Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 18


                                                   గోపాలుడు - గోవిందుడు

           

    ఒక గ్రామమునందు గోపాలుడు, గోవిందుడు అను నిరువురు స్నేహితులు నివసించుచుండిరి. వారొక దినమున కట్టెలు కొట్టుకుని వచ్చుటకై సమీపమున నున్న అరణ్యమునకు పోయిరి.
    గోవిందుడు కొంచెము భయపడుచు "ఇప్పుడు ఏదైన కౄరమృగము వచ్చినచో ఏమిచేయుదము" అని పలికెను. గోపాలుడు మిత్రుని వీపు తట్టుచు "మనమిరువురము కలసి ఈ గొడ్డండ్రతో దానిని నరికి చంపుదము" అని ధైర్యము చెప్పెను.
    గోవిందుడు "ఎట్టి కష్టములోనైనను మన మొండొరులము వీడిపోరాదు" అని పలికెను. మిత్రులిరువురు నిట్లు నిశ్చయించుకొని యా నట్టడివిలో నడచిపోవుచుండిరి.
    ఇంతలో దూరమున వారికొక ఎలుగుబంటు కనిపించెను. భల్లూకమును చూచినంతనే గోవిందుని గుండెలు దడదడ కొట్టుకొనెను. అతడు గడగడ వణకుచు వెంటనే గొడ్డలిని పారవేసి సమీపముననున్న మామిడి చెట్టెక్కెను.
    పాపము గోపాలుడు ఒంటరి వాడయ్యెను. చెట్టెక్కుట చేతగాదు. అతనికి ఒక ఉపాయము స్ఫురించెను. అతడు నేలపైబడి ఊపిరి బిగబట్టి కదలక మెదలక చచ్చినవానివలె పరుండెను.
    భల్లూకము మెల్లగా గోపాలుని సమీపించినది. వాని రొమ్ము, గడ్డము, ముక్కు, చెవులు వాసన చూచినది. గోపాలుడు కొంచెమేనియు చలింపలేదు. ప్రాణములు బిగబట్టుకొని యతడట్లే పడియుండెను. భల్లూకము శవమును భుజింపదు. అందుచే అది గోపాలుని వదలి వెడలిపోయెను.
    ఇది యంతయు గోవిందుడు కొమ్మలచాటున నక్కి నిక్కినిక్కి చూచుచుండెను. భల్లూకము పోయినంతనే అతడు వృక్షము దిగి గోపాలుని దగ్గరకు వచ్చి "ఏమిరా గోపీ! ఎలుగుబంటు నీ చెవిలో నేమి రహస్యము చెప్పినది?" అని పరిహాసమాడెను.
    గోపాలుడు "నీవంటి విశ్వాస హీనులతో స్నేహము చేయవలదని చెప్పినది" అని మొగముపై గొట్టినట్లు జవాబు చెప్పెను.
    గోపాలుని మాటలు వినినంతనే గోవిందుడు సిగ్గుతో తలవంచుకొనెను.

                                         *  *  *  *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS