ద చెల్లెలు రుక్మిణి. ఆవిడ మొగుడు ఉమామహేశ్వరం గారు కూడా ప్లీడరీ చదివి, బోర్డు కట్టుకుని కొన్నాళ్ళు ప్రాక్టీసు చేశాడు. కాని, గుమస్తా కి జీతం ఇవ్వటానికి కూడా సరిపడే సంపాదన లేకపోవటంతో కొద్ది రోజులకే విసుగొచ్చింది.
"ఎవరి చేతి క్రిందా ఉద్యోగం చెయ్యకుండా స్వతంత్రంగా బ్రతకాలి.' అనే ఆదర్శానికి తిలోదకాలిచ్చి వీళ్ళ కాళ్ళు వాళ్ళ కడుపులు పట్టుకుని ఎలాగో ముసబుగా సెలక్టు అయాననిపించుకున్నాడు -- ఆ తరవాత ఆదృష్టమూ కలిసి వచ్చింది -- ఇప్పుడు జడ్జి పదవిలో ఉన్నాడు.
అ దంపతులకి ఒక్కడే సంతానం. అతనే రామకృష్ణ -- ఉన్న ఒక్కడికి పెద్ద చదువు చెప్పించాలనే సరదా తో అయిదు వేలు పెట్టి మెడిసిన్ లో ఓ సీటు సంపాదించారు. ఉమా మహేశ్వరం గారు -- మొగపిల్ల వాడి మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడికి పోతుంది? సీటు కోసం ఖర్చు పెట్టిన అయిదు వేలు, అబ్బాయి డిగ్రీ చూపించి మరో అయిదు వేలు, తన జడ్జి హోదా చూపించి ఇంకో అయిదు వేలు , తన ఆస్తి కంతటికీ ఏకైక వారసుడు అనే ఆకర్షణతో మరో అయిదు వేలు, ఇలా లెక్కలు వేసి ఎంత లేదన్నా ఇరవై వేలయినా కట్నం రూపంలో రాబట్టలేక పోతానా అని వూహలల్లుకుంటుండే వారు అయన-- కాని అయన ఆలోచనల నన్నింటిని తారుమారు చేసేసింది రుక్మిణమ్మ గారి ముచ్చట.
'తనకు వున్నంతలో ఏ లోటూ చెయ్యడు అన్నయ్య -- అయినా ఇవాళ వాళ్ళు ఓ పది వేలు ఇస్తే మాత్రం కూర్చుంటాయా ఏమిటి' అంటూ తన మనస్సులో కోరిక మెల్లిగా బయట పెట్టింది ఓ రోజు.
'మనకి డబ్బు లేకనా కట్నం తీసుకోటం అదొక ముచ్చట, హోదా అంతే -- ఫలానా జడ్జి గారి అబ్బాయికి ఇంత కట్నం ఇచ్చారూ అంటే -- ఆహా , రహస్యంగానే అనుకో -- మనకి ఎంత దర్జాగా వుంటుందో ఆలోచించు -- ఆ కట్నం డబ్బులు మూట కట్టి బ్యాంకి లో వేసుకోవాలనే కక్కుర్తీ నాకేం లేదు -- వాళ్ళిచ్చిన దానికి మరో పదివేలు కలిపి మరీ ఖర్చు చేస్తాను మహారాజు లా--' అంటూ దర్పంగా కళ్ళు ఎగరవేశాడు అయన.
'అదే నేను చెప్పేదీను -- డబ్బు దాచుకునే ఉద్దేశ్యమే లేనప్పుడు అసలు పుచ్చుకోటం మాత్రం ఎందుకూ అని -- ఆ డబ్బు కాస్తా ఆనాడే ఖర్చయి పోయినా , ఇన్ని వేలు కట్నం తెచ్చామూ అన్న అహం మాత్రం కలకాలం వుండి పోతుంది వాళ్ళల్లో ....మొన్నటికి మొన్న ఆ నాయుడి గారి కోడలెం చేసిందో తెలిసిందిగా -- ఆవిడ నాతొ చెప్పుకుని ఒకటే ఇదయిపోయింది పాపం -- ఓరోజు వంటవాడు రాలేదుట, ఆవాళ ఆవిడికి జలుబు భారంగా వుండి ఆ పూటకి కోడల్ని చేయ్యమందిట వంట -- ఆ పిల్ల పుట్టింట్లో పదిమంది నౌకర్లూ చాకర్లూ వంట వాళ్ళూ అంతా వుండటం తో ఏ పనీ చెయ్యటం అలవాటు కాకపోయినా ఎలాగో వండి పడేసిందిట-- తీరా భోజనాలకి కూర్చున్నాక ఆ పదార్ధాలు నోట పెట్టుకోలేక మరుదులూ వాళ్ళూ ఏదో హాస్యం చెయ్య బోయారుట -- అక్కడికీ ఆవిడ కోడల్ని వెనకేసుకు వచ్చి ఏదో సర్ది చెప్తూనే వుందిట -- అయితే నెం , ఆ పిల్ల రోషంగా 'నేనేం గతి లేక రాలేదు మీ ఇంట్లో అడ్డమయిన చాకిరీ చెయ్యటానికి. మా నాన్న యాభైవేలు కట్నం ఇచ్చి మరీ పంపించాడు నన్ను' అంటూ సమాధానం చెప్పటం దాంతో మాటకి మాట పెరిగి చివరికి పది రోజుల్లో ఆస్తుల పంపకం వేరే వుండటం దాకా వచ్చిందిట -- అంతా అలా వుంటారని కాదను కొండి -- మనకా ఒక్కగానొక్కడు . ఈ ఉద్యోగం వున్నన్నాళ్ళూ ఇక్కడా అక్కడా తిరిగినా రిటైరయాక వాడ్ని విడిచి వుండలేం కదా -- స్వంత మేనగోడలే అయితే కాస్త అటూ ఇటూ అయినా సర్దుకు పోతాం -- అయినా ఇప్పుడు మనకేం తక్కువ. ఆ కట్నం డబ్బులు పుచ్చుకోకపోయినా దర్జాగా పెళ్ళి చెయ్యగలిగే స్థితిలోనే వున్నాం -- మనలాంటి వాళ్ళం అయినా కాస్త మంచీ చెడ్డా ఆలోచించకపోతే ఈ కట్నాల బెడద ఇలా పెరిగిపోతూనే వుంటుంది. ఆడపిల్లలు కలవాళ్ళు అతలా కుతలం అయిపోతూనే వుంటారు ' అంటూ ఆదర్శాలు కలబోసి తన కష్ట సుఖాలు ఏకరువు పెట్టిందావిడ.
